సుశాస్త్రీయం - తెలుగు భాషోద్ధారకుడు శ్రీ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ - టీవీయస్.శాస్త్రి

Charles Philip Brown

UNESCO వారు ప్రపంచం మొత్తం మీద 13 భాషలు మృతభాషలుగా మారే ప్రమాదముందని గుర్తించారు. త్వరలో తెలుగు భాష కూడా ఆ జాబితాలో చేరే అవకాశాలున్నాయని విశ్లేషకుల అంచనా!మాతృభాష మృతభాష కాకుండా కాపాడుకోవటం మన ధర్మం,కర్తవ్యం. మనిషిగా పుట్టినందుకు మనం ముఖ్యంగా ముగ్గురి ఋణాలను తీర్చుకోవాలి.

ఒకటి-జన్మనిచ్చిన తల్లి,రెండు-పుట్టిన గడ్డ,మూడవది- భావవ్యక్తీకరణకు బాసటగా నిలచిన మాతృభాష ఋణాన్ని! ఉగ్గుపాలతో నేర్చుకున్న భాషను మాట్లాడటానికి సిగ్గుపడే ప్రబుద్ధులున్న బిడ్డలను కన్న తెలుగుతల్లి దీనస్థితి చూస్తే బాధ వేస్తుంది. ప్రపంచ తెలుగుమహాసభలు జరిపి, చేతులు దులుపుకోవటం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. సభలలో సరైన నిర్ణయాలు తీసుకోరు, తీసుకున్న నిర్ణయాలను కూడా సరిగా అమలుపరచరు. ప్రాచీన హోదా పొందిన ఈ తెలుగు భాషకు పరాయి గడ్డమీద పుట్టిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ లాంటి వారు ఈ మధురమైన భాషను నేర్చుకొని, దాని అభివృద్ధికోసం వారి జీవితాన్నే అంకితం చేసిన విధానాన్ని చూస్తే, అటువంటి మహనీయునికి మన తెలుగు జాతి యావత్తు ఋణపడి ఉండిందనటంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

తెలుగు భాషా సేవకుడైన C.P. బ్రౌన్ గారిని గురించిన కొన్ని విషయాలను తెలుసుకొని వారిని స్మరించుకోవటం మన కనీస ధర్మం! చార్లెస్ ఫిలిప్ బ్రౌన్,1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ మతప్రచారకుడు,నియమబద్ధమైన జీవితాన్ని గడిపిన వాడు.C.P.బ్రౌన్  చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆ తర్వాత C.P.బ్రౌన్ తల్లితో ఇంగ్లండు వెళ్ళిపోయాడు. C.P.బ్రౌన్ కు చిన్నతనం నుండి భారతీయ భాషలమీద మక్కువ ఎక్కువ. ఆ మక్కువతోనే ఇంగ్లండులో ఉన్నప్పుడే హిందుస్థానీ భాషను నేర్చుకున్నారు. కొంతకాలం తరువాత, మద్రాసులో 1817 ఆగష్టు 4 న,ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. ఆ రోజుల్లోనే తెలుగు భాషను నేర్చుకోవాలనే మక్కువ కలిగింది. ఒక మంచి ఉపాధ్యాయుని సహాయంతో తెలుగు భాషలో కొంతవరకు పరిచయాన్ని పెంచుకున్నారు.ఆయన తెలుగు నేర్చుకుంది ఉద్యోగ బాధ్యతలో ఒక భాగంగానే! అయితే, క్రమేపీ తెలుగు భాషలోని తియ్యదనం ఆయనను అమితంగా ఆకర్షించింది.1820 ప్రాంతంలో, ఆంధ్రదేశంలోని ఒక మారుమూల ప్రాంతమైన కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు.ఆ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలంటే, ప్రజలతో మమేకం కావాలి.వారి కష్ట సుఖాలను గురించి తెలుసుకోవాలంటే, తెలుగు భాషమీద పట్టు సాధించాలి. ఆయనకు ముందు పనిచేసిన ఉద్యోగులు, అనువాదకుల ద్వారా పదవిని నిర్వహించేవారు. అనువాదంలో మూలానికి అన్యాయం జరిగే ప్రమాదముందని గ్రహించి,ఇష్టపడి,కష్టపడి తెలుగు భాషను ఆసాంతం నేర్చుకోవటానికి సంసిద్ధుడయ్యాడు బ్రౌన్.

భాష నేర్చుకోవటానికి ఆయన ఎదుర్కున్న ఇబ్బందులే, ఆయనను తెలుగు భాషా పరిశోధకుడిగా మార్చాయి. ఉద్యోగ రీత్యా ఈయన మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునల్వేలి లాంటి ప్రదేశాలలో పనిచేసి, రెండవసారి అనగా 1826 లో మరలా కడపకు తిరిగివచ్చి, అక్కడే స్థిరపడ్డారు. ఇన్ని ప్రాంతాలను తిరగటం వలన, ఒక్కొక్క ప్రాంతంలో ఉండే మాండలికాలాను, భాషలోని తేడాలను, ఒకే మాటకు వివిధ ప్రాంతాలలో ఉన్న విభిన్న అర్దాలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. వీటినన్నిటినీ దృష్టిలో ఉంచుకొని, తెలుగులో మొట్టమదటి నిఘంటువును ప్రచురించింది వీరే! నేటికీ మన పండితులందరు కూడా దీనినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు .అంతేకాకుండా వారి పేరు మీద 'బ్రౌణ్యం' అనే పదం కూడా ఏర్పడింది. బ్రౌన్ చెప్పిందే  'బ్రౌణ్యం'! అలానే, ఒక వ్యాకరణ గ్రంధాన్ని కూడా వెలువరించారు.

ఆనాటి పండితుల సహాయాన్ని తీసుకొని తెలుగులోని చాలా ప్రాచీన గ్రంధాలను,కావ్యాలను అందరికీ అర్ధమయ్యే విధంగా పరిష్కరించారు.దీనికోసం ఎంతోమంది పండితులను పోషించారు. విశేషమేమంటే,  ఇదంతా తన సొంత ధనంతోనే నిర్వహించారు. పేదప్రజలకు ధన సహాయం చేసేవాడు. ఆయనలోని ధార్మిక దృక్పథం, పుస్తక ప్రచ్రురుణలకు అయిన ఖర్చులవలన బ్రౌన్ ఆర్ధికంగా దెబ్బతిన్నాడు. అప్పులు కూడా చేసాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఇతని ధోరణి నచ్చక,1834 లో ఉద్యోగం నుండి తీసివేసారు. మరలా కొంతకాలం తరువాత, కంపెనీ వారికి  పర్షియన్ అనువాదకుడిగా, 1837లో ఇండియాకు వచ్చాడు. నిజానికి అది ఒక మిష మాత్రమే! అసలు కారణం,ఆయనకు భారతదేశపు సంస్కృతీ, భాషలపట్ల వ్యామోహం తీరకపోవటం వలన ఏదో ఒక రూపంలో ఈ దేశానికి వచ్చి తెలుగు భాషకు నూతన జవసత్వాలను తేవటం! అలా వచ్చిన ఆయన, అనుక్షణం తెలుగు భాష అభివృద్ధికోసం అహోరాత్రులు కృషిచేసాడు.

తేటతెలుగుకవి వేమన పద్యాలకు వెలుగు చూపించాడు. తెలుగువారికొక మంచి నీతిశతకం లభ్యపడటానికి కారకులయ్యారు. వేమన పద్యాలుగా చెప్పబడే 1164 పద్యాలను పరిష్కరించి ప్రచురించాడు. నలచరిత్ర, వసుచరిత్ర, పల్నాటి వీరచరిత్ర, ఆంధ్రమహాభారతం, శ్రీమద్భాగవతాలను కూడా ప్రచురించాడు. ఉద్యోగ బాధ్యతలు ఒక వైపు, తెలుగు భాషా సేవ మరొకవైపు - ఇలా సాగింది ఆయన జీవితం. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదనే విమర్శలను ఎదుర్కొన్నాడు.1854 లోఉద్యోగ బాధ్యతల నుండి విముక్తుడైన తరువాత, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా పనిచేసారు. లండన్ నుండి ఆయన ఇండియాలోని భాషా ప్రేమికులతో తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగించారు. ఈ మహనీయుడు తెలుగు భాషకు చేసిన సేవను గురించి, ప్రఖ్యాత సాహితీ పరిశోధకుడు స్వర్గీయ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇలా అన్నారు, "ఆంధ్రభాషోద్ధారకులలో కలకాలము స్మరింపదగిన మహనీయుడు, మహావిద్వాంసుడు సి.పి.బ్రౌను" మరొక సాహితీ పిపాసి, పరిశోధకుడు అయిన స్వర్గీయ కొమర్రాజు లక్ష్మణరావు గారు, బ్రౌన్ ని గురించి ఈ విధంగా చెప్పారు, "సి.పి.బ్రౌను అనునాతడు ఆంధ్రభాషామతల్లి సేవకే జన్మమెత్తినట్లు కానవచ్చుచున్నది. ఇతడు ఆంధ్ర వాజ్మయాభివృద్ధికి చేసినంతటి పని ఇటీవలి వారెవ్వరూ చేయలేదని చెప్పిన అతిశయోక్తి కానేరదు" తెలుగు భాషా సేవకోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఈ మహనీయుడు,1884 డిసెంబర్ 12న, లండన్ లో తన 86 వ ఏట మరణించారు. ఆయనకు స్మృతి చిహ్నంగా కడపలో ఆయన నివాసమున్న గృహంలోనే ఒక గ్రంధాలయాన్ని ఏర్పాటు చేసారు. కానీ, నిధుల కొరత వలన అది సరిగ్గా నడవటం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం వారు C.P. బ్రౌన్ అకాడెమీ అనే సంస్థను, తక్కువ ధరలో కొన్ని మంచి పుస్తకాలను ప్రచురించి తెలుగు సాహిత్యాన్ని ప్రతి ఇంటికి చేరువ చెయ్యాలనే సదుద్దేశ్యంతో నెలకొల్పారు. అది కూడా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతుంది. నేను ఈ మధ్య ఒక పుస్తకంకోసం ఆన్ లైన్ లో ఆర్డర్ ఇద్దామని ప్రయత్నించి విఫలుడనయ్యాను.  దాని వెబ్ సైట్ నిర్వహణ కూడా సరిగా లేదు. మరీ దారుణం ఏమిటంటే, పుస్తకం విలువకు, పోస్ట్ ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని చెక్కుద్వారా కొరియర్ లో పంపితే,ఆ చిరునామాలో అకాడెమీ లేదని నా లేఖ తిరిగి వచ్చింది. వెబ్ సైట్ లో కనీసం మారిన చిరునామాను కూడా సవరించలేని దీనస్థితిలో ఉంది ఆ అకాడెమీ. భాగ్యనగరంలో వీధి రౌడీలకు కూడా శిలావిగ్రహాలు ఉన్నాయి. కానీ, ఈ మహనీయుని శిలావిగ్రహాన్ని ప్రధాన కూడలి ప్రాంతంలో ఏర్పరచకపోవటం అనేది మన బాధ్యతారాహిత్యం, అవిధేయత, కృతఘ్నతా భావం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మన భాషకు ఇంత  సేవ చేసిన మహానీయుని పట్ల మనం చూపించవలసిన కృతజ్ఞత ఇదేనా? అసలు ఈ వ్యాసానికి మొదట 'తెలుగు భాషా సేవకుడు  శ్రీ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్' అనే మకుటాన్ని ఉంచాను. భాషకు సేవ చేయవలసిన మనం భాషను ఉద్ధరించినట్లు బడాయిలు చెప్పుకోవటం చూసి,వ్యాసానికి 'తెలుగు భాషోద్ధారకుడు శ్రీ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్' అనే మకుటాన్ని ఉంచాను. ఈ వ్యాసం ప్రేరణతో నైనా ,మాతృభాషను మృత భాషను కానివ్వకండి!

తెలుగు భాషోద్ధారకుడు శ్రీ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కు స్మృత్యంజలి!  

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి