నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
______________________________________________________________________
స్వీడన్ లోని హెల్సిన్ బోర్గ్ నగరానికి చెందిన 20 ఏళ్ళ ఓ దొంగ 'హోమ్ అండ్ గార్డెన్ స్టోర్'లోకి వెళ్ళి చీపుళ్ళకట్టల వెనక దాక్కున్నాడు. ఉద్యోగస్థులు స్టోర్ ని మూసి వెళ్ళాక కేష్ బాక్స్ పగలకొట్టి డబ్బు దోచుకున్నాడు. తర్వాత అతను బయటపడడానికి దారి దొరకలేదు. బాత్ రూం కిటికీ గ్రిల్ ని విప్పాలని శతవిధాల ప్రయత్నించి విఫలం అయాక, ఏంచేయాలో తోచక పోలీసుల ఎమర్జెన్సి నంబరుకి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. గంటన్నర తర్వాత ఆ స్టోర్ మేనేజర్ తో వచ్చి పోలీసులు ఆ దొంగని అరెస్ట్ చేసారు.
ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ కి చెందిన ఇద్దరు దొంగలు ఓ బిస్కెట్ ఫేక్టరీలోకి, దానికున్న హైటెక్ అలారం సిస్టంని విఫలంచేసి లోపలకి ప్రవేశించారు. మర్నాడు ఫేక్టరీకి వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్ పగలకొట్టబడిన అలారాన్ని చూసి విలువైనవి పోయాయేమోనని కంగారు పడ్డాడు. తర్వాత చూస్తే లేఫర్స్ బిస్కెట్స్ బస్తాలు రెంటిని మాత్రమే ఎత్తుకెళ్ళారు. టి.వి, ఫ్రిజ్, సెల్ ఫోన్స్ లాంటి ఖరీదైన వస్తువులున్న వాటిని వాళ్ళు దొంగిలించలేదు!