ఇంద్రియ నిగ్రహం - సి.హెచ్.ప్రతాప్

Indriya nigraham

భగవద్గీత 2 వ అధ్యాయము, 58 వ శ్లోకం

యదా సమ్హరతే చాయం కూర్మోజ్గానీవ సర్వస:
ఇంద్రియాణీంద్రియార్ధేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||

ఇంద్రియాలను నియంత్రించుకుంటూ, సుఖ దుఖాలు, చావు పుట్టుకలు, ఆనంద విచారాలు మొదలైన ద్వందాలు నుండి విడివడి పరిపూర్ణమైన , శాశ్వతమైన బ్రహ్మానందాన్ని ఎలా పొందవచ్చునో శ్రీ కృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా మానవాళికి తెలియజేస్తున్నాడు.

తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకొని, బాహ్య ప్రపంచం నుండి వచ్చే ఆపదల నుండి తనను రక్షించుకునే విధంగా మానవుడు ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించుకొని సంపూర్ణ జ్ఞానమునందు స్థిరుడైన వారికి శాశ్వత బ్రహ్మానందం ప్రాప్తిస్తుందని ఈ శ్లోకం భావం.

ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే ఆత్మ వివేకము కలిగి, స్వీయ-నియంత్రణ,మరియు మనస్సును సదా పవిత్రంగా వుంచుకుంటే, కఠోర సాధనలు చేసే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు. బలమైన వీచేగాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో అదే విధంగా ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని హరించి వేస్తుంది.మనసులోని పవిత్రతను హరించి అల్లకల్లోలానికి గురి చెస్తుంది. అంతిమంగా సాధకులను అధ:పాతాళానికి నెట్టి వేస్తుంది.

ఇంద్రియములు అంటే ఙ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని. వాటిలో మనస్సుకూడా ఒక ప్రధానమైన ఇంద్రియం. అదే కర్మలకు కారణమైన ప్రధాన ఇంద్రియం అని పతంజలి మహర్షి యోగసూత్రాలలో స్పష్తం చేసారు.మనస్స్సుకు ఒక విచిత్రమైన లక్షనం వుంది.తనకు ఇష్టమైనదానిమీదకు పోవటం దాని సహజ లక్షణం. అది దానికి ఇష్టంలేని దానిమీదకు పోదు. ఎందుచేతనంటే దానివలన దానికి ప్రయోజనం లేదు కాబట్టి. కష్టసాధ్యమైన పారమార్ధిక విషయాలవైపు మనస్సు పోదు. సహజంగా ఇంద్రియాల వలన లభించే సుఖాలు మనస్సుకు ఆహ్లాదం కలైగిస్తాయి కాబట్టి మనస్సు ఎల్లప్పుడూ ఇంద్రియాలవైపే పరుగులు తీతుంది. ఇంద్రియాలు స్వయం తృప్తి కోసం కోరికల దిశగా పగ్గాలు లేని గుర్రం వలె పరుగులు తీస్తాయి. కోరికల సాధనలో మానవుడు అంతులేని దుఢాన్ని, ఆందోళనలను పోగు చేసుకుంటాడు.ఆ విధముగా మనస్సును మళ్ళించగల శక్తిని సమకూర్చుకోవటాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు.
కాబట్టి లౌకిక సుఖాన్ని కాదు అనుకుని పారమార్ధిక సుఖానికై మానవుడు ప్రయత్నం చెయాలి.ఇంద్రియనిగ్రహం అంటే అస్తులు - పస్తులు ఉండి, దేహానికి తిండి- తీర్థాలు ఇవ్వక కృశింపజేయటం కాదు. మనస్సుతో ఇంద్రియాలపై విజయం సాధించాలి. నిరంతరం భగవత్స్మరణతోను, విచారణతోను, సత్సాంగత్యంతోను, జపధ్యానాలతోను, ప్రాపంచిక విషయ వైరాగ్యంతోను క్రమక్రమంగా సాధించాలి. అప్పుడే జ్ఞానార్జనకు వీలవుతుంది అని శాస్త్రం స్పష్తం చెస్తోంది.

ఈ కలియుగంలో మానవులందరూ తమ తమ ఇంద్రియాలకు బానిసలవుతారని, ఇంద్రియాలు అతి ప్రభావవంతమైన మానవులను ఇష్టం వచ్చినట్లు ఆడిస్తాయని బ్రహ్మదేవుడు కలి పురుషుని లక్షణాలు తెలియజేసాడు. నేడు తాను కోరిన విధంగా తమ ఇంద్రియాలను నియంత్రించుకోవడం అనేది మానవులకు ఒక అగ్ని పరీక్షగా మారింది. ఇంద్రియాలను శాస్త్రం విష సర్పాలతో పోల్చింది.అవి ఎప్పుడూ ఎలాంటి అడ్డు లేకుండా విచ్చలవిడిగా బుసలు కొడుతూ సంచరిస్తుంటాయి. కాబట్టి వాటిని నియంత్రణ లోకి తెచ్చుకోవాలంటే ముందుగా సాధకుడు పాములు ఆడించేవానిలా పరాక్రమవంతుడై వుండాలి. పాముల శయ్యపై శయనించే విష్ణుమూర్తి, పాములను సదా మెడలో ఆభరణాలుగా ధరించే శంకరుడు ఇంద్రియాలను నిగ్రహించే తత్వానికి ప్రతీకలు. ఇంద్రియభోగాలకు దూరంగా వుంటూ వేదం తెలియజేసిన నిషిద్ధ కర్మలు ఆచరించకుండా సదా జాగరూకుడై వుండాలి. మనో నిగ్రహం కోసం బుద్ధి యుక్తంగా ప్రయత్నించాలి.తాబేలు ఆపదలు వచ్చినప్పుడు తన అవయవాలను వెంతనే ఉపసంహరించుకొని, తర్వాత తిరిగి బయటకు తెచ్చుకుంటుంది.


అదే విధంగా సాధకుడు ఇంద్రియాలు బాహ్య విషయాల వైపు పరుగులు తీసినప్పుడు తాబేలు లా బుద్ధి ఉపయోగించుకొని ఇంద్రియాలను ఉపసంహరించుకోవాలి,మనస్సును సహజంగా నిగ్రహించుకోవడం కష్టసాధ్యం కాబట్టి మనస్సు కంటే శ్రేష్టమైన బుద్ధిని ఉపయోగించుకొని, భౌతిక చర్యలు, కర్మలను నిగ్రహించుకుంటూ తద్వారా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యమని భగవద్గీత తెలియజేస్తోంది.. భగవంతుని వైపు దృష్టి సారించి , పూజ, స్తోత్రం, ఆరాధన, జపం, తపస్సు, యోగము, ధ్యానం వంటి ధార్మిక అంశాలపై దృష్టి సారించాలి. భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం, శరణాగతి, నిష్కల్మషమైన ప్రేమ పెంచుకోవాలి. అన్ని రకాల సంశయ భావాలను తొలగించుకోవాలి. తన ఇంద్రియాలు స్వీయ సంతృప్తి కోసం కాక భగవంతుని సేవ కోసమే వినియోగించుకోవడమనే అభ్యాసం చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో చేయడం ఎంతో అవసరం. భగవంతుని భక్తి రస భావితుడు కానివారు ఇంద్రియములకు లోబడిపోయి,మనస్సు అనుక్షణం చంచలమవుతుండదం వలన తీవ్ర మనోవేదనకు లోనవుతారు.అటువంటి వ్యక్తి ఎంతటి శక్తి సంపనుడైనా చివరకు జీవితంలో వైఫల్యం పొందక తప్పదని భగవద్గీత బోధిస్తోంది.