
"మీక్కావల్సినవన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉంచుతాను, మీ మధ్యాన్నం కునుకు అయ్యాక, మీరే చూస్కోండి"అంది శకుంతల.
"ఎందుకో " అన్నాడు నరసింహం పేపర్ తిరగేస్తూ.
"పక్కింటావిడ చందన గారితో కలిసి బడే చౌడి కి షాపింగ్ వెళుతున్నాను" అంది.
"ఏంటో విశేషం" ముక్కు మీద జారిన అద్దాల పైనుంచి చూస్తూ అన్నాడు నరసింహం.
'ఏమో, వస్తారా అని అడిగింది, సరే అన్నాను" అంది.
"బజారు పేరో, షాప్ పేరో అన్నా చెప్పిందా? అదీ లేదా" అన్నాడు.
"నల్లి సిల్క్స్ అనుకుంట" అంది.
"అంటే నీకు తెలుసన్నమాట, ఎదో తెలియనట్టు బిల్డప్ దేనికో "
"అబ్బబ్బా! ఏంటి మీ బాధ ఇప్పుడు " అంది.
" నాకేంటే బాధ, హాయిగా, ఒక్కడినే ఉంటా ఇంట్లో " అన్నాడు
"మీ బాధ నాకు అర్ధమైంది. 2 - 3 గంటల్లో వచేస్తానండి" అంది నవ్వుతు.
" ఇప్ప్పుడు ఈ నల్లి గారికి ఆ చందన పట్టు చీరలు ఎందుకో " మళ్ళీ అదే పాయింటుకొచ్చాడు నరసింహం.
"ఆవిడ పేరు చందనా! మేము వెళ్ళేది నల్లి. మీరూ మీ వెటకారం" అంది శకుంతల.
"చందనో వందనో, ఇప్పుడే పేపర్లో చూస్తున్నా, ఈ పట్టు చీరల వ్యవహారం. పట్టు చీరలు మన సంస్కృతికి పట్టు కొమ్మ అంటారు కానీ ఆ వెలుగుల్లో ఉన్న చీకటి మనకు పట్టదు. నేత కార్మికుల దీన బాధ వినే వాడెవడు. దళారీల చక్రాల కిందో , వాళ్ళ మగ్గం లోనో వాళ్లే నలిగిపోతున్నారు. ఇంతమందికి ఈ కళను, అంత అందాన్నిచ్చే నేత కార్మికుడు తన కూతురి పెళ్ళికి పట్టుచీర పెట్టగల స్థితి లో లేడంటే, మనసు కలిచేస్తోంది. భారతదేశంలో పట్టు చీరలపై వార్షిక వ్యయం ₹45,000 కోట్ల నుండి ₹60,000 కోట్ల వరకు ఉంటుందట. ఒక అంచనా ప్రకారం ₹1.5 కోట్ల నుంచి ₹3 లక్షల కోట్ల వరకు విలువైన చీరలను అల్మారాల్లో బందీ చేసి ఉంచుతున్నామట!
అల్మారాలో బందీనా, లేక దేశనిర్మాణంలో భాగమా? అని మనం ఆలోచించం. ఒక్క పట్టు చీర మహా అంటే 4 లేదా 5 సార్లు కట్టుకుంటారా ? మరి మిగిలిని సమయం? అల్మారాలో, మౌనంగా కాలం గడుపుతూ ఉంటుంది ఈ పట్టు చీర . అల్మారాలో బంధీగా ఉన్న ఈ చీరలకు బదులు విద్యాలయాలకు, చికిత్సకు,నీటి పైపులు,అల్మారాల నుంచి ఇళ్లకు,మెరిసే చీరల నుండి మెరుగైన సమాజానికి....." దాదాపుగా కుర్చీలో నుంచి లేచి ఏకైక ప్రేక్షకురాలైన శకుంతల ముందు ఊగిపోతున్నాడు నరసింహం.
"ఆపండి, ఆపండి, బీపీ రాగలదు (నవ్వుతూ). నిజమే ! ఈ ప్రతికూల ప్రభావాలను కొనసాగించకుండా పట్టు చీరల వెనుక ఉన్న కళాత్మకతను సంరక్షించబడేలా నైతిక వినియోగదారులతో సహా దైహిక సంస్కరణలు అవసరం. అయినా మీకో విషయం చెప్పనా ? అంది.
"ఏంటో అది, చెప్పూ! చెప్పనా అని అడగడం దేనికో "అన్నాడు
"నేను పట్టుచీరల షాపింగ్ కి వెళుతున్నాని చెప్పానా? వెళ్లినా నేను కొంటానని చెప్పానా ? మన బాబు రవి , మీకు 3-4 టీ -షర్ట్స్ కొని ఇవ్వమని ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతూంటాడు, వాడు మీకు కొనుక్కోమని చెపితే , నాకెందుకురా వేస్ట్ అని అంటారని , నన్ను తెమ్మన్నాడు " అంది నవ్వుతూ .