నాట్యకళకు వన్నెలద్దిన శ్రీ వీ.ఏ.కే.రంగారావు - టీవీయస్. శాస్త్రి

Sri VAK Rangarao Biography

వీ.ఏ.కే.రంగారావు - ఈ పేరు సంగీత సాహిత్య ప్రియులందరికీ సుపరిచితమే! ప్రతి సంవత్సరం, డిసెంబరు మాసం చివర్లో చెన్నైలో జరిగే తెలుగు సంగీత, నాట్య సమ్మేళన సభల్లో ఓ వ్యక్తి అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. చలాకీగా, సందడిగా కనిపించే ఆయన పట్ల నాట్యకోవిదులు, సంగీత విద్వాంసులు వినయ విధేయతలు కనబరుస్తుంటారు. ఆయనపై భక్తితో మరి కొందరు పాదాభివందనం కూడా చేస్తుంటారు. మొహమాట పడకుండా నమస్కరించిన వారినందరినీ ఆశీర్వదిస్తూ, అడపాదడపా చమత్కార సంభాషణలతో అక్కడి వాతావరణాన్ని ఆనందమయంగా మార్చే ఆ పెద్దాయన పేరు వెంకట ఆనందకృష్ణ రంగారావు.

సినీ, సాహిత్య రంగంలో స్థిరపడిన ప్రముఖులందరూ ఆయన్ని ‘వీఏకేఆర్’ అంటుంటారు. బొబ్బిలి జమిందారీ వంశీయులైన వీఏకేఆర్ సొంతవూరు కృష్ణాజిల్లా లక్కవరం. పుట్టింది, పెరిగింది అంతా మద్రాసులోనే.1930లోమద్రాసులోనే జన్మించారు. చిన్నతనం నుంచీ నాట్యకళపై ఆసక్తి పెంచుకున్నవీఏకేఆర్ 1960లోవళువూర్ రామయ్యపిళ్లై దగ్గర శిష్యునిగా చేరారు. అడయార్ లక్ష్మణ్, శాంతా ధనుంజయ్ దంపతులతో పాటు కళానిధి నారాయణన్ నుంచి నాట్యకళ, అభినయాన్ని నేర్చుకున్నారు. తర్వాత పద్మా సుబ్రహ్మణ్యం దగ్గర భరతశాస్త్రం నేర్చుకున్నారు. పుట్టింది రాజకుటుంబం కావడం వల్ల అప్పట్లో సామాన్యుల సహవాసం చేయొద్దని తల్లిదండ్రుల నుంచి ఆంక్షలు ఉండేవి. రాజమందిరంలో పనిచేసే దేవదాసీల వల్ల నాట్య కళ రుచి తెలిసింది. అనతికాలంలోనే ఆయన నాట్యంలో ఎంతో అనుభవమున్న నాట్యాచార్యునిగా, కళా విమర్శకుడిగాఎదిగారు. పాత్రోచిత నటనలోనూ, నృత్యంలోనూ పొరపాట్లు జరిగితే మొహమాట పడకుండా కుండకొట్టినట్లు చెప్పే వ్యక్తి వీఏకేఆర్.

భగవంతుడికి నృత్య నివేదన..
రంగారావులోమరో అద్భుతకోణం ఉంది. ఏటా రెండుసార్లు భగవంతుడికి నృత్య నివేదన చేస్తుంటారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో ఏటా ఆషాడశుద్ధ సప్తమికి సాక్షాత్కారోత్సవ వైభవం జరుగుతుంది. చిత్తూరుజిల్లా పుత్తూరు సమీపంలోని కార్వేటి నగరంలో వేణుగోపాలస్వామి ఆలయంలో కృష్ణాష్టమి పండగ వైభవంగా జరుగుతుంటుంది. ఈ రెండు ఉత్సవాల్లోనూ వీఏకే రంగారావు గజ్జెకట్టి అన్నమయ్య కీర్తనలతో సరస రసపూరిత పదాలు, జావళీలతో స్వామివార్లకు నృత్య కైంకర్యం చేస్తుంటారు. ఈ పూజను 41 ఏళ్ల కిందట మొదలుపెట్టి ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా జరుపుతున్నారు.

సాహిత్య సేవ ప్రశంసనీయం..
తెలుగు సాహిత్యంపై వీఏకేఆర్‌కున్న పట్టు అసామాన్యం. బ్రహ్మశ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి శిష్యరికంలో, శ్రీ ఆరుద్ర గారి సాన్నిహిత్యంలో అపారమైన మేథాసంపత్తిని వీఏకేఆర్ సొంతం చేసుకున్నారు. శ్రీ మల్లాదివారి శిష్యరికం చేసినప్పటికీ, వారి'చలవ మిరియాలు'లాగా ఉండవు వీరి విమర్శలు. ఈయన పుస్తక సమీక్షలు చాలా కర్కశంగా ఉంటాయి. తప్పు జరిగితే సహించే మనస్తత్వం ఆయనలో లేదు. ఈయన రచించిన ఆలాపన, త్రివేణి గ్రంథాలు ముద్రితమయ్యాయి. స్వర్ణయుగంలోని సినిమా సంగతులు, సంగీతం, పుస్తక సమీక్షలు తదితర సంగతులన్నీ ఆలాపన గ్రంథంలో కదంబంలాగా మాల అల్లారు. అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాణి పదాలకు నాట్యకళాకారులు ఎలా అభినయించాలో తెలియజేసే గ్రంథం త్రివేణి. ఇవి రెండూ మేథావుల ప్రశంసలు పొందాయి. సంగీత సాహిత్య విషయాల మీద వీరు వ్రాసిన సమీక్షలు, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్స్, మద్రాస్ మెయిల్, శ్రుతి,స్క్రీన్ లాంటి ఆంగ్లపత్రికలతో పాటుగా, ఆంద్రపత్రిక, విజయచిత్ర, ఆంధ్రప్రభ, జ్యోతి లాంటి వివిధ పత్రికలలో ప్రచురించబడేవి. కర్ణాటకసంగీతం, భరతనాట్యం, కూచిపూడి, యక్షగానం, లలిత సంగీతం, వాద్య సంగీతం....  ఇలా ఒకటేంటి, వారికి పరిచయం లేని కళారంగం లేదంటే అతిశయోక్తి లేదు. హిందుస్తానీ సంగీతాన్నికూడా సమీక్షించే సత్తాగల వారు ఈయన. సమీక్షలలో,ఆయన ఇచ్చే మంచి మార్కుల కోసం ఆత్రుతతో వేచి చూస్తుంటారు కళాకారులు, నాటినుండి నేటివరకు.

గ్రామఫోన్ రికార్డుల సేకరణ..
ఎవరూ తనతో పలకని రోజుల్లో గ్రామ్‌ఫోన్ రికార్డులే ఆయన గురువులయ్యాయి. అందుకే  షుమారు 52వేల రికార్డులను సేకరించారు. ఎవరెప్పుడు అడిగినా రెండునిమిషాల్లో రికార్డు తీసి చేతిలో పెట్టగలిగే నేర్పుగా వీటిని భద్రపరచడం వీఏకేఆర్‌కే చెల్లింది. కేవలం లలిత కళల్లోనే కాకుండా వృక్షశాస్త్రం, పాకశాస్త్రం వంటి ఇతరరంగాల్లోనూ అనుభవముంది. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలికి ఎన్నో సత్కారాలు జరిగాయి. సంగీత, సాహిత్యాలలో పరిశోధన చేసే విద్యార్ధులకు వీరు మార్గ దర్శకత్వం వహించేవారు. ఎక్కడా దొరకని విషయాలు కూడా వీరి వద్ద లభ్యపడుతాయి. 80 ఏళ్ళ వయసులో కూడా నవయువకుడి వలే ఉత్సాహంగా కళాసేవ చేస్తున్న ఈ కళాసేవకుడికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని భగవంతుని వేడుకుందాం!

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి