మా చార్ధామ్ యాత్ర -5 - కర్రా నాగలక్ష్మి

మా చార్ధామ్ యాత్ర -5

 

 

బదరీనాధ్ కి బయలుదేరిన దగ్గరనుంచి మా డ్రైవరు బదరీనాధ్ లో రాత్రి బస తీసుకోకండి, దర్శనం చేసుకు వచ్చేయండి, మానా వెళ్ళొద్దు అని నస మొదలు పెట్టేడు. మేం 12 రోజులకు టాక్సీ మాట్లాడుకున్నాం. అప్పటికి పది రోజులు అయింది, అతను ఎందుకు తొందర పడుతున్నాడో అర్థం కాలేదు. మేం మానా చూడాలి, మరునాడు పిండ ప్రదానాలు చేసుకోవాలి అని చెప్పేం. దానికి అతడు రాత్రి నుంచి భారీ వర్షాల్ని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఎంత తొందరగా అయితే అంత తొందరగా సురక్షితమైన ప్రదేశానికి చేరు కోవడం మంచిదని చెప్పేడు.

జోషిమఠ్ లో నృశింహ స్వామి మందిరం చూసుకున్నాం, కొత్తగా పాలరాతితో నిర్మించేరు.

మేము బదరీనాధ్ చేరేసరికి మూడయింది, ముందుగా మానా వెళ్ళి అక్కడ గణేశ్ గుహ, వ్యాస గుహ, సరస్వతీ నది, మానా లో సరస్వతీ నది ప్రక్కగా ఉన్న సరస్వతీ మందిరాన్ని (పాలరాతితో నిర్మించేరు) దర్శించుకొని ఆ తరువాత బదరీ కోవెలని దర్శించుకోండని డ్రైవరు చెప్పడంతో మేము అలాగే మానాలో అన్నీ చూసుకొని బదరీనాధ్ దర్శనానికి వచ్చాం, మందిరం చాలా ఖాళీగా ఉంది, అలకనంద మీద మరో బ్రిడ్జ్ వేసి పాత బ్రిడ్జ్ ని మూసి వేసేరు, మరమ్మత్తులు చేస్తారేమో?, పూర్తిగా మూసి వేస్తే మాత్రం భక్తులు వరాహ శిలని చూసే అవకాశం పోతుంది. వేడినీటి కుండాలకు వెళ్ళే దారి మరింత పెరుగుతుంది. అక్కడ ఆ మెట్లమీద నడవడానికే మన శక్తి హరించుకు పోతుంది. ఒక్క అడుగు దూరమైనా చాలా ఎక్కువనిపిస్తుంది.

చాలామంది మందిరాన్ని చూసి చేతులు జోడించి బయటకి వచ్చేస్తారు, అలా కాకుండా అక్కడ ఉండే పూజారిని లోపల ఉన్న విగ్రహాల గురించి అడిగి తెలుసుకోండి. వారు వివరంగా చెప్తారు. మళ్ళీ మళ్ళీ రాగలిగే ప్రదేశాలు కావు. కోవెల రద్దీగా ఉన్నా కూడా పూజారులు విగ్రహాల వివరాలు చక్కగా చెప్తారు. లోపల నర, నారాయణ, కుబేర, ఉద్ధవ, నారద విగ్రహాలు, బయట ప్రాకారంలో లక్ష్మి, ఆంజనేయుడు, కామధేనువు, గంటాకర్ణుడు మొదలయిన విగ్రహాలను చూడొచ్చు.

ఇక్కడ గంటాకర్ణుని గురించిన కథ తెలియజేస్తాను. రావణాసురుడు కుబేరుని పై యుద్ధంలో గెలిచి, ఆ రాజ్యానికి తన సైన్యాధిపతి గంటాకర్ణుని రాజుగా చేసి లంకకు మరలిపోతాడు, గంటాకర్ణుడు కుబేరుని వద్దకు పోయి రాజ్యం తిరిగి తీసుకొనమని కోరగా కుబేరుడు నిరాకరించి అడవుల్లోకి పోతాడు, గంటా కర్ణుడు కుబేరుని రాజుగా తాను కుబేరుని బంటుగా ప్రకటించుకొని ధర్మంగా పరిపాలన సాగిస్తాడు. గంటాకర్ణుని పాలనలో ప్రజలు సుఖంగా ఉంటారు. ధర్మబద్ధుడైన గంటాకర్ణుని గుర్తుగా బదరీనాధు ని మందిరంలో అతనికి చోటు కల్పించేరు. ఉత్తరాఖండ్ మందిరాల్లో కుబేరునికి డా మందిరం ఉండడం కనిపిస్తుంది.

బదరీనాధ్ కోవెలలో రద్దీ లేకపోవడానికి కారణం 3, 4 రోజులుగా వర్షాల వల్ల యాత్ర హరిద్వార్ లో ఆపేయడం. భక్తులు బదరీలో చిక్కుకు పోయేరు. వారందరినీ ఆరోజు హరిద్వార్ కి పంపేశారు.

బదరీలో బయలుదేరే సరికి సాయంత్రం ఆరయింది.

హనుమాన్ ఘడీ లో హనుమంతుని దర్శించుకొని బయలుదేరాం. రాత్రి జోషిమఠ్ లో ఉందామా? అని మా డ్రైవరుని అడిగేం, వర్షాలుపడే సమయంలో జోషిమఠ్ సురక్షితమైనది కాదని ఇంకా ముందుకు పోయి ఆగుదామని అన్నాడు. పాండుకేశ్వర్ చూద్దామనుకున్నాం, భవిష్యబదరి వెళ్దామని అనుకున్నాం, వర్షాలవల్ల రోడ్లు బాగోలేక కుదరలేదు. రాత్రి పదకొండు గంటలు దాటేక రోడ్డుమీద ఉన్న హోటల్ లో రూము తీసుకున్నాం.

ఈ కొండల్లో ఈ సంవత్సరం చూసిన హోటల్స్ మళ్ళా సంవత్సరం చూడటం కష్టమే. ఒకటి రెండు ఏళ్లకి వర్షాల్లో కొట్టుకు పోతాయి. ఆ రోజు చాలా దూరం ప్రయాణించడం వల్ల అలసిపోయేం, మరునాడు కాస్త ఆలస్యంగా బయలుదేరుదామని అనుకున్నాం.

కర్ణప్రయాగ చూసుకున్నాం, వర్షాలవల్ల ఆదిబదరి వెళ్ళలేకపోయేం, నందప్రయాగ చూసుకొని ధారీదేవి దర్శనానికి వచ్చేం. రుద్రప్రయాగ దగ్గర రైల్వేలైను వేస్తూ ఉండటంతో రుద్రప్రయాగలో రుద్రేశ్వరుడిని దర్శించుకోలేకపోయేం.

ధారీదేవి కోవెలని కూడా చాలాబాగా కట్టేరు. దేవప్రయాగలో రఘనాధుని దర్శించుకొని హరిద్వార్ చేరుకున్నాం.

హరిద్వార్లో వేడి ఎక్కువగా ఉండడంతో ఏసీ రూమ్స్ తీసుకున్నాం. మా ట్రావెల్స్ వారినే బుక్ చెయ్యమన్నాం, అక్కడకి నాలుగడుగుల దూరంలో తెలుగువారి సత్రం ఉంది. 2023 లో వారివద్ద ఏసీ రూములు తీసుకున్నాం, రూములు బాగులేవు, ధరలు కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు. ఆ రాత్రి ఉప్మా వండుకున్నాం, ప్రొద్దుటే గంగా స్నానం చేసుకొని, కంకల్ లో మరోసారి గంగా స్నానం చేసుకొని పితృతర్పణాలు విడిచి తెలుగు భోజనం(తెలుగు వారి సత్రంలో) తిన్నాం. ఆరోజు గంగా హారతి చూసుకొని ఉప్మా తిన్నాం.

ఋషీకేష్, నీలకంఠ్ మహదేవ్ మొదలయిన మందిరాలు చూసుకొని మా యాత్ర ముగించుకున్నాం.

ఎన్నో మంచి జ్ఞాపకాలతో, అనుభవాలతో యాత్ర ముగించుకుని వచ్చేం.

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు