
ఏమోయ్ నాలుగు దాటింది, ఆ టీవీ కాస్త ఆపి, కాఫీ- గట్రా ఏమన్నా ఉంటే , నా మొహాన పడేయ్! నా ఈవెనింగ్-వాక్ కి టైమ్ అయింది, అన్నాడు నరసింహం.
రిటైర్ అయ్యాక చాదస్తం తో పాటు ఇలా మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్ లాంటి మంచి అలవాట్లు వచ్చాయి నరసింహం కి.
ఒక్క రోజు కాఫీ లేక పోతే తట్టుకో లేరు అని తనలో తను అనుకుంటూ వంట గది లోకి వెళ్ళిపోయింది శకుంతల. ఫ్రిడ్జ్ లో అర లీటర్ ప్యాకెట్ లో ఉన్న పావు లీటర్ పాలను ఒక గిన్నె లో పోసి గ్యాస్ వెలిగించింది.
“మైసూరుశాండల్ సబ్బు, పావలా బిళ్ళ సైజు కు వచ్చింది కొత్త సబ్బు పెట్టు”, అంటూ హాల్ లోకి వచ్చిన నరసింహం తన ఎదురుగా నిలుచున్న శకుంతలను చూస్తూ, "కాఫీ ఎక్కడే" అన్నాడు.
"పాలు విరిగిపోయాయి, ఈ పూట కాఫీ లేదు గీఫీ లేదు, కాఫీ-గట్రా తెమ్మన్నారు గా ఇందాక , గట్రా కావాలంటే మొన్నటి పుల్లారెడ్డి మిక్స్చర్ ఇస్తా, అంతే" అంది శకుంతల.
“నిన్ననేగా రెండు పాల ప్యాకెట్లు తెచ్చాను, నీకు దుబారా ఎక్కువైంది ఈ మధ్య "
" నన్నంటే మాత్రం ఊరుకోను. మీరే గా ప్రొద్దున్నే పంచాంబృతం ఎక్కువ చెయ్యి, మా అమ్మైతే చెంబుడు పంచాంబృతం ఇచ్చేది, నేను చెంచాడే ఇస్తానని దెప్పిపొడిచారు, మర్చిపోయారా? పాలన్నీ వాడేసాను “ అంది కాస్త వ్యంగ్యంగా శకుంతల.
" ఐనా నిన్నని ప్రయోజనం లేదు లే, కాలమే ఇలా ఏడ్చింది. అన్నిట్లో నూ దుబారానే, వెఱ్ఱి వెయ్యి విధాలు అన్నట్టు మొన్నామధ్య వినాయకుడు పాలు తాగుతున్నాడని కొన్ని వేల లీటర్లు ధార పోసారట, ఇది కాకుండ నాగుల చవితి ఉండనే ఉంది గా, ఆ ఒక్క రోజే కొన్ని లక్షల లీటర్ల పాలు పుట్టలో పోస్తున్నాం. పోనీ పాడీ- పంటా అయినా సంవృద్ధిగా ఉందా అంటే అదీ లేదు, మరి పాలు ఎక్కడ నుండి వస్తాయ్? ఉన్న పాలల్లో నీళ్లు, ఇంకా దిగజారి అవీ-ఇవీ , ఏవి పడితే అవి , కరిగితే చాలు కల్తీయే. కల్తీ మీద కల్తీ. కల్తీ మనుషులు! కల్తీ బుద్ధులు!" అంటున్న నరసింహం ఇంకా తన మాట ఆపక ముందే అందుకుంది శకుంతల,
"అబ్బబ్బా ఇంక ఆపండి! మీరూ మీ చాదస్తం! ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కల్తీ మొమ్మాటికి తప్పే, పసి పిల్లలు , పండు ముసలి , రోగులు ,పౌష్టిక ఆహారంగా పాల పైనే ఆధార పడి ఉన్నారని కూడా ఆలోచించరు. చిక్కటి పాల కాఫీ తాగి, కమ్మటి గడ్డ పెరుగు తిని ,ఎన్ని ఏళ్ళైందో! హ్మ్ఁ.. పోనీలెండి కలికాలం" అంది ఉతికి న బట్టలు మడత పెడుతూ .
"కలికాలం కాదే కల్తీ కాలం! ఇలా నీతో మాటలు పెట్టుకోవడం నాకు వృధా కాలం" అన్నాడు నరసింహం నవ్వుతు.
" మీదేమో వృద్ధ కాలం ! మీరూ మీ కవిత్వం. బయలుదేరండి చీకటి పడ్తోంది. అలాగే వచ్చేటప్పుడు సత్యనారాయణ స్టోర్లో పాలు తెండి" అంది శకుంతల.
ఓ గంట తరువాత , శకుంతల సెల్ఫోన్ “జగదానంద నాయక“ అన్న పాట రింగ్టోన్ లా మ్రోగింది.
"చెప్పండి" అంది శకుంతల."శకుంతల, ఈ రోజు సూపర్ -పవర్ స్టారు సినిమా రిలీజ్ తెలుసా" అన్నాడు నరసింహం.
“అయితే నాకెందుకు చెబుతున్నారు?” అంది శకుంతల
“అంతే కాదు ప్రముఖ రాజకీయ వేత్త , దీనబంధూ గారి నూరవ జయంతట ! అన్నాడు ఆసక్తిగా నరసింహం.
"రామా! ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేసారా?అవతల అటుకుల ఉప్మా మాడిపోతుంది" అంది కాస్త విసుగ్గా శకుంతల.
"అదే మరి, హీరో గారి కటౌట్ కి పాలాభిషేకం కోసం, నాయకుడి విగ్రహానికి పాలాభిషేకం కోసం , వారి వారి అభిమానులు మార్కెట్ లో ఉన్న పాలు అన్నీ ఊడ్చేశారట. సో…నో మిల్క్! మిల్క్ అవుట్ అఫ్ స్టాక్ అని బోర్డులు! " నిరుత్సాహంగా అన్నాడు నరసింహం, ఒక రకమైన నిర్లిప్తతా భావం తో.