పఠాభి - భావకవిత్వంలో ఒక వి(సు)లక్షణ కవి - టీవీయస్. శాస్త్రి

Pattabhi Rami Reddy Tikkavarapu Biography

ఈ రోజు మీకు, తెలుగుదేశం పూర్తిగా మరచిపోయిన ఒక గొప్ప భావకవిని పరిచయం చేయటానికి గర్విస్తున్నాను."వచన పద్యమనే దుడ్డు కర్రల్తో-పద్యాల నడుముల్ విరగ దంతాను" అని నిక్కచ్చిగా చెప్పిన ఘనుడాయన.ఆయనే శ్రీ పఠాభి. తెలుగు కవిత్వానికి కొత్త రక్తం ఎక్కించాలనే తపనతో భావకవిత్వానికి నూతన వరవడిని దిద్దారు.ఆ ఉద్దేశ్యంతోనే తన పేరును కొత్తగా"పఠాభి"గా మార్చుకొని భావకవిత్వానికి కొత్త సొగసులు కూర్చాడు . ఆయన పూర్తి పేరు శ్రీ తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి గారు.వీరు 19-02-1910 న  నెల్లూరులో శ్రీ రామిరెడ్డి,సుదర్శనమ్మ అనే దంపతులకు జన్మించారు.

విద్యాభ్యాసం----1933 దాకా నెల్లూరులోని వీ.ఆర్. హైస్కూల్ లో,మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటర్మీడియట్(1933 -35 ),శాంతి నికేతన్ లో బీ.ఏ(లెక్కలు,ఇంగ్లీష్,ఆర్ధిక శాస్త్రం.) వీటన్నిటినీ మించి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విద్యార్ధి(1935-37 ).అటు తర్వాత,కలకత్తా విశ్వ విద్యాలయంలో యం.ఏ,అటుపై న్యూయార్క్ ,కొలంబియా విశ్వవిద్యాలయంలో యం.ఏ(ఇంగ్లీష్),మ్యూజియం అఫ్ మోడరన్ ఆర్ట్ లో 'కోర్సు ఇన్ మోషన్ పిక్చర్ అప్రిసిఏషన్'.

అమెరికాలో ఉండగా,దాని మిత్ర రాజ్యమైన బ్రిటన్ కు వ్యతిరేకంగా భారతదేశం స్వాతంత్ర్యపోరాటం జరుపున్నందుకు, నిర్బంధ సైనిక విధాన్ని తిరస్కరించారు.

వివాహం----స్నేహలతను ప్రేమించి పెళ్ళాడారు.శ్రీమతి స్నేహలతారెడ్డి గారి తల్లి బెంగాలీ వనిత,తండ్రి తమిళుడు.వీరికి ఇద్దరు సంతానం.అమ్మాయి పేరు నందన ఇషబెలియా,అబ్బాయి పేరు కోణార్క మనోహర్.

రాజకీయ జీవితం--భార్యా భర్తలిద్దరూ సోషలిష్టు నాయకుడు స్వర్గీయ డాక్టర్ రాంమనోహర లోహియాకు సన్నిహిత అనుచరులు.శ్రీమతి స్నేహలతారెడ్డి శ్రీ జార్జి ఫెర్నాండెజ్ కు అతి సన్నిహితురాలు.ఎమర్జెన్సీ కాలంలో ఈమెను తీహార్ జైలులో నిర్బంధించారు.జైలు నుండి  విదులైన తరువాత అనారోగ్యం పాలై మరణించారు.

సినీ రంగ జీవితం---కన్నడంలో మొదటిసారిగా,నిర్మించి దర్శకత్వం వహించిన 'సంస్కార'అనే సినిమాకు 1970 లో ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి స్వర్ణ పతకం(ఫాల్కే అవార్డు) ,లొకార్నో చలన చిత్రోత్సవంలో కంచుపతకం,మన్ హైం చలన చిత్రోత్సవంలో కాతొలిక్, ప్రొటెస్టంట్  జ్యూరి అవార్డులు గెలుచుకున్నది. అది ఒక అద్భుతమైన సినిమా.అందులో ఆయన శ్రీమతి స్నేహలతారెడ్డి గారే నాయికగా నటించినట్లు నాకు గుర్తు.తెలుగులో శ్రీ కే.వీ.రెడ్డి గారితో భాగస్వామిగా పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీ కృష్ణార్జున యుద్ధం,భాగ్యచక్రం అనే సినిమాలను నిర్మించారు.సంస్కార సినిమాకు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు సహాయకుడిగా పని చేసినట్లు గుర్తు.వారిద్దరూ మంచి స్నేహితులు.కన్నడ సినీ చరిత్రలో మొదట రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్న చిత్రం'సంస్కార'.చాలా గొప్ప సినిమా.ఇది ఒక ప్రసిద్ధ కన్నడ రచయిత వ్రాసిన నవలను ఆధారంగా చేసుకొని నిర్మించిన చిత్రం.ఆలోచన రేకెత్తించే ఈ గొప్ప చిత్రాన్ని చూసే అదృష్టం నాకూ కలిగింది.

రచనా వ్యాసంగం-- చలాన్నీ శ్రీ శ్రీ ని బాగా ఆకళింపు చేసుకున్నాడు. తన 20 వ ఏటనే 'ఫిడేలు రాగాల డజన్'(1939), నీలగిరి నీలిమలు(1950) అనే వాటిని ముద్రించారు."పద్యానికి ,గద్యానికి అంట కట్టి ,గ్రాంధికానికి వ్యావహారికానికి పెళ్లి చేసి ,తెలుగు ,ఇంగ్లీష్ కు పొత్తు కలిపి కవిత్వం రాస్తాను .వచన కవిత్వం అనే పేరుతో పిలుస్తా .వాటిని దుడ్డు కర్రల్ని చేసి పద్యాల నడుము విరగ గొడ్తా"అన్నాడు .తన కవిత్వాన్ని గురించి ఈ విధంగా ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. "నా కవిత్వం  నూతనములో బహు నూతన కవిత్వం "అని గర్వంగా చెప్పుకున్నాడు ."బోగం పిల్ల చనులు బూందీ పొట్లాల లాగా ‘’ఉన్నాయి"అన్నాడు. విశ్రుంఖల  శృంగారాన్ని వ్రాసి వినుతికెక్కాడు .బోగం దాన్ని"సంఘానికి వేస్ట్ పేపర్ బాస్కెట్"గా వర్ణించి పాఠకులను ఆలోచనలలో పడేసాడు.

ఆముద్రితాలు--కయిత నా దయిత,పఠాభి పన్ చాంగం.

హాబీ- -గణిత శాస్త్రం.
వీరు సహజంగానే గొప్ప ధనవంతులు. గొప్ప కళాప్రియులు.

వీరిని గురించి ప్రముఖుల అభిప్రాయాలు--

చలం గారు--తెలుగుదేశాన ఈ రాగాల డజను, డజను దెబ్బలుగా,అరడజను పూలుగాను,వేయి కన్నీటి చుక్కల వేడిగాను,నూరు వెక్కిరింపుల నాలికల్ జాచినట్లు,కలవర పరచగలవు.

బెజవాడ రామచంద్రారెడ్డి గారు---రాగాల డజన్ కాదు,దీన్ని రోగాల డజన్ అనాలి.

విశ్వనాధ సత్యనారాయణ గారు--పఠాభి అనే కవి ఉన్నాడు.ఆ పేరులోనే అతని లక్షణం తెలుస్తుంది కదా!పట్టాభి అన్నది పఠాభి అయింది.రెండు టాలు ఎందుకని ఒత్తు ఠా పెట్టాడు.వీళ్ళందరూ పూర్వ కవిత్వ సంప్రదాయాలమీద దాడి ఎత్తిన వాళ్ళు. పూర్వ కవిత్వంలో చంద్రుడూ,మలయానిలం,మన్మధుడు,కోకిల వీటిని ఆశ్రయించి వాళ్ళు పద్యాలల్లుతారు.ఈ కొత్త కవులకు అవంటే మంట.ఆయన విప్లవం అంతా పూర్వ కవితా సమయాలమీద.

శ్రీ శ్రీ --- పఠాభి  'ఫిడేలు రాగాలు డజన్ 'నన్ను చాలా ప్రభావితం చేసిందని ఆరుద్ర స్వయంగా ఒప్పుకుంటాడు.ఛందస్సుల మీద  పఠాభి కున్నంత అధికారం శిష్ట్లాకు గాని,నారాయణబాబు గానీ లేదు.ఈనాడు ఆరుద్ర ముద్ర అంటారే(ఫోర్జరీ అనబోను గాని),అది నిస్సందేహంగా పఠాభి ముద్రే!అది దాటి ఆరుద్ర ఇప్పటికీ ఇంకా బయట పడలేదు.

ఈ 'ఫిడేలు రాగాల డజన్' కు ముందు మాటగా 'ఇంట్రో' అనే పేరు మీద శ్రీశ్రీ క్లుప్తంగా పఠాభి కవితారీతులని గొప్పగా కొనియాడాడు.ఒక్క ఈ చిన్ని పుస్తకంతో సాంప్రదాయకవుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన పఠాభి 'ఫిడేలు రాగాల డజన్'నుండి ఒక కవితను మీకోసం ఈ క్రింద తెలియజేయుచున్నాను.

ఆత్మకథ

ఎవర్నని యనుకొంటారో మీరు నన్ను!
ఏను పఠాభిని ......
కాంగ్రేసు రాష్ట్రపతి స్థానానికోసం
బాబూ సుభాసుబోసుతో పోటీ చేసి
ఓడిపోయిన డాక్టర్ పట్టాభిని
గాన్నేను,మరో పఠాభిని;
అయితే అతగాడికున్నంత
ఉపజ్న  నాకున్ లేదని తలపకండీ,
గాంధీటోపీ జహ్వరుజాకట్ 
మీసాలు   లేనంత మాత్రాన!
పయిజమ్మాలు వేస్తాను కాబట్టి
నన్ను మీరు షోదాయని సోషలిష్టని
తిట్టబోకండి, ప్రఖ్యతంగానున్న
కవిన్నేను;
నాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందున టెలిస్కోపులు
మయిక్రోస్కోపు లున్నవి.
నా ఈ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరుగదంతాను,
చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని
చాలా దండిస్తాను;
ఇంగ్లీష్ భాషాభాండారంలో నుండి
బందిపోటుం జేసి కావాల్సిన
మాటల్నుదోస్తాను.
నా యిష్టం వచ్చినట్లు జేస్తాను
అనుసరిస్తాను  నవీనపంథా; కానీ
భావకవి  న్మాత్రము కాన్నే,నే
నహంభావకవిని.

ఈ పుస్తకం మొదటి ముద్రణ 1939 లో జరిగింది.తర్వాతి కాలంలో ఈయన ఎక్కువ కవితలు వ్రాయలేదు.కారణం మాత్రం తెలియదు.ఈ పుస్తకంలోని పన్నెండు కవితలూ అద్భుతమైనవి.ఆయన "పఠాభి పన్ చాంగం"నుండి కొన్ని 'పన్'లు--- ఉద్యోగుల్లో రెండు రకాలు –ఒకరు చేసే వారు –మరొకరు కాజేసే వారు.కాంగ్రెస్ వాళ్లకు వడకటం తగ్గి –ఏకటం హెచ్చింది. జిహ్వ పని వాదించుటే కాదు –ఆస్వాదించుట కూడా! కవితా పట్టాభిషిక్తుడు పఠాభి.తెలుగు భావకవిత్వానికి కొత్త అందాలను కూర్చిన ఈ వి(సు)లక్షణ కవి  May 6, 2006 న మరణించారు.

పఠాభికి శ్రద్ధాంజలి ఘటిస్తూ....

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి