నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
______________________________________________________________________
ఆస్ట్రియాలోని ఇద్దరు టీనేజర్స్ మంచు కురిసే ఓ రాత్రి 43 కార్లలోని రేడియోలని, టేప్ రికార్డ్ ర్లని దొంగిలించారు. అయితే వారు ఇట్టే పోలీసులకి పట్టుబడ్డారు. కారణం? మంచులోని వారి పాదముద్రలని అనుసరించి వాళ్ళింటికి వెళ్ళారు పోలీసులు. వాళ్ళ ఇంటినిండా దొంగిలించిన సామాగ్రి చాలా దొరికింది.
విస్ కాన్ సిన్ లోని ఓ దుకాణంలోకి ఓ దొంగ కత్తితో వెళ్ళి, అక్కడున్న ఓ చిన్నపిల్ల కంఠానికి కత్తిని ఆనించి, తనకి ఆకలిగా ఉందని, తినడానికేదైనా ఇవ్వమని చెప్పాడు. ఆ పిల్లనేంచేయద్దని, తను లంచ్ కోసం తెచ్చుకున్న చికెన్ సేండ్ విచ్ మాత్రమే తన దగ్గర ఉందని ఆ దుకాణం యజమాని జస్ పాల్ సింగ్ చెప్పాడు. అతనిచ్చిన ఆ సేండ్ విచ్ తిని ఆ దొంగ దుకాణం నుంచి తృప్తిగా వెళ్ళిపోయాడు. ఆ దుకాణం కేష్ బాక్స్ లో ఆ సమయంలో 3200 డాలర్లున్నా, ఆ దొంగ డబ్బు అడగలేదు.
"అడిగితే డబ్బిచ్చేసి ఉండేవాడిని" అని పోలీసులకి చెప్పాడు జస్ పాల్ సింగ్.