ఆంధ్ర, తెలంగాణ విడిపోయాయి. నన్ను చాలామంది అడిగారు... 'గోతెలుగు.కామ్' ఆంధ్రా వాళ్ళదా? లేక తెలంగాణా వాళ్ళదా? అని! వారందరికీ ఒకే సమాధానం... ఇది 'తెలుగు' వారిది! ఇంతవరకు గోతెలుగు.కామ్ అనేది ఒక్క రాష్ట్ర ప్రజలకే! కానీ.. ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల కొరకు! ఇందులో రాజకీయాలకి చోటు లేదు కనుక తెలుగు మాట్లాడే వారందరిదీ! తెలుగు భాష ఒక్కటే... రాష్ట్రాలు వేరైనా భాష మారదు - 'గోతెలుగు.కామ్' కేవలం రాష్ట్రాలకి పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారందరిదీ! మనందరిదీ!!
రాష్ట్రాలు విడిపోవచ్చు.. కానీ 'తెలుగు భాష'ని ఎవరూ విడదీయలేరు. తేనెలొలుకు తెలుగుభాష ఏ ఒక్కరి సొత్తూ కాదూ.. మనందరి సొత్తు! అందుకే 'గోతెలుగు' ను ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు వారందరూ అభిమానిస్తున్నారు.... ప్రోత్సహిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తరువాత దేశంలో ఒక భాషను ఒక రాష్ట్రం కంటే ఎక్కువగా మాట్లాడేది హిందీ తరవాత తెలుగుకే సాధ్యం అయ్యింది. యాస మారినా భాష మారదుగా!!
'జై తెలుగుతల్లి!'
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి
అమరావతి నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి ......