మధ్యతరగతి మనస్తత్వాలు - భమిడిపాటి ఫణిబాబు

middle class mentalities

దో ఐటి రంగం ధర్మమా అని గత కొన్ని సంవత్సరాలుగా అయిదంకెల్లోనూ, ఆరంకెల్లోనూ జీతాలొస్తున్నాయి కానీ, తొంభైయ్యో దశకానికి పూర్వం చాలా మంది, మధ్య, దిగువ తరగతి బాపతు జనాలే. 21 వ శతాబ్దం వచ్చేసరికి, అప్పటిదాకా ఆ వర్గానికే చెందిన ప్రభుత్వోద్యోగులు కూడా అప్పర్ మిడిల్ క్లాసులోకి వచ్చేశారు. చేతిలో డబ్బులున్నప్పుడే కదా, వేషాలన్నీ వేసేదీ? అయినా పునాది మాత్రం మధ్యతరగతిదేకదా. లక్షణాలు ఎక్కడికిపోతాయి? అందువలన ఈ వ్యాసం ఎవరినో ఉద్దేశ్యించింది కాదు, మనందరిదీనూ. ఇందులో పెద్దగా సిగ్గుపడాల్సిందేమీ కూడా లేదు. ఎప్పుడైనా ఎవరైనా సరే, భూమి మీద కాళ్ళు తగిలిస్తూ జీవనం లాగించాల్సిందే. అందుకే చూస్తూంటాము, ఈ తరం వారు, చేతినిండా డబ్బులు ఆడడంతో, ఒకరూపాయి ఖర్చుపెట్టాల్సిన చోట, అయిదు రూపాయలు ఖర్చుపెట్టి, వారి so called affluence చూపించుకున్నా, వారి తల్లితండ్రులు మాత్రం పాపం ఇంకా పాతవాసనలనుండి బయటపడలేకున్నారు. ఇప్పుడంటే పిల్లలకి అన్నేసి జీతాలొస్తున్నాయి కానీ, వారు పుట్టిపెరిగింది మధ్యతరగతిలోనేగా.

ఎవరినైనా చూసి వీడు మధ్యతరగతి వాడూ అని తెలిసికోడానికి, కావాల్సినన్ని లక్షణాలు ఉన్నాయి. అదేమీ పెద్ద ఘనకార్యమేమీ కాదు. రైల్లో స్లీపర్ లో ప్రయాణం చేస్తున్నారనుకోండి, పగటి పూట కూడా, రిజర్వు చేయించుకున్న అధికారంతో త్రీ టయర్ లో, మధ్య బెర్తు తెరిచేసి నిద్రపోయేవాడు. వీళ్ళు ఈమధ్యన సీనియర్ సిటిజెన్ కన్సెషన్ల ధర్మమా అని ఏసీ త్రీ టయర్ లో ప్రయాణం చేసినా సరే, మధ్యతరగతి వాసనలు మాత్రం పోవు. ఏసీ లో వెళ్ళేటప్పుడు, ప్రతీ స్టేషను లో రైలు ఆగినప్పుడల్లా బయటకు వచ్చినుంచోడం, ప్రక్కనే సాధారణ బోగీ ఉంటుంది, వాళ్ళకు తెలియొద్దూ, మనం ఏసీలో ప్రయాణం చేస్తున్నామనీ? పైగా బోగీ అద్దాల్లోంచి ఏమీ కనిపించదు కూడానూ..

ఎప్పుడైనా బజారుకి వెళ్ళినప్పుడు, ఈరోజుల్లో అయితే పోనీ మాల్స్ అనుకోండి, అక్కడుండే వస్తువుల ధర ఎంతా అనడం. అసలు ఛాన్సంటూ వస్తే, బేరం చేసినా చేసుండేవాడనుకోండి, వాళ్ళ కొడుకో, కూతురో, కోడలో చివాట్లు పెట్టుండకపోతే. మరీ అల్లుళ్ళు అంతంత తెగించేయరనుకోండి. పోనీ అక్కడైనాచెయ్యి ఊరుకుంటుందా, ప్రతీదీ, ఓసారి తడివి చూడ్డం, కొనేదీ లేదూ పెట్టేదీ లేదు. ఇంక ఏ Exhibitions/Fairs  కీ వెళ్ళినప్పుడైతే, తిండిపదార్ధాల stalls దగ్గరైతే ప్రతీదీ రుచి చూడ్దం, ఎంతలా రుచి చూస్తారంటే, మొత్తం రౌండు పూర్తయేసరికి ఆ పూటకి ఇంటికెళ్ళి తినక్కర్లేనంత. ఇంక పెళ్ళి భోజనాల్లో అయితే పూర్తిగా వీధిన పడిపోతూంటారు. ఈమధ్యన ఏ రిసెప్షన్ కి వెళ్ళినా డిన్నరు కూడా అదే పూట పెట్టేస్తూంటారు, నూటికి డెభైమందిదాకా, పెళ్ళిమాటెలా ఉన్నా, ఈ రిసెప్షన్లకి తప్పకుండా ఎటెండవుతూంటారు. ఈమధ్యన అంతా హై ఫై  వ్యవహారాలే కదా. ఇదివరకటి రోజుల్లో లాగ ఏదో అరటి ఆకుల్లో బంతి భోజనాల లా కాదుగా, ఓ పదో పదిహేనో కౌంటర్లూ, పైగా ఎన్ని కౌంటర్లు పెడితే అంత గొప్పాయె. ఆ భోజనాలకి వెళ్ళేముందర, ఓ విషయం గమనిస్తూంటాము, ఆ పెళ్ళికి క్యాటరింగు చేస్తున్నవాడి మనుషులు ఓ యూనిఫారం వేసికుని ఓ  ట్రే లో అవేవో స్టార్టర్లట పెట్టుకుని రావడం, అందరిదగ్గరకూ వెళ్ళడం, అక్కడదేదో పుల్ల (Tooth pick) లాటిదానితో దేంట్లోనో గుచ్చడం, దాన్ని కాస్తా నోట్లో పడేసికోడం. దాన్ని డైరెక్టుగా పట్టుకుని తీసికోకూడదుట. ఇంతలో ఇంకోడెవడో డ్రింక్స్ పట్టుకుని వచ్చేవాడొకడూ, మనకివ్వకుండా పోతాడేమో అని భయం!  అలాటివాళ్ళొచ్చినప్పుడల్లా, ఏదో ఒకటి తీసికుంటాడే వాడు తప్పకుండా మధ్య తరగతివాడే. ఎందుకంటే, కొద్దిగా పైతరగతి వాళ్ళు, సుతారంగా ఒక్కటంటే ఒక్కటే తీసికుంటారు, మరి వాళ్ళ status తెలియొద్దూ? తరువాత బఫే యో అదేదో దాంట్లో ఎలాగూ లాగిస్తాడుగా, మధ్యలో ఆ తిండియావ ఎందుకో? పైగా వీటన్నిటినీ వీడియో తీసేవాడొకడూ. పెళ్ళి అయిన తరువాత ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది మన నిర్వాకమేమిటో!! ఇంకో ముఖ్యలక్షణమేమిటంటే కొడుకుదో, కూతురిదో కారులో వెళ్ళేటప్పుడు ఫ్రంట్ సీటు లో కూర్చుని చేతులు బయటపెట్టుకుని, ప్రత్యేకంగా బస్ స్టాపుల్లో బస్సుకోసం వేచిఉండేవాళ్ళని చూడ్డం! అదో పైశాచిక ఆనందం - చూశారా ఎలా వెళ్తున్నానో, మీరూ ఉన్నారు... అనే అర్ధం వచ్చేలాగ. అంతకుముందు ఈయనా అలా బస్సులకోసం పడిగాపులు పడ్డవాడే, హాయిగా వెళ్ళకూడదూ, అలాటప్పుడే మనలో నిద్రపోతూన్న మధ్యతరగతి మనస్థత్వం బయటకొచ్చేస్తూంటుంది. ఎప్పుడైనా పిల్లలతో ఏ పెద్ద హొటల్ కి వెళ్ళినా సరే, చేతులతోనే తినడం, అంతేకాదు వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళే చేతులు కడుక్కోడం, హొటల్ వాడు అవేవో వేణ్ణీళ్ళూ, నిమ్మకాయబద్దా తీసుకొచ్చినాసరే. అలా చెప్పుకోవాలంటే, చాలా సందర్భాల్లో expose అయిపోతూంటారు మన మధ్యతరగతి వారు. ఏం చేస్తాం “మూలాలు” అవేగా. అలాటి లక్షణాల్లోనే మరొకటి - ఇంట్లో ఉండే పిల్లల పుట్టినరోజులకి ఎవరైనా గిఫ్టులు తెచ్చినప్పుడు, వాటిని pack చేసిన రంగుకాగితాలు( wrapper) జాగ్రత్తగా చింపి దాచుకోడం, మనం ఎవరికైనా గిఫ్టులు ఇద్దామనుకున్నప్పుడు దాన్ని చుట్టబెట్టి ఇవ్వచ్చని!! వారపత్రికలూ అవీ అమ్మేసేటప్పుడు వాటిలోని ముగ్గులూ, వంటలూ,ఆధ్యాత్మిక వ్యాసాలూ జాగ్రత్తగా చింపి, వాటిని దాచుకోవడం. ఏ కాలు బెణికినప్పుడో డాక్టరుగారు అదేదో fomentation పెట్టమన్నప్పుడు, వేణ్ణీళ్ళు కాచి ఓ గుడ్డ ముంచి “కాపడం” లాటిది పెట్టడం, ఇంట్లో అవేవో రబ్బరు బ్యాగ్గులు ఉన్నాసరే. ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినప్పుడు, మన ఇంట్లోని పిల్లల ఆటవస్తువులు ఆ వచ్చిన పిల్లలకే ఇచ్చి వాళ్ళని ఆడుకోమనడం. దీనికి సాయం బయటకు వెళ్ళినప్పుడు, మన పిల్లలతో “పేచిపెట్టకండిరా..” అనే ఆంక్షలు పెట్టడం.

అలాగని వీరిలో మంచివి లేవని కాదు. ముఖ్యంగా ఆడవారిలో కనిపించిన ప్రతీవారితోనూ ఏదో ఒక బంధుత్వం ఏర్పరిచేసికుని “అన్నయ్యగారూ, బాబయ్య గారూ,  అత్తయ్యగారూ, వదినగారూ...” అంటూ వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించేయడం. ఇలాటి మనస్థత్వం మధ్యతరగతి వారిలో కాకుండా ఇంకెవరిలో ఉంటుందంటారు? ఎప్పుడో వీరి పెళ్ళిలోనో ఇంకో ఫంక్షనులోనో వీరికి ఏదో చీర పెట్టారనో, వీరి కొడుకు/కూతురు బారసాల కి ఏదో చేతిలో పెట్టారనో గుర్తుపెట్టుకుని, జీవితాంతం వారు వచ్చినప్పుడూ, వాళ్ళింట్లో ఫంక్షన్లయినప్పుడు, ఏదో ఒకటి తప్పనిసరిగా ఇస్తూండడం.

రైళ్ళలో ప్రయాణం చేస్తూన్నప్పుడు, తాము తెచ్చుకున్న టిఫినో, పెరుగన్నమో, పులిహారో తమతోపాటు ప్రక్కనున్నవాళ్ళకి కూడా ఆఫరు చేయడం. చాలా sincere గా, క్యూలో నుంచున్నాడంటే అది మధ్యతరగతివాడే చేయగలడు.

మధ్య తరగతి మనస్థత్వాల్లో, చెప్పుకోవాల్సిందల్లా ఒక  ముఖ్యమైనది, వీళ్ళు చాలా “అల్ప సంతోషులు”. వీళ్ళు చిన్నచిన్న సంతోషాలకే ఎంతో ఆనందపడిపోతూంటారు. ఉదాహరణకి, ఈ రోజుల్లో ఉన్న బిజీ లైఫ్ లో, ఊళ్ళోనే ఉండే కొడుకులో, కూతుళ్ళో ఒకసారి కారులో తీసికెళ్ళారంటే చాలు, తెలిసినవారందరికీ చెప్పుకుంటారు, “మా అబ్బాయి ఈవేళ ఫలానా చోటుకి తీసికెళ్ళాడూ..” అని. కూతురూ అల్లుడూ ఓ హొటల్ కి తీసికెళ్ళినా అంతే, ఆ సంతోషం నలుగురితోనూ పంచుకుంటేనే కానీ, ఉండలేరు. ఇది పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉండేవారికి చిత్రంగా కనిపించొచ్చు, కానీ మధ్యతరగతి తల్లికి మాత్రం అదో పెద్ద పండగలా ఉంటుంది.అలాగే మనవళ్ళూ, మనవరాళ్ళూ స్కూల్లో ఏదైనా మంచి ర్యాంకు లో వచ్చినప్పుడు ఎంతో సంతోషపడిపోతారు.

తమ సంతోషాన్ని వ్యక్త పరిచే పధ్ధతిని బట్టి ఎంతో సులభంగా చెప్పేయొచ్చు, ఈవిడ తప్పకుండా, మధ్యతరగతి ఇల్లాలే అని !!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి