హైబ్రిడ్ - .

Hybrid

" టమాటో పప్పు చేస్తాను అన్నావ్? ఇది ఏదో చేసావ్! చెప్పింది చేయనప్పుడు, అడగడం దేనికో?" అన్నాడు నరసింహం కాస్త చికాకు గా .

"అయ్యో, అది టమాటో పప్పే నండి" అంది శకుంతల, కాసింత కంగారుగా.

అత్తగారి ఇంట , అమ్మగారి ఇంటా , శకుంతలకి వంట చేయడం లో తిరిగిన చెయ్యి అని పేరు. అయినా , ఆమె 65 వ ఏట తన నైపుణ్యం నిరూపించుకోవాలని కాదు కానీ , నరసింహం కి ఆవిడ  చేసిన వంట రుచించకుంటే అదొక ఆశ్చర్యం , అంతే .

అసలే రిటైర్డ్ లైఫ్ , అంతటితో వదులుతాడా మహానుభావుడు ?

"ఎదో ధ్యాసలో ఒకటికి బదులు ఇంకోటి వేసుంటావ్, అందుకే పప్పు ఇలా ..." ఇంకా మాటకూడా పూర్తి కాకముందే, శకుంతల అంది

"వంద సార్లు చెప్పాను, అది టమాటో పప్పే! కూరలు తెచ్చింది మీరే గా ". కాస్త తగ్గి నరసింహం పప్పు లో నెయ్యి కలుపుతూ కంచం లోని పప్పు కలుపుతూ టొమాటోలని పరిసలిస్తూ ," అసలు ఉడికితే కదా ఒక రుచీ పచీ " అన్నాడు.

"స్వామి, ఎంత ఉడికించినా  ఇవి అంతే " అంది శకుంతల కాస్త కోపంగా.

"రోజూ నల్లకుంట మార్కెట్ వెళుతున్నారు, ఒకటి గమనించారా? టొమాటోలు అన్ని ఒకే సైజు ఒకే రంగు, అలాగే వంకాయలు, బెండకాయలు ,కాకర , బీన్సు వగైరా అన్నీ ఎదో ఫ్యాక్టరీలో చేసినట్టు ఒకే రకంగా , కళ్ళు చెదిరే రంగులతో రాసులు పోసినట్టు మనం చూస్తున్నాము గా ?మామిడికాయలై చలికాలం లో రావటం ఏంటండీ మరీ  అన్యాయంగా ! మనమేమో ఎగిరి గంతేసి కొనేస్తాం ఆలోచన లేకుండా. బెంగుళూరు మెరపకాయ ఒక దబ్బకాయ సైజ్ ఇప్పుడు , 80ల్లో అవి ఎంత చిన్నగా రుచిగా ఉండేవి గుర్తుందా? అంతా హైబ్రిడ్ మహత్యం. వేసే విత్తనాలు హైబ్రిడ్, చెట్లకి కృత్రిమంగా ఇంజెక్షన్లు , కెమికల్స్ తో సమయానికి ముందే పండించడం అంతా ఒక మాయ. ఒక రోజాపువ్వు చెట్టుకి నాలుగు రంగుల పూలు, మల్లెలు చిన్న చామంతుల సైజు, మనకి రంగు ముఖ్యం సువాసన కాదు, ఆకర్షణ ముఖ్యం రుచి కాదు. పూర్వం లో లాగా రైతులు ఏది పండిస్తే మనం తినడం కాదు , పాపం, మనం ఏది తింటామో రైతులు అది పండిస్తున్నారు ఇప్పుడు. ఇది మన తప్పే  రైతులది కాదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో ఈ కూరల్లో  పౌష్టికత , రుచి కూడా అంతే ఉంది" నిట్టూరుస్తూ అంది శకుంతల.

"అదే, మైసూర్ బోండాలో మైసూరు ఉన్నట్టు " అన్నాడు నరసింహం నవ్వ్వుతూ.

" లాభం కంటె హైబ్రిడ్ సాగు లో నష్టా లు  ఎన్నో ఇక చెప్పనక్కర్లేదు" అంది శకుంతల.

"ఇన్ని చెప్పావ్ గా! కానీ! అదీ చెప్పూ" అన్నాడు నరసింహం నవ్వుతూ. "మీకూ వేళాకోళంగా ఉంది కదా? నేను ఎప్పడూ టీవీ లో చూసేది సోది సీరియళ్ళే కాదు మరి, ఇలా వైజ్ఞానిక ప్రోగ్రాంలు కూడా చూస్తాం "అంది శకుంతల, కాస్త బడాయిగా.

"హైబ్రిడ్ విత్తనాలు రైతులకి మరు-పంటకు అంతగా పనికిరావు, మళ్ళీ కంపనీల వద్ద కొనాలి, కొన్ని సార్లు ఈ సాగు ఎక్కువై, రైతులకి గిట్టుబాటు కూడా కాదు" అంది శకుంతల.

"కరెక్టే, ఏ సీజన్లో వచ్చే సహజ సిద్ధమైన పంట ఆ సీజన్లో తినమంటారు పెద్దలు, నేను సైతం ఇక మీద హైబ్రిడ్ వీలైనంత తగ్గిస్తాను, ఏమంటావ్ " అన్నాడు నరసింహం.

"అబ్బో శ్రీవారి శ్రీశ్రీ కవిత్వం" అంది శకుంతల డైనింగ్ టేబుల్ సర్దుతూ!

"ఆవులు, బర్రెలు, కుక్కలు, పిల్లులు, గొర్రెలు ...." అంటున్న నరసింహం తో అంది శకుంతల "ఆపండి ఆపండి ఇవెక్కడనుండి వచ్చాయి"

"అదే మరి. ఇవి కూడా హైబ్రీడ్ వలలో చిక్కినవే. ఇక్కడితో ఆగని పైత్యం   ఇప్పుడు మనుషుల దాకా సాగుతుందట" అన్నాడు నరసింహం.

" ఇక ఆపండి మీ అగాయిత్యం! మనిషి  హైబ్రిడ్ ఏంటీ ?" అంది శకుంతల.

"అందుకే, నా మాట వినమనేది! DNA మార్పులు మరియు జీన్ల సవరణ మొదలయ్యాయి.  జీన్ సవరణలో, సమస్య కలిగిన జీన్‌ను సరిచేసి లేదా మలుపు మార్చి, ఆరోగ్యకరమైన జీన్‌ను జత చేస్తారు. ఈ ప్రక్రియలో, జీవంలో హాని కలిగించే మార్పులను తొలగించి, డీఎన్ఏ  ని కొంత సవరించి లేదా చేర్చి వ్యాధులను నివారించవచ్చు. దీనివల్ల జన్యు సంబంధ వ్యాధులను రాకుండా చేయడం, కణజాల మరమ్మత్తు, లేదా మరింత ఆరోగ్యకరమైన జీవాలను సృష్టించడం సాధ్యం అవుతుంది. ఈ సాంకేతికత మనుషుల భవిష్యత్తులో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని భావిస్తున్నారు" అన్నాడు నరసింహం.

"ఇక గొడవే లేదు, క్రికెట్ ఆటలో 11 మంది టెండూల్కర్లు, ఫుట్బాల్ ఆటలో 10 మంది మెస్సీలో దుస్సీలో, సినిమా తెరపై మళ్ళీ ANR , NTR , మీ సావిత్ర రావొచ్చన్నమాట ! కానీయండి ఇక ఈ వెర్రి ఎంత దూరం వెళుతుందో చూద్దాం " అంది శకుంతల టీవీ రిమోట్ పట్టుకొని.

మరిన్ని వ్యాసాలు

స్వియ సంగీతంలో ఘంటసాల గీతాలు.
స్వియ సంగీతంలో ఘంటసాల గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరామ నవమి విశిష్టత
- సి.హెచ్.ప్రతాప్
Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం