సాహీతీ వి'శారద' - టీవీయస్. శాస్త్రి

Sahitee Vi'sarada'

తెలుగు సాహిత్యంలో 'శారద' కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దురదృష్టమేమంటే, 'శారద' అంటే చాలా మందికి తెలియదు. ఆ మహనీయుని గురించిన చిన్న పరిచయమే ఈ వ్యాసం. శ్రీ యస్.నటరాజన్ అనే వ్యక్తి 'శారద' గా మారటం వరకు ఆయన జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. శ్రీ ఆలూరి భుజంగరావు గారు వ్రాసిన సాహిత్య బాటసారి--'శారద' అనే జీవిత చరిత్రలో, 'శారద'ను గురించిన కొన్ని విషయాలు చదువుతుంటే, కన్నీళ్లు వచ్చాయి.

తమిళనాడులోని పుదుక్కోట ఆయన జన్మస్థలం. భాగీరధి, సుబ్రహ్మణ్య అయ్యర్లు వీరి తల్లితండ్రులు.1924 లో తల్లి తండ్రులకు ఆఖరివాడిగా, అతి బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారికి పూట గడవటమే కష్టం. అట్టి పరిస్థితులలో,నటరాజన్ జోలెబట్టి మధూకరం తెచ్చుకొని చదువుకుంటమే కాకుండా, తల్లి తండ్రులను కూడా పోషించాడు. ఖాళీ సమయాలలో, దేవాలయాల వద్ద గంధం, విభూతి అమ్మి కొంత ధనాన్ని సంపాదించేవాడు. అతి చిన్న వయసులోనే,ప్రాచీన, ఆధునిక తమిళ సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. ఎక్కువగా హాస్య, వ్యంగ్య రచనలు ఆయనను ఆకట్టుకున్నాయి. సహజంగా ఆయనకు సునిశితమైన హాస్య దృష్టి అబ్బింది.నటరాజన్ తన రెండవ ఏటనే తల్లిని కోల్పోయారు. అక్కలిద్దరినీ తెనాలికి చెందిన వారికిచ్చి వివాహం చేయటంతో, సుబ్రహ్మణ్య అయ్యర్ నటరాజన్ తో తెనాలికే చేరాడు.

1937 లో తెనాలికి వచ్చారు. మొదటినుండీ పుస్తకాలను చదవటం, స్వయంగా కొత్త విషయాలను నేర్చుకోవటం నటరాజన్ కు అలవాటు. అలానే, ఆయన, ఆంగ్ల,ఫ్రెంచి భాషలను నేర్చుకోవటమే కాకుండా, నెమ్మదిగా ఆ భాషల్లో ఉన్న కథలను తమిళంలోకి అనువదించటం ద్వారా, తనలోని రచయితను మేల్కొలిపాడు.తెనాలికి వచ్చినప్పుడు ఆయనకు తెలుగు మాట్లాడటం గానీ,వ్రాయటం గానీ తెలియనే తెలియదు.తెలుగును నేర్చుకోవాలని ఆయనకు ఎంతో ఉబలాటం ఉండేది. కానీ, అతని ముందర ఉన్న సమస్య పొట్టనింపుకోవటం, తండ్రిని పోషించటం. తెనాలిలో మారీసుపేటలో ఉన్న 'ఆంధ్ర రత్నహోటల్ 'లో సర్వర్ గా చేరాడు. (అదే పేరుతో అక్కడ హోటల్ చాలాకాలం వరకూ ఉంది. యాజమాన్యంవారు మారి ఉండవచ్చు.) ఇక తెలుగు నేర్చుకోవటం తప్పని సరి అయింది, హోటల్ కు వచ్చిన వారితో మాట్లాడటం మొదట నేర్చుకున్నాడు. తరువాత స్వయంగా తెలుగు భాషను చదవటం, వ్రాయటం నేర్చుకున్నారు.

ఆ రోజుల్లోనే, ఆయన ఆంగ్ల పత్రికలలోని పజిల్సును పూర్తి చేసేవారు. అలా, చాలా సార్లు బహుమతులు కూడా పొందారు. తెలుగులో ప్రాచీన సాహిత్యం వైపు పోకుండా, ఆధునిక, సమకాలీనపు సాహిత్యాన్ని విశ్లేషణాత్మకంగా చదవటం అలవాటైంది. కొడవటిగంటి, చలం లాంటి వారి సాహిత్యాన్ని బాగా అర్ధం చేసుకున్నారు. కనిపించిన ప్రతి తెలుగు పుస్తకాన్ని చదివేవారు. అలా నటరాజన్ కాస్తా'శారద' అయ్యాడు. ఆయనకు తెనాలిలో తెలుగు నేర్పిన అధ్యాపకుడు శ్రీ తురగా వెంకటేశ్వరరావుగారు. వారు,'శారద' చేత గజేంద్రమోక్షం, శ్యామలాదండకం లాంటివి కంఠస్తం చేయించారు. శారద,తన పదిహేనవ ఏటనే తండ్రని కూడా పోగొట్టుకున్నాడు. ఏకాకి అయిన 'శారద' తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. ఒక రకమైన షాక్ కు గురయ్యాడు. తండ్రికి దహన సంస్కరణలు చేసిన నాటి రాత్రే మూర్ఛ వ్యాధికి గురయ్యాడు 'శారద'. ఆఖరికి ఆ వ్యాధే అతనిని మృత్యులోకాలకు తీసుకొని వెళ్ళింది. కాలువ పక్క పడిన అతని మృతదేహాన్ని మరుసటి రోజుకు గానీ గుర్తించలేకపోయారు. అలా అర్ధాంతరంగా ముగిసింది 'శారద' జీవితం!ఇక ఆయన రచనా వ్యాసంగ విషయాలకు వస్తే, తొలిసారిగా ఆయన వ్రాసిన వ్యంగ్య రచన 'ప్రపంచానికి జబ్బుచేసింది'. ఇది 1946 లో ప్రజాశక్తి పత్రికలో ప్రచురించబడింది. ఆ రచన వారి సొంత పేరైన యస్.నటరాజన్ పేరు మీదే అచ్చయింది. ఆ రోజుల్లోనే, ఆయన 'ప్రజావాణి' అనే వ్రాత పత్రికను ప్రారంభించారు. ఆ తరువాత 'చంద్రిక'ను మొదలు పెట్టారు. అయితే, వాటిని అనారోగ్య పరిస్థితులు, ఆర్ధిక స్తోమత లేకపోవటం వల్ల ఎక్కువకాలం కొనసాగించలేకపోయారు.

1948 నుండి1955 వరకు అంటే ఏడేళ్ళు మాత్రమే రచనలు చేసారు.తెలుగు స్వతంత్ర, జ్యోతి,హంస వంటి పత్రికలు ఆయనకు మంచి ఊతమిచ్చాయి. ప్రస్తుతం, రక్తస్పర్శ , శారదరచనలు, శారద నవలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా, 'శారద' అభిమానుల పూనికవల్లనే వెలుగు చూసాయి. శారద, రావూరి భరద్వాజ గార్లు దాదాపుగా ఒకే సమయంలో రచనలను ప్రారంభించారు. ఇద్దరి మీదా చలం గారి ప్రభావం పూర్తిగా ఉంది. శారద జీవితమంతా దరిద్రంతోనే గడిచింది. ఒక చేత్తో గారెలు చేసి అమ్ముతూ, మరో చేత్తో 'మంచి-చెడు' అనే నవలను వ్రాసారు. ఎంత దుర్భర పరిస్థితులు ఎదురైనా రచనా వ్యాసంగాన్ని మానలేదు. ఇక అతని శైలి చాలా భిన్నమైనది. ఎంచుకునే కథా వస్తువు విభిన్నంగా ఉండేది. ఈ రెండు లక్షణాలే శారదను తెలుగు సాహితీలోకంలో విశారదుడిగా నిలబెట్టాయి."కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి గార్ల రచనలకు వారధి వంటి వాడు శారద" అని ఆ రోజుల్లోనే సాహితీ ప్రియుల మన్ననలను పొందాడు శారద.

కార్మిక ఉద్యమాలతో సంబంధమున్న ఈయన రచనలలో, కార్మికుల జీవనవిధానం కనపడేది. కమ్యూనిస్టు పార్టీలో గుర్తింపు పొందిన కార్యకర్త. ఇంతటి సాహితీ సుసంపన్నుడైన 'శారద' దుర్భర దారిద్ర్యంతో, మూర్ఛవ్యాధితో,17-08-1955 న, తన 31 ఏటనే శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు. ఇదీ, 'శారద నీరదేందు ఘనసార' కన్నీటి కథ. నటరాజన్ అనే తమిళ యువకుడు 'శారద'గా మారిన నిజమైన కథ. 'శారద'జీవితం మరో సత్యాన్ని చెబుతుంది--కష్టాల కొలిమినుండే ప్రజలకు ఉపయోగపడే సజీవ సాహిత్యం ఉద్భవిస్తుంది. ఆకలిదప్పులు,దరిద్రం అతనిని భౌతికంగా బాధపెట్టాయేమో కానీ, అతనిలోని సాహితీ పిపాసను అంటుకోవటానికి, అడ్డుకోవటానికి కూడా అవి భయపడ్డాయి. కేవలం అతను ఒక రచయితే కాదు, తత్వవేత్త, క్రాంతదర్శి, దార్శనికుడు.

తెనాలిలో ఆయన స్మారకచిహ్నాలు లేకపోవటం చాలా విచారకరం. ఆ మహనీయుని ఫోటో కోసం, నా దగ్గరవున్న ఆయన నవలనొక దానికోసం వెదికాను.ఆ నవల వెనకవైపు అట్టమీద ఆయన ఫోటో ఉంది. ఆ నవల కోసం ఎంత వెదికినా కనబడలేదు. "మంచి పుస్తకాలకు రెక్కలు వచ్చి ఎగిరి పోతాయి" అన్న నార్ల వారి మాటలు నిజమే కాబోలు. ఎలాగో ఆయన ఫోటోను సంపాదించాను.  తెలుగువారికి మంచి కథలను అందచేయటానికే ఆంధ్రదేశానికి వచ్చిన ఈ విశారదుడికి బాష్పాంజలి!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి