దాచుకోడాలు... - భమిడిపాటి ఫణిబాబు

daachukovadaalu

"దాచుకోడం" అనే స్వభావం చాలా మందిలో చూస్తాము. కొందరికి మాట "దాచుకోడం" అలవాటూ, కొంతమందికైతే, ప్రతీ వస్తువూ "దాచుకోడం" అలవాటూ. ఏదిఏమైనా ఈ "దాచుకోడం" అనేది ఓ in-built  గా ఉండిపోతుంది. పుటాలెసినా వాళ్ళు బాగుపడరు. వాళ్ళు తినరూ, ఇంకొకళ్ళకి పెట్టరు.. అలాగే వెళ్ళిపోతాయి వాళ్ళ జీవితాలు. పైగా తాము ఎంతో తెలివైనవారిమనే ఓ దురభిప్రాయం కూడా ఏర్పరచేసికుంటారు. కానీ ఇలాటి వారి ప్రవర్తన అవతలివారికి ఎంత "అసహ్యం"గా ఉంటుందో అనేది మాత్రం వీళ్ళకి ఛస్తే తెలియదు! కనీసం తెలిసినా, దులిపేసికుని పోతారు.

ఏదో ఇంట్లో ఒకళ్ళకైనా, పంచుకోడం అనే స్వభావం అంటూ ఉంటే, కొంతవరకూ పరవాలేదు, కానీ భార్యా భర్తలు "దాచుకునే" category లోకి వస్తే, పిల్లలూ అలాగే తయారవుతారు. ఆ జనరేషన్ అంతా అలాగే కంటిన్యూ అయిపోతుంది.. beyond economic repairs అన్న మాట! కానీ, పిల్లలు పై చదువులకి బయటి ప్రాంతాలకెళ్ళి ఏ హాస్టల్ లోనో ఉంటూన్నప్పుడు, పిల్లో/పిల్లాడో భోజనం టైములో వేసికుంటాడని ఏ పచ్చడో, సాయంత్రంపూటల్లో తింటాడని, ఏదో నాలుగు రోజులుండేటట్టు ఏ పిండివంటలో ఇచ్చి, "జాగ్రత్త నాయనా, ఊరికే ఫ్రెండ్సందరికీ పంచిపెట్టేయకు, జాగ్రత్త చేసికుని ఆరారగా తింటూ ఉండూ, నీ పెట్టెకో, కబ్బోర్డుకో ఓ తాళం కూడా వెయ్యే.." అని అంపకాలు పెట్టిమరీ ఇస్తుంది, "దాచుకోడం" category ఆవిడ! అలా ఎలా కుదురుతుందీ, నలుగురూ కలిసి ఉండే చోటా? ఇంకోళ్ళని చూసి మొత్తానికి, ఆ చిన్నప్పటినుంచీ ఉన్న ఆ అలవాటు కొద్దిగా సడలించుకుని, అందరితోనూ పంచుకోడం అలవాటు చేసికుంటాడు. లేకపోతే వాడు ఆ హాస్టల్లో odd man out అయిపోతాడు. పోన్లెండి ఏ కారణమైతేనేం, మార్పంటూ వస్తుంది.

ఏదైనా సరే మనకున్నది ఇతరులతో పంచుకున్నప్పుడే సంతోషం. అంతేకాని ప్రతీ దానికీ, ఎక్కడలేని "యావ" ఉండకూడదు. అందుకనేమో, ఈ రోజుల్లో చిన్నప్పటినుంచే నేర్పుతూంటారు, ప్రతీదీ share చేసికోవాలని. కొంతలో కొంత బాగుపడుతున్నారనే అనుకుందాం! కానీ ఒక్కొక్కప్పుడు చూస్తూంటాము, ఆఫీసుల్లో కొంతమందిని, ఏ న్యూ ఇయర్ కో కంపెనీల వాళ్ళు డయరీలూ, పెన్నులూ లాటివి. ఏదొ పెద్ద పొజిషన్ లో ఉన్నాడు కదా, ఆ ఆఫీసులో ఉండే అందరికీ ఇస్తాడూ, అని ఓ పదో పదిహేనో డయరీలూ, పెన్నులూ ఇచ్చివెళ్తాడు. పాపం మన "ఆఫీసరు" గారికి, ఇంకోళ్ళతో పంచుకోడం, అలవాటు లేదాయే, ఆ వచ్చినవన్నీ తన డ్రాయరు లో పెట్టి తాళం వేస్తాడే తప్ప, పోనీ ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళూ సంతోషిస్తారని మాత్రం తట్టదు! పోనీ అవేమైనా ఈయన డబ్బెట్టి కొన్నాడా అంటే అదీ లేదూ. అన్నేసి డయరీలు నెత్తినేసి కొట్టుకుంటాడా? లేకపోతే పోయేటప్పుడు కూడా తీసుకుపోతాడా? ఏమిటో డయరీలని కాదు, ఊరికే ఉదాహరణకి చెప్పాను. చివరకి రిటైరయినప్పుడు, కబ్బోర్డు ఖాళీ చేస్తూంటే, కనిపిస్తాయి, ఎప్పడెప్పడివో డయరీలూ, రీఫిల్స్ ఎండి పోయిన బాల్ పెన్నులూ, ఎవడు బాగు పడ్డట్టూ? పోనీ ఇంటికైనా తీసికెళ్ళాడా అంటే అదీ లేదూ, ఇంట్లో భార్యకి ఏ చాకలి పద్దు రాసుకోడానికో, పిల్లల రఫ్ వర్కు కో అయినా ఉపయోగించేవి! అసలు అలాటి పంచుకోడం అనే గుణం లేనివాడికి ఎంతచెప్తే లాభం ఉంటుంది చెప్పండి?

ఇంకొంతమందుంటారు - మనం పైఊళ్ళకి వెళ్తూంటాము, మరీ ఒట్టి చేతుల్తో వెళ్తామా ఏమిటీ ఏదో ఇంట్లో అందరూ తింటారని ఏదో ఒకటి తీసికెళ్తాము కదా, ఆ ప్యాకెట్టు తీసేసికుని, పిల్లలకి కూడా అందకుండా, దాచేస్తుంది కానీ, ఛస్తే ఇంకోళ్ళతో ఆఖరికి ఇంటాయనతో కూడా పంచుకోదు! చివరకి ఆ వెర్రిబాగులమనిషి, అడగనే అడుగుతాడు, పాపం ఆయనకి తిండి యావ - వాళ్ళేదో తీసుకొచ్చినట్టున్నారూ, ఓ ప్లేటులో వేసి తెస్తే అందరూ తింటారు కదే! అని. చివరికి ఏమీ చేసేది లేక, ఆవిడ ఆ ఫ్రిజ్జులోనో, ఇంకెక్కడో "దాచేసిన" పాకెట్టులోంచి, అక్కడున్న నలుగురికీ, లెక్కేసి నాలుగంటే నాలుగే తెస్తుంది. ఆ స్వీట్లు తెచ్చినవాళ్ళనుకుంటారు, అర్రే మనం కిలో కదా తెచ్చిందీ, ఇదేమిటీ ఈవిడ అంత కక్కూర్తిగా దాచేసిందీ, అని మొహమ్మాటానికి తీసికోడం మానేస్తారు, పోనిద్దురూ పిల్లలు తింటారూ అని. పుటుక్కుమని ఆ మిగిలినవి, తీసేస్తుంది.

ఏదో ఊరికి వెళ్తే, రోజంతా ఇంట్లోనే కూర్చోము కదా, ఏదో పాత పరిచయం ఉన్నవాళ్ళని కలుసుకుందుకు వెళ్తాము. ఏదో, చాలా కాలం తరువాత వచ్చేరూ అని, వెళ్తూంటే, ఓ జాకెట్టు పీసూ, ఓ కిలో స్వీట్లూ చేతిలో పెడతారు. ఇంటికెళ్ళిన తరువాత, అవేమీ పెట్టిలో పెట్టి దాచుకోము కదా, పైగా ఏ చీమలో పట్టినా, పాకం అంతా కారినా అదో గొడవా, దీంతో, ఆ ఇంటావిడకిచ్చి, అందరూ తింటారులే, ఏ ఫ్రిజ్జ్ లోనో ఉంచు అని చేతిలో పెడతాము. ఇంకా ఆ స్వీట్స్ కి మనది అదే "ఆఖరి చూపు"! మనం అక్కడున్నన్ని రోజులూ ఒక్కసారంటే ఒక్కసారి కూడా, " మీరు మొన్న వాళ్ళెవరింటికో వెళ్ళినప్పుడు, తెచ్చిన స్వీట్లు.." అంటూ, ఓసారి పెడితే ఏం పోయిందిట వాళ్ళ సొమ్మూ? పోనీ వాళ్ళేమైనా డబ్బెట్టి కొన్నవా, వీళ్ళొచ్చారుకాబట్టే కదా ఇంట్లోకి వచ్చేయీ, అని కూడా అనుకోకుండా దాచేసికోడం! ఓ పండనండి, పువ్వనండి, ఏదో నాలుగు పూటలు తిండి పెడుతున్నామూ, అందువలన, వీళ్ళ "సంపాదన" అంతా మాకే ఇవ్వడం విధాయకమూ అనుకుంటూంటారు!

అలాగని అందరూ అలా ఉంటారని కాదు, కొంతమందైతే, ఊళ్ళోవాళ్ళకోసమే బతుకుతూంటామనుకుంటారు. ఇంట్లో ఏం చేసినా, రోడ్డుమీద పోయేవాడిని కూడా పిలిచి పంచుకునే స్వభావులు. ఇంకో రకం ఉంటారు, ఎవరైనా తీసికొస్తే చాలు, ఆ తెచ్చిందేదో పక్క వాళ్లకీ, భోజనాలు చేసే టైములో డైనింగ్ టేబుల్ మీదా పెట్టేయడం. అదేమిటండీ, ఇంట్లో వాళ్ళు తింటారని మేము తెస్తే, ఇదేమిటీ మాకే  పెట్టేస్తున్నారూ అని అన బుధ్ధేస్తుంది.

వస్తువులే కాకుండా, కొంతమంది మాటలు కూడా దాచుకుంటూంటారు. తమ మనస్సులో ఉన్నది ఇతరులతో పంచుకోరు. ఏం చెప్తే ఏమి చేసేస్తారో అని భయం. ప్రపంచంలో ప్రతీవారూ తమకు పోటీయే అని ఓ అభిప్రాయం.

తమపిల్లలు స్కూల్లో చదివేటప్పుడు, వాళ్ళ నోట్సులుకూడా ఇంకోళ్ళకి ఇవ్వనీయరు. అవతలివాళ్ళకెక్కడ మార్కులు ఎక్కువ వచ్చేస్తాయో అని భయం. పోనీ అలాగని, ఇంకోళ్ళ నోట్సులు తీసికోకుండా ఉంటారా అంటే అదీ లేదూ, తమ పిల్లలు ఏ కారణం చేతైనా స్కూలుకి వెళ్ళలేకపోతే, అవతలివాళ్ళ పిల్లల నోట్సులే గతి. అలాగే ప్రతీవారికీ ఏదో ఒక సందర్భంలో అవసరాలు పడుతూ ఉంటాయి. అందరూ అలా ఉంటారని కాదు, సమాజంలో ఇలాటివారినే ఎక్కువగా చూస్తూంటాము. ఉదాహరణకి, ఏ scholarship పరీక్ష గురించో, లేకపోతే ఏ talent test గురించో వీళ్ళకి ముందుగా తెలిసిందనుకోండి, ఛస్తే ఇంకోళ్ళకి చెప్పరు, కారణం వాళ్ళ పిల్లలు ఎక్కడ తమ పిల్లలతో పోటీకి వస్తారో అని! ఇవే కాదు, తమ పిల్లలకి చదువుకోడానికి కొనిపెట్టే పుస్తకాల విషయం కూడా, ఇంకోళ్ళతో పంచుకోరు. వాళ్ళు కూడా ఇవే పుస్తకాలు చదివి మార్కులు ఎక్కువ తెచ్చేసికుంటే అమ్మో!!

ఇప్పుడంటే నెట్ నిండా పెళ్ళి సంబంధాలే కాబట్టి ఫరవా లేదు కానీ, ఇదివరకటి రోజుల్లో, ఇంట్లో ఆడపిల్లుందంటే చాలు, తెలిసిన సంబంధాల విషయం ఇంకోరితో పంచుకునేవారు కాదు. ఏదో కారణాలవల్ల, వీళ్ళ ప్రయత్నాలు fail అయినప్పుడు మాత్రం, పేద్ద "విశాల హృదయం"తో, అవతలివాళ్ళతో ఒక మాట అనడం. అప్పుడు కూడా పూర్తి వివరాలు చెప్పరు, వీరికి ముందుగానే తెలిసినా కూడా. మళ్ళీ మన విషయం తెలిసిపోతే, వామ్మో! చివరికి ఎవరిద్వారానో వాళ్ళకీ తెలుస్తుంది.అప్పుడు మొత్తానికి తేలుస్తారు, జాతకాలు కలవక, మేమే వద్దన్నామండి అని. అసలు కారణం ఇంకోటైనా సరే.

అలాగే, మనం ఏ flat కొనుక్కోడానికో, అద్దెకు తీసికోడానికో, ఖర్మ కాలి ఏ agent/broker నైనా పట్టుకున్నామనుకోండి, తనే వారి దగ్గరకు తీసికెళ్తానంటాడు కానీ, ఆ party ( ఎవరైతే అద్దెకో/అమ్మడానికో ఇచ్చేవారు) వివరాలు మాత్రం మనతో share  చేసికోడు. మళ్ళీ మనం direct గా, వాళ్ళని సంప్రదించేస్తే, వీడి commission పోదూ?, పెళ్ళిళ్ళ విషయాల సంగతికొస్తే "జాతకాలు" safest escape route.

ఇలాటివన్నీ ఇదివరకటి రోజుల్లో సర్వసాధారణంగా జరిగే విషయాలు. ఇంక ఈ రోజుల్లో తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాల విషయాల్లో చూస్తూంటాము. చెప్పా పెట్టకుండా, ఎప్పుడో ఒకరోజు చేతిలో pink slip వచ్చే రోజులాయె. ఎక్కడెక్కడ ఉద్యోగాలుంటాయో చెప్తే, మళ్ళీ వీడెక్కడ competition కి వస్తాడో అని భయం. ఈ అంతదాకా ఎందుకూ, ఎక్కడో ఏదో వస్తువు కొన్నామనుకోండి, అది కూడా ఏ discount sale  లోనో, ఆ విషయం మాత్రం ఇంకోళ్ళతో పంచుకోము. అవతలివాడెందుకు సుఖ పడిపోవాలీ?

ఈరోజుల్లో చూస్తున్నదేమిటీ? పైకోమాటా, లోపలోమాటానూ. ఎక్కడ చూసినా, వాడితో చెప్తే మనకేం వస్తుందీ అనే కానీ, పోనీ మనకి తెలిసినదేదో ఓ నలుగురితో పంచుకుంటే, వాళ్ళూ బాగు పడతారేమో అనుకుంటే, ఎంత బావుంటుందీ? Sharing enhances happiness always...

 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి