నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
______________________________________________________________________
ఇడాహొ రాష్ట్రంలోని ట్విన్ ఫాల్స్ అనే ఊరికి చెందిన ఓ దొంగని బేంకులో డబ్బు దొంగతనం చేయడానికి కాక, డబ్బుని డిపాజిట్ చేసిన నేరం మీద పోలీసులు అరెస్ట్ చేసారు! ఆ దొంగ 1923 నాటి 'హోర్స్ బ్లాంకెట్ సిల్వర్ సర్టిఫికెట్ నోట్స్' ని ముద్రించి దాన్ని బేంకులో డిపాజిట్ చేసాడు. అవి నకిలీనోట్లు అని తెలుసుకున్న ఆ బేంకువారు పోలీసులకి ఫిర్యాదు చేస్తే పోలీస్ చీఫ్ జిమ్ మాన్ అతన్ని అరెస్ట్ చేసాడు.
ఆస్ట్రేలియాలోని చిన్న గ్రామం అయిన ఓ బెల్ మిల్స్ టేట్ లోని 21 ఏళ్ళ అమ్మాయి ఓ బేంక్ లో కేషియర్ డ్యూటీ చేస్తుండగా, మొహాన ముసుగు వేసుకున్న ఓ దొంగ తుపాకీతో వచ్చి ఆమె దగ్గరున్న బేంక్ నగదుని దోచుకున్నాడు. అయితే ఆమె ఆ దొంగ నీలం కళ్ళని చూసి, అతను తన పదహారో ఏట, నాటి ప్రేమికుడని గ్రహించి ఆ సంగతి పోలీసులకి చెప్పింది. వాళ్ళు టెరైలో ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ముసుగే కాక, అతను బేంక్ నించి దొంగిలించిన డబ్బు కూడా అతని జేబుల్లో దొరికింది.