బెడెన్ పావెల్ జయంతి - ఫిబ్రవరి 22 స్కౌట్స్ డే - కొమ్మలూరు హరి మధుసూధన రావు

బెడెన్ పావెల్ జయంతి - ఫిబ్రవరి 22 స్కౌట్స్ డే

పరోపకారము - స్కౌట్స్ & గైడ్స్

ప్రతి రొజూ మంచి వైపు మరలాలని, ప్రతి ఒక్కరూ ఒక మంచి పని చేయాలని స్కౌట్స్ & గైడ్స్ వ్యవస్థాపకుడు బెడెన్ పావెల్ గారి ఆకాంక్ష. ఆర్తులను ఆదుకోవడం, ప్రకృతి పరిరక్షణ చేయడం నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడం మొదలగు సేవా కార్యక్రామాలు స్కౌట్స్ & గైడ్స్ చేయవలెనని బెడెన్ పావెల్ ఉపదేశించారు. ప్రపంచంలో 210 దేశాలకు పైగా స్కౌట్ ఉద్యమ ప్రపంచ సంస్థ World Organisation of the Scout Movement (WOSM) ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరపటానికి దిశా నిర్దేశకులు బెడెన్ పావెల్. ఫిబ్రవరి 22 బెడెన్ పావెల్ గారి జయంతి. ప్రపంచమంతటా ఫిబ్రవరి 22 వ తేదీని ప్రపంచ స్కౌట్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు.

బెడెన్ పావెల్ జీవిత చరిత్ర :

ఫిబ్రవరి 22 వ తేదీన 1857 వ సంవత్సరం లో ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరంలో హెర్బర్ట్ జార్జి బెడెన్ పావెల్ మరియు హెన్ రీటా గ్రీన్ స్మిత్ దంపతుల ఐదవ సంతానంగా స్కౌట్ ఉద్యమ స్థాపకుడైన రాబర్ట్ స్టివెన్ సన్ స్మిత్ బెడెన్ పావెల్ జన్మించాడు. అడవికి దగ్గరగా ఉన్న చార్టర్ హౌస్ స్కూల్ లో విద్యను అభ్యసించేటప్పుడే ప్రకృతి ప్రేమికుడిగా మారి జంతువులను మచ్చిక చేసుకొనుట, వేటాడుట వంటి ఆటవిక విద్యలను అభ్యసించాడు.

సైనిక ఉద్యోగిగా :

బెడెన్ పావెల్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత సైన్యంలో సబ్ లెఫ్టినెంట్ గా 1876 నుండి 1884 వరకు భారతదేశంలో పనిచేసాడు. ధైర్య సాహసాలకు మెచ్చి బ్రిటీష్ ప్రభుత్వం కెప్టెన్ గా పదోన్నతి కల్పించింది. 1885 నుండి 1895 వరకు ఇంగ్లాండ్, సౌత్ఆఫ్రికా, మాల్టాస్, ఐర్లాండ్ దేశాలలో సైన్యంలో తన సేవలను అందించాడు. 1897 మరొకసారి భారతదేశానికి వచ్చి కల్నల్ గా పనిచేసాడు. తన అనుభవాలతో ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుటకు ‘ఎయిడ్స్ టు స్కౌటింగ్’ (Aids to Scouting) అనే పుస్తకాన్ని రచించాడు. 1889 లో దక్షిణాఫ్రికాలో బోయర్ల పై యుద్ధంలో పాల్గొనడానికి వెళ్ళాడు. బ్రిటీష్ వారికి ఓటమి తప్పదని భావించి, దీని నుండి బయట పడటానికి బెడెన్ పావెల్ పనికి వస్తాడని బ్రిటీష్ అధికారులు భావించారు. 217 రోజులు సాగిన యుద్దంలో అతి తక్కువ సైన్యంతో, స్థానిక యువకులకు తర్ఫీదునిచ్చి బోయర్లతో జరిగిన యుద్ధంలో తన చాక చక్యంతో బెడెన్ పావెల్ విజయం సాధించడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. బ్రిటన్ మహారాణి అయిన విక్టోరియా రాణి బెడెన్ పావెల్ కు జనరల్ గా చేసి గౌరవించింది. 1910 లో తన 53 సంవత్సరముల వయస్సులో బెడెన్ పావెల్ సైన్యం నుండి ఉద్యోగ విరమణ చేసాడు.

స్కౌట్ ఉద్యమం :

తను వ్రాసిన ఎయిడ్స్ తో స్కౌటింగ్ అనే పుస్తకంలోని విషయాలను సమీక్షించి ‘స్కౌటింగ్ ఫర్ బాయ్స్’ అనే పుస్తకాన్ని వ్రాశాడు. ఈ పుస్తకం స్కౌట్స్ మరియు గైడ్స్ కు ఎంతో ముఖ్యమైనది. బైబిల్ తరువాత ఎక్కువగా ముద్రితమైన పుస్తకం కుడా ఇదే. ఈ గ్రంధం లోని విషయాలను పరీక్షించుటకు ‘బ్రౌన్ సి’ దీవిలో 1907 ఆగస్టు లో 20 మంది పిల్లలకు మొదట స్కౌట్ శిక్షణ నిచ్చాడు. ఇది విజయవంతం కావడంతో అనేక మంది పిల్లలు స్కౌట్ ఉద్యమంలో చేరారు. లండన్ లోని క్రిస్టల్ ప్యాలెస్ ప్రాంతంలో 1909 లో జరిగిన స్కౌట్స్ ర్యాలీలో అనేక మంది అమ్మాయి కూడా పాల్గొనడం చూసి బెడెన్ పావెల్ తన చెల్లెలు ఆగ్నెస్ ద్వారా అమ్మాయిల కోసం ప్రత్యేకంగా గైడ్స్ ని 1910 లో స్థాపించారు. స్కౌట్ ఉద్యమం తరువాత అంచెలంచెలుగా విశ్వ విఖ్యాతి పొందింది. బెడెన్ పావెల్ తన 55 సంవత్సరాల వయస్సులో ఒలేవ్ క్లారిసోమ్స్ ని వివాహం చేసుకున్నాడు. స్కౌట్ ఉద్యమ స్థాపకుడైన బెడెన్ పావెల్ ని బి.పి. గా గౌరవంతో పిలుచుకుంటారు. స్కౌట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బెడెన్ పావెల్ సతీమణిని లేడీ బి.పి. గా పరిగణిస్తారు. లేడీ బి.పి. గారి పుట్టిన రోజు (1889) ఫిబ్రవరి 22 కావడం యాదృచ్ఛికం. అందుకే ఫిబ్రవరి 22 వ తేదీని థింకింగ్ డే జరుపుకుంటున్నారు. వీరిద్దరూ అనేక దేశాలు తిరిగి స్కౌట్ వ్యవస్థను బలోపేతం చేశారు. దీనిలో భాగంగా 1921లో భారతదేశానికి వచ్చి బెంగాల్ లోని కలకత్తాలో స్కౌట్ ర్యాలీలో పాల్గొన్నారు. బెడెన్ పావెల్ చేసిన సేవను గుర్తు చేసుకుంటూ ప్రపంచంలో వారి జయంతిని ప్రపంచ స్కౌట్స్ డే గా జరుపుకుంటున్నాము.