సాహితీ వనం - వర ప్రసాద్

sahithee vanam

ణపతిని ప్రస్తుతించిన తర్వాత ఒక అద్భుతమైన పద్యంలో సరస్వతీదేవిని ప్రార్ధించి, తన గురువైన ‘శఠకోపయతి’ని స్తుతించి, మహానుభావులైన పూర్వ సంస్కృత కవులను ప్రస్తుతించి, నన్నయ్యను, తిక్కన్న సోమయాజిని, ఎర్రనను భక్తితో తలచుకుని, ‘కు’కవులను త్రుణీకరించి  కొనసాగించాడు పెద్దన. ప్రబంధకవుల కాలమునుండీ మొదలైన మరొక విశేషాంశము ‘కు కవి నిరాకృతి’. కవులము అనుకుంటూ ఏమాత్రమూ భావము, భావుకత్వము, జ్ఞానము, విజ్ఞానము, పాండిత్యము, పూర్వ కావ్య పరిచయమూ లేని అసమర్ధులు ఐనప్పటికీ తమను తాము సర్వసమర్ధులము అనుకునే ‘తాటాకు దండుగ కావ్యకర్తలను’ కవులను హేళన చేయడం, ఆ మిషతో తమకు పోటీదారులైన కవులను నర్మగర్భంగా హేళన చేయడం కుకవి నిరాకృతి. సరస్వతీ ప్రస్తుతి చేసిన అద్భుతమైన పద్యాన్ని చవిచూసి ముందుకు సాగిపోదాము.

చేర్చుక్కగానిడ్డ చిన్నిజాబిల్లిచే
సిందూర తిలకంబు చెమ్మగిల్ల
నవతంస కుసుమంబునం దున్న యెలదేఁటి
రుతి కించిదంచిత శ్రుతుల నీన
ఘనమైన రారాపు చనుదోయి రాయిడిఁ
దుంబీఫలంబు తుందుడుకుఁ  చెంద
దరుణాంగుళిఛ్ఛాయ దంతపుసరకట్టు
లింగిలీకపు వింతరంగు లీన

నుపనిషత్తులు బోటులై యోలగింప
బుండరీకాసనమునఁ గూర్చుండి మదికి
నించు వేడుక వీణ వాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుఁగాత!

తన పాపట బిళ్ళగా అలంకరించుకున్న జాబిల్లి యొక్క వెన్నెలల చెమ్మ వలన తన నుదుటి సిందూరము చెమ్మగిల్లుతుండగా, సిగలోనున్న పుష్పములోనున్న తుమ్మెద చేస్తున్న సన్నని రొద తన వీణా నాదానికి శృతి పడుతుండగా, ముందుకు వంగుతూ, వాలుతూ వీణను వాయిస్తూవుంటే విశాలములైన వక్షోజముల రాపిడికి సొరకాయ బుర్ర లాంటి వీణ దిమ్మ ‘దిమ్మ తిరిగి’ తొట్రు పడుతుండగా, తన వ్రేళ్ళ ఎర్రదనమూ దంతముతో చేసిన వీణ మెట్ల తెల్లదనమూ కలసిపోయి కించిత్తు ఎర్రని ‘ఇంగిలీకపు’ రంగులో వింత కాంతులు వెలయిస్తూ ఉండగా, ఉపనిషత్తులు చెలికత్తెలై, సేవకురాండ్రై సేవలు చేస్తుండగా, తెల్ల తామర పూవులో కూర్చుని మనసుకు హాయిగొల్పుతూ వీణ వాయిస్తూ ఉన్న నలువరాణి, బ్రహ్మదేవుని ఇల్లాలు సరస్వతీ మాత నా ‘ఆత్మలో’ వెలయుగాక, అని సరస్వతీ ప్రార్ధన అనంతరం తన కృతి పతి ఐన శ్రీకృష్ణదేవరాయల వంశప్రస్తుతి చేసి, ఆయన ప్రతాపాన్ని వర్ణించి, షష్ఠ్యంతములతో తన కావ్య కన్యను తన చెలికాడు, రేడు, ఆంధ్రసాహితీగగనసీమల వెలుగొందు సూరీడు ‘రాయలకు’ అంకితం చేశాడు పెద్దన. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ అనేవి షష్ఠీ విభక్తి పదములు. ఈ పదములతో అంతమయ్యే పద్యములతో ‘ఫలానా వారికి’ అంకితంగా ఈ కావ్యాన్ని రచిస్తున్నాను అని చెప్పడం కావ్య సంప్రదాయం. ఆ పద్యాలనే  షష్ఠ్యంతములు అంటారు. ఈ ఐదు పద్యాలలో ఒక రెండు మచ్చుకు చూసి ముందుకు సాగుదాం.

అవిరళ వితరణ విద్యా
నవ రాధేయునకు సజ్జన విధేయునకున్
గవితాస్త్రీ లోలునకున్
ఖవిటంక నటద్యశోబ్ధి  కల్లోలునకున్

అవిరళముగా అంటే విరామం లేకుండా నిరంతరమూ వితరణ చేయడంలో (మాత్రమే) అభినవ కర్ణుడు, అంటే దుష్ట సంపర్కములో కాదు అని ధ్వని, ఎందుకంటే ఆయన(కర్ణుడు) దుష్టచతుష్టయములోనివాడు,  దుర్మార్గుడైన దుర్యోధనునికి విధేయుడు. ఈయన (శ్రీకృష్ణదేవరాయలు) సజ్జనులకు విధేయుడు. ఈయన సామాన్య చక్రవర్తులలాగా ‘సామాన్య’ స్త్రీ లోలుడు కాదు, ఆయన కవితాస్త్రీ లోలుడు’(సామాన్య అంటే వేశ్య అని ఒక అర్ధము) అలాంటి  అభినవ కర్ణునికి, కవితా స్త్రీ లోలునికి, తన కీర్తి అనే సముద్రపు కెరటాలు ఆకాశాన్ని అంటేట్లుగా విజ్రుంభించి, కల్లోలముగా ఎగసి పడుతున్నట్లు భాసించే వానికి,

కరుణాకర వేంకటవిభు
చరణ స్మరణ ప్రసంగ సంగత మతి కీ
శ్వర నరసింహ మహీ భృ
ద్వరనందన కృష్ణరాయ ధరణీ పతికిన్

నిరంతరమూ కరుణాకరుడైన వేంకటేశ్వరుని పాదముల స్మరణముల పలుకులను ఆలకించడంలో మగ్నమైన మనసు కలవానికి, ఈశ్వరనరసింహ రాయలకు భగవంతుని వరప్రసాదముగా కుమారుడైన శ్రీకృష్ణరాయ ప్రభువునకు అభ్యుదయ పరంపరాభివృధ్ధిగా మార్కండేయ పురాణాంతర్గత కథను చెప్పడం ప్రారంభించాడు అల్లసాని పెద్దన.

వ్యాసమహర్షి ప్రోక్తమైన అష్టాదశ మహాపురాణాలలోమార్కండేయ మహా పురాణము ఒకటి. దేవీ మాహాత్మ్యము మొదలైన దివ్య ఘట్టాలతోపాటు  అనేక చిత్ర విచిత్రమైన కథలు, ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు కలిగినది. ఇక్కడ స్వల్పముగా పురాణ వాఙ్గ్మయమును గురించి తెలుసుకొనడం అవసరం.

అష్టాదశ మహాపురాణముల లోని మొత్తము శ్లోకముల సంఖ్య ఒక కోటి. చతుర్ముఖ బ్రహ్మ తను ప్రథమముగా మహా పురాణవాఙ్గ్మయమునే స్మరించుకున్నాడు, అనంతరం ఆయన ముఖమునుండి వేదం ఉద్భవించింది. మహాపురాణ విజ్ఞానముతోనే ఆధ్యాత్మిక జ్ఞానము సంపూర్ణము అవుతుంది. ఒక కోటి సంఖ్య కలిగిన శ్లోకాలను పఠించడం, అర్ధము చేసుకొనడం కలియుగంలో అల్ప ప్రజ్ఞులైన, అల్పాయుష్కులైన మానవులకు సాధ్యము కాదు అనే ఉద్దేశముతో మొత్తము పురాణవాఙ్గ్మయమును నాలుగులక్షల చిల్లర శ్లోకాలకు కుదించి, పద్దెనిమిది మహా పురాణములుగా విభజించి మహాపురాణ వాఙ్గ్మయమును వ్యాసమహర్షి నిర్మించాడు. సత్యలోకములో బ్రహ్మదేవునివద్ద యిప్పటికీ ఒక కోటి శ్లోకముల పురాణ వాఙ్గ్మయము నిత్యమూ పూజలను అందుకుంటూ ఉన్నది అని భారతీయ భావన. ఈ పద్దెనిమిది మహా పురాణములూ బ్రహ్మదేవుని పురాణశరీరములో పద్దెనిమిది అంగములు అని సంప్రదాయము. అందులో మార్కండేయ పురాణము బ్రహ్మదేవుని కుడిపాదము అని, అగ్నిపురాణము ఆయన ఎడమ పాదము అని సంప్రదాయం. మొత్తం నూట ముప్పై నాలుగు అధ్యాయములున్న మార్కండేయ పురాణములో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు అధ్యాయముల వరకు ఏడు అధ్యాయములలో రెండువందల డెభ్భై రెండు శ్లోకాలలో స్వారోచిష మనువు కథ వివరించబడింది.

ఈ పురాణ ప్రారంభంలో జైమిని మహర్షి మార్కండేయ మహర్షిని మహాభారత సంబంధమైన నాలుగు ప్రశ్నలు వేసి తన సంశయములను తొలగించుమని అడుగుతాడు. మార్కండేయ మహర్షి తనకు సంధ్యావందన విధులకు సమయము అయినందున, వివరముగా ఆ ధార్మిక చర్చను చేయడంకోసం, తన సందేహనివృత్తి చేసుకొనడం కోసం వింధ్యపర్వతము మీద తపస్సు చేసుకునే నాలుగు గరుడపక్షులను దర్శించి ఆ పక్షుల ద్వారా తన తన సందేహనివ్రుత్తిని చేసుకొనుమని జైమిని మహర్షికిచెప్పాడు. ఆశ్చర్యపడిన జైమిని పక్షులేమిటి, మాట్లాడడం ఏమిటి, అదే వింత అంటే, మహర్షులకు కూడా సందేహనివృత్తి చేయగలిగిన జ్ఞానమును కలిగిఉండడం ఏమిటి అని అడుగగా ఆ పక్షుల పూర్వజన్మ వృత్తాంతమును తెలియజేస్తాడు మార్కండేయుడు.

సుక్రుశుడు అనే మహర్షిని పరీక్షించడం కోసం దేవేంద్రుడు ఒక పక్షిరూపంలో వచ్చి తన ఆకలిని తీర్చమని అడిగి, మహర్షి సరే, ఏమి తింటావో చెప్పమంటే నరమాంసం కావాలి అని అడిగాడు. నివ్వెరపోయిన ఆ మహర్షి తను పక్షికి మాట ఇచ్చాడు కనుక తన నలుగురు కుమారులను పిలిచి వారిలో ఎవరైనా ఒకరు తన ప్రాణములను త్యాగం చేసి ఆ పక్షి ఆకలిని తీర్చమని అడిగితే, పింగాక్షుడు, విబోధుడు, సుపుత్రుడు, సుముఖి అనే ఆ నలుగురు కుమారులూ  నిరాకరించారు.

మహర్షికి కోపం వచ్చి నలుగురినీ పక్షులై జన్మించండి అని శాపం ఇచ్చాడు. వారు శోకించి, శాప విమోచనాన్ని తెలియజేయుమని ప్రార్ధించగా తన శాపము వృధా పోదు కనుక, పక్షి జన్మలోనూ పూర్వ జన్మ స్మృతి, జ్ఞానము కలిగి, జైమిని మహర్షికి కలిగిన సందేహాలను నివారించి, వింధ్య పర్వతము మీద తపోనిష్ఠతో  శాపవిమోచనాన్ని, సద్గతులను పొందుతారు అని  శెలవిచ్చాడు. కాలగమనంలో కౌరవ పాండవులమధ్య మహాభారత యుద్ధం మొదలైంది.

మహాభారత యుద్ధములో అర్జునునికి, భగదత్తునికి జరిగిన యుద్ధములో అర్జునుడు వర్షంలా కురిపించిన బాణములలో ఒకటి యుద్ధభూమిపై ఆకాశంలో ఎగురుతున్న ఒక గరుడపక్షికి తగిలి, నిండు గర్భంతో ఉన్న ఆ పక్షికి గర్భస్రావం జరిగి దాని కడుపులో ఉన్న నాలుగు గుడ్లు క్రిందపడినాయి కానీ రక్త మాంసములతో బురదగా, చిత్తడిగా, మెత్తగా ఉన్న యుద్ధ భూమి కనుక పగలలేదు. అదే సమయానికి విధి లీలలకు ఉదాహరణగా భగదత్తుని ఏనుగు మెడలో ఉన్న ఘంటకు అర్జునుని వింటినుండి వెలువడిన మరొక బాణం  తగిలి, ఆ ఘంట తెగి ఈ నాలుగు గుడ్ల మీద చేతితో బోర్లించినట్టు పడిపోయి అలాగే ఉండిపోయింది. యుద్ధం ముగిసింది. కాలం గడిచింది. అలాగే ఆ ఘంట క్రింద భద్రంగా ఉన్న నాలుగు గుడ్లు పగిలి నాలుగు పక్షులు బయటికివచ్చి, ఆ ఘంటలోనే కిచకిచలాడుతుండగా ఆ దారిగుండా కురుక్షేత్రం లోని పవిత్ర తీర్థ సందర్శనం కోసం వెళ్తున్న శమీకుడు అనే ఋషి ఆ పక్షుల కూతలు విని ఆశ్చర్యముతో ఘంటను తొలగించి దాని క్రింద ఉన్న పక్షులను చూసి, వాటిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి పెంచసాగాడు. పరీక్షిత్తు మహారాజు దాహార్తితో తను మంచి నీరు అడిగినా ఉలకక, పలుకక తపస్సులో ఉన్న ఒక  మహర్షిమెడలో అక్కడే తనకు కనిపించిన చచ్చిన పామును వేయడం, ఆ తర్వాత అది చూసిన ఆ ముని కుమారుడు శృంగి అనేవాడు పరీక్షిత్తును ఏడవ నాటికీ తక్షక సర్పపు కాటుకు మరణించును గాక అని శపించడం మనకు తెలిసిందే. ఆ శమీక మహర్షియే ఈ శమీక మహర్షి. అనంతరం ఆ గరుడ పక్షులు తమ పూర్వజన్మ వృత్తాంతమును శమీక మహర్షికి వివరించి వింధ్య పర్వతాలకు తపస్సుకు వెళ్ళిపోతాయి.

జైమిని మహర్షి వేదవ్యాసులవారి శిష్యులలో ఒకరు. వేదవ్యాసులద్వారా ‘సామవేదము’ను గ్రహించి తన శిష్య ప్రశిష్య పరంపరద్వారా ప్రపంచములో వ్యాపింపజేసినవాడు. వీటిని సందర్శించి, తన ధార్మిక సందేహాలను వీటిద్వారా మహాభారత గాధకు సంబంధించిన తన సందేహాలను నివృత్తి చేసుకుని, ఆ తర్వాత ‘జైమిని భారతము’ను రచించాడు. ఆ తర్వాత ఆ పక్షులు ముక్తిని పొందాయి. మార్కండేయ మహర్షి తన శిష్యుడైన క్రౌష్టుకి మహర్షికి బోధించిన స్వారోచిష మనువు కథను గరుడ పక్షులు జైమిని మహర్షికి బోధించాయి. యిది మార్కండేయ పురాణమును గురించి స్వల్ప పరిచయము.

స్వాయంభువమనువు చరిత్రమును విన్నతర్వాత, తర్వాతి మనువు ఎవరు? అతని కథ ఏమిటో వివరించండి పుణ్యాత్ములారా! అని జైమిని మహర్షి అడిగాడు. పక్షులు వివరించడం ప్రారంభించాయి, అల్లసానివారి అల్లికకు అనుగుణముగా, ఈ విధముగా...

వరణా ద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాం
బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయ రుఙ్మండలీ
హరిణంబై యరుణాస్పదం బనఁగ నార్యావర్త దేశంబునన్
బురమొప్పున్ మహికంఠహార తరళస్ఫూర్తిన్ విడంబింపుచున్

‘వరణా’నదీ తీరంలో, ఆర్యావర్తము అని పిలువబడే ప్రాంతములో, ఆకాశాన్ని అంటుకునేట్లున్న భవన గోపురములను కలిగినది (వప్రస్థలీ చుంబితాంబరమై) తన పాలరాతి భవనముల తెల్లని కాంతులతో  చంద్రుడి లోని జింకను కూడా తెల్లగా మెరిపించేది (సౌధసుధాప్రభాధవళిత ప్రాలేయ రుఙ్మండలీహరిణంబై) భూదేవి కంఠములో తళ తళలాడే హారములాంటి పట్టణము, అరుణాస్పదము అనే పట్టణము ఒకటి ఉండేది. వరణ – అసి అనే రెండు నదుల మధ్యన ఉన్న పవిత్ర ప్రాచీన నగరము వారణాసి (కాశి). అరుణాస్పదము అనే పట్టణం వరణ నదీ తీరములో ఉంది, అంటే దాదాపు కాశీలో సగము అనేంత పవిత్రత ఉన్న పట్టణము అన్నమాట! అక్కడ విశాలాక్షీ వరుడు, ఇక్కడ విప్రవరుడు ఉన్నారు, అది మరొక తేడా! యిద్దరూ మన్మధుని జయించినవారే, అదీ రహస్యము. నాలుగు వర్ణాలవారూ ఉన్నారు ఆ అరుణాస్పదం అనే పట్టణములో.

అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యా ప్రౌఢి
ముది మది దప్పిన మొదటి వేల్పు
నచటి రాజులు బంటు నంపి భార్గవునైన
బింకానఁ బిలిపింతు రంకమునకు
నచటి మేటి కిరాటు లలకాధిపతి నైన
మునుసంచి మొద లిచ్చి మనుప దక్షు
లచటి నాలవజాతి హలముఖాత్త విభూతి              
నాదిభిక్షువు భైక్ష మైన మాన్చు
నచటి వెలయాండ్రు రంభాదులైన నొరయఁ
గాసెకొంగున వారించి కడపఁగలరు
నాట్య రేఖాకళాధురంధరనిరూఢి
నచటఁ బుట్టిన చిగురుఁగొమ్మైనఁ జేవ

అక్కడి బ్రాహ్మణులు, విద్వాంసులు, జ్ఞానులు వయసు పైబడిన ముసలి బ్రహ్మదేవుడిని కూడా విద్వత్తులో పెద్దగా మెచ్చరు, అంటే అంతటి జ్ఞానులు, పండితులు, విద్వాంసులూనూ! అక్కడి రాజులూ ఇరవైఒక్క మార్లు దండెత్తి భూమిమీద రాజు అనేవాడు లేకుండా నరికేసిన పరశురాముడిని కూడా బంట్రోతుతో కబురుచేసి పిలిపించి మాట్లాడగలరు, అంతటి పరాక్రమవంతులు, పౌరుషవంతులున్నూ! అక్కడి వైశ్యులు చేతిసంచీనిచ్చి కుబేరుడిని కూడా గుమాస్తాను పంపినట్టు పంపి బాకీలు వసూలు చేయించు కోగలరు, అంతటి సంపన్నులు! శ్రామికులైన అక్కడి నాల్గవ వర్ణమువారు తమ నాగటి చాళ్ళు పండించిన ధాన్యపు రాశులతో ఆదిభిక్షువు ఐన శివుడికి కూడా ఎల్లకాలానికీ చాలినంత భిక్ష వేసి ఇక అయన భిక్షాటనం చేసే అవస్థ లేకుండా చేయగలరు!

శృంగార శాస్త్ర కళా ధురంధరలైన అక్కడి వేశ్యలు దేవవేశ్యలైన రంభ మొదలైనవారిని కూడా చీరచెంగుతో వారించి ఓడించగలరు! నృత్య వాద్య గీతముల గానముల ప్రతిభలో అక్కడి చిగురు కొమ్మ కూడా చేవ కలిగినదే! చిగురుకొమ్మ అని పిలువబడే చెట్లు పెద్దన స్వస్థలమైన కొకట, చౌడూరు కడప ప్రాంతాలలో పెరిగే చెట్లు.  లేత కొమ్మలు కూడా చాలా చేవగా ఉండి, చిన్నచిన్న చెల్టు కూడా చాలా పెద్ద పక్షులకు ఆశ్రమిస్తాయి. నీటిలోనే పెరిగినా కుళ్ళిపోకుండా ఉంటాయి, పులికాట్ సరస్సులో కూడా ఇవి ఉంటాయి, వీటిని కడప చెట్లు అని కూడా పిలుస్తారు, వీటిద్వారా కూడా పెద్దన స్వస్థలము (వై.ఎస్.ఆర్) కడపజిల్లా లోనిదే అని పరిశోధనలు చెప్తున్నాయి. యిది భౌగోళికముగా అయితే, పైకి  చూడడానికి చిగురువంటి లేతదనము కలిగినా లోలోపల చాలా ‘ముదురువి’ అక్కడి వస్తువులైనా, వ్యక్తిత్వాలైనా అని కవిమెరుపు!

ఆ పురిఁ బాయ కుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా
షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రుఁ,  డంబురుహగర్భ కులాభరణం, బనారతా
ధ్యాపనతత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూ విలాసుఁ డై

ఎన్నడూ ఆ పట్టణాన్ని వదిలి ఎక్కడికీ వెళ్ళకుండా, వివిధ పవిత్ర ధార్మిక దీక్షలను, క్రతువులను క్రమము తప్పకుండా ఆచరించేవాడు, నిరంతర విద్యాదానశీలి, బ్రహ్మదేవుని కులానికే అంటే బ్రాహ్మణజాతికే ఆభరణము వంటివాడు, విద్వత్తులో, పాండిత్యములో అపర ఆదిశేషునివంటివాడు, అందములో మన్మధునివంటివాడు, చంద్రునివంటివాడు, మాటలలో వర్ణించడానికి అలవికాని అందగాడు, ప్రవరుడు అనే వాడుండేవాడు! ఎన్నడూ ఆ పట్టణాన్ని వదిలివెళ్ళనివాడు అనడంలో విరుపు ఉంది, ఎన్నడూ వెళ్ళని వాడు, వెళ్ళాలనే కోరిక తీరనివాడు కనుకనే ఈ కథకు బీజం పడింది అని ముందు ముందు తెలుస్తుంది కనుక!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి