ఇవ్వాళే ఓ వార్త చదివాను. షిర్డీలో ఇప్పటికీ వివిధ హోటళ్ల వద్ద మిగిలిన తిండి, అలాగే అన్నదానంలో మిగిలిన ఆహార పదార్థాలు అన్నీ సేకరించి, పశువులకు వేసే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోందట. మంచి కార్యక్రమం. ఇలా చాలా చోట్ల జరుగుతున్నట్లు, ఫేస్ బుక్ లోనూ, అక్కడా అక్కడా చదివాను. ఇలా ఎందుకు జరుగుతోంది. మనిషికి తను తినే తిండిని వృధా చేయాలన్న గుణం అసలు ఎందుకు వస్తోంది. బయట తినడం ఎక్కువైన దగ్గర నుంచే ఈ తరహా వృధా పెరిగిపోతోంది. అది కూడా హోటళ్ల తీరు తెన్నులు మారిపోయిన దగ్గర నుంచి. ఒకప్పుడు హోటల్ అంటే ఓపిగ్గా వడ్డన అంటూ వుండేది. భోజనం అయిదు రూపాయిలు వున్న కాలం నాకు తెలుసున్నంత వరకు. అంతకన్నా తక్కువ తెలుసున్న వారుకూడా వుండొచ్చు. ఆ రోజన అడిగితే కానీ వడ్డించేవారు కాదు. ఎన్నిసార్లయినా ఓపిగ్గా వడ్డించే వారు కానీ, కాస్త ఎక్కువ వేసేవారు కాదు. ఇక్కడ వ్యాపారదృక్పథం కాదు, వృధా కానీయకూడదనే ఆలోచన.
రానురాను వడ్డన అనేది ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. సిబ్బంది కొరత, అలవాట్లు అభిరుచులు మారుతుండడం వంటి వగైరాల రీత్యా ప్లేట్ మీల్స్ అన్నది అందుబాటులోకి వచ్చింది. ఇది చిత్రంగా వుంటుంది. తినే వాళ్లకు సరిపోదు..తినని వాళ్లకి ఎక్కువైపోతుంది. తినే వాళ్లతో సమస్య లేదు. కావాలంటే మరి కాస్త పైసలు ఇచ్చి, ఇంకొంచెం కొనుక్కుంటారు. కానీ తినని వాళ్ల సంగతి ఏమిటి? నేను చాలా హోటళ్లల్లో చాలా చాలా సార్లు గమనించాను. భోజనం అయిపోయిన తరువాత కప్పుల్లో కూరలు, సాంబారు, అన్నం వుండిపోవడం. అదే కనుక వడ్డించే పద్దతి వుంటే ఎంతటి ఆదా అని అనిపిస్తుంది. చాలా మెస్ ల్లో సాంబారు, రసం బకెట్ ల్లో పెడతారు. అది కొంతవరకు ఓకె. కానీ ఇప్పుడు రానురాను అది కూడా మారిపోయింది. దాంతో వృధా మరింత పెరిగిపోతోంది. పైగా ఈ వృధా వ్యర్థ పదార్ధాలు పేరుకుపోవడానికి కూడా దారితీస్తోంది. సికిందరాబాద్ గార్డెన్ హోటల్ దగ్గర నిత్యం ఉదయం పూట గమనిస్తుంటాను. మున్సిపాల్టీ లారీలోకి పీపాలకు పీపాలు చెత్త లోడ్ అవుతుంటుంది. అందులో సగం ఆహార పదార్ఢాలే. ఇదంతా డంప్ యార్డ్ ను నింపడానికి తప్ప మరేమీ కాదు.
ఓ సారి ఓ పెద్ద ఫుడ్ జాయింట్ లో సరదాగా అడిగాను. మిగిలినవి ఏం చేస్తారు అని. డంప్ లో పారేస్తాం అన్నాడు ఓనరు. అదేమిటి? ఇంత కాస్ట్లీ బర్గర్లు, పిజ్జాలు, పఫ్ లు, ఇంకా చాలా రకాలు కదా,. కనీసం స్టాఫ్ కన్నా ఇవ్వ వచ్చు కదా అని అడిగా..దానికి ఆయన భలే లాజికల్ సమాధానం ఇచ్చాడు. మొదట్లో అలాగే ఇచ్చేవాళ్లం. వాళ్లు వాటిని తినకుండా బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్లకు పట్టుకెళ్లి అమ్మతున్నారు. పైగా మా ప్యాకింగ్ ల్లోనే. దాంతో మా పేరు చెడుతోంది అని చెప్పుకొచ్చాడు. అదీ నిజమే అనిపించింది. అంటే ఓ మంచి పని చేసేవాడిని కూడా మనమే చేయకుండా చేస్తున్నామన్నమాట.
ఇక కొత్తగా బఫేలు, ఫ్యామిలీ ప్యాక్ లు ప్రారంభమయ్యాయి. వీటితో వృధా మరింత పెరిగింది. బఫె కు వెళ్లినపుడు గమనించండి. ప్లేటు నిండా వడ్డించుకుని వస్తారు.. కాస్త కెలుకుతారు. తరువాత ఆ ప్లేటు పక్కన పెట్టి, మరోటి అందుకుంటారు. ముందు తీసుకున్నదంతా వృధా. ఇలా నాలుగైదు సార్లు..ఎంత తిండి వృధా. ఇంకో సంగతి కూడా వుంది ఇక్కడ. ఈ ప్లేట్లు ఇలా మార్చే వ్యవ్యహారం పెళ్లి పేరంటాలు చేసేవాళ్లకు పీకల మీదకు తెస్తోందన్న సంగతి గమనించాలి. పెళ్లిళ్లలోనూ ఇప్పుడు బఫే అలవాటైంది. అక్కడ క్యాటరింగ్ వాడు ప్లేటుకు ఇంత అని లెక్క కడతాడన్న సంగతి తెలిసిందే. పెళ్లికి వచ్చిన ఒక్కరు నాలుగు ప్లేట్లు మారిస్తే, క్యాటరింగ్ బిల్లు అంతకు అంతా పెరుగుతుంది. అందుకే ఈ అలవాటుకు స్వస్తి చెప్పండి,.హోటల్ కానివ్వండి.. ఇంట్లో కానివ్వండి..పెళ్లి పేరంటాల్లో కానివ్వండి..మీ వల్ల ఆహార పదార్థాల వృధాను అరికట్టండి. కావాల్సినంత వడ్డించుకోవడం, అవి తిన్నాకే మళ్లీ తీసుకోవడం అలవాటు చేసుకోండి.
దీనివల్ల డబ్బుల ఆదా అన్నది పక్కన పెడితే జాతి ప్రయోజనాలు కూడా ఇమిడి వున్నాయని గమనించండి. దేశంలో ఎందరో కాస్త తిండికి మొహం వాచి వున్నారని గమనించండి. మనం ఆహారం వృధా చేయడం మానేస్తే, తిండిగింజల వాడకం తగ్గుతుంది. ఫలితంగా ధరలు తగ్గుతాయి. ఇంకా చాలా చాలా ప్రయోజనాలు ఇమిడి వుంటాయి. అదే విధంగా హోటల్ వాళ్లు కూడా ఈ వృధాకు అడ్డుకట్ట వేయాలి. వీలయితే ఇలా వృధా అవుతున్న పదార్థాలను వారు విడివిడిగా వుంచి, ఏదైనా స్వచ్ఛంధ సంస్థను సంప్రదించి,వారి ద్వారా వాటి సక్రమ వినియోగానికి ఏర్పాట్లు చేయాలి. మనం బతుకుతూ ఇతరుల్ని బతకనివ్వాలన్నది పెద్దల మాట. అదే విధంగా మనం తింటూ, ఇతరులకు తినే అవకాశం ఇవ్వాలి. అలా చేయాలంటే ఈ 'బఫె'లో తిళ్లకు స్వస్తి చెప్పాలి. మరి కొంచెం వడ్డించమంటారా.. అని అడగడంలో ఎంత ఆప్యాయత వుంది. అడిగి తినడంలో, అడిగి వడ్డించడంలొ అభిమానాలు పెరుగుతాయని గమనించండి.