అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు - టీవీయస్. శాస్త్రి

amarajeevi shri Potti Sreeramulu

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీ రాములు. అంతకు ముందు శ్రీ స్వామి సీతారం 38 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మధ్యలోనే విరమించారు. 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం లేకపోవటం చాలా బాధాకరమైనది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం కూడా ఒక భాగంగా ఉండి తమిళుల పరిపాలనలో ఎన్నో బాధలు, ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆంధ్రులు అంతా ఏకమై స్వంత రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు.

శ్రీ పొట్టి శ్రీ రాములు గారు,19 -10 -1952 న,మైలాపూరు,మద్రాసు లోని,స్వాతంత్ర్య సమరుడు శ్రీ బులుసు సాంబ మూర్తి గారి గృహంలో నిరసన వ్రతం ప్రారంభించారు.58 రోజులు తన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించి,చివరకు, 16-12-1952 న అమరజీవి అయ్యాడు.ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర ఉద్యమం 1910 లోనే ప్రారంభం అయింది.1913 లోనే,ప్రధమ ఆంద్ర మహాసభలు బాపట్లలో నిర్వహించారు.ఈ ఉద్యమంలో శ్రీ న్యాపతి సుబ్బారావు, శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు, కొండా వెంకటప్పయ్య,శ్రీ స్వామీ సీతారాం  మొదలగు ప్రముఖులు పాల్గొన్నారు. వీరంతా మహాత్మాగాంధీని కూడా కలుసుకొని ప్రత్యేక రాష్ట్ర అవశ్యకతను గూర్చి వివరించి నప్పుడు స్వాతంత్ర్య అనంతరం ఈ సమస్యకు పరిష్కారం చూడగలమని హామీ ఇచ్చారు. ఈ ధ్యేయానికి సరైన పరిష్కారం దొరక్క పొట్టి శ్రీ రాములు గారు నిరవధిక నిరాహార దీక్ష గావించి ఈ ఉద్యమానికి ఆయువుపట్టునిచ్చారు.

శ్రీ రాములు గారు ఎవరెన్నిచెప్పినా, పత్రికల ద్వారా సంపాదకీయాలు రాసినా వాటిని పెడచెవిన పెట్టి దీక్షను కొనసాగించి అమరవీరులైనారు. ప్రజలు రెచ్చిపోయి విశృంఖలంగా అనేక దౌర్జన్యాలకు పూనుకున్నారు. యావత్ ప్రపంచం ఈయన త్యాగాన్నికొనియాడింది.. అప్పటి భారత ప్రధాని జవర్‌హాల్‌ నెహ్రూ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయుటకు అంగీకరించి ఆంధ్రులకే కాక తమిళ, కేరళ మరాఠీ, గుజరాతీలకు ప్రత్యేక రాష్ట్రాలు ప్రసాదించారు. శ్రీ పొట్టీ శ్రీ రాములుగారు నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లి గ్రామంలో 1901 మార్చి 16వ తేదిన జన్మించారు. మద్రాస్‌లో విద్యాభ్యాసం గావించారు. తర్వాత సానిటరీ ఇంజనీరు విద్య కోసం బాంబే వెళ్ళారు. కొంతకాలం రైల్వే శాఖలో పనిచేశారు. చిన్న వయసులోనే భార్యా వియోగం కలిగింది.

1927లో శ్రీ రాములు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీజీ పిలుపు మేరకు జాతీయ ఉద్యమంలో సబర్మతి  ఆశ్రమంలో చేరారు. ఆయన నిరాడంబరతను, మానవ సేవను గుర్తించి గాంధీజీ, "శ్రీ రాములు వంటి పది మంది కార్య ధీక్షాపరులు ఉంటే దేశ స్వరాజ్యం ఒక సంవత్సర కాలంలో సాధించవచ్చని" చెప్పారు. కృష్ణాజిల్లాలోని కొమ్మరవోలు గ్రామం, గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో గల గాంధీజీ ఆశ్రమాల్లో శ్రీ రాములు గొప్ప సేవలు అందజేశారు. 1938-42 మధ్యలో దేశ స్వాతంత్ర్యం కోసం నిర్వహించిన అనేక సత్యాగ్రహాల్లో పాల్గొని అనేక మార్లు జైలు శిక్ష అనుభవించారు.

1944లో నెల్లూరు జిల్లాను కేంద్రంగా చేసుకొని ఖద్దర్ వాడకంపై ప్రచారం చేపట్టారు. 1946లో నెల్లూరు పట్టణంలోని మూలాపేటలో గల వేణుగోపాలస్వామి దేవాలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరసన వ్రతం చేసి వారికి ఆలయ ప్రవేశం కావించుటలో సఫలీకృతులయ్యారు.చివరి రోజుల్లో చాలా కాలం నెల్లూరు జిల్లాలోని పలుప్రాంతాలలో హరిజనోద్దరణ కోసం పాటు పడ్డారు. ఆయన ఙ్ఞాపకార్ధం హైదరాబాద్ నగరంలో తెలుగు విశ్వవిద్యాలయానికి శ్రీ పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయంగా పేరు పెట్టారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాను 'శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా'గా పేరు మార్చారు. తెలుగు వారి అందరికి స్వరాష్ట్రం ఏర్పాటు చేసిన త్యాగపురుషుడు, శ్రీ రాములు గారి ఆశయాలు, నిరాడంబరత పట్టుదల నేటి యువత నేర్చుకొని, ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు ఆంధ్రులు అందించే నిజమైన నివాళి అవుతోంది!

అమరజీవి త్యాగానికి ఘనమైన నివాళి సమర్పించుకుందాం!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి