పుస్తక సమీక్ష: బోయకొట్టములు పన్నెండు - సిరాశ్రీ

Book Review - Boyakottamulu pannendu

పుస్తకం: బోయకొట్టములు పన్నెండు (చారిత్రక నవల)
రచన: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె
వెల: 180/-

ప్రతులకు:
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్లె 
2-253, డి5ఎ,
సొసైటీ కాలనీ, మదనపల్లి-517325

రచయిత చరవాణి:9502304027



పుస్తకం చదివాక నలుగురు మిత్రుల్ని ఒక ప్రశ్న అడగాలనిపించి అడిగాను. "పురావస్తు ప్రదర్శన శాలలో చూసిన వాటిల్లో ఏవి గుర్తున్నాయి" అని. నలుగురు చెప్పిన సమాధానాల్లోను విరిగిపోయిన దేవతా విగ్రహాలు, రాతి యుగం- మధ్య యుగం నాటి పనిముట్లు, రాజులు వాడిన కత్తులు, కటార్లు, శిరస్త్రాణాలు, బల్లాలు, దుస్తులు, చిత్రపటాలు మొదలైనవి ఉన్నాయి కాని శాసనాలు చూసినట్టు ఎవరూ చెప్పలేదు. చరిత్ర మీద జిజ్ఞాస ఉంటే తప్ప శాసనాల జోలికి పోవు కళ్లు, మెదడు. ఒకవేళ కంటపడ్డా అప్పటికప్పుడు చదివేసి "ఓహో" అనుకుని వెంటనే మరిచిపోవడం తప్ప వాటి గురించి పెద్దగా ఆలోచించే వాళ్లు తక్కువే. కాని క్రీ.శ 848 నాటి ఒక చిన్న శాసనం ఒక రచయితని టైం మెషీన్ లోకి దాదాపు 1200 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయి 200 ఏళ్ల చరిత్రని అద్భుతంగా మన ముందుకు వచ్చేలా చేసింది. అది పండరంగని అద్దంకి శాసనం.

పండరంగడు అనే వాడు 12 బోయ కొట్టములు (మండలాలు లాంటివి) పడగొట్టాడు అనేది ఆ శాసనంలో సారాంశం. అసలు ఎవడీ పండరంగడు? ఎవిటా బోయ కొట్టములు? ఆ ఆసక్తితో శ్రీ సుబ్రహ్మణ్యం పిళ్ళె ఆలోచన మొదలుపెట్టారు. ఆసక్తి తపన అయ్యింది, తపన తపస్సు అయ్యింది. ఆ తపస్సు ఆయనని కాలంలో ప్రయాణించేలా చేసింది. 1200 ఏళ్ల క్రితానికి వెళ్లి చూస్తున్నట్టుగానే రాసారు ఆనాటి తెలుగు వారి చరిత్ర. వాస్తవ దూరం అనిపించని కల్పనలు, దేశ కాలమానాలకు సరిపోయే సన్నివేశాలు, చాళుక్య-పల్లవ రాజుల మధ్య రాజకీయాలు, దండయాత్రలు పాఠకులని పరుగెత్తిస్తాయి.

సరళ గ్రాంథిక భాషలో ఉందని ముందు కాస్త అనాసక్తితో మొదలుపెట్టినా నవలలోని విషయం భాషావరోధాన్ని దాటించేస్తుంది. కొంత సేపటకి ఆభాషలో, ఆ పదాలలో, ఆ పలుకుబడిలో తాదాత్మ్యం అయిపోవడం కూడా నిజం. చరిత్ర మీద, తెలుగు భాష మీద ఏ మాత్రం ఆసక్తి ఉన్న వారైనా ఈ నవలను నమిలి తీరాల్సిందే.

ప్రముఖ అవధాని శ్రీ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు మాటల మధ్యలో ఈ నవలను గురించి ప్రస్తావించారు. అట్ట అట్టహాసంగా లేకపోవడం, టైటిల్ టంగ్ ట్విస్టర్ లా ఉండడం, రచయిత గురించి నేనెప్పుడూ వినకపోవడం వల్ల పెద్ద ఆసక్తి కలగలేదు. కాని ఇంటికొచ్చి చదవడం మొదలుపెడితే ఒక భారీ బడ్జెట్ చారిత్రక చిత్రం చూస్తున్న అనుభూతి కలిగింది. ఆ కాలం నాటి రాజుల్లో కరకుదనం, రాజసం, సాహసం, రాజనీతి ఇలా అన్నీ ఉత్కృష్ట స్థాయిలో దర్శనమిస్తాయి.

ఇది తెలుగు వారి చరిత్ర. నన్నయ భారతం కంటే దాదాపు 300 ఏళ్ల క్రితమే తెలుగు పద్యం పుట్టిన తీరు ఒక కాల్పనిక సన్నివేశంలో రచయిత చెప్పారు. చందస్సు గురించి పైపైన తెలిసిన వారిని ఈ సన్నివేశం రంజింప చేస్తుంది.

ఇంకా ఇలా అనేక అంశాలు తెలుగు సంస్కృతి, భాషా ప్రియులను ఆకట్టుకుంటాయి. ఈ అరుదైన చారిత్రక నవలను పిళ్ళె గారు సమర్ధవంతంగా రాసారు. వారి కృషి అణువణువునా కనిపిస్తుంది.

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం