మా చార్ధామ్ యాత్ర - కర్రా నాగలక్ష్మి

Maa chardham yatra

మా చార్ధామ్ యాత్ర -3

గంగోత్రి వెళ్ళేటప్పుడుగంగనానిలో పితృతర్పణాలు విడిచిపెట్టాలని అనుకున్నాం. 2023 లో వెళ్లినప్పుడు గంగనాని వెళ్లేం. అక్కడ పూజారి స్థలపురాణంలోపరాశరుడు ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు విడిచి వారిని స్వర్గానికి పంపేడని, ఇక్కడ పితృదేవతలకు ఇచ్చే తర్పణాల వలన వారి పాపాలు నశించి ఊర్ధ్వలోకాలకు చేరుతారు అని చెప్పేరు”. మేం వెళ్ళినది పితృపక్షాలలో కావడం వల్ల గంగనానిలో ఆరోజు తర్పణాలు వదలాలని అనుకున్నాం. కాని వెళ్లేటప్పుడు ప్రొద్దుటే వెళ్లడం వల్ల గంగనాని వచ్చినట్టుగా గుర్తించలేదు. గంగోత్రినుంచి వచ్చేటప్పుడు ముందుగా మా డ్రైవరుకి చెప్పి అక్కడ ఆపమన్నాం. గంగనాని అంటే గంగాదేవికి అమ్మమ్మ గారి ఊరని స్థానికుల కథనం. నార్త్ లో తల్లి పుట్టిల్లు అంటే చాలా గౌరవం ఇస్తారు. ఇక్కడ వేడినీటి ఊటలు ఉంటాయి. ఆడవారికి వేరుగా మగవారికి వేరుగా స్నానాలు చెయ్యడానికి, బట్టలు మార్చుకోడానికి గదులు ఉంటాయి. పౌరాణిక కథనం ప్రకారం పరాశర ముని ఇక్కడ తపశ్సు చేసుకోగా తపశ్సక్తి వల్ల పుట్టిన వేడి వల్ల అక్కడి నీరు వేడిగా, చర్మరోగాలను పోగొట్టగలిగే శక్తిని పొందిందని అంటారు.

స్నానాలు చేసుకొని తర్పణాలు ఇచ్చుకొని తృప్తిగా కేదార్ నాథ్ వైపు ప్రయాణించేం.

ప్రయాణం మధ్యలో హెలికాఫ్టర్ టికెట్స్ కోసం ప్రయత్నాలు చేసేం. మా యాత్రకు ముందు మేం హెలికాఫ్టర్ టికెట్ మోహం లోపడి టికెట్ డబ్బులు 6000₹ చొప్పున 6 టికెట్స్ పోగొట్టు కున్నాం, నష్టం మేమే పెట్టుకున్నాం, మాతో వచ్చిన ఫణిగారు వారికి తెలిసిన వారి ద్వారా ప్రయత్నించేరు. కాని అవలేదు. గుప్తకాశి దాటుకొని రామ్ నగరు చేరేం, అప్పటికే రాత్రి అవడం వల్ల రామ్ నగర్ లోనే ఉండిపోయేం. మా డ్రైవరు చెప్పినదేమిటంటే ముందు వారమంతా చాలా వానలు పడడం వల్ల ప్రయాణ సాధనాలు నిలిచిపోగా చాలా మంది సీతాపూర్, సోన్ ప్రయాగ లలో యాత్రీకులు నిలచిపోయేరు. అందువల్ల ముందుకు పోతే మాకు రూము దొరకడం ఇబ్బంది అవొచ్చు అని. మేము డోలీలు అవీ ఉన్నాయా? అని అడిగితే మా హోటలు యజమాని గుర్రాలని, డోలీలని కూడా నిలిపి వేసేరు అని చెప్పేడు, మరో విషయం ఏమిటంటే సోన్ ప్రయాగ నుంచి నడవాలి, లోకల్ జీపులను నిలిపి వేసేరు అని కూడా చెప్పేడు.

ఇంతకు ముందు మేం గౌరీకుండ్ వరకు మా కారులో వెళ్ళి అక్కడ నుంచి కేదార్ నాథ్ కి 14 కిలోమీటర్లు గుర్రాలమీద వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నడిచి వచ్చేవారం. 2023 లో వెళ్లినప్పుడు 65 ఏళ్ళు నిండిన నేను డోలీలో వెళదామనుకున్నాను, మా టాక్సీలను సోన్ ప్రయాగ వరకే అనుమతిస్తున్నారు, అక్కడ నుంచి లోకలు జీపులలో గౌరీకుండ్ వెళ్లాలి. రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయం అది.

లోకలు జీపులలో ఎమిది మందిని చొప్పున ఎక్కిస్తూ మా వరకు వచ్చేసరికి ప్రొద్దుట పది దాటింది. అంటే సుమారు 5 గంటలు క్యూలో ఉన్నాం, అది కూడా అక్టోబరు నెలలో. తీరా గౌరీకుండ్ చేరేక చూస్తే డోలీలు లేవు, ఉన్న ఒక్క డోలీకి రానూపోనూ 30 వేలు అడిగేడు మేము నలుగురం ఉన్నాం. తప్పక గుర్రాలను నమ్ముకున్నాం. అక్కడ బోర్డు చూసేక తగిలింది నాకు షాకు, గౌరీకుండ్ 22 కిలోమీటర్లు అని వ్రాసి ఉంది. వయసులో గుర్రాలమీద యాత్ర అంటే కష్టమే, కాని తప్పదు. గుర్రాలను మాట్లాడుకున్నాం. మా దంపతులకు దొరికిన గుర్రాలు మంచివే, జాగ్రత్తగా 3 గంటలకి కేదార్ నాథ్ చేర్చేయి. దారిలో మా గుర్రాలబ్బాయిని ఇందేంటి కేదార్ నాథ్ 14 కిలోమీటర్లు కదా? అంటే అదెప్పటి మాట, దారి సురక్షితమని ప్రభుత్వం దారి వేసింది, ఇప్పుడు 22 కిలోమటర్ల దూరం అన్నాడు. అక్కడ నుంచి సుమారు కిలోమీటరు నడిచి కోవెలకి పక్కగా ఉన్న హోటలులో 5 గురికి సరిపడే రూము తీసుకొని మా వాళ్ళకోసం ఎదురు చూస్తూ ఉన్నాం.

రూము దొరికిన తరువాత ఆకలి గుర్తొచ్చి పక్కనే ఉన్న హోటలుకు వెళ్లేం. కొందరు దర్శనం చేసుకున్నవాళ్లు వచ్చి భోజనాలు చేస్తున్నారు. ఎదురుగా రంగురంగు దీపాలతో అలంకరించిన మందిరం. పెద్ద పెద్ద పాలరాతి మెట్లు, ఉపమందిరాలను సహితం పాలరాతితో తీర్చి దిద్దిన మందిరం ముచ్చటగా ఉంది. కాని భక్తల క్యూ చూస్తే మాత్రం మతిపోయింది, క్యూ మెలికలు తిరిగి రెండు కిలోమీటర్ల పొడవున ఉంది.

మరునాడు ప్రొద్దుటే బయలుదేరుదామనే ప్లానులో ఉన్నాం. మందిరం దగ్గర పరిస్థితి చూస్తే దర్శనం అయేటట్టుగా లేదు.

మా ఎదురుగా కూర్చొని ఫలహారం చేస్తున్న కొందరిని వాకబు చేస్తే మనిషి వెయ్యి రూపాయలు ఇస్తే పక్కనుంచి వెంటనే దర్శనానికి పంపుతారు అని తెలిసింది. అప్పుడు హోటలులో పనిచేసే అతను మా దగ్గరకి వచ్చి టికెట్ కౌంటరులో 5 వేల రూపాలిచ్చి అభిషేకం టికెట్టు కొనుక్కుంటే తిన్నగా గర్భగుడిలోకి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు, ఒక టికెట్టు మీద అయిదుగురుకి ప్రవేశం ఉంటుంది అని చెప్పేడు. త్వరగా వెళ్లమని, లేకపోతే కౌంటరు కట్టెస్తారని చెప్పేడు. మా వారు కౌంటరు దగ్గర క్యూలో నిలబడి టికెట్ తెచ్చేరు, మాకు తెల్లవారి 3 గంటల సమయం కేటాయించేరు. మా వాళ్లు ఎక్కిన గుర్రం మొరాయించి నానా ఇబ్బందులూ పెట్టి 5 గంటలకి పైకి చేర్చింది. హోటలుకి వాళ్ళను తీసుకొని వెళ్లేం. వాళ్లు భోజనం చేస్తున్న సమయంలో పెద్ద వాన పడింది. క్యూలో ఉన్న జనాలు బసలకి వెళ్లి పోయేరు. లైను ఖాళీ, మేము క్యూలో వెళ్లి హాయిగా దర్శనం చేసుకొని వచ్చేం.

కోవెలని చాలా అధునాతనంగా తీర్చి దిద్దేరు, విశాలమైన ప్రాంగణం, పెద్ద క్యూలైనులు. ఇంకా పనులు సాగుతున్నాయి, పెద్దపెద్ద ఇనుప పట్టాలను హెలీకాఫ్టరు ద్వారా తరలిస్తున్నారు. వచ్చే ఏడాదికి పక్కా రోజ్లు కూడా వచ్చెస్తాయని అనుకున్నాం. మందిరం చూస్తూ ఉంటే కన్నులపండగగ ఉంది.

రూములో 2 గంటల వరకు విశ్రమించి మూడుకి తిన్నగా కోవెలలోకి వెళ్లి హాయిగా వారిచ్చిన పంచామృతాలతో స్వామికి అభిషేకం చేసుకొని తిరిగి రూముకి వచ్చి పడుకున్నాం. మరునాడు తొమ్మిదికి గౌరీకుండ్ కి బయలుదేరేం. ఇక్కడ కూడా ఒకే డోలీ ఉంది, గౌరీకుండ్ కి 30 వేలు అడిగేడు. మేం మళ్ళా గుర్రాలమీద బయలుదేరేం, మరిది గారూ ససేమిరా గుర్రం ఎక్కను ఎలాగోలా నడుస్తా అన్నారు, గుర్రాలు ఎటెటో పరుగెడుతున్నాయి. మరి వాటి మీద కూర్చోలేక మేం కూడా దిగి నడవడం మొదలు పెట్టేం.

నాకు కొంచం వెర్టిగొ ఉంది, అలాంటి నేను ఎలా నడుస్తాను అనుకున్నాను, గుర్రం మీంచి పడితే తగిలే దెబ్బలకన్నా నడవలేక నేపడితే తగిలే దెబ్బలు తక్కువే అనుకొని నడకసాగించేను. విష్ణుసహస్రనామం, లలితా సహస్రనామం ఇలా నాకు తెలిసిన వన్నీ చదువుకుంటూ నడుస్తూ సాగేను, ఎవరి మానాన వారు దిగసాగేం, మా వారు, మా చెల్లి, మరిదిగారు ఓపదిహేను కిలోమీటర్లు దిగేక ఇంక నడవలేక పిట్టు పెట్టించుకొని దిగేరు. మొత్తానికి అందరం సురక్షితంగా దిగేం.

మరి 2024 లో సోన్ ప్రయాగ నుంచి నడక అంటే నేను, మావారు ఇక్కడనుంచే దండం దేవుడికి అని రామ్ పూర్ లోనే ఉండిపోయేం. మా డ్రైవరు మా స్నేహితులను తీసుకొని వెళ్లి సీతాపూర్ దగ్గర వదిలి పెట్టేడు. అప్పటి వరకు పడ్డ వర్షాల వల్ల రొడ్లు పాడవడం ఒకకారణమయితే, రెండవది విపరీతమైన వాహనాల రద్దీ వల్ల రోడ్డు మూసి వేయడం మరో కారణం. సీతాపూర్ నుంచి గౌరీకుండ్ సుమారు 13 లేక 14 కిలోమీటర్లు ఒకవైపు అక్కడ నుంచి కేదార్ నాథ్ కి వెళ్లే దారి లేదు, కొండలమీద బురదలో కాళ్ళు జారుతూ ఉంటే అలా ఎక్కుతూ దిగుతూ కేదార్ నాథ్ దర్శనం చేసుకున్నారు. మా స్నేహితులు, అయితే వర్షాలవల్ల చాలా మంది గౌరీకుండ్, సోన్ ప్రయాగలలో యాత్రీకులు ఆగిపోడం వల్ల వీరికి చాలా బాగా దర్శనం అయింది. రాత్రి అక్కడే కేదార్ నాథ్ లో బస చేసి మరునాడు రాత్రికి గౌరీకుండ్ చేరి అక్కడ రాత్రి బసచేసి మూడోనాడు మద్యాహ్నం సీతాపూర్ కారు పార్కింగ్ చేరుకున్నారు. అందులో కాలుజారి లోయలో పడబోయి ఆచుకోడం, కాలుజారి నడకదారిలో పడి పక్కటెముకలు నొప్పి చేయడం, కాలు బెణకడం లాంటివి జరిగేయి. గౌరీకుండ్ లోను కేదార్ నాధ్ లోనూ ఉన్న ప్రభుత్వపువారి ఉచిత వైద్యసదుపాయాల వల్ల సకాలంలో పైన్ కిల్లర్స్ పడటంతో క్రిందకు చేరుకోగలిగేరు.

2023 లో వేసిన రోడ్లు వరదలలో కొట్టుకు పోయేయి. వరదలలో చాలా హోటల్స్ కూడా కొట్టుకు పోయేయని గమనించేం.

రెండోరోజు రావలసిన వారు రాకపోయేసరికి మాకు ఆందోళన, మేమున్న హోటలులో మాపక్కరూములో ఉన్న ఆడవాళ్లు కూడా మాలాగే ఉండిపోయేరు, వాళ్ళవాళ్లు ఒకరోజు ముందు వెళ్లేరు. రెండోరోజు రాత్రి వాళ్లు చేరేరు. వాళ్ళవల్ల అక్కడి పరిస్థితులు తెలిసాయి కాబట్టి కాస్త ఆందోళన తగ్గింది.

చాలా చోట్ల అంటే హరిద్వార్ లో టాక్సీ ఆఫీసులలో, హరిద్వార్ లో తెలుగు సత్రం వారి ఆఫీసులో ఉన్న బోర్డులలో ఇంకా గౌరీకుండ్ నుంచి కేదార్ నాథ్ దూరం 14 కిలోమీటర్లు అని ఉండడం గమనించేను. సుమారుగా 23 లేక 24 కిలోమీటర్లు అని అనుకోవాలి. అదీ కొండలమీద నడక అంత సులువుగా ఉండదు. అందుకే కేదార్ నాథ్ వెళ్ళడానికి సిద్ధపడ్డవారు మొత్తం 50 కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడితే మంచిది, మన అదృష్టం బాగుంటే డోలీవో, మంచిగుర్రమో దొరకొచ్చు.

నా అనుభవం వల్ల నేను తెలుసుకున్నదేమిటంటే ఇలాంటి యాత్రలు(అమర్నాధ్, కేదార్నాధ్, కైలాశ్ పరిక్రమ లాంటివి) మనకి 60 ఏళ్ళు రాకముందే పూర్తి చేసుకోవాలని, మేము యాత్రలన్నీ 45 ఏళ్ళనుంచి చెయ్యడం మొదలు పెట్టేం, సునాయాసంగా ఎక్కిపోయేవాళ్ళం. అలాంటిది ఈసంవత్సరం మాకు కష్టమనిపించింది, అదే వయసు ప్రభావం.

గత 4,5 ఏళ్ళుగా ఉత్తరాఖండ్ లో వర్షాలు కూడా చాలా ఉధృతంగా పడుతున్నాయి. చాలా రోడ్లు కొట్టుకు పోయేయి.

సురక్షిత ప్రదేశాలలో మాత్రమే బస తీసుకోవాలి, ఇలాంటి విషయాలు టాక్సీ డ్రైవర్లపై విడిచి పెట్టాలి.

ఆరోజు అక్కడినుంచి బయలుదేరిత్రియుగి నారాయణ్వెళ్లేం. ముందుగా చెప్పినట్లుగానే రోడ్లు అస్సలు బాగులేవు, మా కర్నాటక మితృలకు మొదటిమారు కాబట్టి టాక్సీ డ్రైవరుని బ్రతిమాలి వెళ్లేం. అయితే దారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నారాయణ మంత్రం జపిస్తూనే ఉన్నాం. రోడ్డు అన్నది మాత్రం లేదు. మా డ్రైవరు ముందుగానే చెప్పేడు. అయినా మొండిగా వెళ్ళేం.

త్రియుగి నారాయణ్ అన్న మందిరం మూడు యుగాలనుంచి ఉన్నదని(కృత,త్రేతా, ద్వాపర) పేరు వచ్చింది. ఇక్కడే శివపార్వతులకు వివాహం నారాయణుడు పార్వతికి అన్నదమ్మునిగా శివునికిచ్చి వివాహం జరిపేడని, బ్రహ్మ వివాహ మంత్రాలను జపించేడని, సనకాదిమునులు, ముక్కోటి దేవతలు వేడుకను చూడ తరలి వచ్చేరని, వివాహ సమయంలో ప్రజ్వలింపజేసిన ధుని ఇప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.

మందిరంలో పితృతర్పణాలు, పూజలు నిర్వహింపబడుతున్నాయి. వివాహాలు కాని వాళ్లు పూజలు చేసుకుంటే త్వరగా వివాహం అవుతుందని, వివాహంలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరింప బడతాయని, స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. సారి చూసిన మరో సంగతి ఏమిటంటే అన్ని వయసుల వారూ ఇక్కడ పూజలు చేసిన తరువాత వివాహ మంత్రాలతో(సూక్ష్మ) వివాహం చేసుకోడం.

తిరిగి వచ్చేటప్పుడు డ్రైవరు చెప్పిన మాట వినాలని అందరం అనుకున్నాం.

మిగతా భాగం వచ్చేవారం చదువుదాం.

అంతవరకు శలవు.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు