ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర-3 - కర్రా నాగలక్ష్మి

ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర-3

ఆది కైలాశ్ ఓం పర్వత్ యాత్ర-3

సుమారు 55 కిలోమీటర్లదూరం, టాక్సీ చేసుకొని బయలుదేరేం. ఆది కైలాశ్ దారిలోనే ఇరవై కిలోమీటర్లు వెళ్లిన తరువాత డైవర్షన్ వస్తుంది, ధర్చూలా వరకు రోడ్లు బాగుంటాయి, ఆతరువాత దైవాదీనమే, నారాయణ ఆశ్రమం కి వెళ్లే దారైతే మరీ ఘోరం. సముద్ర మట్టానికి సుమారు 2734 మీటర్ల ఎత్తులో ఉంది ఆశ్రమం. కొన్ని చోట్ల మరీ బురదలోనే ప్రయాణించ వలసి వచ్చింది. అంతా దేవదారు వృక్షాలు, మబ్బులు కమ్ముకొని చాలా చోట్ల తుప్పర పడుతూ ఉంది వాతావరణం, చీకటి పడకుండా వచ్చేయాలి అని బయలుదేరిన దగ్గర నుంచి మా డైవరు సణుగుడు. నాలుగైదు గంటల ప్రయాణం తరువాత నారాయణ ఆశ్రమం చేరేం.

చక్కని కట్టడం, ప్రశాంతంగా ఉంది.

పంచచూలి పర్వత శ్రేణులలో కట్టబడిన ముచ్చటైన ఆశ్రమం. అక్కడ శానిటోరియం, స్థానిక పిల్లలు చదువుకొనే స్కూలు కూడా అదే. జూన్ లో స్కూల్ శలవులవడం వల్ల అంతా ఖాళీగా ఉంది. ఆశ్రమంలో కూడా ఒకరిద్దరు తప్ప ఎక్కువ మందిలేరు. కైలాశ్ మానససరోవర్ యాత్ర జరిగేటప్పుడు యాత్రీకులకు వసతిగా ఆశ్రమం ఇచ్చేవారట, యాత్ర ఆగిపోయేక సమయంలో ఆశ్రమం ఖాళీగానే ఉంటోందట.

ఆశ్రమం నారాయణస్వామివారిచే నిర్మించబడింది, నారాయణ స్వామి గురించి తెలుసుకొని తరువాత ఆశ్రమ పరిసరాలను పరికిద్దాం.

ఉత్తరాది వారిలా చెప్పాలంటే మద్రాసీ, మనలా చెప్పాలంటే కర్నాటక లో సుమారు 1914 లో జన్మించిన యువకుడు(పేరు ఎవరికీ తెలీదు), భక్తిమార్గం ఎన్నుకొని, కైకైలాశ్ మానససరోవర్ కి వెళ్లాలని అన్ని కష్టాలనూ ఎదుర్కొని ఎలాగో అలా హరిద్వార్ చేరుకున్నాడు, అక్కడినుంచి కైలాశ్ ఎలా వెళ్లాలో తెలీక హరిద్వార్ లోనే యోగులకు సపర్యలు చేస్తూ, కైలాశ్ వెళ్లాలనే కోరికను వెలిబుచ్చుతూ గడపసాగేడు. ఓనాడు కొంతమంది యోగులు కైలాశ్ వెళుతూ ఇతనిని కూడా తమతో రావలసిందిగా ఆహ్వానించేరు. వీరు తావాఘాట్ అనే గ్రామం మీదుగా వెళ్తూ రాత్రి అక్కడ బస చేసేరు. ప్రదేశం నారాయణ స్వామికి బాగా నచ్చింది. కైలాశ్ నుంచి తిరిగి వచ్చే టప్పుడు తోటి యాత్రీకులతో హరిద్వార్కి వెళ్ళిపోక ఇక్కడి గ్రామ ప్రజలకి ఏమైనా చెయ్యాలనే సంకల్పంతో ఇక్కడే ఉండిపోయేరు, ధనం లేకపోతే తానేమీ చెయ్యలేనని తెలియడంతో కొన్నాళ్ళు దేశాటనం చెయ్యాలని వెళ్ళిపోయేరు, దేశాటనలో ధనికులు ఇచ్చిన డబ్బుతో తిరిగి వస్తూ తనతో కూడా నారాయణుని విగ్రహాన్ని తీసుకు వచ్చేరు, బరువైన విగ్రహాన్ని పల్లకీలో తెస్తూ నారాయణ మంత్రాన్ని జపిస్తూ వస్తున్న అతనిని గ్రామ ప్రజలు నారాయణ స్వామి అని పిలువసాగేరు. నారాయణస్వామి తిరిగి వచ్చిన తరువాత గ్రామ ప్రజల కొరకు విద్యాలయం, వైద్యశాల ప్రారంభించేరు. సుమారు 1946 లో ఆశ్రమం ప్రారంభించబడింది. అప్పట్లోనే వైద్యశాలకి X-ray మిషిన్ తెప్పించేరట. నారాయణ స్వామి రామకృష్ణపరమహంస, వివేకానందుల వారి బోధనలు అనుసరించేవారట.

ఆశ్రమం పంచచూలి పర్వత శ్రేణుల మధ్య సుమారు 2734 మీటర్ల ఎత్తున ఉంది. ఇక్కడ వివిధ రకాలైన పుష్ప జాతులను చూడొచ్చు. ఆశ్రమం తరువాత లోయ తప్ప మరేమీలేదు. ప్రశాంతమైన ప్రదేశం, చాలా నీటుగా ఉన్న పరిసరాలు, ముఖ్యంగా పూల తోటలు వదిలి రాబుద్ది కాదు. ప్రశాంతంగా అక్కడ కొన్నాళ్ళు ఉండాలని అనిపించింది.

ఆశ్రమంలో సమాధి మందిరం, నారాయణ మందిరం, కొన్ని గదులు ఉన్నాయి. కొద్ది మంది పనివారు, ఒకరో చాలా తక్కువ మంది శిశ్యులు ఉన్నారు, వారుకూడా కొన్ని రోజులు గడిపి వెళ్లిపోయేవారే, అక్కడ ఉండి ఆశ్రమాన్ని నడిపేవారు ఏదో కార్యక్రమానికి వెళ్లేరు.

కైలాశ్ మానససరోవరానికి వెళ్ళే దారి అని మెట్ల దారి ఉంది, అక్కడనుంచే యాత్రకు వెళ్ళేవారట.

దట్టంగా మబ్బులు కమ్ముకుంటూ ఉండడంతో మేం తొందరగా బయలుదేరిపోయేం.

మరునాడు పది దాటేక తిరిగి ఆది కైలాశ్ యాత్రకి బయలు దేరేం. పది తరువాత ఎందుకంటే రాత్రి ఎక్కడైనా కొండచరియలు విరిగి పడితే వాటిని తీసివేసేక మాత్రమే దారి తెరుస్తారట.

సుమారు ధర్చూలా నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నగుంజిచేరుకున్నాం, ఆదికైలాశ్ వెళ్ళే రోడ్డుమీద ఉన్న గ్రామం, కొండలలో గ్రామం అంటే నాలుగిళ్ళు ఉంటాయి అంతే. అక్కడ మాకు భోజనం, మేము చేరేక వాళ్ళు వంటలు మొదలు పెట్టేరు. చలి బాగా పెరిగింది. శుచిశుభ్రం కోసం ఇలాంటి ప్రదేశాలలో వెతుకకోడదు. రుచి ఎలా ఉంటుందో అనుకున్నాం, రెండుకూరలు, పప్పు, రొట్లు, అన్నం ఇంకేమైనా వండమంటారా? అని కూడా అడిగేరు. ఇవి చాలని అన్నాం. రుచిగానే ఉన్నాయి.

గంట రెస్ట్ తరువాత నాభికి బయలుదేరేం. గుంజి హోటలు దాటగానేఇగ్లుఆకారంలో కట్టిన గదులు కనిపించేయి, వాటిని కైలాశ్ మానససరోవర్ యాత్రీకులకు ఉండడానికి ఇచ్చేవారట, అక్కడనుంచి అంతా మిలిటరీ వారి నివాసాలు తప్ప మరేమీ లేవు.

నాభి చేరేసరికి ఎండ బాగా ఉంది. అక్కడ రెండు మూడు యాత్రీకులకై ఏర్పాటు చేసిన గదులు తప్ప మరేమీ లేవు. ఇంకా ముందున గాని వెనుకన గాని యాత్రీకులు ఉండడానికి గాని భోజనానికి గాని ఏమీ దొరికే ఛాన్స్ లేదు. మేము ముందుగా చేరుకున్నాం కాబట్టి మాకు నచ్చిన గదులు తీసుకున్నాం. గదులన్నీ గూళ్లలాగా ఆరేడు ఎత్తైన మెట్లు ఎక్కేక వంగొని వెళ్ళేలా ఉండేగదులు, బాత్రూములు క్రిందన, మట్టితో కట్టిన మెట్లు, కాలు జారిందంటే గోవింద, వాన పడితే బురదమయం. అయితే ఆరూములు వెచ్చగా ఉంటాయి, మేము ఎంచుకున్నవి క్రిందన ఉన్న గదులు, చలి ఎక్కువగా ఉంటుంది. వంటహాలుకి కాస్త దూరం, మెట్లు ఎక్కడాలు, దిగడాలు లేవు కాబట్టి ఆగదినే మేము ఎంచుకున్నాం.

దూరంగా మంచుకప్పబడిన పర్వతాలు, కొండని ఆనుకొని నిర్మించ్న గదులు, రహదారిని ఆనుకొని ఉన్నాయి. టూరు అంతా ప్యాకేజీ కాబట్టి వారు రూముకి ఎంత తీసుకున్నదీ మాకు తెలీదు.

ఇక్కడి వసతి సౌకర్యాల గురించి చెప్తాను. ప్రదేశం కుటుంబం నడుపుతున్నారు. చుట్టూరా మట్టి గదులు, ప్రక్కగా రెండు బాత్రూములు, రెండు టాయిలెట్లు, ఒక పెద్ద బాయిలర్, కట్టెలతో పనిచేస్తుంది. ప్రొద్దుట ఒక రెండుగంటల కోసం కర్రలు పెట్టి ముట్టిస్తారు, బాయిలర్ ప్రక్కన ఉన్న కుళాయికి పైప్ ద్వారానీటిని పంపుతారు. అందులోంచి వేడినాళ్లు వస్తాయి. పెద్ద టెంటు అందులో పాతికమంది కూర్చోడానికి వీలుగా కుర్చీలు టేబుళ్లువేసేరు. టేబుల్ పైన టీ, దాని ప్రక్కనే త్రాగడానికి వేడినీరు. ప్రక్కనే ఉన్నటెంటు వంటగది, అందులో ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగ మనిషి పనులు చేస్తూ ఉన్నారు. మరొకతను వంట గదిలోని వారికి సామానులు, కర్రలు అంద జెయ్యడం. కూరలు తరగడం, వండిన సామాను పక్క టెంటుకి చేరవెయ్యడం చేస్తున్నాడు, మరొకతను రిపేరు పనులు చేస్తున్నాడు, అందరూ ఒకేకుటుంబానికి చెందిన వారు.

మేము చేరగానే హారతి ఇచ్చి బొట్లు పెట్టి వారి పద్ధతిలో ఆహ్వానించేరు. తరువాత వేడి టీ, బజ్జీలు ఇచ్చేరు. ఎనిమిదికి డిన్నరు ఇస్తామని చెప్పేరు, మాకు ఏడుకల్లా డిన్నరు కావాలని చెప్పేం, మరునాడు నాలుగికి బయలుదేరి ఆదికైలాశ్ చేరాలనేది మా ఆలోచన, సాధారణంగా కొండలలో తొమ్మది, పది దాటితే మబ్బులు కమ్ముకుంటాయి, అలాంటి పరిస్థితిలో ఆదికైలాశ్ దర్శనం కాదు. ఇది మా గైడ్ మాకిచ్చిన సూచన.

అంత ప్రొద్దున్నే వేడినీరు ఇవ్వలేము అని చెప్పేరు, మేము మా దగ్గర ఉన్న కెటిల్స్ లో వేడినీరు కాచుకొన్ గోరువెచ్చని నీటితో స్నానాలు చేసుకొని అను కున్నట్లుగా నాలుగుకి వెళ్లలేకపోయేం, కాని అయిదుకి బయలుదేరేం. మా గైడు మరో గ్రాపువాళ్లతో మమ్మల్ని కలిపి తీసువెళ్లాలని, వారు మేము బయలుదేరేటప్పటికి నిద్రలోనే ఉన్నరు, ఎనిమిది దాటితేకాని రామని అనడంతో మేము అయిదుకి గొడవచేసి బయలుదేరిపోయేం.

మిగతా వివరాలు వచ్చే వారం చదువుదాం, అంతవరకు శలవు.