మా చార్ధామ్ యాత్ర -4
ఈ ట్రిప్పులో మేము హోటలు భోజనం చెయ్యలేదు. కరెంటు లేని చోట హోటలు వారి వంటగదిని మా భోజనం తయారీకోసం మేము వాడుకొన్నాం.
త్రియుగినారాయణ్ నుంచి తిరుగు ప్రయాణం లో వాన మొదలయింది. గుప్తకాశి లో మేం చేరేసరికి చిన్నగా వాన పడుతోంది. మేం మందిరం వైపు నడక సాగించేసరికి అది వడగళ్ళ వానగా మారింది. దారంతా పెద్దపెద్ద వడగళ్లు. జాగ్రత్తగా నడుచుకుంటూ మందిరం చేరుకున్నాం. మా కర్నాటక దోస్తులు వేదపండితులు, వారు వేదపాఠశాల కూడా నడుపుతున్నావారు, నిష్ఠగలవారు కావడంతో మాకు కూడా చాలా పూజలు, పితృతర్పణాలు చాలా నిష్ఠగా చేసుకునే అదృష్టం కలిగింది.
ఇక్కడనేను గుప్తకాశి వివరాలు పెట్టడం లేదు. ఇంతకుముందు ఇదే పత్రికలో చాలా వివరంగా వ్రాసేను.
అక్కడనుంచి కాళీమఠ్ వచ్చేం. కాళికాదేవి రక్తబీజుని సంహరించిన తరువాత తన రౌద్రరూపాన్ని విడిచి పెట్టిన స్థలం ఇది. ఇక్కడ కాలికాదేవి విగ్రహం ఉండదు( ప్రస్థుతం ఉన్నది 20014 తరువాత పెట్టినది), శ్రీచక్రానికి పూజలు నిర్వహిస్తారు. అసలు విగ్రహం ప్రస్థుతం కటకటాల వెనుక ఉన్న రాగి తాపడం క్రిందన ఉంటుంది. ఏడాది లో ఒకరోజు పూజారి మాత్రమే లోనికి వెళ్ళి పూజలు నిర్వహిస్తారట. మన పూజలు అన్నీ రాగి తాపడం మీదనే నిర్వహిస్తారు. ఇక్కడ కూడా చాలా తుమ్మెదలు రాగి తాపడం దగ్గర తిరగడం చూసేము. అవన్నీ కూడా పార్వతీదేవి మాతృకలు తుమ్మెదల రూపంలో అమ్మవారి రక్షణ కొరకు ఉంటాయట. ఈ విషయం అక్కడి పూజారి చెప్పేరు.
ఉత్తరాఖండ్ లో అన్ని మందిరాలలోనూ మరమ్మత్తులు, పాలరాతి ప్రాంగణాల పనులు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ మందిరంలో అన్ని కాలాలలోనూ వెలుగుతూ ఉండే ధుని ఉంది. లక్ష్మి, సరస్వతి మొదలయిన దేవతల అంతరాలయాలు ఉన్నాయి.
అక్కడనుంచి ఓఖిమఠ్ వచ్చేం. ఓఖిమఠ్ లో ఉషా అనిరుద్దుల వివాహం జరిగిన ప్రదేశం. మధ్యలో ఓంకారేశ్వర మందిరం ఉంటుంది. పంచకేదారాలలో లెక్కించే మధ్యమహేశ్వర్, కేదార్ నాధ్ ల ఉత్సవ విగ్రహాలకు శీతాకాలంలో ఓంకారేశ్వర మందిరం లో ఉంచి నిత్యపూజలు నిర్వహిస్తారు. ఇక్కడ అనిరుద్ధ, ఉష, పార్వతి, మాంధాత విగ్రహాలు ఉంటాయి. వెనుక నున్న గదులలో కేదార్ నాధ్, మధ్యమహేశ్వర్ గద్దీలు(పడకలు) ఉంటాయి. క్రిందనున్న గదులలో గోపీనాధుడు, కాళీమాత విగ్రహాలు ఉంటాయి.
మాంధాత ఇక్కడ చాలా సంవత్సరాలు ఘోర తపస్సు చేసుకున్న ప్రదేశం కాబట్టి ఇక్కడ అతని విగ్రహం ఉన్నట్లు చెప్తారు, అంటే ఈ ప్రదేశం ఉషా పరిణయానికి ముందరే( త్రేతాయుగానికి పూర్వమే) ప్రసిద్ధి చెందినది అనుకోవచ్చు.
ఓఖిమఠ్ ఊరు మధ్యమహేశ్వర్, తుంగనాథ్ మందిరాలను సందర్శించుకునేవారికి బస చేసుకునేందుకు చాలా అనువుగా ఉంటుంది.
ఓఖిమఠ్ లో వాతావరణం పొడిగా ఉండి ఇంకా వెలుతురు ఉండడంతో అక్కడనుంచి బయలుదేరిపోయేం. మళ్లా పెద్దగా వాన మొదలయింది. ఆవర్షంలో ప్రయాణం ముందుకి సాగడం చాలా కష్టమనిపించింది. కాని బసకి యోగ్యమైన ప్రదేశం కనబడలేదు. ఎనిమిదిదాటింది, వాన ఉండి ఉండి కురుస్తోంది. మధ్యలో హోటల్స్ ఉన్నా జాగాలు లేవని తెలుసుకొని ముందుకు సాగేం. ఒకచోట చిరుతసంచారం ఉంది జాగ్రత్తగా ముందుకి వెళ్లండి అని మోటారు సైకిలు వ్యక్తి మా డ్రైవరుని హెచ్చరించేడు. రాత్రి పదకొండుకి మంచి బస దొరికింది, ఆరోజు హోటలు వారి రోటీలు తిని పడుకున్నాం. ఆ రాత్రి కూడా వాన పడుతూనే ఉంది.
మరునాడు ప్రొద్దుటే మా వంటలు వండుకొని సర్దుకొని బయలుదేరేం.
ఆరోజు మా ప్లాను ప్రకారం గోపేశ్వర్, జోషిమఠ్, పాండుకేశ్వర్ చూసుకొని బదరీనాధ్ లో రాత్రి బసచేసుకొని ప్రద్దన్నే బదరీనాధుని దర్శించుకొని బ్పహ్మకపాళంలో పితృకార్యాలు నిర్వహించుకొని మానా చూసుకొని వీలయితే మరోరోజు అక్కడే గడపాలని అనుకున్నాం.
గోపేశ్వర్ చమోలీ జిల్లా కేంద్రం. ఇక్కడ గోపీనాథ్ మందిరం ముఖ్యమైనది. ఈ మందిరం రుద్రనాధ్(పంచకేదారాలలో ఒకటి) యొక్క శీతాకాలపు నివాసం. రుద్రనాధ్ విగ్రహం శీతాకాలంలో ఈ మందిరంలో ఉంచి పూజలు చేస్తారు. చుట్టూరా విరిగిపోయిన దేవీదేవతల విగ్రహాలు ఉంటాయి. మందిరం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. మదోస్తులకు ఇవన్నీ మొదటిమారు చూడడం, వారు ఈ మందిరాలు దర్శించుకొని భక్తి పారవశ్యం పొందుతూ ఉంటే వారిని చూసి, వారికి ఇవన్నీ చూపమని మమ్మలని దేవుడు నియమించేడని మాదంపతులకు అనిపించింది. క్రిందటి సంవత్సరం మాఘ మేలాకి ప్రయాగ్ రాజ్(త్రివేణి సంగమం)లో పరిచయం. కల్పవాసంలో మొత్తం 15 టెంట్లు బుక్ చేసుకొని కాశీ నుంచి వెళ్లేం. అప్ుడు పరిచయమయేరు. రోజూ ఓ రెండుగంటలు సత్సంగం పెట్టుకొనేవారం, కాశీఖండం చదవడమయేక ఎదేనా చెప్పమని అడిగితే మేము చేసిన యాత్రల గురించి చెప్తూ ఉండేదాన్ని. ఓ రోజు త్రివేణీ సంగమానికి వెళ్తూ ఉంటే సుధగారు చర్ధామ్ యాత్ర మాకు చేయించండి అన్నారు. నేను సరే అన్నాను, మాట ఇచ్చిన తరువాత కష్టమో నిష్టూరమో తీర్చాలనేది నా అభిమతం. అలా పెట్టుకున్న యాత్ర ఇది.
మాది స్నేహం అనాలా?, రోజూ ఫోనులు చేసుకోడం లాంటివి కూడా లేదు. అయితే ఒకరిమీద ఒకరికి చాలా గౌరవం ఉంది. మా మొత్తం టూరు అంతా చాలా సులువుగా, హాయిగా సాగింది. ఎటువంటి మాట ఎవరిమీద రాలేదు. ఈ గొప్పతనం ఏ ఒక్కరిదీకాదు. అందరూ మానసిక పరణితి ఉన్నవాళ్లు కావడం కూడా విశేషమే.
గోపీనాధ్ మందిరంలో ప్రొద్దున్నే రుద్రాభిషేకం చేసుకొని, బయటి ప్రాకారంలో ఉన్న కూపం ఇందులో నీరు వైతరణి నది నుండి వస్తాయట, ఆ నీటితో పక్కనే ఉన్న శివలింగాలకి అభిషేకం చేసుకున్నాం. బయట ఐదు మీటర్ల పొడవున్న త్రిశూలం పాతి ఉంటుంది. చుట్టూరా కంచె కట్టి ఉంటుంది. దీని వెనుక కథ ఏమిటంటే ఈ త్రిశూలాన్ని శివుడు మన్మధుని సంహరించడానికి ప్రయోగించినదట, త్రిశూలం మన్మధుని దహించిన తరువాత ఇక్కడ భూమిలోకి చొచ్చుకు పోయిందట. ఇది అష్టధాతువులతో నిర్మించినది. కోవెల 13వ శతాబ్ధంలో నేపాలు రాజులచే నిర్మింపబడిందని ఇక్కడి శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. త్రిశూలం మీద ఉన్న లిపి గురించి గాని దాని అర్థం కాని ఇప్పటి వరకు కనుగొనలేకపోయేరు.
ఈ త్రిశూలం గురించి మరో విషయమేమిటంటే ఎంతటి బలముపయోగించినా ఈ త్రిశూలాన్ని కదిలింలేరట, కాని నిజమైన భక్తుడు తాకగానే ఎండుటాకులా కదిలిపోతుందట. ఈ త్రిశూలాన్ని చేతితో తాకే అవకాశం లేదు.
క్రీస్తుపూర్వం నుంచి ఉన్న లిపుల గురించి చాలా మంది చరిత్రకారులు గుర్తుపట్టి వాటి గురించి వివరించ గలిగేరు కాని ఈ లిపిని గురించి చెప్పలేక పోయేరు అంటే ఎన్ని వేల సంవత్సరాలకు ముందుదో తెలీదు. కాని ఇన్ని సంవత్సరాలగా ఈ త్రిశూలం అన్ని కాలాలనూ చూస్తూ, వరదలూ మంచు తుఫానులకు సాక్షిగా ఉండి కూడా అరిగి పోలేదు తరిగి పోలేదు. మరి ఆ మహత్యం ఏమిటో?.
గోపీనాథ్ మందిరం అంటే కృష్ణుని మందిరం అనుకుంటాం కాని ఇది శివకోవెల, గోపీనాథ్ అనే పేరెందుకు వచ్చింది అంటే రెండుకథలు చెప్పేరు. ఒకటి శివుడు విష్ణుమూర్తికి ప్రియ సఖుడు, అలాగే విష్ణుమూర్తికి శివుడు ప్రియ సఖుడట. తన పేరుతో కాకుండా తన సఖుడి పేరుతే పిలిస్తే తొందరగా కరుణిస్తాడని గోపీనాథు అని పిలుస్తారట, రెంవది గోపేశ్వర్ ఊరికి అథిపతి కాబట్టి గోపీనాథుడు అని అంటారు.
ఇక అక్కడ నుంచి మా ప్రయాణం బదరీనాథ్ వైపుగా సాగింది. బదరీనాథ్ రోడ్డు బాగున్నప్పుడు అది విశాలమైన డబుల్ రోడ్డు. ఈ వర్షాలకి చాలా చోట్ల రోడ్డు లోయలోకి కొట్టుకు పోయింది. కొన్ని చోట్ల ఒక కారు మాత్రమే అతి కష్టంగా వెళ్లేటట్లు ఉంది.
మిగతా యాత్రా వివరాలు వచ్చే సంచికలో చదువుదాం అంతవరకు శలవు.