
ఆది కైలాశ్ ఓం పర్వత్ యాత్ర-2
గోలూ దేవత దర్శనం చేసుకొని జాగేశ్వర్ మహదేవ్ మందిరానికి బయలుదేరేం. సుమారు 80 కిలోమీటర్ల ప్రయాణం 4 గంటల సమయం పడుతుంది. ఇక్కడ నుంచి మనకి విపరీతమైన ఎత్తుకి పెరిగిన దేవదారు వృక్షాల మధ్య నుంచి ప్రయాణించాలి. చాలా చోట్ల ఈ అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే సూర్యుని కిరణాలు నేలని తాకలేనంత. మనకి చిన్నప్పుడు విన్న కథలలో కాకులు దూరని కారడవి అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. ప్రయాణీకులు విసరిన పళ్ళు తింటూ చెట్ల పై కిచకిచ లాడుతున్న కోతులు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ దారంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒకటో అరో వాహనాలు తప్ప మరేమీ ఉండవు. జన సంచారం కూడా తక్కువే.
జాగేశ్వర్ మందిరాలకి రెండు కిలోమీటర్ల ముందు దండేశ్వర్ మందిర సముదాయం వస్తుంది. ఈ మందిరాలు ఆర్కియాలజీ వారి సంరక్షణలో ఉన్నాయి. ఈ మందిరాల నిర్మాణం తొమ్మిది పది శతాబ్దాల మధ్య అప్పటి పాలకులైన ఖతూరియా రాజులు నిర్మించినట్లుగా బోర్డు పై వ్రాయబడింది. ఇక్కడ దండనాథ్ మహదేవ్, నవదుర్గ, కుబేర, సూర్యనారాయణ, లక్ష్మీ నారాయణ మందిరాలు ఉన్నాయి. స్థానికుల ప్రకారం ఈ మందిరాలను బాల జాగేశ్వర్ అని అంటారు, శ్రావణ మాసం, శివరాత్రులకు జరిగే జాత్రలు ఇక్కడ నుండి బయలుదేరి జాగేశ్వర్ మందిరం మీదుగా సాగి వృద్ద జాగేశ్వర్ మందిరాలలో ముగుస్తాయి. ఇవన్నీ కూడా రాతి కట్టడాలు. వేల సంవత్సరాలు పైబడి అలాగే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఎందుకో ఎత్తైన పైన్, దేవదారు వృక్షాల మధ్య ఉన్న ఈ మందిరాలలో దర్శనానంతరం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే మనస్సుకి ప్రశాంతంగా ఉంటుంది.
దండేశ్వర మహదేవ్ మందిర సముదాయం దాటుకొని జాగేశ్వర్ ఊరిలోకి ప్రవేశించక మునుపే పార్కింగ్ లో కారు పెట్టుకొని ఓ పావు కిలోమీటరు నడక తరువాత జాగేశ్వర్ మందిరాలు చేరుకుంటాం.
ఈ మందిర సముదాయంలో సుమారు 124 పెద్ద, చిన్న, అతి చిన్న మందిరాలున్నాయి. ఈ మందిరాలు జటగంగ ఒడ్డున నిర్మింపబడ్డాయి. ఎప్పుడు నిర్మించబడ్డాయో తెలియరాలేదు, ఎందుకంటే ఈ మందిరాలలో శిలాశాసనాలు దొరకలేదు, మందిర నిర్మాణం ప్రకారం ఇవి 5 నుంచి 7వ శతాబ్దంలో నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. కాని ఈ మందిరాలు గుప్తులకాలం నుంచే ఉన్నట్లు తరువాత 5 నుంచి 7వ శతాబ్దానికి చెందిన రాజులు మందిర పునఃనిర్మాణం చేసి ఉండవచ్చునని కొందరి కథనం.
ఈ సమూహం లో ముఖ్యంగా మృత్యుంజయ మహాదేవ్, జాగేశ్వర్, వాస్తు పురుష, గణేష, కుబేర, దుర్గ, సూర్యనారాయణ మొదలైన మందిరాలు చెప్పుకోవచ్చు.
మృత్యుంజయ మందిరం మంటపం, లోపల యజ్ఞకుండం, గర్భగుడిలో శివలింగం ఉంటాయి. ఇక్కడ యజ్ఞకుండం దగ్గర మృత్యంజయ హోమాలు జరుగుతూ ఉంటాయి. కాలసర్పదోషం, అపమృత్యు దోషం ఉన్నవాళ్లు ఇక్కడ హోమం చేసుకుంటే ఆపదలు తొలగిపోతాయని నమ్మకం.
జాగేశ్వర మందిరం కొంచెం వెనుకగా ఉంటుంది. ఇక్కడ శివలింగం చిన్నగా ఉంటుంది, లింగం మధ్య చిన్న గీతలా అంటే రెండు భాగాలుగా ఉంటుంది. అర్థనారీశ్వరలింగం, శివపార్వతులిద్దరూ కలిసే ఇక్కడ ఉంటాకని అంటారు. ఇంతకు ముందు వెళ్లినప్పుడు జాగేశ్వర్ ఊరిలోనే రెండు రోజులున్నాం. పగలు రాత్రి హారతి సమయానికి వెళ్లే వాళ్ళం, అప్పట్లో పూజారి, శంకరాచార్యుల వారితో కర్నాటక నుంచి వచ్చిన అతని శిశ్యుని సంతతి వారి మని చెప్పి, శివలింగం చేత్తో తాకితే కదులుతుందని మా చేత కూడా ముట్టుకొని చూపించేరు. కదులుతోంది. అలా కదులుతూ ఉండడమే అక్కడి ప్రత్యేకతని, ప్రతీ మందిరంలోనూ శివుడు హారతి సమయానికే వస్తాడని కాని ఇక్కడ జగ్రదావస్థలో ఎప్పుడూ ఉంటాడని, భక్తుల కోరికలు తీర్చాలనే ఇక్కడ జగ్రదావస్థలో ఉంటాడని చెప్పేరు. అలాగే రాత్రి హారతికి ముందు స్వామివారి పడక సిల్కు దుప్పటి పరచి పూలు జల్లి తయారు చేసి హారతిచ్చి తలుపులు మూసి వేసేరు. మరునాడు పగలు 5 గంటలకి తలుపులు తీసే సమయానికి రమ్మని తాళం పెట్టి వెళ్లి పోయేరు. ఎందుకు అంటే స్వామి పడకపై దుప్పటి కదిలించినట్లు ఉంటుందని స్వామి ఆ పడకపై నిద్రిస్తారని చెప్పేరు. అప్పట్లో ఈ ప్రాంతాలలో మే, జూన్ లలో కూడా చాలా చలిగా ఉండేది. 5 గంటలకల్లా స్నానాలు చేసుకొని మందిరానికి వెళ్లేం, మా ముందరే తలుపులు తీసేరు. ఘంటాద్వని, శంఖనాదాలతో కోవెలలోపలికి వెళ్లేం. జాగేశ్వర్ మందిరం తలుపులు కూడా తీసుకొని లోపలకి వెళ్లేం, లోపల పడక నిజంగానే ఎవరో వాడినట్లుగా ఉంది, ఎలుకలున్నాయేమో?అన్నాను. మా ఊరు మొత్తం మీద ఎలుకలు లేవు అని ప్రాతఃకాల పూజ, అభిషేకాలు చెయ్యడం లో మునిగి పోయేడు. పూజ తరువాత మందిర సముదాయ ప్రాంగణంలో ఉన్న ఓ దేవదారు చెట్టును చూపించేరు, ఆ చెట్టు శిఖరం రెండుగా ఉంది, అంటే ఒకే మొదలు, తలలు రెండులా అన్నమాట, ఇది పార్వతీపరమేశ్వరుల అర్థనారీశ్వర రూపం అన్నారు. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది. అయితే ఇప్పుడున్న కుర్ర పూజారులకు అంత ఓపిక, ఓర్పు లేవు, అడిగినా ఇవేవీ చెప్పటం లేదు.
ఈజాగేశ్వర్ మహదేవ్ మందిరాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగనాథ్ మందిరమని చెప్తారు, అలా అని వ్రాసిన బోర్డు కూడా ఉంది. వీరు చెప్పేదేమిటంటే నాగేశం దారుకావనే అని శ్లోకంలో ఉంది కాబట్టి ఇదే అసలు జ్యోతిర్లింగం అని, శంకరాచార్యులవారు స్వయంగా వచ్చనట్లు, వారి శిశ్యులను పూజాది కార్యక్రమాల కొరకై ఇక్కడ ఉంచి నట్లు చెప్తారు, అలాగే మహారాష్ట్ర లో ఉన్న ఔండా నాగనాథ, ద్వారకలో ఉన్న నాగనాథ్ లే అసలు జ్యోతిర్లింగాలని వారు చెప్తారు. మాలాంటి వాళ్ళం ఎది అసలు ఎది కాదు అనే వాదనెందుకు అన్నీ చూసేస్తే పోలా? అనుకొని అన్నీ చూసెస్తాం.
ఇవి చూసుకొని మేం దర్చూలా వైపు ప్రయాణం సాగించేం. అప్పటికి సుమారు200 కిలో మీటర్లు ప్రయాణించేం. మరో 180 కిలో మీటర్లు ప్రయాణించాలి.
మేఘాలు కమ్ముకొని సన్నగా వాన ప్రారంభమయింది. కొన్ని చోట్ల రోడ్డుమీదకి రాళ్లు కొట్టుకు రావడం మొదలయింది. చిన్నగా అయితే ఏమనిపించలే గాని రెండుమూడు చోట్ల బండి వెళ్లలేనంత జోరుగా నీటిప్రవాహం దానితో పాటు రాళ్లు వస్తూ ముందు ప్రయాణం కష్టమనిపించింది. రోడ్డు పైన బళ్ళన్నీ ఆగిపోయేయి రెండువైపులా కూడా, ప్రవాహవేగం కొంచెం తగ్గగానే ఇటుప్రక్కవారు అటు ప్రక్కవారు బళ్లని దాటించేరు, ఎక్కువసేపు ఆడకోడదు, ప్రవాహానికి పెద్దరాయి అడ్డుపడి ఉంటుందని, కొద్దిసేపు తరువాత ఆ రాయి దొర్లుతూ రావొచ్చు, దానివల్ల మనం పెద్ద ప్రమాదంలో పడవచ్చు అని మా డ్రైవరు చెప్పడంతో కాస్త భయపడ్డాం. కొండలలో 180 కిలో మీటర్లు 5,6 గంటలు పట్టింది రాత్రి తొమ్మిదికి ధర్చూలా చేరేం. చలిబాగా వెయ్యడం మొదలయింది.
ఆది కైలాశ్, ఓం పర్వత్ చూపించే గైడ్ ఆ రాత్రి మాకి మొత్తం Itinerary ఇచ్చేడు. మరునాడు హెల్త్ చెకప్, పెర్మిట్ చేయించుకోడం, మరునాడు యాత్రకి బయలుదేరడం. బ్రేక్ఫాస్ట్ తరువాత హెల్త్ చెకప్ కి వెళ్ళేం, బిపి చెక్ చేసి మేమందరం ఫిట్ గా ఉన్నట్లు డాక్టరు సర్టిఫై చెసిన కాయితాలు తీసుకొని పెర్మిట్ కి గాను మా గైడ్ వెళ్లిపోయేడు, మిగతా సమయం లోకలో మార్కెట్టు తిరుగుదాం అని బయలుదేరేం. ప్రస్తుతం ధర్చూలా చిన్న టౌను. నాలుగైదు కిరాణా దుకాణాలు, బట్టల దుకాణాలు తప్ప మరేమీలేవు, కూరలు పళ్ళు రోడ్డుపైనే పెట్టుకొని అమ్ముకుంటున్నారు.మరో రెండుమూడేళ్ళ తరువాత ఊరెలా రూపాంతరం చెందుతుందో తెలీదు.
ఇంతకు ముందు మన ప్రభుత్వం ద్వారా నడపబడే కైలాశ్ మానససరోవర్ యాత్ర ధార్చూలా మీదుగా సాగేది. ఇక్కడ వరకే మోటారు బళ్ళు నడిచేవి, ఇక్కడి నుంచి కాలినడకన వెళ్లే వారు. గత కొన్ని సంవత్సరాలుగా కైలాశ్ మానససరోవర్ యాత్రకి చైనా ప్రభుత్వం భారతపౌరులను అనుమతించటం లేదు. 2024 లో ఆదికైలాశ్ యాత్రకు తగిన ఏర్పాట్లు భారత ప్రభుత్వం చేసింది. ఈ యాత్ర దారిలో వచ్చే గ్రామాలలో యాత్రీకుల భోజన, వసతులు చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. అయితే ఇక్కడి ప్రజలు వారికి ఉన్న వనరులలోనే యాత్రీకులకు అన్ని సదుపాయాలూ అమర్చడం చాలా సంతోషాన్ని కలుగజేసింది.
ధార్చూలా అనే పేరు ఈ గ్రామానికి ఎలా వచ్చింది అనే దానికి ఇక్కడ ఒక కథ చెబుతారు. సూర్యుడు ఉదయించేటప్పుడు దూరంగా ఉన్న కొండ అంచులలో భగభగ మండుతున్న పొయ్యి లా కనబడుతాడట, అందుకు ఈ గ్రామానికి ధార్( అంచు) చూలా(పొయ్యి) అనే పేరొచ్చింది.
మాతోపాటు వచ్చిన మా కజిన్ వాయుసేనలో డాక్టరు, ఆమె పది సంవత్సరాల క్రిందట ఈ మార్గం ద్వారా కైలాశ్ మానససరోవర్ యాత్రీకులకు మార్గదర్శిగా వెళ్లింది. మేమూ కైలాశ్ మానససరోవర్ నేపాల్ మార్గం వెళ్లేం. ఆమె అక్కడకి దగ్గరగా ఉన్న నారాయణాశ్రమం బాగుంటుంది అక్కడకి వెళ్దామంటే బయలుదేరేం.
ఆ వివరాలు త్వరలో చదువుదాం, అంతవరకు శలవు.