తెలుగు సినీ ప్రముఖుడు శ్రీ యల్.వీ.ప్రసాద్ గారు - టీవీయస్. శాస్త్రి

L.V. Prasad Biography

యల్. వీ. ప్రసాద్ అని సినీప్రపంచంచే పిలువబడిన శ్రీ అక్కినేని లక్ష్మీవరప్రసాద్ గారు నటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత. వీరు సినిమా పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వీరిని 1982లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. వీరు హిందీ,తెలుగు, తమిళ, కన్నడ మొదలైన పలు భాషలలో సినిమాలను, నిర్మించటంగానీ, దర్శకత్వం  వహించటంగానీ, నటించటం గానీ జరిగింది. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలంఅరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు. ఈ సినీ ప్రముఖుని గురించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.

యల్.వీ.ప్రసాద్ గారు 17-01-1908న పశ్చిమగోదావరి జిల్లాలోని, ఏలూరు సమీప గ్రామమైన సోమవరప్పాడులో ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించారు. వీరిది వ్యవసాయదారుల కుటుంబం. తండ్రి శ్రీరాములు, తల్లి బసవమ్మ.మొదటి నుండీ వీరికి చదువు మీద ఆసక్తి తక్కువ. నాటకాల మీద వ్యామోహం ఎక్కువగా ఉండేది. తొలిరోజుల్లో నాటకాలలో చిన్నచిన్న వేషాలు వేసారు. 1924 లో మేనమామ కూతురైన సౌందర్య మనోహరమ్మతో వీరికి వివాహం జరిగింది. కుటుంబం ఆర్ధిక ఇబ్బందులతో కాలం వెళ్ళబుచ్చుతుంది. ఈ పరిస్థితులలో ప్రసాద్ గారు 1930 లో ఇంటిలో ఎవరికీ చెప్పకుండా జేబులో ఒక వంద రూపాయలు వేసుకొని జీవనోపాధి కోసం వూరు వదలి బొంబాయికి వెళ్ళారు. సినీ పరిశ్రమకు చెందిన  ఎవరితోనూ సంబంధాలు లేకపోవటం వలన కనీసం స్టూడియోల లోపలి కూడా అడుగు పెట్టలేకపోయారు.

అలా ఒక ఆరు నెలలు అన్ని స్టూడియోల చుట్టూ తిరిగారు. ఆఖరికి వీనస్ ఫిలిం కంపెనీలో ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించారు. అక్కడ కొంత కాలం పనిచేసిన తరువాత నెలకు 30 రూపాయల జీతం మీద ఇంపీరియల్ లైట్ కంపెనీలో చేరారు. భారత దేశంలో మొదటి టాకీ చిత్రమైన 'ఆలం అరా' నిర్మించిన శ్రీ ఇరానీ గారు ఆ కంపెనీకి అధినేత. ఆ సినిమాలో ఒక చిన్న అతిధి పాత్రలో ప్రసాద్ గారు నటించారు. ఆ రోజుల్లో ఇరానీ గారికి సహాయకుడిగా శ్రీ హెచ్. యమ్. రెడ్డి  గారు పని చేస్తుండేవారు. ఆ సమయంలోనే ప్రసాద్ గారికి రెడ్డి గారితో పరిచయం అయింది. రెడ్డి గారి ప్రతిభను గుర్తించిన ఇరానీ గారు వారికి తెలుగులో మొదటి టాకీ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించారు. ఆ సినిమానే భక్త ప్రహ్లాద. ఆ సినిమాలో ప్రసాద్ గారు ఒక చిన్న పాత్రలో నటించటానికి రెడ్డి గారు అవకాశాన్ని కల్పించారు. అదే సమయంలో తమిళంలో తీసిన మొదటి టాకీ చిత్రమైన కాళిదాస్ లో కూడా  వీరు నటించారు. అప్పటినుండి యల్.వీ.ప్రసాద్ గారి పేరు సినీ పరిశ్రమలో మార్మోగిపోయింది.1940లో మకాంను బొంబాయి నుండి మద్రాస్ కు మార్చి శ్రీ హెచ్. యమ్. రెడ్డి గారికి సహాయ దర్శకుడిగా పనిచేయనారంభించారు.

రెండవ ప్రపంచ యుద్ధపు రోజులవి. ముడి ఫిల్మ్ కు కొరత ఏర్పడింది. సినిమా పరిశ్రమ కూడా మందకొడిగా సాగుతున్న రోజులవి. 1946 లో నిర్మించిన 'గృహప్రవేశం' సినిమాలో వీరు ప్రముఖ పాత్రను పోషించారు. ఆ సినిమాకి ఆధారం శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు వ్రాసిన ఒక కధ. ఆ సినిమాలో నటించటమే కాకుండా, దానికి దర్శకత్వం కూడా నిర్వహించారు ప్రసాద్ గారు. ఆసినిమాకు, వారు పోషించిన పాత్రకు విశేష ప్రశంసలు లభించాయి.ఆర్ధికంగా కూడా ఆ సినిమా విజయవంత మయింది. ప్రసాద్ గారు పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. 1947 లో పల్నాటియుద్ధం సినిమాను తీసే రోజుల్లో, ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న శ్రీ గూడవల్లి రామబ్రహ్మం గారి ఆరోగ్యం సరిగా లేకపోవటం వలన, ఆ సినిమాకు ప్రసాద్ గారు దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ఆ సినిమా కూడా విజయవంతమయింది. ఇక పరిశ్రమలో ప్రసాద్ గారి జైత్రయాత్ర ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు.

1949 లో మనదేశం సినిమాకు దర్శకత్వం వహించి, ఆ సినిమాలోనే తెలుగువారి తెరవేల్పు అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఒక చిన్న పాత్రలో పరిశ్రమకు పరిచయం చేసారు.1950 లో అక్కినేని నాగేశ్వరరావు, రామారావు గార్లతో సంసారం అనే సినిమాను తీసారు. ఈ సినిమాలో సావిత్రి గారు కూడా ఒక చిన్న వేషంలో నటించారు. ఆ సినిమా అఖండ విజయాన్ని చవిచూసింది. తరువాత విజయా వారి సంస్థలో మిస్సమ్మ, పెళ్ళిచేసి చూడు, షావుకారు, అప్పుచేసి పప్పుకూడు లాంటి మనోహర దృశ్య కావ్యాలకు దర్శకత్వం వహించారు. 1955 లో నిర్మాతగా మారి పలు విజయవంతమైన సినిమాలు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో నిర్మించారు. ఆ సమయంలోనే సగంలోనే ఆగిపోయిన ఒక స్టూడియోను కొన్నారు. 1970 లో హిందీలో ఖిలోనా అనే సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. బొంబాయిలో ఏ సినిమా హాల్  వద్ద మొదట్లో watchman గా పనిచేసారో, ఆ హాల్ లోనే ఈ సినిమా రజతోత్సవం జరుపుకోవటం విశేషం.1981 లో నిర్మించిన ' ఏక్ దూజే కే  లియే' అఖండ విజయాన్ని చవిచూడటమే కాకుండా, కమల్ హాసన్ హిందీ ప్రేక్షకుల మనసు కూడా దోచుకోవటానికి దోహదపడింది. ఈ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడిన హిందీ పాటలకు విశేష ఆదరణ లభించింది.

1965 కల్లా ప్రసాద్ స్టూడియోను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 1974లో అధునాతన కలర్ ఫిలిం ల్యాబ్ ను నిర్మించారు. ఇండియాలో ఉన్న మంచి లాబ్ లలో ఇది ప్రముఖమైనది. యల్.వీ. ప్రసాద్ కంటి వైద్యశాలకు భూరి విరాళాన్ని ఇచ్చారు. దేశంలోనే  ఇది ఒక ప్రముఖ నేత్ర వైద్యశాల. ఆయన జీవితంలో అపజయాలు లేవు. అన్ని రంగాలలో కూడా ప్రధముడిగా నిరూపించుకోవటం ఆయన ప్రత్యేకత. సహృదయుడు, సౌమ్యుడు,సునిశిత స్వభావుడు. ఈ లక్షాణాలే వీరి విజయానికి కారణాలు. ఇలా జీవించినంత కాలం సినీ పరిశ్రమకు సేవలు చేసిన ఈ మహనీయుడు 22-06-1994 న అనారోగ్యంతో మరణించారు. 2006 లో భారత ప్రభుత్వం వీరి పేరు మీద తపాలా బిళ్ళను విడుదల చేసింది. 2008 లో వీరి శతజయంతి ఉత్సవాలను పరిశ్రమలోని వారందరూ ఒక పండుగగా జరుపుకున్నారు.

వారి వారసులు కలర్ లాబ్ ను, ఐమాక్స్ సినిమాహాల్ మొదలైన వాటిని విజయవంతంగా నడుపుతున్నారు. వారి మనవడు అయిన శ్రీ రవిశంకర ప్రసాద్ గారు ఈమధ్యనే దుర్మరణం పాలు కావటం అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వీరి పేరు మీద పరిశ్రమకు చెందిన వ్యక్తులకు ఏదైనా పురస్కారాన్ని ఏర్పాటు చేయటం ఎంతో సమంజసం. కృషితో, పట్టుదలతో స్టూడియో లైట్ బాయ్ నుండి స్టూడియో అధిపతి దాకా ఎదిగిన ఈ మహనీయునికి నా కళాభివందనాలు! స్మృత్యంజలి!!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి