సుశాస్త్రీయం: మరో మహాత్ముడు - ఆంధ్రా గాంధి - శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు - టీవీయస్. శాస్త్రి

Vavilala Gopalakrishnayya Biography

రెండు జతల ఖద్దరు బట్టలు, గాంధీజీ బొమ్మ వున్న ఒక ఖద్దరు సంచిలో సద్దుకొని నిత్యమూ ఏదో ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొనటానికి సిద్ధంగా ఉండే ఈ అసాధారణ వ్యక్తి మన ఆంధ్రుడే అని గర్వంతో చెప్పుకోవచ్చు. ఏక సంథాగ్రాహి, తెలుగు ఆంగ్ల భాషలలో అనేక గ్రంధాలు రచించిన ఈ మేధావి మన తెలుగు బిడ్డ అని చెప్పు కుంటానికి ఎంత గొప్పగా ఉంటుందో నాకు! పెద్ద విద్యాధికుడు కాదు, సామాన్యమైన మాధ్యమిక విద్యాలయంలో చదువుకున్న విద్యే! అయితేనేమి, అమోఘమైన ధారణ కలిగిన వ్యక్తి. ఎంతో మంది మేధావులు, విద్యావంతులు-- విశ్వ విద్యాలయాలలో వీరి 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వపు బడ్జెట్ ఉపన్యాసాలు' వినటానికి కుతూహల పడేవారు ఆరోజుల్లో! ప్రజా ఉద్యమాలు సరే సరి, అవే వారికి ఊపిరి, ఉత్తేజం! సాహిత్య పిపాసి. గురజాడ వారి కన్యాశుల్కం గురించి ఎంత  విశ్లేషణ  పూర్వకంగా విపులీకరించి చెబుతారో! ఈ మహనీయుడు మా నాన్నగారైన శ్రీ తెలదేవలపల్లి వేంకటేశ్వర్లు గారికి ఆప్తులు, మాకు బంధువు కూడాను.  అట్టి మహనీయుని జీవిత చరిత్ర గురించి నాకు తెలిసిన కొన్ని విషయములు మీకూ తెలియ చేయటానికి గర్వపడుతున్నాను.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు 17-09-1906 న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి అనే ఊరిలో జన్మించారు. వీరి తల్లి తండ్రులు శ్రీమతి పేరిందేవి, శ్రీ నరసింహం గార్లు. తల్లి తండ్రులకు వీరు నాలుగవ సంతానం. చదువుకునే రోజుల్లోనే గాంధీజీ స్వాతంత్ర్య  ఉద్యమం వైపు ఆకర్షితులై, విద్యను మధ్యలోనే  ఆపి వేసి అనేక ఉద్యమాలలో పాల్గొని  బ్రిటిష్ వారిచే జైలు శిక్షలు కూడా అనుభవించారు. జీవితమంతా నిరాడంబరంగా గడిపారు. ఆజన్మ బ్రహ్మచారి. అజాత శత్రువు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో శ్రీ గార్లపాటి నరసింహారావు గారితో కలసి పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసిన యోధుడీయన!. 1925 లోనే సత్తెనపల్లిలో 'శారదా నిలయం' అనే  గ్రంధాలయం నెలకొల్పటమే కాకుండా, గ్రంధాలయ ఉద్యమాలు చేసి, అనేక గ్రంధాలయాల ఏర్పాటుకు కృషి చేసారు. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి శాసన సభ్యునిగా సత్తెనపల్లి నుండి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుతో అభ్యర్ధిగా పోటీచేసి ఎన్నికయ్యారు. ఆ తరువాత వీరు చాలాసార్లు Independent  అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జీవితాంతం గాంధేయ వాదిగా కొనసాగిన వీరు శ్రీ ప్రకాశం పంతులు గారికి సన్నిహితుడు.

మరో ఆంద్ర ప్రముఖుడు అయిన  శ్రీ తెన్నేటి విశ్వనాధం గారు, వీరు ఆ రోజుల్లో ఆంద్ర ప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతలుగా ఉండి అనేక ప్రజా సమస్యలపైన అర్ధవంతమైన చర్చలు చేసారు. వీరి చర్చల మధ్యలో కొన్ని  హాస్యోక్తులు నా కింకా గుర్తున్నాయి. శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులవి. ఒక రోజు శాసన సభలో ఒక తీవ్రమైన విషయంపైన సుదీర్ఘ చర్చ జరుగుతుంది. బ్రహ్మానందరెడ్డి గారు అసహనంగా ఉన్నారు. ఆ అసహనంలో వారు ఇలా అన్నారు "గోపాలకృష్ణయ్య గారూ! మీరు చెబుతున్న విషయం అర్ధవంతంగా లేదు. నేను ఒక చెవితో విని మరొక చెవితో వదిలి పెడుతున్నాను" అని ఒక చిన్న వ్యాఖ్య చేశారు. వెంటనే గోపాలకృష్ణయ్య  గారు "ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన దంతా ఒక చెవితో విని మరొక చెవితో వదిలి పెడుతున్నారంటే, నాకొక అనుమానం, ఆ రెండు చెవుల మధ్య ఉండవలసిన 'బ్రహ్మ' పదార్ధం లేని వట్టి 'ఆనందరెడ్డి' గారేమో మన ముఖ్య మంత్రి" అని వారు విసిరిన ఛలోక్తికి సభలోని అందరితోపాటు బ్రహ్మానందరెడ్డి గారు కూడా నవ్వుకున్నారు. బ్రహ్మానందరెడ్డి గారు వీరిని సరదాగా వావిలాల గోలకృష్ణయ్య గారు అని పిలిచేవారు.

పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించి ప్రజా సేవలో బ్రతికినంతకాలం జీవించిన ధన్య జీవి మన గోపాలకృష్ణయ్య గారు. సుదీర్ఘమైన ఆయన ప్రజా జీవిత ప్రస్థానంలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు.అందులో ముఖ్యమైనవి 'విశాలాంధ్ర' ఉద్యమం, ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర ఉద్యమం. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కోసం వీరు చేసిన కృషి మరువ రానిది. పండిత నెహ్రూ గారిచేత ఈ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేయించటంలో వీరి కృషి అభినందనీయం. ఆ ప్రాజెక్ట్ వల్ల నేడు నల్గొండ మరియూ గుంటూరు జిల్లాలు సుభిక్షంగా ఉన్నాయంటే, దానికి కారకులైన శ్రీ వావిలాల వారిని మనం నిత్యం  స్మరించుకోవాలి. ఆ ప్రాజెక్ట్ నుండి జల విద్యుత్తు కూడా ఉత్పత్తి అవుతుంది. అది నేడు ఒక గొప్ప పర్యాటక ప్రాంతం కూడా.1990 లో వీరు మద్యనిషేధ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆంద్ర ప్రదేశ్ అధికార భాషా సంఘానికి  వీరు మొట్ట మొదటి అధ్యక్షులుగా కూడా పనిచేసారు. వారి హయాంలోనే ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు భాషలో ఉత్తర ప్రత్యుత్తరములు, notifications  మొదలుగునవి ఎన్నో అమలు పరచబడినవి. ఆంద్ర విశ్వ విద్యాలయంవారు వీరికి 'కళాప్రపూర్ణ' అనే సత్కారంతో గౌరవించి తన ప్రత్యేకతను నిలుపుకుంది. భారత ప్రభుత్వం వీరిని 'పద్మ భూషణ్' బిరుదుతో సత్కరించింది.

ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు, ఆజన్మ బ్రహ్మచారి, అపర భీష్ముడు శ్రీ గోపాలకృష్ణయ్యగారిని మృత్యువు వారిని 96 సంవత్సరాల వయసులో, 29 -04 -2003 న  అనారోగ్యం పాలుచేసి ఓడించింది. భౌతికంగా వారు మనలను విడిచిపోయారు కానీ, నాగార్జున సాగర్ నుంచి ప్రవహించే కృష్ణా జలతరంగాలలో వారు చిరునవ్వుతో నిత్యం మన క్షేమాన్ని  కనిపెడుతూనే ఉన్నారు! అయితే ఆ మహనీయుని స్మారక చిహ్నాలు, ఒక ఉద్యానవనం సత్తెనపల్లిలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం చేసిన వాగ్దానం శుష్కవాగ్దానం గానే మిగిలి పోయింది. వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్ అనే సంస్థని గుంటూరు అరండల్‌పేటలో ఏర్పాటు చేసారు. దానినే 'వావిలాల సంస్థ' గా పిలుస్తుంటారు. అందులో గోపాలకృష్ణయ్య గారు సేకరించిన వేలాది పుస్తకాలతో ఒక గ్రంధాలయం కూడా ఉన్నది.

వారి రచనలు
తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు
1922లో తొలి రచన 'శివాజీ'
1947లో 'మద్రాసు మంత్రివర్గమా ఎక్కడికి?'
1951లో 'విశాలాంధ్రం'
1976-77 'ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయోద్యమం'

విదేశ పర్యటనలు
1952 లో శాంతి సభలలో పాల్గొనే నిమిత్తం భారత దేశ ప్రతినిధిగా చైనా దేశంలో పర్యటించారు.
1952 లోనే శాంతి సభలలో పాల్గొనే నిమిత్తం భారత దేశ ప్రతినిధిగా రష్యా దేశంలో పర్యటించారు.
1992 లో ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొనే నిమిత్తం అమెరికా దేశంలో పర్యటించారు.

'ఆంధ్రాగాంధి', 'అపరభీష్ముడు' అయిన వారికి నా ఘనమైన నివాళి!!!

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి