కబుర్లు చెప్పుకోడానికి........ - భమిడిపాటి ఫణిబాబు

kaburlu cheppukodaaniki

వర్నమెంటు లో ఉద్యోగాలు చేసేటప్పుడు, ఏదైనా ట్రైనింగ్ కార్యక్రమాలకి వెళ్ళడం చాలా బాగా ఉండేది. బయటి ఫాక్టరీలనుండి వచ్చిన పాత మిత్రుల్ని కలుసుకోవడం మినహా పెద్ద ఏమీ నేర్చుకునీది ఉండేది కాదు. ఈ ట్రైనింగులు ఓ ఆటవిడుపు లాగ ఉండేవి. ఊళ్ళోనే ఉండే ట్రైనింగు కార్యక్రమాలకి ప్రభుత్వం వారు ఎలొవెన్సులూ వగైరా ఇచ్చేవారు కాదు. బయటి ఊళ్ళకైతేనే పుణ్యం పురుషార్ధమూనూ - ఏసి టిక్కెట్టూ, దినసరి భత్యమూ లాటివి. ఆ ట్రైనింగులకి వెళ్ళి ఏదైనా నేర్చుకున్నామా అన్నదానితోనూ పనుండేది కాదు. ఆ ఏడాది ట్రైనింగు లకి కేటాయించిన డబ్బు ఖర్చయిందా లేదా అన్నదే ప్రశ్న. ఇందులో ఇంకో తమాషా ఉంది - ఆ Training లో ఉన్నంతకాలమూ, అంతా తెలిసినట్టే ఉంటుంది. అదేమిటో కానీ తిరిగి ఉద్యోగ విధులకొచ్చేసరికి అన్నీ మర్చిపోతాము.

మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా మనకి తెలిసినవారు దివంగతులైతే చాలా బాధ పడతాము. ఎవరో ఒకరి ద్వారా ఈ వార్త తెలిసికొని, దగ్గర వాళ్ళందరూ చేరతారు. వెళ్ళిన మొదటి అరగంటా ఆ పోయినాయిన గురించే మాట్లాడుకుంటారు, ఆయన చేసిన మంచి పనులూ, ఆఫీసులో ఆయన ప్రవర్తనా వగైరా, వగైరా.. ఇదేదో నేను వాతావరణాన్ని హాస్యంగా తీసికుంటాననుకోకండి, మామూలుగా అటువంటి సందర్భాల్లో తరచూ జరిగే విషయాలు చెప్తున్నాను.

పోయినాయన ఇంటికి ముందర ఓ పెండాల్ వేసి ఓ పది పదిహేను కుర్చీలు వేస్తారు. ఇంకో చిత్రమేమంటే శుభ కార్యానికీ, ఇలాటి వాటికీ కూడా ఒకే రకమైన రంగు పెండాల్/షామియానా వేస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ, దివంగతులైన ఆసామీ, ఆ ముందు రోజు రాత్రి దాకా అందరితోనూ ఎలా మాట్లాడిందీ, తెల్లారేక అకస్మాత్తుగా ఎలా పడిపోయిందీ, డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళే లోపల ఎలా ప్రాణం పోయిందీ అన్నీ మాట్లాడుకుంటారు. అదే కాకుండా చూడ్డానికి వచ్చిన ప్రతీవారికీ ఆ విషయాలు చెప్పడంతో కొంత కాలక్షేపం జరుగుతుంది. ఓ అరగంటా, గంటా ఈ మాటలు పూర్తి అయిన తరువాత, ఆ వచ్చిన వాళ్ళందరికీ, ఇంక మాట్లాడడానికి (పోయినాయనని గురించి) ఏమీ ఉండదు. ఇంక అక్కడినుండి, ఆయన బాడీ తీసికెళ్ళేదాకా ఏదో కాలక్షేపం ఉండాలిగా, ఊళ్ళో కబుర్లన్నీ మొదలెడతారు.వాళ్ళ ఉద్యోగాల లోని కష్టసుఖాలూ వగైరా వగైరా... ఇదేం విచిత్రమో అర్ధం అవదు. వీళ్ళు  కబుర్లు చెప్పుకోవడానికి ఇంకో ప్రదేశమే దొరకలేదా?వచ్చిన పని ఏమిటి, మాట్లాడడానికి ఏమీ విషయం లేకపోతే నోరు మూసుకుని కూర్చోచ్చుగా. ఈ కబుర్ల ప్రకరణం అంత్యక్రియలు పూర్తయేదాకా నిరాటంకంగా సాగుతాయి. మధ్యలో సెల్ ఫోన్లొకటీ. వాటిని "స్విచ్ ఆఫ్" చేద్దామనైనా తోచదు. ఒకవైపున కర్మకాండలు జరుగుతూనే ఉంటాయి, ఇంకోవైపున ఎవరో ఒకరు ఫోనులో మాట్టాడుతూనే ఉంటారు. ఆ మాయదారి ఫోను “సైలెంటు” లో పెట్టి, తరువాత missed calls చూసుకోవచ్చని ఎందుకు తట్టదో తెలియదు.

పనిలేని కబుర్లు చెప్పుకోడానికి ఇంకో అనువైన వేదిక పెళ్ళిళ్ళు. ఇక్కడ కొన్ని చిత్రాతి విచిత్రమైన సన్నివేశాలు చూస్తూంటాము. పెళ్ళిళ్ళకి వెళ్ళేది, చిన్ననాటి స్నేహితుల్నీ, చుట్టాలనీ కలుసుకోవడం కోసమే. మొట్టమొదటగా ఎవరి పెళ్ళికోసం వెళ్ళేమో, వాళ్ళని కలుసుకొని, మీరు వచ్చి పిలిచారూ, ఇదిగో నేను వచ్చేశానూ, ఇంట్లో తీరిక లేక మా ఆవిడ రాలేకపోయిందీ (ఇవన్నీ స్టాండర్డ్ కారణాలే లెండి) అవన్నీ చెప్పేస్తారు. పెళ్ళిపెద్ద గారి భార్య 'అదేమిటీ వదిన గారిని తీసుకు రాలేదూ' అని ఓ సారి అడిగేసి (అయితే ఈయనకేమీ ఇవ్వక్కర్లేదు, అని అకౌంటులో వేసేసికుంటుంది, మొగాళ్ళు ఒక్కళ్ళూ పెళ్ళికి వెళ్తే వాళ్ళకేమీ ఆఖరికి జేబిరుమ్మాలు కూడా దొరకదు. ఇంటావిడతో కలిసి వెళ్తే, మన చుట్టరికాన్ని బట్టి, జాకేట్టు గుడ్డో, పెట్టుబడి చీరో దొరుకుతుంది). అలాగని ఒక్కళ్ళే వెళ్ళారు కదా అని ఇవ్వాల్సిన బహుమతిలో మాత్రం ఏమీ తక్కువ చేయకూడదు.

ఆ వచ్చిన పెద్దమనిషి, ముందుగా  టిఫినూ, కాఫీ తీసికొని హాల్లో తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారేమో వెదుకుతాడు. ఈయన అదృష్టం బాగుంటే, తను 30-35 సంవత్సరాల క్రితం కలసి చదువుకున్నవాడో, లేక ఒకే ఊళ్ళో ప్రక్క ప్రక్కల ఇళ్ళల్లో ఉండేవాడో దొరుకుతాడు. ఎక్కడో చూసినట్లనిపిస్తుంది కానీ జ్ఞాపకం రాదు. ప్రతీ రోజూ చూసేవాళ్ళే గుర్తుండరు, ముఫై ఏళ్ళ తరువాత ఎలా గుర్తు పడతారూ?

ఎలాగైతేనే ఓ రెండు మూడు సార్లు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న తరువాత ఏవేవో జ్ఞాపకాలు వచ్చి 'మీరు ఫలానా కదూ', అని ఒకరినొకరు పలకరించుకుంటారు. ఒకటి రెండు మాటలైన తరువాత పూర్తిగా గుర్తుకొచ్చేస్తుంది. ఏమండీ.. లతో ప్రారంభం అయి, ఏమోయ్ లోకీ కొండొకచో ఏరా.. లోకీ వెళ్తాయి వీళ్ళ కబుర్లు. చాలా కాలం తరువాత కలుసుకోవడంతో ఇంక వీళ్ళ కబుర్లు, గడచిన ముఫై ఏళ్ళలోనూ జరిగినవన్నీ నెమరు వేసికుంటారు. చిన్నప్పుడు కలిసి చదువుకున్నట్లైతే, టీచర్లని ఎలా ఏడిపించేవారో, ఆడపిల్లల్ని ఎలా ఏడిపించేవారో గుర్తు చేసికుంటారు. పాత స్నేహితులు ఎవరొరు ఎక్కడెక్కడ ఉంటున్నారో అవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇంక వీళ్ళ కుటుంబ పరిచయాలు అవాలిగా. అందులో ఒకాయన ఒక్కడే వచ్చాడు కాబట్టి బ్రతికి పోతాడు. రెండో ఆయన, ఎవరో చిన్న పిల్లని పిలిచి,'అక్కడ కబుర్లు చెప్తోందీ, మీ అమ్మమ్మని ఓ సారి ఇలా పిలూ' అని, హాయిగా ఏవో కబుర్లు చెప్తూన్న ఓ పెద్దావిడని పిలుస్తాడు.'ఇదిగోనోయ్, మా ఆవిడ'అని పరిచయం చేసి, ' ఇతను గుర్తున్నాడా, రాజమండ్రీ లో మా ఆఫీసులోనే పనిచేసేవాడు' అని అడుగుతాడు. తను గుర్తు పట్టడానికే గంట పట్టిందని మర్చిపోతాడు. ఆవిడేమో మొహమ్మాటానికి, 'గుర్తు లేకేం, వదినగారిని తీసుకురాలేదేం' అంటుంది. నిజం చెప్పాలంటే ఆవిడకి గుర్తేం ఉండదు, అయినా ఇలాటి స్టాండర్డ్ డైలాగ్గు చెప్పేస్తే గొడవుండదు!! అక్కడితో ఈ పరిచయ కార్యక్రమం పూర్తి అవదు, ఈయన కొడుకూ, కోడలూ, మనవడో మనవరాలో, వీళ్ళందరినీ పిలిచేసి, ఓ ఐడెన్టిఫికేషన్ పెరేడ్ చేయిస్తాడు. అందరూ వరసలో నిల్చోవడం, ఓ ప్లాస్టిక్ స్మైల్ ముఖానికి పులిమేసుకోవడం. వీళ్ళందరినీ చూసి ఫొటోలు తీసేవాడు ఓ సారి క్లిక్ చేయడం. ఇవన్నీ పూర్తైన తరువాత, ఒకళ్ళ సెల్ నంబర్లు ఒకళ్ళు తీసికోవడం, ఈ రోజుల్లో ఇంకో ఫాషనూ - మెయిల్ ఐ.డి ఉందా అని అడగడం, (అంటే అవతలి వాడికి తెలియాలన్నమాట వీడి దగ్గర కంప్యూటర్ ఉందీ అని !!

అందువలన ఈసారి మీరు ఎప్పుడైనా పెళ్ళికి వెళ్తే గుర్తుంచుకోండి, ఇలాటి అద్భుత దృశ్యాలు మిస్ అవకండి. మంచి కాలక్షేపం.

 

మరిన్ని వ్యాసాలు