సాహితీ వనం - వర ప్రసాద్

sahithee vanam

క జాతి తన సంపదగా భావించే వాటిలో సంగీతము, సాహిత్యము, సాంస్కృతిక వారసత్త్వ సంపద ప్రధాన అంశాలు. సంగీతము దానిని అలా పాడగలిగిన గాయకుడు ఉన్నంత వరకే అలా నిలిచి ఉంటుంది. అంటే త్యాగరాజస్వామి పాడిన కృతులను మనము మరలా త్యాగరాజస్వామి వారి గొంతులో వినలేము ఇప్పుడు. కానీ అయన సాహిత్యాన్ని ఇప్పటికే కాదు సృష్టి నిలిచి ఉన్నంత కాలమూ రుచి చూడగలము. ఆయన శిష్యప్రశిష్య  బృందాలు ఆయన కృతులను, ఆయన బాణీలో పాడి, ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నారు, సరే, కానీ ఆయన స్వరం మనకు లభ్యమా? కాదు కదా! అలాగే అన్నమయ్య, రామదాసు, శ్యామశాస్త్రి , ముత్తుస్వామి దీక్షితులు మొదలైన వాగ్గేయకారులు గానము కూడా, వారి గానము మనకు ప్రాప్తము లేదు, వారి సాహిత్యము మాత్రము ఉంది. కనక సాహిత్యం శాశ్వతముగా నిలిచి ఉంటుంది, సంగీతం కన్నా. ఆధునిక సాంకేతిక విజయాలవలన గాయకుల మ్యూజిక్ రికార్డ్స్ అందుబాటులో ఉన్నాయి, కనుక
కొంత అదృష్టమే, కానీ అవి ‘లైవ్’ కావు కదా, నిజముగా ఎదురుగా పాడుతున్నప్పుడు వినే అనుభూతికి రికార్డు చేసిన దాన్ని వినే అనుభూతికి తేడా ఉండదూ? సాహిత్యము మాత్రము ఆ సాహితీకారుని ప్రత్యక్ష వీక్షణా భాగ్యాన్ని మనకు కలుగజేస్తూనే ఉంటుంది ఎప్పటికీ, ఆ సాహిత్యములో కాలగమనంలో కొన్ని మార్పులూ చేర్పులూ చోటు చేసుకొనవచ్చు, కానీ రచయితతో పాఠకుని సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఈ రకంగా కూడా సాహిత్యము శాశ్వతమైనది, సంగీతము కన్నా, అనుభూతికన్నా ఆలోచన శాశ్వతమైనట్టు, ఎందుకంటే, సంగీతం అనుభూతి ప్రధానమైనది, సాహిత్యము ఆలోచనా ప్రధానమైనది అని ప్రారంభములో చెప్పుకున్నాము కదా!

సమస్త భాషలకూ ‘సంస్కృతం’ తల్లి. అది దేవ భాష, మన భారత జాతీయ భాష. సంస్కృత సాహిత్యములో ఐదు మహాకావ్యాలు అని విద్వాంసులు నిర్ణయించారు. అందులో మూడు కవికులగురువు కాళిదాసు రచించినవే. మిగిలిన రెండిటిలో ఒకటి భారవిది, ఇంకొకటి మాఘునిది. కాళిదాసుని రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశము, భారవి రచించిన కిరాతార్జునీయం, మాఘుని శిశుపాలవధం ఈ ఐదూ సంస్కృతములోని మహాకావ్యాలు. వీటిని చదవకుండా సంస్కృత పండితుడు కారు ఎవరూ. అలాగే తెలుగులో అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము, రామరాజభూషణుడు (భట్టుమూర్తి)  రచించిన వసుచరిత్రము, శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి రచించిన ఆముక్తమాల్యద, తెనాలి రామకృష్ణుడు రచించిన పాండురంగ మహాత్మ్యము, ఈ నలుగురికీ ముందు తరం వాడైన మహాకవి శ్రీనాధుడు రచించిన శృంగార నైషధం ఐదు మహాకావ్యాలు. ఈ ఐదింటిలో కూడా మనుచరిత్రము, వసుచరిత్రము, ఆముక్తమాల్యద, పాండురంగమహాత్మ్యము మాత్రమే స్వతంత్ర తెలుగు కావ్యాలు. శృంగార నైషధము హర్షుడు సంస్కృతములో రచించిన నైషధము అనే కావ్యానికి తెనుగుసేత. ఈ ఐదు కావ్యాలూ చదవకుంటే ఎవరైనా సరే, తెలుగు సాహిత్యమును చదివిన పండితుడు అనిపించుకొనలేడు అని మహాకవుల, పండితుల, విమర్శకుల నిర్ణయము.

పండితులు అనిపించుకోవడానికే కాదు, తెలుగువారు అని పిలిపించుకోవడానికి కూడా ఈ ఐదింటినీ కనీసమాత్రంగా అయినా తెలుసుకొనడం అవసరం. మనము ఫలానా ఊరివారము అని చెప్పుకోడానికి ఆ ఊరులో మనను తెలిసినవారు కొందరు, మనకు తెలిసినవారు కొందరు ఉండాలి కదా. లేకుంటే మనకా ఊరులో గుర్తింపు ఎక్కడుంది? మన ఊరు అని చెప్పుకుని ప్రయోజనమేముంది?

తెలుగు నేల ఒక అందమైన పల్లె. తెలుగు భాష ముచ్చటైన తోట. ఆతోటలో ఎన్ని పూలచెట్లు! ఎన్ని సౌరభాల ప్రవాహాలు! ఎన్ని విరులు, ఎన్నెన్ని మలయపవనకవనఝరులు! ఆ తోటలో విహరించకుంటే, ఆ విరులసురలు రుచించకుంటే, తెలుగుదనం ఎక్కడ, తెలుగు జిలుగు పలుకుబడుల వెలుగు ధనం ఎక్కడ? కనుక మన సాహిత్య సంపదను కనులారా చూసుకోవడానికి భువన’విజయనగరానికి’ బయల్దేరడం, నలుదిక్కుల గుమాయించిన తెలుగు తోట పరిమళాల పస చూడడం, తుంగభద్రా సముత్తుంగ తరంగ సంగతుల హంగుతో తీయ తీయని తెనుగు వీణియ ధ్వానం చెవులు నిగిడించి ఆలకించడం, తెలుగుసాహితీ వనంలో సేదదీరడం, అప్పుడు కదా నేను తెలుగువాడిని అని సంబరంగా చెప్పుకోడం! ఇంకా ఆలస్యమెందుకు? బయల్దేరదాం విజయనగర భువనవిజయ వీధులలో విందులకు, తెలుగుపద్యకావ్యకన్య  సోయగాల పొందులకు, ఆంధ్రకవితా పితామహుని అల్లికజిగిబిగి పసందులకు.

అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ప్రాణమిత్రుడు, గురుతుల్యుడు సాహిత్య రంగంలో. శ్రీకృష్ణదేవరాయల జీవితం ఎక్కువ గడిచింది అల్లసానిపెద్దన సాంగత్యములో, ఆయన సింహాసనాన్ని చేపట్టకముందునుండి కూడా. శ్రీకృష్ణదేవరాయలకు సలహాలు, సూచనలు కూడా ఇచ్చేవాడు కనుకనే పెద్దనామాత్యుడు అని పిలువబడ్డాడు.

పెద్దన బళ్ళారి ప్రాంతంలోని దోపాడు పరగణాలోని దోర్నాల గ్రామమువాడు అనీ, ప్రస్తుత వై.ఎస్.ఆర్. కడపజిల్లాలోని కోకట గ్రామమునకు  చెందినవాడు అని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పదిహేను, పదహారు శతాబ్దముల మధ్యకాలములో జీవించిన వాడు అని చారిత్రక పరిశోధకుల అభిప్రాయము. (శాలివాహన శకము1430 లో జన్మించాడని పరిశోధకుల అభిప్రాయము)

స్వారోచిష మనుసంభవము అనేది పూర్తి పేరుగా కలిగి, మనుచరిత్రముగా అందరికీ సుపరిచితమైన తెలుగులోని ప్రథమ స్వతంత్ర కావ్యానికి మార్కండేయ పురాణము లోని స్వారోచిష మనువు కథను ఎంచుకున్నాడు పెద్దన. అలా ఎంచుకొనడానికి కూడా శ్రీకృష్ణదేవరాయల అభ్యర్ధనయే కారణము అని మనుచరిత్రము కావ్యఅవతారికలో చెప్పాడు.

భువనవిజయము అని పేరు కలిగిన (సాహితీ)సభలో సభాపీఠికను అధిష్టించి ఉన్న రాయలు

సప్తసంతానములలోఁ బ్రశస్తిఁ గాంచి
ఖిలము గాకుండునది ధాత్రిఁ గృతియ కానఁ
గృతి రచింపుము మాకు శిరీషకుసుమ
పేశల సుధామయోక్తులఁ బెద్దనార్య!

అని కోరాడు రాయలు. సత్కుమారునికి జన్మనివ్వడం, చెరువులు త్రవ్వించడం, ధనమును (నిధి) సంపాదించడం, ఉత్తమ (ప్రబంధ) రచన చేయడం, అగ్రహారములను నిర్మించడం, దేవాలయములను నిర్మించడం, వనములను నిర్మించడం ఇవి సప్తసంతానములని ఆర్యోక్తి. వ్యక్తి కాలగర్భములో కలిసిపోయినా ఆతని స్మృతిని ప్రపంచం లో నిలబెట్టేది సంతానం. ఈ ఏడు రకాల సంతానములలో కూడా నశించిపోనిది కృతి, కావ్యము. తన కుమారుడు మంచివాడే అయినా వాడికి పుట్టిన వాళ్ళు వెధవలు అయితే ఆ వంశము మొత్తాన్నీ తిట్టిపోస్తారు, కొడుకు పుట్టెనేని గుణవంతుడాయెనా వాని పేరు వంశ వర్ధనుండు, కొడుకు పుట్టెనేని గుణ హీనుడాయెనా వాని పేరు వంశ నాశకుండు’ అన్నారు కదా. కనుక కొడుకుల వలన, కొడుకుల కొడుకుల వలన సత్కీర్తి శాశ్వతము కాకపోవచ్చు. చెరువులు ఎండిపోవచ్చు. ధనము కరిగిపోవచ్చు లేదా దొంగలపాలు కావొచ్చు, అగ్రహారాలు నిర్మానుష్యాలు కావచ్చు, దేవాలయాలు శిథిలములు కావొచ్చు, వనములు వాడిపోవచ్చు కానీ సత్కృతి, ఉత్తమ కావ్యము చరిత్రలో నిలిచి ఉంటుంది, కనుక ఒక ఉత్తమ కృతిని మాకు రచింపవయ్యా, దిరిసెన పూలవంటి నాజూకైన, సొగసైన, అమృతపు సోనలలాంటి పలుకులను చిలికే పెద్దనార్యా! అని కోరాడు రాయలు.

హితుఁడవు చతురవచోనిధి
వతుల పురా ణాగ మేతిహాస కథార్థ
స్మృతి యుతుఁడ వాంధ్ర కవితా
పితామహుఁడ వెవ్వరీడు పేర్కొన నీకున్?

నా హితుడవు. కనుక నా పేరును చరిత్రలో చిరస్థాయిగా చేసేవారు నీకన్నా ఎవరున్నారు నాకు? చతురమైన మాటల నిధివి, సాటిలేని పురాణ, ఆగమ, ఇతిహాస కథల, అర్ధముల ఎరుక కలిగినవాడివి, ఆంధ్రకవితా పితామహుడవు, నీకు సాటి ఎవరున్నారు? కనుక నీవే నన్ను చరిత్రలో చిరస్థాయిగా నిలపగలిగే కావ్య రచనా దక్షతను కలిగినవాడవు!

మనువులలో స్వారోచిష
మను సంభవ మరయ రససమంచిత కథలన్
విన నింపు, కలిధ్వంసక,
మనఘ! భవ చ్చతురరచన కనుకూలంబున్

స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, భద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి అనే వారు పద్నాలుగురు మనువులు.వారందరిలోనూ స్వారోచిష మనువుకు సంబంధించిన కథలు రసవత్తరముగా వినడానికి ఇంపుగా ఉంటాయి, కలి దోషాలను పరిహరిస్తాయి, అంతేకాదు, నీ చతుర సరస రచనా శైలికి అనుకూలముగా ఉంటాయి కనుక మార్కండేయ పురాణ కథా ప్రకారముగా ఆ కథను కమనీయ కావ్యముగా చెప్పవయ్యా అని ఒక బంగారు పళ్ళెరములో ఉంచిన కర్పూర తాంబూలాన్ని అందించిన రాయల ఆహ్వానాన్ని మన్నించిన పెద్దన చిందించిన ప్రబంధ కావ్యసుధ మనుచరిత్రము. మనుచరిత్ర కావ్యాన్ని ప్రబంధ శైలిలో అందించాడు పెద్దన. ఆ నాటి రాజులు ప్రబంధ కథలను వ్రాయడంకోసం తాంబూలాలు ఇచ్చేవారు, ఈనాటి పోతరాజులు వధలుచేయడం కోసం తాంబూలాలు ఇస్తున్నారు! తమ ప్రత్యర్ధులను హత్యచేయడంకోసం నాయకులూ, పెత్తందారులు, ముఠానాయకులు  కిరాయి హంతకులకు 'సుపారీ' ఇవ్వడం తాలూకు వార్తలను మనము వింటూనే ఉన్నాము కదా!

నగర, సముద్ర, ఋతు, పర్వత, సూర్యోదయ, చంద్రోదయ, వనవిహార, జలవిహార, మద్యపాన, సురత, విప్రలంభ, ప్రయాణ, వివాహ, పుత్రోదయ, మంత్ర, ద్యూత, సమర, దోర్వీర్య(బాహుబల) వర్ణనలు అనే పద్దెనిమిది వర్ణనలతో కూడిన ఉదాత్త కావ్యాన్ని ప్రబంధము అన్నారు.

కావ్య అవతారికలో శ్రీకారముతో, శార్దూల వృత్తముతో, యిష్టదేవతాస్తుతితో ప్రారంభించడం కావ్య సంప్రదాయము. అలా ప్రారంభించి, విష్ణువును, శివుడిని, బ్రహ్మను తన కృతిపతి ఐన శ్రీకృష్ణదేవరాయలను శుభ దృష్టితో చూసి, అభీష్ట శుభములను ఇచ్చి, ఉజ్జ్వలమైన వైభవాన్ని ప్రసాదించుమని కోరి, గణపతిని ప్రార్ధించాడు పెద్దన. మనుచరిత్రము ఆరు ఆశ్వాసముల గ్రంధము. ఆరు ఆశ్వాసాలలోని అన్ని పద్యాలనూ పరామర్శ చేసుకొనలేము కనుక విశేష చమత్కారములున్న పద్యాలను మాత్రమే చర్చించుకుందాము. త్రిమూర్తులను అద్భుతమైన మూడు పద్యాలతో ప్రార్ధించి ఒక అద్భుతమైన పద్యములో గణపతిని ప్రార్ధించాడు.

పూర్వకవులలో పాండితీ చమత్కారానికన్నా వేదాంత, ఆధ్యాత్మిక రహస్యముల సూచనలు ఎక్కువ. ప్రబంధ కాలమునకు వచ్చేసరికి పాండితీ వైదుష్యానికి పెద్ద పీట వేయడం జరిగింది, రాజాశ్రయము ఎక్కువ కావడము, మహా విద్వాంసులు, పండితులు పోటీ పడడం వలన. అలా అని వేదాంత, ఆధ్యాత్మిక అంశాలను విస్మరించడము జరుగలేదు.

అంకముఁజేరి శైలతనయా స్తన దుగ్ధములానువేళ బా
ల్యాంక విచేష్టఁ దొండమున నవ్వలి చన్ కబళింపఁ బోయి, యా
వంకఁ గుచంబు గాన కహి వల్లభ హారముఁ గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గజాస్యునిఁ గొల్తు నభీష్టసిద్ధికిన్

అమ్మవారి ఒడిలో చేరి తల్లి స్తన్యాన్ని తాగే వేళలో బాల్యపు బుద్ధిచేత తన తొండము తో అటు ప్రక్కన వున్న స్తనాన్ని కూడా పట్టుకొనబోయాడు  గణపతి. అయితే అమ్మవారి ఇంకొక సగం అయ్యవారు, పరమ శివుడు కనుక, ఆయన మెడలో వున్న పాము తగిలింది ఆ తొండానికి. ఆయన ఏనుగు ముఖం కలిగిన వాడు కనుక, ఏనుగులు సహజంగా స్నానానికి చెరువుల్లోకి, సరస్సుల్లోకి దిగినప్పుడు అక్కడ వున్న తామర తూడులను వూరికే వినోదం కోసం పీకి పారేస్తూ వుంటాయి కనుక, ఈ పామును పొడుగ్గా వుండడం చేత, తామర తూడు అనుకుని, విచ్చుకుని  వున్న పడగను విచ్చిన తామర పువ్వు అనుకుని లాగ బోయాడు గణపతి. అటువంటి తన బాల్య చేష్టలతో తల్లి దండ్రులకు ఆనందాన్ని కలిగిస్తున్న ఆ గణపతిని నా అభీష్ట సిద్ది కై ప్రార్ధిస్తాను అని తన 'మనుచరిత్ర' ప్రబంధాన్ని ప్రారంభించాడు అల్లసాని పెద్దన.  మనుచరిత్రం లో ముందు ముందు వరూధిని తన  భ్రమ కారణంగా మాయా ప్రవరాఖ్యుడి వలలో పడి, భావి కథకు మూలాన్ని అందిస్తుంది, కనుక ఆ సూచకంగా కూడా ఈ 'భ్రాంతిమద లంకారాన్ని' అల్లసాని పెద్దన ఉపయోగించాడు అని పండిత విమర్శకుల అభిప్రాయం!

సమం దేవి స్కంద ద్విప వదన పీతం స్తన యుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం
యదాలోక్యాదాశంకా కులిత హృదయో హాస జనకః
స్వ కుంభౌ హేరంబః పరి మృశతి హస్తేన ఝటితి

ఈ ఆది శంకరాచార్యుల  వారి శ్లోకప్రభావం 'అంకము జేరి' పద్యంపైన ఉంది. ప్రబంధ కాలంలో కవులు పాండితీ ప్రకర్షకూ, చమత్కృతికీ దొరికిన ఏ అవకాశాన్నీ, సందర్భాన్నీ వదలుకోలేదు. ఇదే కాదు, భట్టుమూర్తి  'దంతా ఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయం గ్రాహమున్..'అనే పద్యం కూడా ఈ కోవలోకి చెందినదే! ఆ పద్యాన్ని వసుచరిత్రమును రుచి చూసేప్పుడు తెలుసుకుందాము పూర్తిగా. ఈ రెండు పద్యాలపై  పైన చెప్పిన సౌందర్య లహరి లోని ఆది శంకరాచార్యుల వారి శ్లోక ప్రభావం వున్నది.  అంతకుముందు ఈ భావంతో చెప్పిన శ్లోకాలు ఎక్కడ వున్నట్టు కనబడవు. అదీ కాక అప్పటి కవులు రచయితలు కాకముందు ముందు చాలా గొప్ప పాఠకులు. కనుకనే తరవాత గొప్ప రచయితలు కాగలిగారు! ఆదిశంకరాచార్యుల వారి సాహిత్యాన్ని చదువుకొనకుండా ఎవడైనా ఎలా పండితుడౌతాడు  కనుక?

రెండు ప్రక్కలా సమానంగా కుమార స్వామికీ, గణపతి కీ  స్తన్యాన్ని ఇస్తున్న , నిరంతరమూ క్షీర ధారలను స్రవిస్తున్న నీ రెండు వక్షోజములూ నా (మా) యొక్క ఖేదమును హరించును గాక! ఈ రెండవ ప్రక్క కుచమును (తను తాగుతున్న కుచమును గాదు!) చూసిన గణపతి గున్న ఏనుగు కుంభ స్థలము వలె వున్న ఆ కుచమును జూసి, తను గున్న ఏనుగే కనుక (పాలు తాగుతున్న పిల్లాడు కదా మరి), అది అమ్మవారి స్తనమా ..లేక తన కుంభ స్థలమా?? అనే అనుమానంతో తన కుంభ స్థలం సరీగా వున్నదా లేదా..తన తలపై వున్నదా లేదా..అనే అనుమానంతో..అమ్మవారి స్తనమును తడిమి చూశాడుట చూపరులకు నవ్వు వచ్చేలాగా! అసలే ఒకసారి తల తెగితే అతి కష్టం మీద అతుక్కున్నది కదా అంతకు మునుపు. అదీ ఇక్కడి మరొక చమత్కారం! అందుకనే ఎందుకొచ్చిన కర్మరా  అనే భయంతో అన్నట్లు, పసి పిల్లలు పాలు తాగేప్పుడు సహజంగా తల్లుల వక్షోజములను తడుముతూ, ఆడుకుంటూ పాలు తాగడం లోక సహజం కనుక కూడా, బాల గణపతి రెండవ ప్రక్కన వున్న స్తనమును అనుమానం తో తడిమి చూస్తుంటే చూపరులకు నవ్వు వస్తున్నదట!

ఇక్కడి ఇంకొక రహస్యం ఆది శంకరాచార్యుల వారు 'సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏక మాపాతమధురం, అన్యదాలోచనామృతం' అనే శ్లోకభావాన్ని ఇక్కడ ధ్వనింప జేస్తూ, అమ్మవారి సారస్వత మూర్తి ఐన సరస్వతీ దేవిని ఇక్కడ దర్శింపజేశారు!

సంగీత సాహిత్యాలు రెండూ సరస్వతీ దేవి రెండు స్తనములు. అందులో ఒకటి, అంటే సంగీతం ఆపాత మధురం. ఇంకొకటి, అంటే సాహిత్యం, ఆలోచించిన కొద్దీ రహస్యాలు తెలుస్తూ అమృత తుల్యం గా వుంటుంది! సంగీతాన్ని ఆస్వాదించడానికి సంగీత రహస్య విశేషాలు తెలియనక్కరలేదు! శివ రంజని వింటుంటేనే  విషాదం తెలుస్తుంది. అలాగే ఇతర అనేక రాగాలు కూడా ఆ 'మూడ్' ను తెలియ జేస్తాయి, ఏ మూడ్ లియకున్నా'శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణి:', శిశువులు, పశువులు, పాములు కూడా గాన రసాన్ని గ్రహించ గలుగుతాయి! సాహిత్యం అలా కాదు. కేవలం వినగానే ఉత్తి వచనం ఆకర్షించదు . వినాలి, అర్థం చేసుకోవాలి, అనుభూతి చెందాలి, విమర్శించుకోవాలి. అప్పుడు ఆనందం కలుగుతుంది! ఇంతవరకూ ఇంతకుముందు కొద్దిగా చర్చించుకున్నదే. ఇక్కడే అసలైన రహస్యాన్ని నిక్షిప్తం చేశాడు ఆది శంకరుడు.

కుమారస్వామి కుజుడికి అధిపతి. కుజుడు సంగీత శాస్త్ర అధిపతి. కుమార స్వామిని ఉపాసించడం వలన, కుజుడి అనుగ్రహం వలన సంగీత విద్యలో అభినివేశం, అధికారం కలుగుతాయి! గణేశుడు సాహిత్య జ్ఞానానికీ, జ్ఞానానికీ, బుద్ధికీ, విచక్షణకూ, బుధుడికీ అధిపతి! కనుకనే, గణపతికి అనవసరమైన ఆలోచన ఎక్కువై, ఇలా అనుమానం వచ్చి అమ్మ స్తనాన్నీ, తన కుంభ స్థలాన్నీ అలా తడిమి చూసుకున్నాడని ఆదిశంకరులు అన్నమాట యిది!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి