మనిషన్న ప్రతీవాడికీ ఉంటుంది ఈ కంఫర్ట్ జోన్ అన్నది. దీనికేమీ డిక్షనరీల్లో వెదకక్కర్లేదు అర్ధం తెలియడానికి. మన ప్రాణానికి హాయిగా ఉండేదేదో చేసుకోవడం అని ఓ అర్ధం చెప్పుకోవచ్చు. కానీ చిత్రం ఏమిటంటే మనం కంఫర్ట్ జోన్ అనుకున్నది అవతలవాడికి ఎక్కడలేని చిరాకూ తెప్పిస్తుంది. అందుకేనేమో ఎవడికి వాడే చూసుకోవాలి తప్ప, ఇంకోడి సదుపాయం, సౌకర్యం గురించీ ఆలోచించకపోవడమనేది ఈ జోన్ల ముఖ్యసూత్రం. అవతలివాడు ఎలా పోతే మనకేమిటీ అనేదే చూసుకోవడం ఉద్దేశ్యంగా పెట్టుకుంటూంటారు చాలామంది.
దీనికి ఓ లింగబేధం కూడా ఉండదు. వయస్సుతో అసలు పనేలేదు. ఫలానాది మన ప్రాణానికి హాయిగా ఉందీ, అలాగే కానిచ్చేద్దాం అనుకోడం. ఉదాహరణకి పసిపిల్లలు గుడ్డలు తడిపేసికుంటూంటారు, అస్తమానూ మార్చడానికి ఓపిక లేక అవేవో డయపర్లని వేస్తూంటారు. ఏదో రోజుకి ఓ మూడునాలుగుసార్లు మారిస్తే సరిపోతుంది, ఆ పసిపిల్లాడి ప్రాణానికీ హాయీ, ఇంట్లోవారికీ హాయి. జీవితంలో ఈ డయపర్ల ప్రక్రియ ఒక్కటే ఇరుపక్షాలకీ ఆమోదయోగ్యమైన కంఫర్ట్ జోన్ అనడానికి సందేహమేమీ లేదు.
కొద్దిగా వయసొచ్చిన తరువాత ఇంకొన్ని కంఫర్ట్ జోన్లు చోటు చేసికుంటాయి. ఇలాటివి అవతలివారికి చిరాకు తెప్పిస్తూంటాయి. ఇంట్లో తిండి తినడం పూర్తయిన తరువాత, వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి చేతులు కడుక్కుని, నూటికి తొంభైమంది ప్రక్కనే ఉండే ఏ కర్టెన్ కో చేయి తుడిచేసుకోవడమంత హాయి ఇంకోటుండదనుకుంటారు. మనకి బాగానే ఉంటుంది, కానీ ఆ ఇంటి ఇల్లాలుకి మాత్రం ఎక్కడలేని చిరాకూ తెప్పిస్తుంది. అక్కడ న్యాప్ కిన్ పెట్టానుకదా దానితో తుడుచుకోడానికి ఏం రోగం అనే భావం వచ్చేటట్టు ఓసారి గయ్యిమంటుంది. వంటచేసేటప్పుడు చెయ్యి కడుక్కుని తనుమాత్రం పమిటచెంగుతో తుడుచుకుంటే ఎవ్వరూ నోరెత్తకూడదు. నోరెత్తారా మర్నాడు ఉపోషమే!
అలాగే డ్రాయింగ్ రూమ్ము లో సోఫాలుంటాయనుకోండి, కూర్చున్నంతసేపూ కాళ్ళు క్రిందకే పెట్టుకుని, ఏదో ఆఫీసులో కూర్చున్నట్టే కూర్చోవాలి తప్ప, ఛస్తే కాళ్ళు మాత్రం పైకి పెట్టుకోకూడదు. ఇదివరకే హాయిగా కుర్చీలో కాళ్ళు ఎలా కావాలంటే అలా పెట్టుకునేవాడినీ, ఈ సోఫాలు కొని, లేనిపోని తద్దినం తెచ్చుకున్నానురా భగవంతుడా అని అనుకోని రోజుండదు. ఇంక తిండి విషయానికొస్తే, వయసు పెరిగేకొద్దీ, లేనిపోని ఆంక్షలు పెట్టేస్తూంటారు, ఫలానాది తినొద్దూ, ఫలానాదానిలో ఉప్పు ఎక్కువేసికోవద్దూ, ఫలానా స్వీటు తింటే మీకు పడదూ, రోజూ ఊరగాయవేసికుంటే ఎలా కుదురుతుందీ, ఇలా ఒకటేమిటి ప్రతీదీ నిషిధ్ధమే. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఏవైతే నిషిధ్ధమన్నారో అవే ఈ పెద్దాయన కంఫర్ట్ జోన్లు. ఇలాటి బాధితుల్నే చూస్తూంటాము బయట రోడ్డు ప్రక్కనే ఉండే పానీ పూరీ షాప్పులదగ్గరా, సారాకొట్లుండే షాప్పుల బయట ఉండే మిరపకాయబజ్జీ కొట్ల దగ్గరానూ. ఏదో ఈవెనింగు వాక్ పేరుచెప్పో, గుడికి వెళ్తున్నామనో చెప్పి బయటకి వచ్చేసి చేసే పనులన్నమాట ఇవి! హాయిగా అప్పుడప్పుడు ఇంట్లోనే చేసేస్తే ఈ గొడవలే ఉండేవికావుగా. ఇలాటి ప్రాణులు ఏ పెళ్ళికైనా వెళ్ళినప్పుడు చూస్తూంటాం, అక్కడ బఫే లో పెట్టిన ప్రతీ కౌంటరుదగ్గరా ఏదో ఒకటి తినేయడమూ, తరువాత ప్రాణం మీదకు తెచ్చుకోడమూనూ...
ఇంక పుస్తకాలూ పత్రికలా విషయానికొస్తే కొందరికి ఫలానా పేపరు చదివితేనే కానీ రోజెళ్ళినట్టుండదు. కానీ ఇంట్లోనేమో ఇంగ్లీషు పేపరు తెప్పించుకోవడమే ఓ స్టేటస్ సింబల్ అనుకుంటారాయె. కొంతమందికైతే తెలుగు పేపరు తెప్పించుకోవడమే నామోషీ అనుకుంటారు, అవేవో పెద్ద పెద్ద ఇంగ్లీషు నవలలు చదివితేనే మన అస్థిత్వానికి ఓ గుర్తింపు వస్తుందీ అనుకుంటారు కొంతమంది. అలాగే ఇంగ్లీషు సినిమాలూనూ, అప్పుడప్పుడు హిందీ. అంతేకానీ, హాయిగా ఏ తెలుగు సినిమాయేనా పెట్టకూడదురా నాయనా అని మాత్రం అడక్కూడదు. ఏదో అదృష్టం బాగుండి టివీ లో ఓ తెలుగు కార్యక్రమం వస్తోందని ఏకాగ్రతతో చూద్దామని కూర్చుంటే, అప్పుడే వస్తాయి ఎక్కడలేని కబుర్లూ, నవ్వులూ, ఏడుపులూనూ, పోనీ వినిపించడంలేదని సౌండు పెంచుదామా అంటే, అక్కడికేదో ధ్వనికాలుష్యం ఎక్కువైపోతోందని గొడవా. అర్ధం పర్ధంలేని పాటలూ అరుపులూ కేకలూ మాత్రం, ఊరంతా వినిపించేటట్టు పెట్టుకోవాలి. అది ఈకాలపు వారి కంఫర్ట్ జోన్నాయె ఏం చేస్తాం?
ఇంక ప్రయాణాల విషయానికొస్తే, ఏదో ఫలానా రోజు ఫలానా ట్రైన్ లో రిజర్వేషను చేయించుకుని బయలుదేరుదామనుకుందాం, సాయంత్రం ఏ నాలుగున్నరకో బండంటే, పోనీ ఓ గంట ముందుగా బయలుదేరుదామేమిటీ అనడం తరవాయి, ఎందుకూ అంతముందరనుంచీ అక్కడేం చేస్తాం అంటారే కానీ, పోనీ పెద్దాయన అడిగినట్టు బయలుదేరితే అనిమాత్రం అనుకోరు. ఓ గంట ముందరే స్టేషనుకి చేరుకోవడం ఈ పెద్దాయన కంఫర్ట్ జోన్నాయె. మరీ చివరి నిముషంలో బయలుదేరితే, ఏ ట్రాఫిక్కు జామ్ములోనైనా చిక్కడిపోతామేమో, ఇంకో ప్లాట్ఫారం మీద బండొస్తే ఉరకలూ పరుగులూ తీయాలేమో అని ఎప్పుడూ ఈయన ఓ గంటముందుగానే స్టేషనుకి చేరుకోవడం ఈయన అలవాటు. ఓ మాట చెప్పండి, ఈరోజుల్లో ఎక్కడ చూసినా విమానాల్లో వెళ్ళేవారే, ఎయిర్ పొర్టుకి విమానం బయలుదేరేసమయానికి రెండు గంటలముందరే, అవేవో సెక్యూరిటీ చెక్కులూ, సింగినాదాలూ పేరుచెప్పి చేరుకుంటారే, అలాటిది ఇంట్లో పెద్దాయన ఓ గంట ముందర బయలుదేరుదామంటే అంత గొడవెందుకూ?
కుటుంబం అంతా వెళ్తున్నారుకదా అని ఇంట్లో ఉండే పెద్దవారిని కూడా అప్పుడప్పుడు ఏ ఫైవ్ స్టార్ హొటల్ కో తీసికెళ్ళారనుకోండి, ఈ పెద్దాయన్ని ఆయన ప్రాణానికి హాయిగా ఉండేటట్టు మాత్రం ఉండనీయరు. హాయిగా చేత్తో కలుపుకు తినడం ఈయనకి అలవాటు. కానీ అక్కడ అరచేతికి కూడా అంటకుండా, కోడి కెక్కరించినట్టే తినాలిట, లేకపోతే ఓ స్పూన్నో, ఫోర్కో తోనే తినాలిట. అదేదో ఫింగర్ బౌల్లో ఏదో, దాంట్లో వేణ్ణీళ్ళూ, ఓ నిమ్మకాయబద్దా వేసి తెస్తూంటారు. అందులో సుతారంగా వేళ్ళు ముంచుకుని కడుక్కోవాలిట, హాయిగా వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లడం చేతులు శుభ్రంగా కడుక్కోవడం పెద్దాయనకి కంఫర్ట్ జోన్నాయె.
కొంతమందికి ఏదో ఫలానా సినిమా చూడడంలో ఉండే ఆనందం ఇంకో సినిమా చూస్తే ఉండదు. టివీ లో ఎన్నిసార్లువచ్చినా చూడ్డం మానడు. అదేమో ఇంట్లో ఉండే మిగిలినవారికి చిరాకూ..." అబ్బ ఆ సినిమా ఎన్నిసార్లు చూస్తారూ... ఎప్పుడూ ఆ రంధేనా... అంటారే కానీ, పోనీ ఇంకెంతకాలం ఉంటాడూ, బతికున్నన్నాళ్లైనా హాయిగా అయనమానాన్న ఆయన్ని ఎంజాయ్ చేయనిద్దూ అని ఎన్నెన్ని ఇళ్లల్లో ఎంతమంది అనుకుంటారూ అన్నదే ప్రశ్నార్ధకం. ఇక్కడ సినిమా అన్నది కాదు ముఖ్యం, మనస్సుకి ఆహ్లాదకరంగా ఉండేది ఏదైనా సరే ఓ సినిమా కావొచ్చు, ఓ పుస్తకం కావొచ్చు, ఓ తిండిపదార్ధం కావొచ్చు, ఓ టివీ కార్యక్రమం కావొచ్చు, ఎవరి సంతోషం వారిదీ, ఎవరి కంఫర్ట్ జోన్ వారిదీ...