కలలు - .

Kalalu

"ఏమోయ్ కాఫీ రెడీ నా, ఆ పెట్రోల్ పొద్దున్నే పడకుంటె బండి నడవదుగా. ఉష్ణోదకం అని పెద్దవారు ఊరికే అనరుగా, ఆ వేడే మనల్ని  చురుగ్గా ఉంచేది, శివం రోడ్ - కాఫీడే నుంచి ఫ్రెష్ పొడి తెచ్చాం కదా ?  "మొహం తుడుచుకుంటూ నరసింహం హాల్ నుండి శకుంతలని అడిగాడు. కాఫీ గ్లాస్ తో వస్తూ నవ్వుతూ అడిగింది శకుంతల , " రాత్రి నిద్రలో ఎదో ఈత కొడుతున్నట్టు కాళ్ళను చేతులను ,  ఊపుతూ ఒక గావుకేక పెట్టారు , ఏంటి కధ ! మంత్రగాడిని పిలిపించాలా లేదా తాయెత్తు ఏదైనా కట్టించాలా? " అంది నవ్వుతూ.

"కబుర్లాపోయి! రోజూ గురక పెడుతున్నావని అంటున్నాననేగా నా మీద ఏదో కల్పితాలు వేస్తున్నావ్ , లేకుంటే , నా మొహానికి ఈత కూడానా " అన్నాడు నరసింహం.

"కల్పితం కాదండి, అలా చేస్తూ ఒక పెద్ద కేక కూడా పెట్టారు మీరు. ఏదన్నా పీడ కలా ? అంది

మూడో గుక్క కాఫీ గొంతులో దిగాక , రూఫ్ ని చూస్తూ " అయితే అది కలే అంటావా ? 95% కలలు మనకు గుర్తుండవు అంటారు. నిద్రలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ లో లాజిక్ ని కంట్రోల్ చేసే భాగం ఆఫ్ -డ్యూటీ అనుకో ! అందుకే కలలన్నీ వింతగానే ఉంటాయి. గుఱ్ఱం నడుపుతున్నట్టో , సింహం తో పోరాడుతున్నట్టో ,పక్షిలా నింగి లో ఎగురుతున్నట్టో ,  ఎన్నో రకాల వింతలు మనం కలలో చూస్తాం. సగానికి పైగా ఈ కలల్ని మనం ప్రొద్దున్నే బ్రష్ చేసుకునే లోపే మర్చిపోతాం.

కలలో చూసిన అక్షరాలో, పుస్తకాలో, మనం నిద్ర లేచాక  ఆ అక్షరాలు గుర్తుపెట్టుకోవడం  చాలా తక్కువంటారు. లేదా కలలో చూసిన టైం లేదా ఏవన్నా అంకెలో మనం గుర్తు పెట్టుకోలేము అంటుంది సైన్స్ . తమాషా ఎంటంటే , కలలు మనకు కలర్ లోనే కనిపిస్తాయి , ఎప్పుడైనా బ్లాక్ &  వైట్ కల కన్నావా ? బహుశా మనం కలర్ టీవీ చూస్తూ , కలర్ ప్రింటు చూస్తూ గడిపా మేమో , మన పూర్వీకులు బ్లాక్ & వైట్ కళలు కూడా కన్నరేమో? మనం చూడని వారు మన కలలో రారు, మనం ఆలోచించని ఏ విషయం కూడా మనకు కలలో రాదని అంటుంది సైన్స్ .

కలలో గుర్తుపట్టని వ్యక్తులు ఎప్పుడో ఎక్కడో మనం చూసుం టా మట . ఎక్కడో మార్కెట్లోనో ఎదో ఒక పబ్లిక్ ప్లేస్లోనో మనం చూసి వుంటామట.

"కొన్నిసార్లు ఏదన్నా పీడకల వస్తేనో, ఏదన్నా ప్రమాదం జరుగుతున్నట్టు అనిపిస్తేనో, నేను నిద్ర నుండి లేచేస్తానండి" అంది శకుంతల, కుతూహలంగా.

"దాన్నే, ల్యూసిడ్ డ్రీమింగ్ అంటారు. అంటే కలలు స్పష్టతతో కనపడటం. అలాంటి వారు చాలా తక్కువట. వారు కలలని కూడా కంట్రోల్ చేసుకుంటుంటారు. పడిపోతున్నట్టు కల వస్తే , అది కలే అనే స్పష్టత వారిలో ఉంటుంది , వారు వెంటనే నిద్రలో నుంచి లేచేస్తారు. మనం కలలోగనక కదలలేని పరిస్థితి లో ఒక రకమైన దిగ్బంధం లో ఉంటే అది స్లీప్ పరాలసిస్ అంటారట. వింతేంటంటే మనం లేని కలలు, మనకు సంబంధంలేని కలలు రావటం చాలా అరుదు. ఇంకో విషయం , జంతువులు కూడా కలలు కంటాయి అని నిరూపించారు. కుక్క నిద్రపోతున్నప్పుడు దాని పాదాలను కదపడం , మొహం తిప్పడం లాంటివి.

కలలు మనిషి మానసిక దేర్యం పెంచుతాయని ఒక వాదన ఉంది. చాలా మంది వారు సాధించలేని ఎన్నో విషయాలని కలలు కంటూ గడిపేస్తారని ఒక రకమైన తృప్తి చెందుతారట .

"మొత్తానికి కళ్ళుంటే కలలు తప్పవు, అంటారు. అంతే గా ? అంది శకుంతల.

"ఇంత ఉపోద్ఘాతం విని ఊక దంపుడు లా కొట్టేస్తావా?" కాస్త నిరుత్సాహంగా అన్నాడు నరసింహం.

"అయ్యో, మొమ్మాటికి కాదండి. ఏదో మిమ్మల్ని ఆట పట్టిద్దామని" అంది నవ్వుతూ.

"అందుకే శకుంతలా, ఈ రోజు నుండి పడుకునే ముందు ఏ సావిత్రినో, వహీదా రెహమాన్నో తల్చుకుంటూ పడుకుంటా "అన్నాడు నరసింహం.

"పాపం మార్లిన్ మాన్రో ని వదిలి పెట్టారే? నో ప్రాబ్లెమ్ , నేను మాత్రం ఏ శాఖిని నో డాకినీ నో తలుచుకొని  పడుకుంటా. మీ తిక్క కుదురుతుంది !" అంది శకుంతల.

" అయ్యో , వాటిని తల్చుకోవటం దేనికీ? నిన్ను నువ్వు తలుచుకొని పడుకుంటే చాలదూ ? అన్నాడు నరసింహం ఠక్కున.

మరిన్ని వ్యాసాలు

శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరామ నవమి విశిష్టత
- సి.హెచ్.ప్రతాప్
Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి