నిష్కామ కర్మ తత్వం - సి.హెచ్.ప్రతాప్

Nishkama karma tatwam


భగవద్గీత 4 వ అధ్యాయం, 19 వ శ్లోకం :

యస్య సర్వే సమరంభా: కామసంకల్పవర్జిత: |
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు: పండితం బుధ:

ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక, సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమవుతాయో అటువంటి వానిని జ్ఞానులు పండితుడని పేర్కొంటారు అని పై శ్లోకం భావం.మానవుడు చేసే ప్రతీ కర్మ భోగ వాంచారహితముగా వుండాలన్నది ఇక్కడ ప్రధానమైన విషయం.ఈ స్థితిని చేరుకోవాలంతే మొదట మానవుడు సంపూర్ణ బ్రహ్మ జ్ఞానాన్ని సాధించుకోవాలి. తర్వాత తాను చేసే ప్రతీ పని (లేదా కర్మ)ను తన సాధించుకున్న జ్ఞానాగ్నిలో దహింపచేయాలి. అప్పుడు అతను చేసే ప్రతీ కర్మ కూదా పవిత్రంగా మారుతుంది. ఆ కర్మ త్తన కోసం కాక సమాజహితం కోసం చేసేదిగా వుండదంతో భగవంతునికి ఎంతో ప్రీతిపాత్రమవుతుంది.

జీవి అన్నవాడు కర్మ చేయక తప్పదు. అసలు ప్రతీ జీవీ ఏదో ఒక కర్మను నిరంతరం చేస్తూనే వుండాలని, కర్మ త్యాగం చేయడం ముముక్షువులకు మాత్రమే సాధ్యం అని భగవంతుడు భగవద్గీతలోనే మరొక శ్లోకంలో స్పష్టం చేసాడు. అయితే ఆ కర్మ తిరిగి అతడిని సంసార చక్రంలోకి దింపుతుంది. కోరికను అనుసరించి కర్మ, కర్మను అనుసరించి కోరిక అనే విషవలయంలోకి లాగుతుంది కదా! మరి సంసారంలో ఉంటూనే, జీవనానికి ఆధారమైన కర్మలను సాగిస్తూనే... అది తన ఆత్మకు అంటకుండా ఉండాలంటే ఎలాంటి ప్రజ్ఞ ఉండాలో భగవంతుడు పై శ్లోకం ద్వారా స్పష్టం చేసాడు.


కర్తృత్వభావన లేకుండా, కర్మఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలను “నిష్కామకర్మలు” అంటారు.కర్మల గురించిన కర్తృత్వం లేకపోవడం అంటే
నేనే చేస్తున్నాను ఈ పనిని అనే భావం లవలేశమైనా లేకపోవడం.కర్మఫలాసక్తి లేకపోవడం అంటే ఫలితంతో నాకు సంబంధం లేదు, కర్మ చేయడమే నా ధర్మం అనే భావంతో కర్మలు చెయ్యడం.నిష్కామకర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది.మనస్సు పవిత్రం అవుతుంది.చిత్తశుద్ధి కలవాడికి ధ్యానసాధన ద్వారా ఆత్మజ్ఞానం కరతలామలకం అవుతుంది. సాధకుని ఆత్మ తాను దైవిక జ్ఞానంతో ప్రకాశించినప్పుడు, అది కోరుకునే ఆనందం ఇంద్రియ వస్తువుల నుండి కాక భగవంతునికి ప్రేమతో,భక్తితో కూడిన సేవలో లభిస్తుందని గ్రహిస్తుంది. అప్పుడు అది ప్రతి కర్మను భగవంతుని ప్రీతి కోసం , అనుగ్రహం కోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. మనం ఏమి చేసినా, ఏమి తిన్నా, పవిత్ర అగ్నికి నైవేద్యంగా ఏమి సమర్పించినా, మరియు ఏ తపస్సులు, దైవిక సాధనలు చేసినా,వాటిని భగవంతునిగా సమర్పించడమే మన సాధన కావాలి.అటువంటి జ్ఞానోదయం పొందిన ఆత్మ భౌతిక సుఖాల కోసం స్వార్థపూరిత చర్యలను త్యజించి, అన్ని చర్యలను భగవంతునికి అంకితం చేస్తుంది.