ఈ "మూతి ముడుచుకుని కూర్చోవడం" అనేది ఏదో ఒకసందర్భంలో అందరూ చేసేదే. కానీ అయినప్పుడూ మూతి ముడుచుకుంటే, కొంతకాలం భరిస్తారు, తరువాత్తరువాత enough is enough అని ఎవరూ పట్టించుకోవడం మానేస్తారు. పైగా కొందరైతే సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఉందికదా అని ఆ మూతిని ముడుచుకుంటే బాగుంటుందా మరి? ఏ వయస్సుకా ముచ్చట.చిన్నప్పుడయితే ముద్దు వస్తుంది. అది ఆ వయస్సుని బట్టి వచ్చే previlege. ఆ రోజుల్లో వాళ్ళు ఏది చేసినా ముద్దుగానే ఉంటుంది. బట్టలు తడిపితే ముద్దు,వచ్చీరాని మాటలతో ఏం మాట్టాడినా ముద్దు.. అలా అలవాటు పడిపోతారు. అయినా ఆ ముచ్చటా ఎన్నాళ్ళెండి, ఇదివరకటి రోజుల్లోలాగ స్కూలుకి అయిదేళ్ళు వచ్చేదాకా వెళ్ళకపోవడం కాదుగా, పురిటి రోజుల్లోనే స్కూల్లో ఎడ్మిషన్ కి దరఖాస్తు పెట్టుకోవాల్సిన రోజులాయె. దానితో పాపం ఆ పసిపిల్లలకీ కొన్ని నిబంధనలు వచ్చేశాయి. ఏదో కొన్నికొన్ని సందర్భాల్లోనే మూతి ముడుచుకోవచ్చు. ఎప్పుడూ, స్కూల్లో మంచిమార్కులు వచ్చినప్పుడో, ఇంట్లో ఏ వారాంతాల్లోనైనా బయటకి వెళ్ళాల్సిన పిక్నిక్ స్పాట్ల గురించి తల్లితండ్రులమధ్య బేధాభిప్రాయాలు వచ్చినప్పుడో... ఫలానా చోటుకి వెళ్ళాల్సినదేదో కొంచం ఖర్చుతో కూడినదేదో అయిందనుకోండి, ఇంట్లో ఉండే చిన్నపిల్లాడితో ఈ తండ్రి గారి రిలేషన్ ద్వారా అంటే వాళ్ళ సంబంధం సందేహిస్తున్నట్టు కాదండోయ్ ( బిజినెస్ రిలేషన్లన్నమాట), అత్యవసరపరిస్థితుల్లో ఈ చిన్నపిల్లాడిచేత మూతి ముడిపించేస్తే, గండం గడిచిపోతుందన్నమాట. ఏదో వాడిపేరు చెప్పి, చవకలో లాగించేయొచ్చు. ఇలా కొన్ని కొన్ని మూతిముడుచుకోవడాలున్నాయే వాటిని మెళుకువతో ఉపయోగించుకోవచ్చు.
ఒక వయస్సు వచ్చిన తరువాత మాత్రం, ఏ విషయంలోనైనా కోపం వచ్చినా, తాననుకున్నట్టుగా జరక్కపోయినా ఇదిగో ఈ మూతిముడుచుక్కూర్చోవడమనే అస్త్రమే దిక్కు. ఎవరైనా పట్టించుకుంటారా లేదా అన్నది, ఆ ఇంట్లో తమ స్థోమత, స్థాయీ ల బట్టి ఉంటుంది.ఇంకో విషయం ఇటువంటి పరిస్థితులు మాత్రం సాధారణంగా మగవాళ్ళకే ఎక్కువ వస్తూంటాయి. అలాగని ఆడవారికి రావా అని కాదూ, అంతగా అవసరం ఉండదు వారికి. అంటారు కానీ, ఏదో పేరుకి ఇంటికి పెద్దేకానీ, ముఖ్యమైన విషయాల్లో ఆడవారిదే ఆఖరి మాట అనడంలో ఏమాత్రం సందేహమూ లేదు. ఏదో మొక్కుబడికోసం " మా వారిని అడిగి చెప్తామండీ.." అనడం ఆడవారికి అలవాటు. ఓ ఊతపదంలా వాడుతూంటారు. ఏదో ఫలానా పని చేయాలన్నా, ఫలానా చోటకి వెళ్ళాలన్నా, ఆడవారే కొండొకచో అత్తగారూ కోడలూ కలిసే ఓ నిశ్చయానికొచ్చేస్తారు. ఏదో ఫార్మాలిటీకి ఈ పెద్దావిడ పెద్దాయనతోనూ, ఆ కోడలు తన భర్తతోనూ ఓమాట చెవినేస్తారు. ఆ అర్భకప్రాణులు కూడా ఏదో ఫార్మాలిటీకి తమ ఆమోదముద్ర తెలపాలే కానీ, క్వెర్రీలు వేయకూడదు. అలా ఉంటేనే కదా సర్వేజనా సుఖినోభవంతూ అనుకోవడం మరి !
ఉద్యోగంలో ఉన్నంతకాలమూ ఫరవాలేదు, ఇంట్లో అందరూ తనమాటే వింటున్నారూ అనే దురభిప్రాయంతోనే ఉంటాడు మగవాడనబడేవాడు.అసలు కష్టాలన్నీ ఉద్యోగంలోంచి రిటైరయ్యి కొంపలో కూర్చోవడం ప్రారంభం అయినప్పటినుండే మొదలు. అలాగని అవన్నీ ఏవో ప్రాణాంతకాలని కాదు. ఫలానాది చేయడం వలనో, చేయకపోవడం వలనో, ఈ పెద్దాయన్ని హాస్పిటల్లో చేర్చాల్సిన పరిస్థితి ఏమీ కాదనుకోండి. అందరూ సంతోషంగా ఉంటేనే కదా ఇంట్లో వాతావరణమూ బాగుండేదీ, కానీ ఎక్కడో దేంట్లోనో ఓ తేడా వచ్చేస్తుంది, ఆ పళంగా ఇంటి పెద్దాయనకి కోపం వచ్చేసి మూతి ముడుచుక్కూర్చుంటాడు. కారణం బయటకి చెప్పడానికి పాపం నామోషీ, చెప్పకపోతే ఎలా తెలుస్తుందీ అని ఇంట్లోవారి ఉద్దేశ్యమూ. కానీ నలభై ఏళ్ళు ఈయనగారితో కాపురం చేసిన పెద్దావిడ మాత్రం ఇట్టే పట్టేస్తుంది, ఈయనకి అసలు ఎందుకు కోపం వచ్చిందో. అలాగని ఆవిడమాత్రం తక్కువ తిన్నట్టా, ఆవిడ అనుకుంటుంది, ఇలా అయిందానికీ, కానిదానికీ కోపాలు తెచ్చేసికుని, బిపీలు పెంచేసికుంటే సంసారాలు సాఫీగా గడుస్తాయా అనుకుని, మాటాడక్కూర్చుంటుంది. ఇలా ఆవిడ కూడా కిమన్నాస్థి లా ఉండడం ఆ పెద్దాయనకి ఇంకా చిర్రెత్తుకొచ్చేస్తుంది.
అసలు విషయంలోకి వద్దాం. ప్రతీరోజూ మనవడూ, మనవరాలూ స్కూలికి వెళ్ళిపోయిన తరువాత, కొడుకూ కోడలూ ఆఫీసులకీ వెళ్ళిపోవడంతో, తనూ భార్యా ఏకఛత్రాధిపత్యంగా ఉంటూండేవారు.ఇంట్లో ఉండే ఆ LED Tv మీద ఈయనవే పూర్తిహక్కులు. కావాల్సిన ప్రవచనాలూ, పౌరాణిక చలనచిత్రాలూ ఒకటేమిటి, ఉద్యోగంలో ఉన్నప్పుడు చూద్దామనుకున్నా చూడలేనివన్నీ హాయిగా చూస్తూ కాలక్షేపం చేసేస్తూంటారు. ఆ పెద్దావిడ కూడా, పోనిస్తూ ఏదో వెళ్ళిపోతోందిగా అని ఆవిడకూడా తన పూజాపునస్కారాలతో బిజీ అయిపోతుంది.రోజులన్నీ ఒకలా ఉంటే గొడవే ఉండదూ.మన పెద్దాయనకి మూతిముడుచుకుని కూర్చోడానికి అవకాశం రావొద్దూ.. అప్పుడే చాలారోజులయిపోయిందాయె.ఆయనకూడా ఈ ప్రక్రియని ఆరారగానే ఉపయోగిస్తూంటాడు. మరీ ఓ అలవాటుగా మారిందంటే ఎవరూ పట్టించుకోరేమో అన్న భయం ఈయనకి మాత్రం లేదంటారా? అయినా ఈ "పెద్దరికానికి" ఉన్న ఒకేఒక సదుపాయమే మరి. పిల్లలకి శలవల రూపంలో ఈ అవకాశం కాస్తా రానే వస్తుంది. శలవలొచ్చాయంటే మొట్టమొదట హక్కులు పోయేది ఈ టీవీ లమీదే. వాళ్ళక్కవాల్సిన ప్రోగ్రాములు వాళ్ళు పెట్టుకునే హక్కు వారికి ఈ కలియుగంలో జన్మతహా ఆ భగవంతుడే ఇచ్చేశాడు. ఫలానా టైములో ఫలానా ప్రవచనం వినడమేమో ఈ పెద్దాయనకి అలవాటాయె.స్కూలుకి వెళ్ళడానికి ప్రతీరోజూ పక్కమీదనుండి లేవడానికి పేచీ పెట్టే ఆ పిల్లలేమో, తీరా శలవొచ్చిందంటే మాత్రం తెల్లారేటప్పటికి నిద్రలేచి, ఆ టీవీ ముందర చతికిలపడతారు. ఈ పెద్దాయనేమో స్నానపానాదులు పూర్తిచేసికుని హాల్లోకొచ్చేటప్పటికి రిమోట్ కాస్తా ఆ పిల్లల చేతుల్లో ఉంటుంది. అంతే ఏమీ అనకూడదూ, గట్టిగా మాట్టాడితే కొడుక్కీ, కోడలికీ నచ్చదూ, అలాగని బలవంతంగా ఆ రిమోట్ లాక్కోలేడూ, చేతనయిందేమిటీ-- మూతిముడుచుక్కూర్చోడం. పెద్దావిడ గమనిస్తూనే ఉంటుంది, కానీ ఏమీచేయలేని పరిస్థితీ. ఒకవైపున తన ప్రాణానికి ప్రాణమైన పసిపిల్లలూ, ఇంకోవైపునేమో కట్టుకున్నవాడూ, ఎవరి పక్షం తీసికుంటే ఏం గొడవో. తటస్థంగా ఉండిపోతుంది.ఓసారి బయటకెళ్ళొచ్చారంటే చల్లబడిపోతారని తెలుసు. ఈ పెద్దాయనేమో ఏదో సణుక్కుంటూ బయటకెళ్ళడానికి చెప్పులేసికుంటూంటే, "ఉండండి.. కాఫీ ఇస్తాను త్రాగి వెళ్ళండి.."అంటుంది.
ఏ పార్కులోకో వెళ్ళి చతికిలబడతాడు. లేదా ఓ నాలుగైదుసార్లు పార్కు చుట్టూ నడుస్తాడు. ఏదైతేనేం ఆరోగ్యానికి మంచిదే కదా. ఓ గంట పోయిన తరువాత, ఏదో పేద్ద పనున్నట్టూ, లేదా ఏదో ముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచిస్తున్నట్టూ ఎవ్వరితోనూ మాట్టాడడు.పెద్దావిడకి తెలుసు ఈపెద్దాయన hangover లోనే ఉన్నట్టు. అసలు ఓ టీవీ విడిగా తాముండే గదిలోనే పెట్టించేసికుంటే గొడవే ఉండదుగా, ఆ ఆలోచనమాత్రం ఎవరికీ తట్టదు. అదిమాత్రం ఓ పెద్ద ఖర్చా అంటే అదీకాదూ, LED Tv హాల్లో పెట్టుకోగలిగిన తాహతున్నవారికి విడిగా తల్లితండ్రుల రూమ్ములో పెట్టడం ఓ పెద్ద పని కాదు. ఈ మూతి ముడుచుక్కూర్చోవడాలు కలిసుండేటప్పుడే జరుగుతాయనుకోకండి, పెద్దవారు కారణాంతరాలవల్ల విడిగా ఉంటున్నప్పుడూ జరుగుతూంటాయి. చెప్పేనుగా అమావాశ్యకీ పున్నానికీ మూతి ముడుచుకోకపోతే ఆ అస్థిత్వానికి అర్ధమేవిటీ అనేది కొందరి సిధ్ధాంతం. ఏదో ఆవపెట్టి కూర వండుతుందికదా అని ఏ అరటికాయలో తెస్తే, ఆ పెద్దావిడేమో వాటిని సుళువుగా అయిపోతుందికదా అని ఏ ఓ రెండు కాయలు వేయించేసి కారంజల్లేస్తే ఈయనగారికి ఎక్కడలేని కోపమూ వచ్చేస్తుంది. ఓ మాటా మంతీ లేకుండా భోజనం చేసి లేచిపోవడం. ఏదో తేడా వచ్చిందీ అని పెద్దావిడకీ తెలుసు, కారణమూ తెలుసు.
అయినా కాపరాలు చేస్తూనే ఉంటారు... దేని slot దానిదే. కానీ ఒకవిషయం మాత్రం ఆలోచించుకోవాలి. ఈ మూతిముడుచుకోవడాలనబడేవి పంటి క్రింద రాయిలా ఉండకూడదు. పోపులో శనగబద్ద లా ఉండాలి. చూడండి హాయిగా భోజనం చేసి ఏ పడక్కుర్చీలోనో కూర్చున్నప్పుడు, అకస్మాత్తుగా పోపులో వేసిన శనగబద్ద, ఏ పంటిలోనో ఇరుక్కున్నది కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, సుతారంగా నాలికతో దాన్ని బయటకు తెచ్చుకుని ఆ శనగబద్ద రుచిని ఆస్వాదిస్తాం. అదో మధుర భావన.
మనం వెళ్ళిపోయిన తరువాత మన గురించి నాలుగు మంచిమాటలు చెప్పుకోవాలి అంతేకానీ, "అమ్మయ్యా వెళ్ళిపోయారు లేకపోతే ప్రతీదానికీ గొడవే..." అనిమాత్రం అనుకోకుండా చూసుకోవాలనేదే ఈ వ్యాసం ఉద్దేశ్యం...