నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
______________________________________________________________________
జర్మనీలోని బాన్ నగరానికి చెందిన ఓ దొంగ ఓ నగల దుకాణంలోకి వెళ్ళి తుపాకి చూపించి, కొన్ని వజ్రాల ఉంగరాలని దొంగిలించాడు. కిటికీ అద్దం పగలకొట్టి వెనక వైపునుంచి కిందకి దూకాడు. దురదృష్టవశాత్తూ అతని హిప్ దగ్గరి ఎముక విరగడంతో కదలలేని అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు ఉంగరాలు తప్ప మిగిలినవన్నీ దొరికాయి. పోలీసులు అతన్ని పూర్తిగా వెదికి, ఆ ఉంగరాలు లేవని నిర్ధారణ చేసుకొన్నాక హాస్పిటల్ కి తీసుకెళ్ళారు హిప్ ఎముకకి తీసిన ఎక్స్ రేలో, అతని కడుపులో ఉన్న మిస్ అయిన మూడు ఉంగరాలూ కనిపించాయి! కొన్నయినా తనకి దక్కాలని ఆ దొంగ ఆ ఉంగరాలని మింగాడు.
వాషింగ్ టన్ స్టేట్ కి చెందిన రెంటెరిమా మార్టినెజ్ అనే దొంగ ఓ ట్రాక్టర్ - ట్రెయిలర్ ట్రక్ ని దొంగిలించాడు. కొద్దిసేపట్లోనే అతను అమెరికన్ పోలీసు సహాయ నంబర్ 911 కి ఫోన్ చేసాడు. కారణం, ఆ ట్రక్ లోని ఓ చిన్నగ్లాసులో ఉన్న పానీయాన్ని తాగాడు. అయితే అది పానీయం కాక, ఆ ట్రక్ డ్రయివర్ నమిలి ఉమ్మేసిన పొగాకు! అది తాగాక తనకి ఏమో అయిపోతూంటే పోలీసులకు సహాయానికి ఫోన్ చేసాడు. తనని అరెస్ట్ చేయడానికి ఆ దొంగ పోలీసులని తనే ఆహ్వానించినట్లయింది.