(గత వారం తరువాయి)
అని తన కథ నెఱిఁగించినఁ
దన కనుఁగవ మెఱుఁగు లుబ్బఁ దాటంకములున్
జనుఁగవయు నడుము వడఁకఁగ
వనిత సెలవివాఱ నవ్వి వానికి ననియెన్
తన కథను ప్రవరుడు చెప్పగా ఆ ఇంతి తన కండ్ల మెరుపులు మిక్కుటం అవుతుండగా, తన చెవులకు
ఉన్న కమ్మలు, తన వక్షోజాలు, నడుము చలించిపోయేట్లు పకపక బిగ్గరగా నవ్వి ఇలా అన్నది.
(పాత్రను పరిచయం చేస్తున్న విధానాన్ని, ఎలాంటి ప్రవర్తన ఎవరికి నప్పుతుంది అనే విషయాన్ని
తెలుసుకోవాలి మనం. ముక్కూ మొహం తెలియని మగవాడిని చూడడంతోనే ఆమెకు మనసైంది.
లౌక్యంగా పోకచెట్టు చాటుకు చేరింది, పోకచెట్టు సన్నగా పొడుగ్గా పెరుగుతుంది, మాటున దాగడానికి
అదేమీ గుబురు కాదు. చూసీ చూడడంతోనే వీడు గనుక నన్ను ఏలుకుంటే మన్మథుడు కూడా
నాకు బానిస ఐపోడూ అనుకున్నది, అందమైన మగాడు కంటపడగానే ఒంటి పంటపండింది అనుకోడం,
జారిణి లక్షణం, అందమైన స్త్రీ కనపడగానే కామవాంఛ కలగడం విటుడి లక్షణం. మాటిమాటికీ పైట
సవరించుకోడం, ఏమీ తెలియనట్లు ఒంటి సొంపులుచూపించడం, బిగ్గరగా అకారణంగా పగలబడి
నవ్వడం ఇవన్నీ తమవైపు ఆకర్షించుకోడానికి చేసే ప్రయత్నాలు, అలాచేసేది వేశ్యారత్నాలు. కులస్త్రీలకు
ఈ లక్షణాలు ఉండవన్నమాట. పెద్దన అది సూచిస్తున్నాడు ఇక్కడ)
ఇంతలు కన్ను లుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర? ఏ
కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక, నీ వెఱుఁగవే మునువచ్చిన త్రోవచొప్పు? నీ
కింత భయంబు లే కడుగ నెల్లిద మైతిమి, మాట లేటికిన్?
ఇంతలేసి కండ్లుపెట్టుకుని 'మా ఇంటికి వెళ్ళే దారి ఏది' అని ఎవర్నడుగుతున్నావయ్యా? ఏదో ఒక
వంక పెట్టుకుని ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళను పలుకరించి, చెంతచేరడానికి కాకుంటే? నువ్వొచ్చిన
దారి నీకే తెలియకుండా పోయిందా? ఆహా! అబ్బా! అంత చులకనగా కనిపిస్తున్నామా? చాల్లే
నీ మాటలు! అన్నది. ఇంతింత కళ్ళు పెట్టుకున్నావు ఎందుకయ్యా దండుగ, ఎదురుగా ఉన్న
ఒంపుసొంపుల వాహినులు చూడకుండా! అని ప్రేరేపించడం అన్నమాట, నేను ఒంటరిగానే ఉన్నాను,
ఎవరన్నా వెంట ఉన్నారేమో అని భయపడి, సంకోచించి, డొంకతిరుగుళ్ళు తిరక్కు! పర్లేదు,
విషయానికి వచ్చెయ్యి అని ధైర్యం చెప్పడం అన్నమాట! ఈ విషయాన్నే పెద్దన 'ఇలా నర్మగర్భంగా
పలికింది'అన్నాడు. అంతటితో ఆగకుండా,
చిన్ని వెన్నెలకందు వెన్ను దన్ని సుధాబ్ధి/ బొడమిన చెలువ తోఁబుట్టు మాకు
రహి పుట్ట జంత్ర గాత్రముల ఱాల్ గరఁగించు/ విమల గాంధర్వంబు విద్య మాకు
ననవిల్తుశాస్త్రంపు మినుకు లావర్తించు/ పని వెన్నతోడఁ బెట్టినది మాకు
హయమేధ రాజసూయములనఁ బేర్వడ్డ/ సవనతంత్రంబు లుంకువలు మాకుఁ
గనకనగసీమఁ గల్పవృక్షముల నీడఁ
బచ్చ రాచట్టుగమి రచ్చపట్టు మాకుఁ
బద్మసంభవ వైకుంఠ భర్గ సభలు
సాముగరడీలు మాకు గోత్రామరేంద్ర!
వెన్నెలకందు అంటే చంద్రుడు, చిన్నివెన్నెలకందు అంటే జాబిలి అన్నమాట, పెద్దన చిలిపి ప్రయోగం.
చంద్రుడి వెన్ను తన్ని, అంటే చంద్రుడిని వెన్నంటి పాలసముద్రంలో జన్మించిన శ్రీలక్ష్మి మాకు తోబుట్టువు.
క్షీరసాగర మథనం జరిగినప్పుడు ముందు హాలాహలం, తర్వాత వరుసగా కామధేనువు, ఉఛ్ఛైశ్రవము,
ఐరావతము, కల్పవృక్షము, అప్సరలు, చంద్రుడు, శ్రీమహాలక్ష్మి జన్మించారు. తనను తను గొప్పగా
పరిచయంచేసుకోవాలి ముందు, కనుక శ్రీమహాలక్ష్మి మా తోబుట్టువు, మేము సామాన్య అప్సరాకాంతలం
కాము, అని చెప్పుకోవడం, ఇంత గొప్పదాన్ని నిన్నుకోరాను, దరిచేరాను నన్నేలుకో అని అడగడం
గొప్పగా ఉంటుంది కదా, అదీ జాణతనం! రాళ్ళు కరిగేలా పాడడం మా విద్య, నిన్ను కరిగించడం ఎంత?
అని లోలోపల! మన్మథుని కామకళాశాస్త్ర రస సరస ప్రయోగం మాకు వెన్నతో పెట్టిన విద్య. అశ్వమేధం,
రాజసూయం అని మీరు పిలుచుకునే యజ్ఞయాగాదులు మాకు చిరునామాలు, వాటిసహాయంతో
మమ్మల్ని చేరుకొంటారు జనులు! బంగారుకొండసీమలు, కల్పవృక్షపునీడలు, దేవసభలు, బ్రహ్మ
విష్ణు మహేశ్వరుల సన్నిధులు మా నృత్య సాధనకు ఆటపట్లు.
విప్రకుమారా! నా పేరు వరూధిని. (కామకేళిలో ఉచితరీతిని అలరించడంలో!)ఉదారగుణంకలిగిన
ఘృతాచి, తిలోత్తమ, హరిణి, హేమ, రంభ, శశిరేఖలు నా ప్రాణస్నేహితురాళ్ళు. నానావిధ రత్న,
ఔషధ, వృక్ష సంపన్నమైన ఈ మంచుకొండ చుట్టుప్రక్కల ఎల్లపుడూ 'ప్రేమగా' తిరుగుతుంటాం
(ప్రేమికులకోసం!)
భూసుర కైతవ కుసుమ శ
రాసన! మాయింటి విందవైతివి కై కొ
మ్మా! సముదంచ న్మణిభవ
నాసీనత సేద దేఱి యాతిథ్యంబున్
భూసురోత్తమా! కపట(కైతవ) మన్మథుడా! నాయింటి విందును అందుకునే వాడివైనావు
(నా ఒంటి విందును కూడా!) చక్కగా మణిమయ సౌధంలో కూర్చుని నా ఆతిథ్యంలో సేద దీరవయ్యా
అన్నది వరూధిని. బంగారంలాంటిఒళ్ళు మధ్యాహ్నపుఎండలో ఎంత కందిపోయిందో చూడు,
ముద్దులు మూటగట్టే ముఖం వడగొట్టినట్లు ఎలా కమిలిపోయిందో చూడు, 'నా గృహం పావనం చేసి,
బడలిక తీర్చుకుని వెళ్ళరాదూ' అని అడిగింది.
ఓ హంసగమనా! నీ సపర్యలు ఎందుకు, నీ భక్తియే చాలు, నీ ఆతిథ్యం లభించినట్లే! నా సత్కర్మలు
సమయంకాకముందే తీర్చుకొనడానికి త్వరగా ఇంటికి వెళ్ళాలి, నన్ను కరుణించి, నేను ఎలా ఇంటికి
చేరుకోగలనో చెప్పి పుణ్యం కట్టుకో, మీ దేవజాతివారి మహిమలు దివ్యమైనవి, మీకు ఏదీ అసాధ్యం
కాదు, కనుక, 'తల్లీ'నా వారితో నన్ను చేర్చు అని బ్రతిమిలాడాడు ప్రవరుడు. లేత నవ్వు తళుక్కుమనగా
ఆ తెల్లతామరలవంటికన్నులున్నచిన్ నది ఇలా అన్నది.
ఎక్కడియూరు? కాల్నిలువకింటికిఁ బోయెదనంచుఁ బల్కె దీ
వక్కట! మీకుటీరనిలయంబులకున్ సరి రాకపోయెనే
యిక్కడి రత్నకందరము లిక్కడి నందన చందనోత్కరం
బిక్కడి గాంగసైకతము లిక్కడి యీ లవలీనికుంజముల్?
ఊరట ఊరు! ఎక్కడి ఊరయ్యా, ఒకటే ఊదరగొడుతున్నావు! కాలు నిలవక ఇంటికిపోతా ఇంటికిపోతా
అని పాటపాడుతున్నావు! ఇక్కడి రత్నమయమైన గుహలు, గృహములు, ఇక్కడి నందనచందన
సమీరాలు, ఇక్కడి దేవగంగాతీరపు ఇసుక తిన్నెలు, ఈ లతానికుంజములు మీ గుడిసెలకు సాటి
రాలేదా నీ కండ్లకు?
సరే, విను, నువ్వంటే బెట్టో, గుట్టో, బయటపడ్డంలేదుగానీ, నాకవేమీ లేవు,
నిక్కము దాపఁ నేల ధరణీసురనందన! యింక నీపయిన్
జిక్కె మనంబు నాకు నను జిత్తజుబారికి నప్పగించెదో?
చొక్కి మరందమద్యముల చూఱలఁ బాటలువాడు తేంట్ల సొం
పెక్కినయట్టి పూవుఁ బొదరిండ్లను గౌఁగిట గారవించెదో?
నిజాన్ని ఎందుకు దాచిపెట్టడం? బ్రాహ్మణకుమారా! నీపై మనసు చిక్కుకుంది, నన్ను ఇలా మన్మథునికి
అప్పజెప్పి నీ దారి నువ్వు చూసుకుంటావా? లేక పూలమకరందాన్ని గ్రోలీ గ్రోలీ అలిసిపోయిన తుమ్మెదల
సోరు పెంపెక్కిన పూ పొదరిళ్ళలో బిగి కౌగిటిలో నన్ను గౌరవిస్తావో అంటుండగానే, ' ఓ పద్మాక్షీ! ఇలా
పలకడం నీకు తగునా? వ్రత, ఉపవాసదీక్షల్లో రోజులు వెళ్లదీసే విప్రులను కామించడం తగునా?
వెనకా ముందూ ఆలోచించవద్దూ?
దేవతార్చన, బ్రాహ్మణసమర్చన మిగిలిపోయాయి ఈ రోజుకు, భోజనానికి వేళదాటిపోయింది, నా ముసలి
తల్లిదండ్రులు ఆకలితో నీరసించి తూలుతూ కూడా నాకోసమే ఎదురుచూస్తుంటారు వారు తినకుండా,
నేను 'ఆహితాగ్నిని' అగ్నిని ఆరాధించి, ఆ తర్వాత ఆకలిని తీర్చుకునేవాడిని, నేను వెంటనే ఇల్లు
చేరకుంటే నా ఈనాటి సమస్త ధర్మకర్మలూ నిలిచిపోతాయి, నేను ఇంటికి వెళ్ళే మార్గం చెప్పి పుణ్యం
కట్టుకో అన్నాడు ప్రవరుడు.
కొద్దిగా చిన్నబుచ్చుకుని, 'ఓ మన్మథాకారా! ఈ లేతవయసు వైదిక కర్మనిష్ఠలతో గడిచిపోతే ఇంకా
భోగములెప్పుడయ్యా అనుభవించేది? ఈ కర్మకాండ, యజ్ఞయాగాదుల ఫలం 'మా' కౌగిళ్ళలో
సుఖించడమే కదా!
సద్యోవినిర్భిన్నసారంగనాభికా/హృ తమై పిసాళించు మృగమదంబు
కసటువో బీరెండఁ గరఁగి కఱ్ఱలనంటి/ గమగమ వలచు చొక్కపు జవాజి
పొరలెత్తి ఘనసార తరువులఁ దనుఁదాన/తొరగిన పచ్చకప్పురపు సిరము
గొజ్జంగి పూఁబొదల్ గురియంగఁ బటికంపు / దొనల నిండినయట్టి తుహినజలము
అంధునకుఁ గొరయె వెన్నెల?
మృదుల వసన ఫలాస వామేయ రత్న
భూషణంబులు గల విందు భోగపరుఁడ
వయి రమింపుము ననుఁగూడి యనుదినంబు
అప్పటికప్పుడే పగిలిన కస్తూరీమృగపు బొడ్డునుండి వెలువడ్డ కస్తూరీ పరిమళము, దానంతట
అదే శుద్ధిగా కరిగి గుమాయించే జవ్వాజి, పచ్చకర్పూరపు చెట్లనుండి పొరలుపొరలుగా తనంత
తానే రాలుతున్న కర్పూరపు కమ్మని వాసన, పూపొదరిళ్ళలో కురిసిన మంచుతుంపరల
పరంపరలు, నాజూకైన వస్త్రాలు, రత్నాభరణాలు, విందుభోజనాలు ఎన్నెన్ని ఉన్నాయో ఇక్కడ
నీకేమైనా తెలుసా? అని, అమాయకంగా 'అమ్మదగ్గరికి పోతా!' అని మారాం చేసే చిన్నపిల్లలకు
తాయిలాలు ఆశచూపినట్లు ఊరించడానికి ప్రయత్నం చేస్తూ, గుడ్డివాడికి వెన్నెల కొరతా, ఎంత
వెన్నెల ఉంటె మాత్రం ఏం లాభం? అసలే గుడ్డివాడైతే అన్నది, కళ్ళున్న గుడ్డివాడిలా ఈ
అన్నులమిన్న వన్నెలవెన్నెలను త్రుణీకరించకుం డ, హాయిగా భోగపరుడవై రోజూ నాతో రమించు
అన్నది. తాయిలాలను ఆశపెట్టడమే కాకుండా, నీకు పరిమితులు లేవు, రోజూ, నిరంతరమూ,
శాశ్వతంగా నేను నీదాననే అని కూడా అన్నది, మూన్నాళ్ళమురిపెంగా నాకోరికతీర్చుకుని నిన్ను
వెళ్ళగొట్టను అనికూడా హామీ ఇచ్చింది వరూధిని.
మన్మథబాణాలకు విలవిలలాడుతూ, అరచేతులలో చెక్కిలిచేర్చి, దిగులునిండినచూపులతో, తమ
గాలి సోకితే చాలు, వెన్నలా కరిగిపోయే అలివేణులను కౌగిలిలోచేర్చుకునే భాగ్యం ఎన్నిజన్మలకు,
ఎందరికి కలుగుతుంది? ఓయి అమాయకుడా! సశరీరంగా స్వర్గాన్ని అందుకునే అవకాశాన్ని
వదులుకుని, తిండీతిప్పలులేకుండా, ఇంద్రియసుఖాలను అనుభవించకుండా, ఆత్మను అలసటపెట్టడం
వలన ఏం సౌఖ్యం కలుగుతుంది? అని ప్రశ్నించింది వరూధిని, దానికి ప్రవరుడు, నువ్వన్నది
కాముకులవిషయంలో నిజమే కానీ, కామవాంఛలు లేనివాడు నీ మాటలను లెక్కచెయ్యడు,
బ్రాహ్మణుడు( అంటే జ్ఞాని అనే అర్ధంలో మాత్రమే, అసలైన సత్యాన్ని తెలుసుకుని, ఆచరించేవాడు
అనే అర్ధములో మాత్రమే) ఇంద్రియసుఖాలకు వశుడైతే, మన్మథ బాణాలకు లొంగిపోతే ఈ
ఐహిక కామసుఖానందజలధిలో మునిగి, బ్రహ్మానందసామ్రాజ్యపదవినుండి భ్రష్టుడైపోతాడు,
నీకు తెలిస్తే మాఊరికి వెళ్ళే మార్గం ఏదో చెప్పు, లేకుంటే నా తిప్పలేవో నేనే పడతాను అని
వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. వరూధిని తన అంగభంగిమలతో, అనంగకళాకౌశలంతో, వొంపుసొంపుల
ప్రదర్శనతో, కామోపభోగానందమే బ్రహ్మానందము అనే వాదనతో ప్రవరుడిని ఒప్పించడానికి తన
ప్రయత్నం కొనసాగించింది, ప్రవరుడు ఈ తుఛ్ఛసుఖాలు 'మీసాలపై తేనియల్' అని త్రుణీకరించాడు.
ఇక చివరి అస్త్రం ఏడుపు ప్రారంభించి, గద్గద స్వరంతో, నిష్టూరాలాడింది, 'స్త్రీ తనంత తనే వలచివస్తే
ఎవరికైనా లోకువే అన్నది, అయినా లాభంలేకపోయింది.
ఇక యిలాకాదు అనుకుని, 'నన్నిక బాధపెట్టవద్దు' అంటూ, వేగంగా అడుగులేస్తూ, నిట్టూర్పులు
విడుస్తూ, కొప్పు విడిపోయి,తలలోనిపూలు రాలిపోతుండగా, సుకుమారమైన తనూలత
పులకించిపోతుండగా, దీనంగా, అనునయంగా బ్రతిమిలాడుతూ, రతివాంఛ త్వరపెడుతుండగా,
బరువెక్కిన వక్షోజముల భారానికి రవికముడి వీడిపోతుండగా,
ప్రాంచద్భూషణ బాహుమూలరుచితో పాలిండ్లు పొంగార పై
యంచుల్ మోపఁగఁ గౌఁగిలించి యధరంబాశింప 'హా! శ్రీహరీ!'
యంచున్ బ్రాహ్మణుడోరమోమిడి తదీయాంసద్వయంబంటి పొ
మ్మంచున్ ద్రోచెఁ గలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబులన్?
తన ఆభరణముల, బాహుమూలముల శోభలు క్రమ్ముతుండగా, మదనభావంతో పైపైకి పొంగిన
వక్షోజములు తాకేట్లు కౌగిలించుకుని, పెదవులను అందుకోడానికి ప్రయత్నం చేసింది వరూధిని.
ఆమె నోటి తాంబూలపు ఘాటుకు, ఆ వేటుకు 'హా! శ్రీహరీ' అని ఆమె భుజాగ్రములను పట్టుకుని
'పో'అని త్రోసేశాడు ప్రవరుడు, స్థిరచిత్తము కలిగినవారి మనసులను స్త్రీల మాయలు కదిలించలేవుకదా!
ఆ త్రోపుకు దూరముగా తొలిగి, సిగ్గు, లజ్జ కమ్ముకుని, కొప్పు సవరించుకుంటూ, చురచురచూస్తూ,
ఇలా తోసేస్తే స్త్రీలు తట్టుకోగలరా, నిర్దయుడా! చూడు నీ గోళ్ళు ఎలా గుచ్చుకున్నాయో, అయ్యో!
నొప్పి, బాధగా ఉంది అని వక్షస్థలంమీద అశ్రుబిందువులు రాలిపడేలా, గాయపడ్డ కోకిలలా దొంగఏడుపు
ఏడ్చింది. కళ్ళెర్రబడేలా ఏడ్చి ఏడ్చి' యజ్ఞాలు చేశాను, తపస్సు చేశాను అన్నావే, దయాగుణం
లేకుండా ఎన్నిచేసినా పుణ్యం దక్కుతుందా? ఎన్నెన్నో చేసిన పుణ్యం దయాబుద్ది వలన కలుగుతుంది,
ఈమాత్రం ఆలోచించవు, నీ చదువెందుకు, చట్టుబండలుగావడానికి! అని రుసరుసలాడింది.
మత్స్యగంధిని మదనకేళిలో ఓలలాడించిన పరాశరుడిని వెలివేశారా? మేనక మేనిపొంగులహంగులకు
లొంగిన విశ్వామిత్రునికి విలువలేకుండా పోయిందా? అప్సరాకాంతల అందచందాలకు దాసుడైన
మందకర్ణి మహిమ తగ్గిందా? అహల్యాజారుడైన దేవేంద్రుడిని స్వర్గలోకసామ్రాజ్యానికి ప్రభువు
కాకుండా చేశారా? వారందరికంటే నీ మహిమ గొప్పదా? ఆకులూ అలములు మేసి, నవసిన
మునిముచ్చులు అందరూ వాలుకన్నుల జవరాళ్ళ వాకిటి బంధాలుగా పడిగాపులు గాయరా?
అని వరూధిని వదరుతుంటే, కోపంతో, రోషంతో, లజ్జతో, నిలువెల్లా ఆమె శరీరం అదురుతుంటే,
చెదరకుండా, ఆమెను ఏమీ అనకుండా, ఆమె తనను అమాంతంగా కౌగిలించుకున్నప్పుడు అంటిన
జవ్వాది, కస్తూరి పరిమళ ద్రవ్యాలను అక్కడి ఆకాశ గంగా ప్రవాహంలో కడుగుకుని, పరిశుద్ధుడై,
ఆచమించి, 'ఓ స్వాహావధూవల్లభా! అంతర్యామిగా విశ్వమంతా వ్యాపించిన అగ్నిదేవుడా!
నీముఖంగా చేసిన స్తుతులు, హవిస్సులు స్వీకరించి దేవతలు అందరూ త్రుప్తి చెందుతారు!
నీవే సర్వేశ్వరుడివి అని వేదములు ఘోషిస్తున్నాయి, ఆహవనీయము, దక్షిణాగ్ని మొదలైనవి
నీ స్వరూపాలే కదా! నన్ను రక్షింపవయ్యా!' అని అగ్నిదేవుడిని ప్రార్ధించి,
దాన జ పాగ్నిహోత్ర పరతంత్రుడనేని, భవత్పదాంబుజ
ధ్యానరతుండనేనిఁ, బరదార ధనాదులఁ గోరనేని, స
న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధిలోనఁ గ్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా!
నేనే దానము, జపము, అగ్నిహోత్రములను ఆచరించే, ఆరాధించేవాడిని అయితే, నీ పాదాంబుజముల
ధ్యానాసక్తుడిని అయితే, యితరుల ఆలిని, ఆస్తిని కోరుకోనివాడిని అయితే, నన్ను గౌరవముగా, ఇక
ఏ అవమానకర సంఘటనలూ లేకుండా, సూర్యుడు పడమరసముద్రంలో అస్తమించకముందే
సత్త్వరమే నన్ను ఇంటికి చేర్చు హవ్యవాహనా, సమస్త దేవతలకూ హవ్యములను మోసుకెళ్లి
అందించే అగ్నిదేవుడా, నన్ను తీసుకెళ్ళి ఇల్లుజేర్చుమయ్యా అని అగ్నిని ప్రార్ధించాడు ప్రవరుడు.
మరుక్షణమే అగ్నిదేవుడు ఆతని శరీరంలోచేరి మరింత ఉజ్జ్వలంగా కాంతులీనుతూ, ఆప్రాంతమంతటా
వెలుగులు చిమ్ముతూ, అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వరూధిని హృదయంలో
మోహభావనా వీచికలు ఎగసిపడుతుండగా దివ్య తేజస్సులతో, అగ్నిదేవుడి ఆశీస్సులతో తన ఇంటికి
చేరుకొని తన సత్కర్మానుష్ఠానసర్వస్వ జీవికను సర్వజన సంస్తుతిపాత్రంగా కొనసాగించాడు ప్రవరుడు
అని మార్కండేయుడు తన శిష్యుడైన క్రోష్టికి చెప్పాడు అని గరుడపక్షులు చెప్పగా, ఆ తర్వాత ఆ
వరూధిని కథ ఏమయ్యింది అని ఆసక్తిగా ప్రశ్నించాడు జైమిని మహర్షి అని తన 'స్వారోచిష
మనుసంభవము'లోని ద్వితీయాశ్వాసాన్ని ముగించాడు అల్లసాని పెద్దన.
(తరువాయి వచ్చే వారం)