నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
______________________________________________________________________
స్వీడన్ లోని హెల్సిన్ బోర్గ్ కి చెందిన ఓ 20 ఏళ్ళ దొంగ తోటపని సామాగ్రి అమ్మే ఓ దుకాణంలోకి ఓ సాయంత్రం వెళ్ళి దాక్కున్నాడు. ఉద్యోగస్థులంతా షాపుకి తాళాలేసుకొని వెళ్ళిపోయాక అతను నగదున్న ఇనప సేఫ్ ని పగలకొట్టి డబ్బుదోచుకున్నాడు. ఇంతదాకా అతని పథకం సక్రమంగానే సాగింది. ఆ తర్వాత అతను బయటపడటానికి మార్గమే కనబడలేదు. అన్ని తలుపులు ఇనప రేకుతో చేసినవే.
మర్నాడు ఉద్యోగస్థులు వచ్చి దుకాణం చెరిచాక అతన్ని గమనించి పట్టుకున్నారు.
న్యూ మెక్సికో లోని అల్ బూ క్యురెక్యుకి చెందిన 47 ఏళ్ళ క్లారెన్స్ మే క్కోమ్ అనే అతను వాషింగ్ టన్ రాష్ట్రంలో కార్ పూల్ లేన్ లో (కార్లో కనీసం 5 మంది ఉంటేనే ప్రయాణించడానికి అర్హమైన మార్గం) ఒక్కడే ప్రయాణిస్తుంటే ట్రాఫిక్ పోలీసులు అతన్నాపారు. అతని పేరుని రొటీన్ గా పాతక్రిమినల్ రికార్డ్ కోసం కంప్యూటర్ చెక్ చేస్తే అతను 1978 లో తన భార్యని గొంతుపిసికి చంపగా శిక్షపడి, జైలు నించి తప్పించుకున్న నేరస్థుడిగా గుర్తించారు. తక్షణం అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపారు.