సాహితీ వనం - వర ప్రసాద్

sahithee vanam

శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితిమావహన్త్యవిహతాం స్త్రీ పుంస యోగోద్భవాం     
తే వేదత్రయ మూర్తయ స్త్రిపురుషాస్సంపూజితావస్సురైః
భూయాసుః పురుషోత్తమాంబుజభవ శ్రీ కన్ధరాశ్శ్రేయసే

ఇది ఆది తెలుగుకవి నన్నయభట్టు గారి ఆంధ్ర మహాభారతంలోని ప్రథమ పద్యం. తొలి తెలుగు కావ్యమైన మహాభారతం వేదవ్యాసులవారి సంస్కృత మహాభారతానికి అనువాదము. ఈ తొలి తెలుగు పద్యం సంస్కృత సమాస భూయిష్టమై ఉండడం గమనింపవచ్చు. క్రీ.శ. 1022 నుండి 1060 వరకు రాజమహేంద్రవరము రాజధానిగా పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి ఐన నన్నయభట్టు తన రాజుగారి కోరికమేరకు మహాభారత అనువాదమును మొదలుబెట్టాడు.

లక్ష్మిని, సరస్వతిని, పార్వతిని వరుసగా వక్షస్థలంమీద, ముఖమునందు, శరీరమునందు సగభాగముగా నిలుపుకున్న త్రిమూర్తులైన, స్త్రీ, పురుష శక్తిస్వరూప వేదమూర్తులైన,మహావిష్ణువు, బ్రహ్మ, పరమశివుడు మీకు శ్రేయస్సును కూర్చునుగాక అని ఆశీఃపూర్వకముగా పద్దెనిమిది పర్వాల మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం మొదలుబెట్టిన నన్నయ భట్టు మొదటి రెండు పర్వములైన ఆది, సభా పర్వములను పూర్తి చేసి మూడవది ఐన అరణ్యపర్వములో, నాలుగవ ఆశ్వాసములో నూటనలభైరెండవ పద్యమైన 'శారద రాత్రులుజ్జ్వల లసత్తర  తారకహార పంక్తులం జారుతరంబులయ్యె..' పద్యముదాకా తెనిగించిన తర్వాత పరమేశ్వరునీలో లీనమైనారు.

తర్వాత తిక్కన మహానుభావుడు ( క్రీ.శ.1205-1288) నన్నయభట్టు పూర్తిచేయలేకపోయిన అరణ్యపర్వాన్ని ముట్టుకోకుండా, మహాభారతములోని నాలుగవ పర్వమైన విరాటపర్వమునుండి మొదలుబెట్టి మహాభారత ఆంధ్రీకరణను పూర్తిచేశాడు కానీ నన్నయభట్టు ప్రారంభించి వదలివేసిన అరణ్యపర్వము అలానే మిగిలిపోయింది.

క్రీశ.1280-1364 సంవత్సరముల మధ్యకాలంలో జీవించినట్టు భావింపబడుతున్న ఎర్రాప్రగడ అద్దంకి రాజధానిగా పరిపాలించిన ప్రోలయవేమారెడ్డి ఆస్థాన కవియై, 'స్ఫురదరుణాంశురాగరుచి బొంపిరివోవ నిరస్త నీరదావరణములై ..' అనే  పద్యముతో ప్రారంభించి, అరణ్యపర్వములో సగంలో ఆగిపోయిన నాలుగవ ఆశ్వాసమును, మరొక మూడు ఆశ్వాసాలతో మొత్తం ఏడు ఆశ్వాసాల అరణ్యపర్వమును పూర్తి చేశాడు. అలా మొదటి సర్వలక్షణ సమన్వితమైన ఆంధ్ర సాహిత్య ప్రక్రియగా 'ఆంధ్రమహాభారతం' పేర్కొనబడుతుంది. ఆంధ్ర (పద్య) సాహిత్యము మహాభారతముతో మొదలైంది. మహాభారతానికి, అసలు పురాణం వాన్జ్గ్మయానికి జయము అని పేరు. కనుక జయమార్గములో ఆంధ్ర సాహిత్య సరస్వతి నడక మొదలైంది. 'యదిహాస్తి తత్క అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్' అన్నాడు వ్యాసులవారు భారతం గురించి. అంటే ఇందులో ఉన్నదే వేరే ఎక్కడైనా ఉన్నది, ఇక్కడ లేనిది వేరే ఎక్కడా లేదు, మహాభారతంలో లేని సంఘటనలు, పాత్రలు, మనస్తత్త్వాలు, పరిస్థితులు వేరే ఎక్కడా లేవు, ఉండవు. అటువంటి సర్వకాల, సర్వదేశ, సర్వమానవ జీవన సర్వస్వదర్పణంగా మహాభారతంతో మొదలయ్యింది కనుకనే, సర్వ సాహిత్య కళామార్గ సర్వస్వంగా ఆంధ్ర సాహిత్యం వెలుగులు చిమ్మింది, చిమ్ముతూనే ఉంటుంది. ఆ ఆదిగ్రంథ కర్తలైన నన్నయ, తిక్కన, ఎర్రన మహానుభావులను స్మరించుకొని 'తెలుగు సాహితీ వనం' లోని పరిమళాలను ఆస్వాదించే పయనం ప్రారంభిద్దాం!

సమగ్రమైన శైలి, వస్తునిర్దేశము, పరిపూర్ణత కలిగిన తొలి తెలుగు లిఖిత సాహిత్యప్రక్రియ మహాభారతమే ఐనప్పటికీ అంతకుముందు తెలుగులో సాహితీ వికాసములేదు అనుకోకూడదు. సామాన్య విచక్షణ ప్రకారం కూడా మొదటి ప్రక్రియయే సర్వలక్షణ సమన్వితముగా ఉండడం సాధ్యము కాదు కదా. అరకొర లోపాలతో, దోషాలతో ప్రారంభము అయితేనే దోషరహితమైన ఉన్నతస్థితి వస్తుంది. తప్పటడుగులతోనే నడక ప్రారంభమై పరుగులుపెట్టే శక్తివస్తుంది.

శిశువుకు కూడా చిన్ని చిన్ని ధ్వనులతో మొదలై, ఒక భాషగా పరిచయమై, సాహిత్య స్పృహ కలుగుతుంది. సాహిత్యము కన్నా ముందు భాష. ఆ భాషకు పేరు ఆ జాతిని బట్టి వస్తుంది. ఒక భాష మౌఖిక భాషా స్థాయి నుండి లిపిని సంతరించుకోడానికి, ఆ లిపి క్రమబద్ధమైన భాషగా, వివిధ ప్రక్రియా సమన్వితమైన సాహిత్య స్థాయికి చేరుకోవడానికి కొన్ని శతాబ్దాలు పడుతుంది. క్రీస్తు పూర్వం 1500-800 మధ్యకాలానికి చెందినది అని ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు భావిస్తున్న(?) 'ఐతరేయ బ్రాహ్మణం'లో 'ఆంధ్ర జాతి'ని ప్రస్తావించడం జరిగింది. మహాభారతంలో, భాగవతంలో ఆంధ్ర జాతిని ప్రస్తావించాడు వ్యాసులవారు. క్రమక్రమంగా వికాసం చెంది నన్నయ్య కాలమునాటికి విశిష్ట సాహితీ ప్రక్రియల స్థాయికి చేరుకున్నప్పటికీ, అప్పటివరకూ ప్రాకృతం, సంస్కృతం ఎక్కువగా వాడుకలో ఉన్నది, మౌఖికమైన భాష ఉన్నది, శాసనాలలో అక్కడక్కడ కవితా ధోరణి, ఛందోమార్గాలు కనిపిస్తాయి. లిఖిత సాహిత్య స్థాయికి నన్నయ్య కాలానికి చేరుకున్నప్పటికీ, పండిత లోకంలో సంస్కృత భాషాభిమానము ఉన్నది అనడానికి ఆంధ్రమహాభారతాన్ని సంస్కృత శ్లోకములో ఆశీఃపూర్వకంగా ప్రారంభించడం దృష్టాంతము.

ఆయా కాలాలలో ప్రసిద్ధులైన సాహితీవేత్తల పేర్లను బట్టి, సాహిత్యపోషణ సమాజపరిపాలన చేసిన రాజుల పేర్లను బట్టి, సాహితీ ధోరణులను బట్టి మూడువిదాలుగా సాహితీపరిణామదశలను విభజించినప్పటికీ, మనం సాహిత్య పరిశీలన చేస్తున్నాము కనుక, నన్నయకు ముందు (క్రీశ.1000పూర్వం)ప్రాఙ్నన్నయ యుగము అనీ, తర్వాత నన్నయ యుగము(1000-1100) అనీ తెలుసుకొనడం అవసరం. నన్నయయుగము తర్వాత శివకవుల యుగం(1100-1225)నన్నెచోడుడు, పాల్కురికి సోమనాధుడు, శ్రీపతి పండితారాధ్యుడు, శివలెంక మంచన, యథావాక్కుల అన్నమయ్య వీరు శివకవులు, శివసంబంధ సాహిత్యకారులు కనుక దీనికి శివకవుల యుగం అనే పేరు సార్ధకం ఐంది. మొదటి తెలుగు శతకంగా భావింపబడుతున్న 'వృషాధిప శతకము' ఈ యుగములోనే పాల్కురికి సోమనాధుని ద్వారా రచింపబడింది. ఆ తర్వాత తిక్కన యుగం(1225-1320), ఎర్రన యుగం(1320-1400),శ్రీనాధ యుగం(1400-1500), ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయల యుగం (1500-1600),1600-1775 వరకు దక్షిణాంధ్ర యుగం అనీ, 1775-1875 వరకు క్షీణ యుగం అనీ, 1875 నుండీ అఆధునిక యుగం అనీ వ్యవహారము. తెలుగువారిగా తెలుసుకొనవలసిన మన సాహిత్యసంబంధమైన కనీస వివరాలు ఇవి అనే భావనతో ప్రస్తావించడం జరిగింది. ఈ కాలాలలో అనేకులైన యితరులు మహాకవులు ఉన్నప్పటికీ, వారి పేర్లను ప్రస్తావించడంలేదు, యిది సాహిత్యచరిత్రకు సంబంధించిన పరిశోధనకాదు కనుక అనే ఉద్దేశముతో. ముందు ముందు ఆయా ప్రబంధకర్తలను తెలుసుకునే సమయంలో ఇతరులను కూడా పరిచయం చేసుకుందాము.

నన్నయ్యభట్టు మహాభారతం తో ప్రారంభమై, శ్రీనాధ యుగాని చెందిన పోతన మహానుభావుని వరకూ అందరూ సాహిత్య ప్రక్రియను ఆధ్యాత్మిక చర్చకే వినియోగించారు. శ్రీనాధ మహాకవి లో కొద్దిగా ఆ తర్వాతి కాలపు ప్రబంధయుగ లక్షణాలు, శృంగార భావాలు కనిపిస్తాయి అక్కడక్కడ. ఆ తర్వాతి రాయలయుగంలో, ప్రబంధయుగంలో, ఆంధ్రసాహిత్య స్వర్ణయుగంలో ప్రబంధ సుందరి పదం మోపి సరస సాహితీ నూపురధ్వనులను మ్రోగించింది. ఆ యుగము, ఆయుగములోని మహాకావ్యాలు,యితర ప్రబంధాలు మన ప్రధానాంశాలు ఈ సాహితీ వ్యాసంలో.

సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం
ఏక మాపాత మధురం అన్యదాలోచనామృతం

సంగీత సాహిత్యాలు రెండూ సరస్వతీదేవి రెండు వక్షోజములుగా భావించారు భారతీయులు. మానవులందరూ పిల్లలే, జగజ్జనని సరస్వతి తల్లి. ఆమె పిల్లలకు సంగీత సాహిత్యాలు రెండూ ఆ తల్లిపాలు, ఈ అందమైన భావన కేవలం భారతీయులపాలు! సంగీతం ఆపాత మధురం, అంటే చెవులలో పడగానే మధురంగా ఉంటుంది. భావము, భాష, పాండిత్యము వీటితో పనిలేకుండా, తల్లి జోలపాట చెవిన పడగానే శిశువు అలౌకికానంద ప్రవాహంలో మునిగి హాయిగా నిద్రపోతుంది. తల్లి ఏ రాగంలో పాడుతున్నది, శృతి ఏ స్థాయిలో ఉన్నది, లయ ఏ తాళంలో ఉన్నది ఇవేవీ ఆ పసిమనసుకు పట్టవు.

సాహిత్యము ఆలోచనామృతము. ఆలోచనా లోచనాలను తెరిపిస్తుంది. ఆలోచించిన కొద్దీ అమృత తుల్యంగా అనిపిస్తుంది. అంటే సాహిత్యసృష్టి చేసేవాడికి, దాన్ని ఆనందించేవాడికి యిద్దరికీ ఆలోచనాశక్తి ఉండాలి. రచయితకూ, పాఠకుడికీ  భాషా పరిచయం, విమర్శనాశక్తి, రసగ్రహణాపారీణత ఎంత ఎక్కువ వుంటే, ఎంత సమముగా ఉంటే సాహిత్యం అంత శోభిస్తుంది. సంస్క్రుతసమాసభూయిష్టమైన రచన ఎంత దివ్యముగా, ప్రవాహంలాగా ఉన్నప్పటికీ దాన్ని అర్ధంచేసుకోగలిగిన వాడికే కదా దాని రుచి తెలిసేది. కనుక రచయితకూ పాఠకునికీ సాహితీ ప్రతిభలో, విజయంలో పరస్పర అవగాహన అవసరం. అర్ధమయ్యేట్లుగా వ్రాయడం రచయితకు అవసరము, అర్ధము చేసుకునే సామర్ధ్యము ఉండడం పాఠకుడికి అవసరము.

సంగీతం అనుభూతి ప్రధానము, ఫలితముగా ఆనంద ప్రదానము. హృదయమధనం చేస్తుంది, మదిని మధురం చేస్తుంది. సాహిత్యము ఆలోచనాప్రధానము, మేధోమధనం చేస్తుంది. కానీ అనుభూతి ద్వారా లభించే ఆనందంకన్న ఆలోచనాఫలితంగా లభించే ఆనందం ఎక్కువకాలం నిలుస్తుంది, నిలబెడుతుంది. అందుకేనేమో, విచిత్రంగా అనిపించవచ్చు కానీ, సంగీతకారుడికంటే సాహిత్యకారుడు శాశ్వతంగా నిలిచిపోతాడు. అలాంటి సాహిత్యకారులలో కూడా కొందరే ఆ భాష నిలిచిఉన్నంతకాలం నిలిచిఉంటారు, ఆ భాష అనే సముద్రానికి జీవనదులలా. ఎక్కువమంది మధ్యలోనే ఇంకిపోతారు, వేసవికాలపు వరదల లాగా.

అనంతామృతసాగరమైన తెలుగుభాషను జీవనదులలాగా సమృద్ధము చేసిన సాహిత్య రసప్రవాహ వీచికలను దర్శించడం ఈ దీర్ఘ సాహిత్య వ్యాస లక్ష్యం. విధానం సామాన్య పాఠకుడుకూడా ఆహ్లాదంగా అనుభవించే సాహిత్య రీతులను మాత్రమే అవసరాన్నిబట్టి అక్కడక్కడ విమర్శనాత్మకంగా, అక్కడక్కడ విశ్లేషణాత్మకంగా, కొంత వేదాంతపరంగా, కొంత ఆధ్యాత్మిక పరంగా అంచనా వేయడం. అందుకే ఆ చదువులమ్మదయను నమ్మి, ఈ సాహసం చేయడం. ఫలం తెలుగుసాహిత్యవనంలోని సుమగంధాలను, మకరందాలను, రససంబంధాలను, ప్రబంధాల పదబంధాల అందచందాలను తనివితీరా అనుభవించడం.

తీవ్రమైన, ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, వేదాంత సాహిత్య పరిశీలన లక్ష్యము కాదు కనుక, ప్రాచీన సాహిత్యాన్ని వదిలి, అందరూ ఆనందించే అలనాటి సాహిత్య యుగాలను, ప్రబంధ సోయగాలను గమనించడం, తెలుగువాడు అనబడే ప్రతివాడూ తెలుసుకుని తీరవలసిన తెలుగు కావ్యాలను, యితర ప్రముఖ, ప్రధాన ప్రబంధ కావ్యాలను పరిశీలించడం ఈ వ్యాసకర్త ఆశయం. కనుక ఒక్కసారి తెలుగు సాహిత్య ప్రారంభము, ప్రాచీనసాహిత్య పరిణామ యుగాలను పరిచయముచేసుకుని కావ్య ప్రబంధ వనంలో పదం మోపుదాం.

సాహిత్యం సమాజానికి దర్పణం. ఏ నాగరికతవికాసానికైనా సంగీత, సాహిత్య, సాంస్కృతిక రంగాలే గీటురాళ్ళు. సమాజములో శాంతి, భద్రత, ఆనందము నెలకొన్నప్పుడు సాహిత్య, సాంస్కృతిక రంగాలు వికసిస్తాయి. సాహిత్యము తరాల అంతరాలకు వారధి. జాతి విశిష్టతకు పునాది. కనుక సాహిత్యాన్నిబట్టి సామాజిక ధోరణులను, విలువలను అంచనా వేయడం జరుగుతుంది. శ్రీనాధ యుగము తర్వాత ప్రబంధ యుగముగా పిలువబడే రాయలయుగములోనే తెలుగులో ఐదు మహాకావ్యాలుగా గుర్తింపబడే వాటిలో నాలుగు కావ్యాలు వెలిశాయి. శ్రీనాధుని శృంగార నైషధం తర్వాత వచ్చిన మిగిలిన నాలుగు మహా కావ్యాలైన మనుచరిత్ర, వసుచరిత్ర, పాండురంగ మహాత్మ్యము, ఆముక్తమాల్యదలతో రాయలకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నది. మనుచరిత్రను రాయల ప్రాణ స్నేహితుడు, ఆస్థాన ప్రధాన కవి ఐన అల్లసాని పెద్దన రచిస్తే, పెద్దన శిష్యుడు, అభిమాని, రాయల ఆరాధకుడు ఐన రామరాజభూషణుడు వసుచరిత్రను, రాయల ఆస్థానములోని మరొక మహాకవి, తెలుగువారికి సుపరిచితుడు ఐన తెనాలి రామకృష్ణుడు రచించాడు. ఇక ఆముక్తమాల్యదను శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా రచించాడు. ఈ ఒక్క సత్యము చాలు ఆంధ్ర సాహిత్యరంగములో రాయల పాత్ర అద్వితీయమైనది అని తెలుసుకోవడానికి. మనుచరిత్రముతో మొదలుబెట్టి మిగిలిన మహా కావ్యాలను, యితర ప్రబంధాలను పరామర్శించడం ఈ సాహిత్య వ్యాస పరిధి.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి