ఆ ముగ్గురు - ..

aa mugguru

నగనగా ఓ వెర్రోడు..వాడికేం అన్యాయం చేసిందో తెలియదు కానీ, తాబేలును పట్టకుని తెగ బాదేస్తున్నాడు..కానీ అది చావడంలా ఎందుకంటే దానికి బలమైన డిప్ప రక్షణగా వుంది.ఇంతలో అటుగా వచ్చాడో స్వామీజీ. ఈ వ్యవహారం చూసి,,ఓరి పిచ్చివాడా..అలా కొడితే అది చావదు నాయనా..తిరగేసి కోట్టు..అని ఉచిత సలహా  పడేసాడు. దాంతో అది కాస్తా చచ్చింది. స్వామీజీ ఉపాయం మాత్రమే చెప్పాడు..కొట్టినవాడు స్వామీజీ చెప్పిన మేరకే చేసాడు. అందుకని వారికే పాపం అంటదు..పోయిందల్లా తాబేలు ప్రాణమే.

తెలంగాణ విభజన బిల్లు వ్యవహరం అచ్చం ఇలాగే వుంది. రాష్ట్రానికి బిల్లు వెళ్లాలి, పద్మవ్యూహం లోకి వెళ్లిన బిల్లు క్షేమంగా వెనక్కు రావాలి. అలా అని సీమాంధ్ర నాయకులు ఎవరూ ఇబ్బంది పడకూడదు. వారి పరువు వారికి నిలబడాలి. ఇదీ జరగాల్సిన వ్యవహారం. అందుకోసం కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన స్క్రిప్టు రచించింది. కథ,స్రీన్ ప్లే, మాటలు, తాము అందిస్తాము..ఎవరి స్థాయికి తోచినట్లు వారు నటించేసి సీన్లు రక్తి కట్టించమంది. కిరణ్, చంద్రబాబు, జగన్, అశోక్ బాబు వంటి హేమాహేమీలు రెచ్చిపోయి నటించేసారు. సినిమా వ్యవహారం, స్క్రిప్ట్ వైనం తెల్సిన కెసిఆర్ లాంటి వాళ్లు, ఎటువంటి ఉత్కంఠకు లోనవకుండా,  తోటలో పండిన మాంచి కూరలు వండించుకుని తింటూ, హాయిగా నిద్రించారు. 

ఎటొచ్చీ జనాలే, సినిమా ఎలా వుంటుందో తెలియదు కనుక, టీజర్లు చూస్తూ, ట్రయిలర్లు గమనిస్తూ, పేపర్లు కొనేసి, టీవీలు చూసేసి, వెబ్ సైట్ల బ్రౌజ్ చేసి, ఆఖరికి క్లయిమాక్స్ చూసి, ఇదా సినిమా అని, ఎలాగూ డబ్బులిచ్చేసాం కదా..ఇంక చేయగలిగిందేమీ లేదంటూ నిట్టూర్చారు.

నాయకుల అభిమానులు మాత్రం ఎవరికి వారు,  సూపర్, కేక, పక్కా హండ్ర డేస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇంతకీ సినిమా సంగతి ఎలా వున్నా, ఎవరెలా నటించారన్నది మాత్రం ఓ సారి పక్కాగా చూడాల్సి వుంది. వీరిలో ఉత్తమ నటుడు ఎవరు అన్నది ఆ తరువాతి సంగతి.

జగన్ బాబు 'కేక'

తాపత్రయం ఎక్కువ. అంతకు మించిన తలకాయనొప్పలూ ఎక్కువే. అందరి కన్నా ముందు తెరపైకి వచ్చిన క్యారెక్టర్ ఇదే. ఇలా విభజన  అన్న టైటిల్ కార్డు పడడం ఏమిటి? మేకప్ వేసుకుని తెరపైకి వచ్చేసాడీ బాబు. జైలులో లోంచే డైలాగులు కొట్టకుండానే తన జనాల చేత రిజైన్ చేయించి, అమ్మ చేత అన్నం మానిపించి, ఆపై తాను బయటకు వచ్చాక, తాను నిరాహార దీక్ష చేసి, నానా హంగామా చేసాడు. జనం కళ్లార్పకుండా చూసారు. తీరా బిల్లు దగ్గరకు వచ్చేసరికి ఆయన తన చేతులు కడుక్కుని ఓదార్పు అంటూ బుగ్గలు నిమరడానికి వెళ్లిపోయాడు. ఆపైన అసెంబ్లీకి బిల్లు వచ్చేసరికి తెరపై క్యారెక్టర్లు ఎక్కవైపోయి, ఇతగాడు చేయడానికి ఏమీ మిగల్లేదు. మిగిలిన వారు చేసిందానికి తేడాగా చేస్తే తప్ప, జనం తన కేసి చూడరని, సమైక్య తీర్మానం చేయాలి..ఆ తరువాతే చర్చ అని యాగీ మొదలెట్టాడు. కడకు, ఒక్కరే బిల్లుకు అడ్డం పడితే బాగుండదని స్క్రిప్ట్ రాసిన వారికి తెలుసు. అందుకే ఈ హీరోగారిని పక్కన పెట్టి మరో హీరోను తెరపైకి తెచ్చింది. తన పాత్ర ఏ మేరకో జగను బాబుకు తెలియంది కాదు. పైగా ఆయనకు రాసినవి లిమిటెడ్ డైలాగులు. కిరణ్, చంద్రబాబు తోడు దొంగలు. వాళ్ల వల్లే విభజన, సమైక్య తీర్మానం చేయాలి. ఇవే డైలాగులు. జనం ఎన్నిసార్లు విన్నా అవే. అందుకే అప్పుడే వచ్చిన కొత్త పాత్ర కిరణ్ చాలా ఆసక్తికరంగా కనిపించింది.

కిరణ్ బాబు సూపర్

విభజన వ్యవహారం తెరపైకి వచ్చిన తరవాత స్లోగా తెరపైకి వచ్చిన పాత్ర ఇది. జగన్ బాబు పాత్రకు లిమిటెడ్ డైలాగులు అయితే, ఈ కిరణ్ బాబు పాత్రకు అన్ లిమిటెడ్ డైలాగు వెర్షన్ వుంది. అంతగా కీలకమైన పాత్ర కాదు అని జనం అనుకుంటున్న తరుణంలో ఎన్జీవోలకు సపోర్టు ఇచ్చి తెరవెనుకే వుండిపోడవంతో అలా అనుకోవాల్సి వచ్చింది. తీరా చేసి లగడపాటి లాంటి సైడ్ క్యారెక్టర్లు సూపర్ పాత్ర అది ,.వస్తుంది..వస్తుంది..అంటూ హైప్ తీసుకువచ్చారు. ఇది కూడా కీలకపాత్రే అనకునే తరుణంలో బిల్లు రాష్ట్రానికి వచ్చింది.అంతకు ముందు ఢిల్లీలో, రాష్ట్రంలో ఎప్పుడు పడితే అప్పుడు పదునైన డైలాగులు, భారీ సెంటిమెంట్ మేళవించి ఈ పాత్ర నోటి వెంట రావడంతో జనం దృష్టి కాస్త బాగానే ఇటు మళ్లింది. ఏదో చేస్తుందీ  పాత్ర అనుకుంటే బిల్లును సజావుగా అసెంబ్లీకి చేర్చింది. అదేంటీ విలనా? అనుకుంటే, మంత్రి పోర్టు పోలియోనే మార్చి, ట్విస్టు ఇచ్చింది. అరే ఇదేదో బాగుందే అనుకుంటే, డిస్కషనకు ఇంకా టైమ్ కావాలని ఎవర్నీ అడక్కుండానే రాష్ట్రపతికి లేఖ రాసేసి, మళ్లీ జనం చేత ఈల వేయించింది. ఇంకా చాలదన్నట్లు, ఇంటర్వెల్ బ్యాంగ్ మాదిరిగా ప్రీ క్లయిమాక్స్ బ్యాంగ్ మోగించింది. అసలు ఇంతవరకు చూసిన సినిమా సినిమానే కదు..అంతా డూబు..తూచ్..అంటూ బిల్లును వెనక్కు పంపమని నోటీసు ఇచ్చింది. జనం అనుకోని ఈ ట్విస్టుకు బిత్తర పోయారు. వారెవా ఏమి ట్విస్టు..ఏమి స్క్రిప్టు అనుకున్నారు. కానీ అంతలోనే మళ్లీ బిల్లుకు గడువు పెంచమని లేఖ రాసారు. ఇక్కడే జనానికి కాస్త కథ అయోమయంగా అనిపించింది. బిల్లు చెత్త అంటున్నారు. మరి మళ్లీ డిస్కషను అంటూ, గడువు పెంచమంటున్నారు...అసలు ఈ పాత్ర తీరేందబ్బా అనుకున్నారు. అంతలోనే కిరణ్ బాబు ఇచ్చిన తిరస్కారం నోటీసుపై ఓటింగ్ జరగిపోయింది. కిరణ్ పాత్ర జనానికి భలే నచ్చేసింది.

ఇలా జగను బాబు, కిరణ్ బాబు పాత్రలు నడిస్తే, అసలు కీలకమైన పాత్ర మరోటుంది. అదే చంద్రబాబు.

సినిమాలో అసలు సిసలు పాత్ర ఇది. కనిపించదు కానీ మా తెలివైన పాత్ర. జగన్ లా డైలాగులు తక్కువ. కిరణ్ లా చేతలూ తక్కువ. నిజానికి ఈ పాత్ర ఈ సినిమాలోకి రాకపోను. కానీ జగను బాబు నటిస్తున్నాడు అని తెలిసాక, తాను చేయకపోతే క్రెడిట్ అంతా అతగాడికి పోతుందని సినిమా ఒప్పకున్నాడు. అయితే ఒకటి తాను ఒప్పుకున్న సంగతి, నటిస్తున్న సంగతి తెలియకూడదని కండిషన్. కావాలంటే తన మాట వినపడకుండా, సీన్ ను బట్టి మోత్కుపల్లి, ఎర్రబిల్లి, పయ్యావులు, గాలి వంటి మాంచి డబ్బింగ్ ఆర్టిస్టుల చేత వాయిస్ ఓవర్ చేయిస్తానన్నాడు.. సరే కానిమన్నారు. అప్పటి నుంచీ ఈయనా విజృంభించాడు. పైగా ఈయన పాత్ర పోషించడమే కాదు, తెరపై కనిపిస్తూ, జగన్ తో పోటీ పడుతున్న కిరణ్ బాబుకు డైరక్షన్ కూడా చేపట్టాడు. టాలీవుడ్ తెరపై కనిపిస్తే, కొందరే చూస్తారు, అదే బాలీవుడ్ అయితే బెటర్ అని ఢిల్లీ వెళ్లి నిరసన చేసాడు. కానీ చిరకాలంగా బాలీవుడ్ లోకి మన హీరోలను రానివ్వరన్నది తెలిసిందే. అందుకే ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు,. సరే అక్కడి నుంచి వచ్చేసి, ఇంక యాక్షన్ , రియాక్షన్ లు లాభం లేదు, డైరక్షనే బెటర్ అని పార్టీ ఆఫీసులో కూర్చుని పోయాడు. అలా మరీ కూర్చునిపోతే అవార్డు రూల్సు ఒప్పుకోవు అనడంతో, ఒకటి రెండు సార్లు ఆత్మగౌరవ యాత్ర వగైరా పేర్లతో అలా అలా తిరిగి వచ్చారు. ఒకటి రెండు డైలాగులన్నా చెప్పాల్సిందే అంటే, చూస్తూ ఊరుకుంటామా..ఎవరి జాగీరు..ఎలా విభజిస్తార..లాంటి స్టాక్ డైలాగులు చెప్పేసి వచ్చేసారు. 

సీను రక్తికట్టినా కట్టకపోయినా ఫరవాలేదు కానీ మీ మీ యాక్షన్లు మాత్రం అదిరిపోవాలి..జనం కన్ఫ్యూజైపోయినా ఫరవాలేదు..అంటూ రెండు వైపుల నటులను ఒకేసారి సీన్లోకి వదిలారు. ఇది మా యాక్షనే తప్ప, మా బాబు గారి డైరక్షన్ కాదు అంటూనే వారు ఆయన చెప్పినట్లే చేసుకునిపోయారు. వాళ్లకీ స్టాక్ డైలాగులు రాసిచ్చాడు. జగన్ విభజన వాది. కాంగ్రెస్ తో కుమ్మక్యై బెయిల్ తెచ్చుకున్నాడు. (బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తికి కూడా ఈ ప్రచారంతో డవుట్ వచ్చేసి వుండాలి..ఇంతకీ బెయిల్ తానే ఇచ్చానా అని)..సమైక్యం పేరిట ముసుగు వేసుకున్నాడు. ఇలాంటి డైలాగులు విని విని ఆడియన్స్ విసిగిపోయారు. మొత్తానికి బాబు ఆ విధంగా ముందుకు పోయారు. తీరాచేసి చర్చకువచ్చేసరికి బాబు గారి కాల్ షీట్లు అయిపోయాయి. సభా షూటింగ్ కు అరకొరగా రావడం ప్రారంభించారు. మాట్లాడవయ్యా మగడా..అంటే, ఈ సీన్ లో 'మాటల్లేవ్..మాట్లాడుకోడాల్లేవ్' అంటూ మిన్నకున్నారు. తీరా చేసి తోటి పాత్ర కిరణ్ విభజన బిల్లును తిరగ్గొట్టాలి అనగానే ఈయన కూడా తన సపోర్టింగ్ క్యారెక్టర్లకూ అదే డైలాగ్ షీట్ ఇచ్చేసాడు. వాళ్లూ అదే గోల పెట్టడం ప్రారంభించేసారు. క్లయిమాక్స్ కు వచ్చేముందయినా నాలుగు డైలాగులు చెప్పండి అంటే వచ్చేసీన్లో చెబుతా అని తప్పించుకున్నారు. ఇంక వేరే సీనే లేదని ఆయనకు తెలియంది కాదు. అదీ ఆయన స్పెషాలిటి.

ఈ ముగ్గురు హీరోల నటన ఇలా వుంటే మరో సిసలైన క్యారెక్టర్ కూడా వుంది. అది మనోహర్ బాబు క్యారెక్టర్. చాలా గడుసైన పాత్ర.
బిల్లు ప్రవేశ పెట్టడంలో, అది ఏ మాత్రం గాయపడకుండా వెనక్కు వెళ్లడంలో ఈ పాత్రదే యాక్షన్ అంతా. ప్రవేశపెట్టేటపుడు ఎంత చక్కగా చర్చ ప్రారంభమైందా లేదా అన్న మీమాంస జరిగేలా చేసారో, తిరిగి పంపేటపుడు కూడా అంతే. బిల్లుపై చర్చ జరిగి, గడువు పూర్తయి, అది క్షేమంగా వెనక్కు వెళ్లాక, అప్పుడు కిరణ్ తీర్మానం ఓకె అయిందనిపించారు. అంటే కేంద్రానికి కావాల్సింది ఈ తీర్మానం వ్యవహారం కాదు. బిల్లు వెళ్లింది..చర్చ జరిగింది..వెనక్కు వచ్చింది. దట్సాల్. అలా చేయడంలో కీలక పాత్ర మనోహర్ బాబుదే. అయితే సినిమా అన్నాక కాస్త వినోదమూ వుండాలి. అలా వినోదాన్ని అందించిన పాత్ర అశోక్ బాబు ది.

ఒక్కసారిగా తెరపైకి వచ్చిన పాత్ర ఇది. జనం భలే శభాష్ అన్నారు. ఒకటే ఊపున రెచ్చిపోయింది. జనం బిత్తర పోయారు, ఏం తెగువ అనుకున్నారు. సమ్మె అన్నారు. అంతటితో పాత్ర ఫోర్స్ డ్రాపయిపోవడం ప్రారంభించింది. ఆపై నెమ్మదించి, ఇంక యాక్షన్ చేయలేను, డైలాగ్ వెర్షన్ వంటే ఇవ్వండి కిరణ్ బాబు లాగే చెప్పుకుంటూ పోతాను అంది. నిరసన కార్యక్రమం అంది..చలో హైదరాబాద్ అన్న నినాదం వినిపించింది.ఆపై చలో డిల్లీ అన్నట్లు కూడా గుర్తు. కానీ ఎవీ తెరపై మాత్రం కనిపించలేదు.  ఇదెక్కడి క్యారెక్టర్ అని జనం అనుకనే లోగానే క్యారెక్టర్ ముగిసింది. 

ఇవీ తెరపై కనిపించిన పాత్రలు. అసలు ఈ సినిమాలో నటించడం తమకు ఇష్టం లేక ఢిల్లీలోనో, హైదరాబాద్ లోనో కనిపించకుండా కూర్చున్న మెగాస్టార్ చిరంజీవి లాంటి క్యారెక్టర్లు, మేం నటించకున్నా, నాలుగు డైలాగులు చెప్పే సాయం చేయగలని చెప్పిన పురంధ్రీశ్వరి, పల్లంరాజు, గంటా, వెంకయ్య వంటి నటలు అనేకం మంది వుండనే వున్నారు. 

మొత్తానికి సినిమా పూర్తయింది. ఎవరి నటన వారిది. జనం ఎవరిని ఉత్తమ నటుడిగా ఎన్నుకుంటారో..ఎవరికి అవార్డు ఇస్తారో ఎన్నికల అనంతరం తెలుతుంది. అయితే ముందుగా ఈ సినిమాలో బెస్ట్ డైలాగ్ ఒకటి వుంది. అది మాత్రం చెప్పేసుకుందాం..
'....ఎమ్మెల్యేలుగా మా బాధ్యత అయిపోయింది..ఇంక ఎంపీలు, కేంద్ర మంత్రులదే బాధ్యత...'ధూళిపాళ నరేంద్ర.
 

అవును నిజమే. నాయకుల బాధ్యత అయిపోయింది. జనం బాధ్యతే మిగిలింది. నాయకులను ఓటుచ్చుకు సన్మానించాల్సిన బాధ్యత. అదెలా వుంటుందో చూడాలి.
 
courtesy: www.gulte.com

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి