మార్కండేయ మహర్షి తన శిష్యుడైన క్రోష్టుకి మహర్షికి వినిపించిన కథను గరుడపక్షులు జాబాలిమహర్షికి వినిపిస్తున్నాయి. ఆ గరుడపక్షులు చెప్పిన కథను నైమిశారణ్యంలో సూతుడు శౌనకాదిమహర్షులకు వినిపిస్తున్నాడు, మార్కండేయ పురాణంలో. ఆ మార్కండేయ పురాణాంతర్గత స్వారోచిషమనుసంభవ కథను అల్లసాని పెద్దన తన ప్రభువైన శ్రీకృష్ణదేవరాయచక్రవర్తికి వినిపిస్తున్నాడు!
శ్రీ వేంకటేశ పదప
ద్మావేశిత సదయ హృదయ! హరనిటల నట
త్పావక పరిభావి మహః
ప్రావృతనిఖిలాశ! కృష్ణరాయమహీశా!
శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములయందు లగ్నంచేసిన మనసుగలవాడా, శివుని ఫాలనేత్రపు అగ్నిజ్వాలలవలె రోదసీమండలాన్నిప్రకాశింపజేస్తున్న యశస్సును కలిగినవాడా! వినుమయ్యా!
ఆ భూదేవకుమారుఁ డేగిఁనఁ దదీయానూన రమ్యాకృతిం
దా భావంబున నిల్పి యంగభవ కోదండోగ్ర మౌర్వీరవ
క్షోభాకంపిత ధైర్యయై యలతఁ నచ్చో నిల్వకచ్చెల్వ త
ద్భూభృన్మేఖల వెంటఁ గానలబడిన్ దుఃఖాబ్ధినిర్మగ్నయై
ఆ బ్రాహ్మణకుమారుడైన ప్రవరుడు ఆవిధంగా అగ్నిదేవుని సహాయముతో అక్కడినుండి వెళ్ళిపోగా, మన్మథుని వింటితాడుచేస్తున్నధ్వనులకు ఆమె ధైర్యము కోల్పోయింది. పరంపరగా మన్మథుని బాణాలు తాకుతున్నయ్, ఆ బాణాలనుసంధిస్తున్న మన్మథునివింటితాడు విసుగూవిరామమూలేకుండా అదేపనిగా 'ఝుంఝుమ్మని' మోతలుచేస్తున్నది. వరూధిని ధైర్యము సడలి, ఇక అక్కడ ఉండలేక, ప్రవరుడి సాటిలేని అందమైన ఆకారాన్నే మనసులో నిల్పుకుని, దుఃఖసాగరంలో మునిగి, ఆ పర్వతపాదప్రాంతములో అడవులవెంట, చెట్లవెంట, పుట్టలవెంటపడి తిరుగుతున్నది. తిరిగి, తిరిగి, ప్రవరుడు వెళ్ళిపోయినమార్గంలో గాలించి, విసిగి, వేసారి, తన చెలికత్తెలతో వెనుకకు, తనభవనానికివచ్చింది. తనలో తను విరహాలాపాలు చేస్తున్నది.
అక్కటా! వాడు నాతో పొందును నిరాకరించి, నాకు చిక్కకుండా, అంతులేని ఈ వియోగసాగరంలో నన్ను ముంచి వెళ్ళిపోయాడు. నేనీ వియోగ, విరహసాగరాన్ని ఎలా ఈదగలను? ఈ అరకొరనోములు నోచిన నేనెక్కడ, వాడి బిగికౌగిలి ఎక్కడ, నాకెందుకు అది దొరుకుతుంది? హా విధీ నేనేమి చేయగలను?
బంగారంవంటి శరీరకాంతి, తుమ్మెదలబారును ధిక్కరించే కేశములు(నల్లగా, చక్కగా తీర్చి అలంకరించిన కేశములు) చంద్రుడిని కూడా నోరెత్తనియ్యని ముఖం(అంత అందమైన ముఖం) కొండలశిఖరాల్లాంటి వాడి భుజాలు, వాడి నడుము అసలు కనపడదు, ఉన్నదో లేదో మరి, ఇక వాడి కన్నులో వికశించిన సహస్రదళ పద్మములే!
చొక్కపుఁబ్రాయమున్ మిగుల సోయగముం గల ప్రాణ నాయకుం
డెక్కుడు వశ్యతన్ రతుల నేఁకటఁ దీర్చి సమేళ మొప్పఁగా
నక్కున గారవించి ప్రియ మందఁగ నోఁచని యింతిదైన యా
చక్కఁదనం బ దేమిటికి జవ్వన మేటికి? బ్రాణ మేటికిన్?
చక్కని, లేత వయసు, సొగసుగల ప్రాణ నాయకుడు పూర్తిగా వశుడై, తనకు వశం చేసుకుని, రతితో, కోర్కెలతో, మనసుకున్న చింతలు, ఒంటికున్న వంతలు తీర్చి, కౌగిలిలో గారంగా గారవించే భాగ్యానికినోచుకోని ఆడజన్మకు చక్కదనమెందుకు, యవ్వనమెందుకు, అసలు ఆ ప్రాణమెందుకు, హ్హుఁ!
ఎంత తపంబు సేసి జనియించిన వారొకొ మర్త్యభామినుల్!
కాంతుఁ డవజ్ఞ చేసినను గాయము వాయుదు రే నమర్త్యనై
చింతల వంతలం జీవికి సిగ్గఱితిన్ మృతిలేని నాదు చె
ల్వింతయు శూన్యగేహమున కెత్తిన దీపిక యయ్యెనక్కటా!
ఎంత తపస్సుచేస్తే మానవకాంతలై జన్మిస్తారో కదా! మానవ కాంతలు తమ నాధులు తమను నిర్లక్ష్యం చేస్తే మరణించడానికి అయినా అవకాశం ఉంది, నేను దేవతాస్త్రీనై జన్మించి, ఇన్ని చింతలూ వంతలూ అనుభవిస్తూ కూడా సిగ్గూ ఎగ్గూ లేకుండా బతకవలసివస్తున్నది, దేవతాస్త్రీలకు మరణం ఉండనికారణంగా! వాడు లేకుండా బతికే ఆశా లేదు, మరణించే అవకాశమూ లేదు. యే ఆశ, ఆనందము లేని బతుకు బతకవలసివచ్చింది, పాడుబడ్డ కొంపలో దీపం వెలిగించినట్టు! అని బాధపడింది వరూధిని.
'శూన్యగేహమున కెత్తిన దీపిక ' ఎంత అందమైన పదబంధం! ప్రబంధకవిత్వంలో భావకవిత్వ రసదీప్తులు కేవలం అల్లసానివారి కవిత్వంలోనే దొరుకుతాయి, ఎంత క్లిష్టసమాసభూయిష్టంగా రచించగలడో, అంత సరళమైన ఆధునిక సరసభావాలనూ పలికించగలడు పెద్దన.
యిలా తలచి తలచి, వగచి వగచి, మదనబాణాలకు వెగచి వెగచి, ఉస్సురని, ఎర్రని కనుకొలకులనుండి ధారాపాతంగా జాలువారిన అశ్రువులు చెవులలోనిండి, అక్కడినుండి జాలువారి చెవికమ్మలమీదకు కారిపోయాయి. వేదనతో, విరహతాపంతో వేడెక్కిన శరీరం కావడంవలన, శరీరానికున్న ఆభరణాలు కూడా కొలిమిలో కాల్చినట్టు కాగిపోవడంవలన, ఆ చెవికమ్మలమీదపడిన కన్నీటిధారలు పెనంమీదపడిన నీటిబిందువులలా పొగలు, చురచురధ్వనులు వెలువరిస్తున్నాయి. శరీరస్పృహ లేక, లతలు, పూలు అల్లుకుపోయిన ఉద్యానవనమధ్యంలోనున్న చంద్రకాంత శిలావేదికమీద చేరగిలబడిన ఆవిడ దేహమునిండా శోషతో, వరదవెల్లువెత్తినట్లు చెమటలుకమ్ముకున్నాయి, ఆ వరదలో మునగకుండా కాపాడుకొనడంకోసం ఆసరాగా ఉన్న కడవలా అన్నట్టున్న కుచకుంభద్వయం తొలగిపోయిన పైటచాటునుండి బయల్పడి ప్రకాశిస్తుంటే, కుపితుడైన శివుని నుదుటి కంటినుండి వెలువడిన అగ్నిజ్వాలలకు మాడి మసి ఐన మగడి విరహశోకంతో విలపిస్తున్న రతీదేవిలాగా వరూధిని కనిపిస్తున్నది, ఇంతలో సూర్యాస్తమయము అయ్యింది.
తరుణి ననన్యకాంత నతిదారుణ పుష్పశిలీముఖవ్యథా
భర వివశాంగి నంగభవు బారికి నగ్గముసేసి క్రూరుఁడై
యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని రోషభీషణ
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చెఁ గషాయదీధితిన్
మన్మథుని దారుణ పూల బాణాలకు ఎరయై, మేనుమరిచిన సాటిలేని లావణ్యవతిని, క్రూరుడై, నిర్దయగా అహంకరించి వెళ్ళిపోయాడు దుష్టబ్రాహ్మణుడు అని రోషంవచ్చిందేమో అన్నట్టు సూర్యుడు ఆ సాయంసంధ్యలో ఎర్రబారాడు.
ఉరు దరీకుహర సుప్తోత్థ శార్దూలముల్ / ఝరవారి శోణిత శంకఁ ద్రావ
వనకుంజమధ్య శాద్వలచరన్మృగపంక్తి / దావపావక భీతిఁ దల్లడిల్ల
నాశ్రమాంతర భూరుహాగ్రముల్ మునికోటి / బద్ధ కాషాయ విభ్రాంతిఁ జూడ
ఘనసాను శ్రుంగ శృంగాటకంబులఁ గాంచి / యమరులు హేమాద్రి యనుచు వ్రాలఁ
గాసెఁ బేశలరుచిఁ గింశుక ప్రవాళ
ఘుసృణ కిసలయ కంకేళి కుసుమగుఛ్ఛ
బంధుజీవ జపా రాగ బాంధవంబు
లన్నగంబున జరఠారుణాతపములు
విశాలమైన ఆ పర్వత సానువులలోని గుహలలో మధ్యాహ్నపు ఎండకు అలసి, నిదురించి లేచిన పులులు ఆ నిదురమత్తులో సూర్యుని ఎర్రనికాంతులకు ఎర్రనైన సెలయేళ్ళనీటిని రక్తప్రవాహంఅనుకుని ఆబగా తాగుతున్నాయి. వనాలలో, పొదలమధ్యలో, పచ్చికబీళ్లలోతిరుగాడేజింకలు సాయంకాలపుసూర్యుని ఎర్రనికాంతులను పులుముకున్న చెట్లను చేమలనుచూసి కార్చిచ్చుచెలరేగింది అని భయంతో తల్లడిల్లుతూ పరుగులుపెడుతున్నాయి. ఆ వనములమధ్యనున్న ఆశ్రమములలోనున్న మునులు సాయంసూర్యుని అరుణారుణకాంతులను పులుముకున్న చెట్లకొసలు చూసి ఉతికిన తమ కాషాయవస్త్రాలు ఆరడానికి ఆ చెట్లకు కట్టినట్లున్నారు శిష్యులు, బహుశా, అని విభ్రాంతిచెందుతున్నారు. సంధ్యారుణకాంతులలో బంగారువన్నెలో మెరిసిపోతున్న ఆ పర్వతసానువులను, శిఖర శిఖరాగ్రములను, ఆ శిఖరములమీది వివిధ వృక్షాగ్రములనుచూసి స్వర్ణమయమైన మేరుపర్వతం అని భ్రమించి ఆకాశసంచారులైన దేవజాతివారు వాలుతున్నారు.
నేర్పుగా పగడపుకాంతులను, మోదుగులను, కాశ్మీరపూలరంగుచివుళ్ళను, గులాబీకాంతుల అశోకవ్రుక్షములను, మంకెనపూలను ఆ మంచుకొండమీదపూయించాయి అస్తమిస్తున్న ముదుసలిసూర్యుని లేత అరుణకాంతులు. ఆంధ్రసాహిత్యంలో ప్రక్రుతివర్ణనలో అత్యుత్తమస్థాయి పద్యాలలో ఇది ఒక పద్యం. ఒక్క సీసపద్యంలో అనంత ప్రకృతి సాయంశోభను వర్ణచిత్రముగా మలచి అందించాడు అల్లసానిపెద్దన.
చూడబడే దృశ్యము ఒకటే అయినా చూసేకండ్లనుబట్టి వేర్వేరుభావాలు కలుగుతాయి. దర్శించబడే సత్యం ఒకటే అయినా దార్శనికులను బట్టి దర్శనములు మారుతాయి, జన్మసంస్కారాన్నిబట్టి అన్వయించుకోవడం జరుగుతుంది, ఒకే సాయంకాలపు అరుణవర్ణం పులులకు రక్తప్రవాహ భ్రాంతిని, అమాయకపు పిచ్చిజింకలకు కార్చిచ్చుభయాన్ని, మునిజనాలకు కాషాయవస్త్రభ్రాంతిని, దేవతలకు హేమాద్రిభ్రాంతిని కలిగించింది. అందుకే యద్భావం తద్భవతి అన్నది! అందుకే అల్లసానిపెద్దనను 'ఆంధ్రకవితాపితామహుడు' అన్నది!
శరీరానికి సుఖమునిచ్చేవి కొన్ని, మనసుకు సంతోషాన్నిచ్చేవి మరికొన్ని, ఆత్మకు ఆనందాన్నిచ్చేవి కొన్నికొన్ని. ఆత్మకు ఆనందాన్ని యిచ్చేవి, బ్రహ్మానందైకరసాంబుధిలో ఓలలాడించేవి ఉత్తమసంగీత, సాహిత్యాలే. అటువంటి ఉత్తమసాహిత్యరుచులు అందించే కావ్యపఠనము వలన సరళమైన, మృదువైన, సరసమైన ఊహలు, భావాలూ కలిగి, శాంత, కరుణాగుణాలు వృద్ది చెందుతాయి, అందుకని ఈ సాహిత్యాన్ని తెలుసుకోవాలి.
సూర్యాస్తమయం ఐంది. ఆకాశంలో పక్షులు బార్లుతీరి తమగూళ్ళకు పయనం చేస్తున్నాయి. సూర్యుని ప్రచండమైన వేడిమి కొద్దిగా తగ్గింది. ఎండమావులు ఇంకిపోయాయి, ఎండ ఉంటేనే కదా ఎండమావులు, ఆశపెట్టుకుంటేనే కదా నిరాశ! చిన్నిమంకెనపువ్వు ఐనాడు సూర్యుడు, దిక్కులు కాంతులు కోల్పోయాయి, కమలదళములు ముకుళించుకున్నాయి.
'ఇక సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, తమరు విచ్చేయండి' అని చంద్రుడికి స్వాగతం పలకడానికి వెళ్ళే నిశికాంత ఆడదూతల్లాగా నీడలు తూర్పుకు పొడవుగా సాగుతున్నాయి. అంతకంతకు వేగముగా చీకట్లు కమ్ముకుంటుంటే, తన ప్రియురాలైన బడబ ముఖసందర్శనాభిలాషతో అంతులేని వేగంతో రథం కనిపించకుండా వెళ్ళిపోయినట్లు ఒక్కసారిగా అద్రుశ్యుడైనాడు సూర్యుడు. చీకట్లు కమ్ముకున్నాయి. ప్రత్యేకించి ఈ ఘట్టంలోని వర్ణనలు వర్ణించనలవికానివి. అనుభవైకవేద్యం, అంతే. అన్ని పద్యాలనూ సమీక్షచేయడం ప్రయాణాన్ని మరీ సుదీర్ఘం చేసుకోవడమే అవుతుంది కనుక అక్కడక్కడ రుచిచూస్తూ ముందుకు సాగుదాం!
ఏవిహంగముఁ గన్న నెలుఁగిచ్చుచును సారె / కును సైకతంబులఁ గూడఁ దారుఁ
దారి కన్గొని తనజోడు గాకున్న / మెడఎత్తి కలయంగ మింట నరయు
నరసి కన్నీటితో మరలి తామర యెక్కి / వదన మెండఁగ సరోవారినద్దు
నద్ది త్రావఁగ సైఁప కట్టిట్టు గన్గొని / ప్రతిబింబ మీక్షించి బ్రమసి యుఱుకు
నుఱికి ఎఱకలు దడియ వేఱొక్కతమ్మి
కరుగు, నరిగి రవంబుతోఁ దిరుగుతేంట్లఁ
బొడుచు ముక్కున, మరియును బోవు వెదుక
సంజఁ బ్రియుఁ బాసి వగ నొక్క చక్రవాకి
ఆ సంధ్యాసమయంలో ఒక ఆడచక్రవాకపక్షి తన ప్రియుడిని ఎడబాసిన దుఃఖముతో ఏ పక్షిని చూసినా అది తన ప్రియుడేనేమో అని ఎలుగెత్తి కూస్తున్నది. బదులుగా కూత వినిపించేప్పటికి ఆ ఇసుకతిన్నెలలో ఆ కూతపెట్టిన పక్షిని కలవడానికి వెళ్తున్నది. వెళ్లి, అది తన జతగాడు కాకపోవడంతో, మెడనెత్తి, తనప్రియుడిని వెతికి కలుసుకోవడానికి మరలా ఆకాశంలోకి చూస్తున్నది. చూసి చూసి కన్నీటితో వెనుకకు మరలి తామరపువ్వునెక్కి, ముఖం పొడివారి, గొంతు తడారి, నీరు తాగుదామనుకుని ముక్కును సరసులో ముంచి, వియోగవిషాదంలో మంచినీరుకూడా సహించక, అటూ యిటూ చూసి, నీటిలో తన ప్రతిబింబాన్నే చూసి తన ప్రియుడేనేమోయని నీటిలోకి దూకుతున్నది. తనప్రియుడు కాడు, లేడు, రాడు అని తెలిసి వేరొక పూవు వద్దకు వెళ్తుంది. వెళ్లి ఆ పూవు మీద ఝుమ్మని నాదం చేస్తున్న తుమ్మెదలను విసుగ్గా, కసిగా పొడుస్తుంది. తను ప్రియుడివిరహంలో కుమిలిపోతుంటే తుమ్మెదలు హాయిగా తేనెనుతాగుతూ రొదచేస్తుంటే కోపం రాదూ మరి! మరలా తన ప్రియుడు గుర్తుకొచ్చి, వెదకడానికి వెళ్తుంది. తన ప్రియుడిని కనుగొనేదాకా ఆ కథ అలాగే నడుస్తుందన్నమాట! ఇక నెమ్మదిగా చంద్రోదయమైంది.
అంతటఁ బ్రాచి నిశాపతి
యంతికగతుఁ డౌట విని ముఖాలంబి తమః
కుంతలములు దీర్పఁగఁ గొను
దంతపుదువ్వెన యనంగ ధవళిమ దోచెన్
ఇక తూర్పుదిక్కున నిశారమణీనాథుడు, చంద్రుడు నిద్రలేచి, నెమ్మదిగా పాన్పు దిగుతున్నాడు అని విని, ఆయన ముఖమునకు వేళ్ళాడుతున్న నల్లని ముంగురులు అనే చీకట్లను సరిజేయడానికి, దువ్వుకోడానికి కావలసిన దంతపు దువ్వెనగామారినదేమో అన్నట్లు వెన్నెల తెల్లదనం కనిపించింది.
కలయ జగమునఁ గలయట్టి నలుపు లెల్లఁ
దెలుపులుగఁ జేసి నీడలు దెలుపు సేయఁ
గా వశము గామిఁ బొడము దుఃఖమునఁ బోలె
సాంద్రచంద్రిక తుహిన బాష్పములు గురిసె
చంద్రుని వెన్నెల ప్రపంచములో ఉన్న నలుపులను అన్నిటినీ తెలుపులుగా చేయగలిగింది, కానీ నీడలను తెల్లగా చేయలేకపోయింది. ఆ వైఫల్యముతో కలిగిన దుఃఖబాష్పములేమో అన్నట్లు వెన్నెల మంచుబిందువులనుకురిపించింది!
ఆ చంద్రుని వెన్నెలలోని వేడిమిని(!) ఆ చల్లని మంచుతుంపరల సెగను(!) తట్టుకొనలేకపోయింది అసలే విరహపు వేడిమిలోనున్న వరూధిని. ఈసమయంలో హాయిగా యితరులు ప్రియులకౌగిళ్ళలోమునుగుతూ, చెట్టపట్టాలేసుకుని వనవీథీవిహారాలుచేస్తుంటే నేను ఇలా ఒంటరిగా ఉండగలనా? ఉద్యానవనములోకి వెళ్దాము రమ్మని తన చెలికత్తెలను వెంటదీసుకుని వనములోకి వెళ్ళింది. వెన్నెల వేడికి తట్టుకోలేక పవిటచెంగును ముసుగుగా వేసుకుని ఉద్యానవనములోకి వెళ్లి, ఆ పరిమళ శీతవాయువులను తట్టుకోలేక, పైట జారిపోతుండగా, బాణములదెబ్బకు తట్టుకోలేక పరుగెత్తినట్టు బరువెక్కిన వక్షోజములతో పరుగెత్తింది. కార్చిచ్చు తరిమినట్టు, కొప్పుజారిపోతుండగా చిగురాకుపోదల్లోకి పరుగెత్తింది. చేతులకున్న బంగారుగాజులను వెనక్కు త్రోసి తీగలను మెడకుచుట్టుకుంది ఉరిపెట్టుకున్నట్టు. నడుముకున్న బంగారు మొలతాడు(వడ్డాణము)బిగించి ఏటిలోదూకేదానిలా వెన్నెలలోకి ఉరికింది. తుమ్మెదలు కరుస్తాయని తెలిసికూడా, భయంలేకుండా పుప్పొడిలోమునిగింది, పూలతావిని తాగింది, మామిడి చెట్టువద్ద నిల్చుంది, మన్మథబాణాలకు విసిగి, వేసారి, తమకు మరణము లేదనే సంగతిని ఆ విరహోన్మాదములో మరిచిపోయి, శరీరాన్ని అంతము చేసుకుందాము అనుకున్నది వరూధిని. ఆమెను చెలికత్తెలు వారించి, చెక్కిళ్ళమీదికి కారుతున్న కన్నీటిని తుడుస్తూ,
పూఁతపసిండివంటి వలపుం బచరించు కులంబు నీతికిన్
లేఁత గదమ్మ యిత్తెరఁగు? లేమ! సురాంగన లెల్ల నిట్టి నీ
చేఁతకు మెత్తురమ్మ? దయసేయక తిన్ననిమేను వెన్నెలన్
వేఁతురటమ్మ? యింత కనువేఁదురు సెల్లుఁనటమ్మ ఇంతికిన్?
పైపైపూతబంగారంలాంటి ప్రేమలను ఒలకబోసే మన కులనీతికి యిది కొత్త కాదా? తోటి దేవతాకాంతలందరూ నీ తీరుకు మెచ్చుకుంటారా, నొచ్చుకుంటారుగానీ! ఏమాత్రమూ జాలిలేక, నీ సుకుమారమైన శరీరాన్ని యిలా వెన్నెలలో వేపుతారా ఎవరన్నా? స్త్రీకి యింత కసి, పంతం చెల్లుతుందా? వెన్నెలను తట్టుకోలేని నువ్వు మన్మథుని సభాస్థలి ఐన ఈ వసంతవనానికి ఔనమ్మా అని రావడమేంటి చెప్పు, ముల్లును వదిలించుకుని శూలంతో పొడుచుకున్నట్టు? అని నచ్చజెప్పి భవనంలోకి తీసుకెళ్ళి పాన్పుమీద పడుకోబెట్టగా, కసిగా, కోపంగా చంద్రోపాలంభం చేయడం ప్రారంభించింది వరూధిని. ఉపాలంభం అంటే తిట్టడం, ప్రబంధ నాయికలతో తిట్టించుకోవడం చంద్రుడికీ, మలయమారుతానికి, మన్మథునికీ మామూలే!
త్రిపురసంహార మొనరించునపుడు హరుఁడు
బండికల్లుగ నీమేను గండి చేసె
నదియు సెలవాఱి తెగటారవైతి చంద్ర!
యకట!రోహిణియెడ నపథ్యమునఁ జేసి
నీ బండబడ, త్రిపురాసురసంహార సందర్భములో నిన్ను బండిచక్రముగా ఉపయోగించుకొని, ఇరుసుకోసం నీ శరీరానికి గండిపెట్టాడు పరమశివుడు, అదీ సరిపోలేదు, రోహిణీదేవితో చేసిన అపథ్యము వల్లనైనా నీకు పొయ్యేకాలం రాలేదు పాడుగాను!
పాలఁ బుట్టిన మాత్రాన మేలి గుణము
నేఁడు నీ కేల గల్గు నో నీరజారి!
నీటఁ బుట్టినవాడు గాఁడోటు వహ్ని?
కాల్చుచున్నాఁడు జగమెల్లఁ గరుణలేక!
పాలసముద్రములో పుట్టినంతమాత్రాన నీకు మేలు గుణం ఎలావస్తుందిలే! నీటిలో పుట్టినవాడైనా అగ్నిదేవుడు కరుణ అనేదే లేకుండా ప్రపంచాన్ని దహించివేయడం లేదూ? చంద్రుడికి ముట్టాల్సింది ముట్టజెప్పడం ఐపోయింది, ఇక మన్మథుని వంతు!
తొడిఁబడఁ బాఱి పైకురికి ధూర్జటి కంటి కడిందిమంటలో
నడపొడ గానరాక తెగ టాఱియుఁ గాలినయట్టి మ్రోడు కై
వడి రతి లోచనాంబువుల వాన నిగిర్చితె పాంథబాధకై?
మడియ కనంగ? యవ్వెలది మంగళసూత్రమహత్త్వమెట్టిదో ?!
మీదిమీదికి వెనకాముందూ చూసుకోకుండా వెళ్లి, శివుని కొసకంటిచూపుకే ఐపూ అజా లేకుండా మాడి మసైపోయి కూడా, కాలిన మోడు మళ్ళీ చిగిర్చినట్లు రతీదేవి కంటి శోకబాష్పవర్షానికి మరలా చిగురించావా నాయనా, తమదారిన తామువెళ్ళే వాళ్ళను బాధించడానికి? ఆ యింతి మంగళసూత్రమహిమ ఎంత గొప్పదోకదా! ఇలా మన్మథునికి మంగళం పలికి, మలయపవనుడిని తిట్టింది. తిట్టీ తిట్టీ, కోపం, రోషం, విరహం, వేదన అన్నీ ముప్పిరిగొని మూర్ఛపోయింది. చెలికత్తెలు ఉపచారాలు చేసి తెలివితెప్పించారు. యిలా రాత్రంతా గడిచి, ఇంతలోనే సూర్యోదయం ఐంది. మరలా అద్భుతమైన వర్ణనల పరంపర ప్రవాహంగా పారించాడు పెద్దన.
సకలాశాగతి నర్మకోపవిరతి శ్రౌత క్రియారంభ ణా
త్మక వర్గత్రయికిన్ మదుచ్చరిత శబ్దజ్ఞానమే మూల మిం
తకుఁ బోలన్ వినుఁ డంచు దెల్పుగతిఁ జెంతం గొండపై పల్లెలం
గృకవాకుల్ మొరసెన్ గృహోపరి ద్రిభంగిన్ భుగ్న కంఠధ్వనిన్
సమస్త దిక్కులజాడలను, చీకటి రహస్యాలను తెలుసుకోవడానికి, వేదవిహితకర్మల ఆరంభానికీ నేను చేస్తున్న ఈ ధ్వనియే ఆధారము వినండోహో అన్నట్లు సమీపంలోనున్న కొండపై, పల్లెల్లో ఇళ్ళమీద కోళ్ళు ముమ్మార్లు కూశాయి.
వాలారుం గొనగోళ్ళ నీవలసతన్ వాయించుచో నాటకు
న్మేళంబైన విపంచి నిన్న మొదలున్ నీవంటమింజేసి యా
యాలాపంబె యవేళఁ బల్కెడుఁ బ్రభా తాయాత వాతాహ తా
లోలత్తంత్రుల మేళవింపఁ గదవే లోలాక్షి దేశాక్షికిన్
నీవు కొనగోళ్ళతో అలసటతో వాయిస్తున్నప్పుడు నాటరాగానికి మేళవించిన వీణ నిన్న మొదలుగా నీవు ముట్టుకొననికారణముగా ఆ రాగాన్నే ప్రభాతవాయువులకు పలుకుతున్నది, ఆ వీణ తీగలను ఓ లోలాక్షీ, దేశాక్షి రాగానికి మేళవించరాదూ! ప్రభాత సమయములో భూపాలం దేశాక్షి రాగాలు, మధ్యాహ్న వేళలలో నాటరాగం వాయించడం సంప్రదాయం, ఆ విషయాన్ని చెప్తున్నాడు సంగీతశాస్త్రజ్ఞుడైన పెద్దన!
ఇక ఇలా కాదుగానీ వాడేమన్నా ఇంద్రుడా, చంద్రుడా, ఉపేంద్రుడా? ఆ నందనవన భూమికి పోదాము రా! వాడు అక్కడ ఉండకపోడు, నీ అందము, చందము ఎవడినైనా వెర్రివాడిని చేయకుండా ఉంటుందా? ఎందుకిలా రోదించడం? యిదెంతపని? వాడు బాలుడు, అమాయకుడు కనుక అప్పటికీ నువ్వు అమాంతం మీద పడేసరికి భయపడి, సందేహించాడు కానీ వాడికి కూడా మరలా నిన్ను చూసేదాకా కాలునిలుస్తుందా? రా! రమ్మని ఒకతె కర్పూరము తెస్తే విసుగ్గా ఒక్క చుక్క పెట్టుకుంది. పూలరాశులు ఒకతె తెస్తే విసుగ్గా ఒకటిరెండు పూలు ముడుచుకుంది, రత్న పాదుకలు ఒకతె తెచ్చి పెడితే సున్నితముగా ఎప్పటిలా తొడుగుకోకుండా అవి దూరంగా తొలిగేట్లు విసురుగా అడుగుబెట్టింది వాటిలో. పోకలు ఒకతె తెచ్చి యిస్తే, సహించవు నాకు అని కొన్ని పరపరా నమిలి ఉమ్మేసింది. తాంబూలమును సగం కొరికింది. వారు పిలిస్తే సగమే సమాధానమిచ్చింది. సగము స్పృహలో సగం మైకంలో ఉన్నది. చింతతో సగమై చిక్కిపోయి (ఒక్క రాత్రికే!) సమీపంలో ఉన్న ఉద్యానవనములోకి తన చెలికత్తెలతో వెళ్ళింది వరూధిని. వారు ఉద్యానవిహారము చేస్తున్నా, జలక్రీడలాడుతున్నా, పరిహాసాలు చేసుకుంటూ పూలు కోసుకుంటున్నా వరూధిని మాత్రం ఈ ప్రపంచములో లేదు.
అపరిమితానురాగ సుమనోలసయై చిగురాకుఁ జేతులం
దపసిని కౌగిలించె వనితా యిదె రంభ! దలంప రంభ దా
నపరిమితానురాగ సుమనోలసయై చిగురాకుఁ జేతులం
దపసిని గౌగిలించుటుచితంబె కదా! యన నవ్వె రంభయున్
ఈ రంభ అపరిమితమైన ప్రేమతో తపసిని అంటే విశ్వామిత్రుడిని కౌగిలించుకుంది అలనాడు అన్నది ఒక సఖియ రంభను చూపిస్తూ, ఔనుమరి! అపరిమితమైన ప్రేమతో తపసిని అంటే అవిసె చెట్టును రంభ అంటే అరటిచెట్టు కౌగిలించుకోవడం సరి ఐనదే కదా అని శ్లేషగా పలికింది ఇంకొక సఖియ. అవిసెచెట్టు అరటిచెట్టు సహజముగానే, పెనవేసుకుని పెరిగిన దృశ్యాన్ని చూపిస్తూ ఇలా సరసోక్తులు ఆడుకున్నారు వారు. యిది ఇలా వుంటే ...
ప్రవరుడు హిమాలయాలకు రావడం, వరూధిని అతడిని కామించడం, ప్రవరుడు తిరస్కరించి వెళ్ళిపోవడం అంతా తెలుసుకున్నాడు గంధర్వుడు ఒకడు. యిప్పుడు వరూధిని ప్రవరుడిమీది విరహముతో అలమటిస్తున్న విషయాన్నీ గమనించాడు. ఇదే అదను అనుకున్నాడు.
ఒక్కొకవేళఁ బద్మముఖు లొల్లమి సేయుదు రొక్కవేళఁ బె
న్మక్కున నాదరింతురు క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్,
పక్కున వేసరన్ జన, దుపాయములన్ దగు నిచ్చకంబులన్
జిక్కఁగఁజేసి డాసి సతి చిత్తముఁ బట్టి సుఖింపఁగాఁ దగున్
పద్మముఖులు ఒకోసారి ఒప్పుకోరు, ఒకోసారి విపరీతమైన మక్కువతో దగ్గరికి తీసుకుంటారు, జవరాళ్ళమనసులు క్షణాలలో మారిపోతాయి, క్షణానికి ఒకసారి మారిపోతాయి! ఠక్కున విసిగిపోకూడదు. ఉపాయంగా తగినట్లు ఇచ్చకాలు చెప్పి చిక్కించుకుని, దరిచేరి, పట్టుకుని, పట్టు చిక్కించుకుని వాళ్ళతో యథేఛ్ఛగా సుఖించాలి అని నిర్ణయించుకున్నాడు జారశిఖామణి ఐన ఆ గంధర్వుడు. వరూధినికి ప్రవరుడిమీద మనసైంది కనుక అచ్చు ప్రవరుడిలా మారిపోయాడు వాడి గంధర్వమాయావిద్యతో. మారిపోయి, వరూధిని తన చెలికత్తెలతో విహరిస్తున్న వనంలో చేరిపోయాడు. వరూధిని ప్రవరుడి ఊహల్లో విహరిస్తూ, చెలికత్తెలతో వనములో విహరిస్తూ
పసిఁడితోరముతోడి బాహువల్లననెత్తి / సారెకుఁ బొదలపైఁ జాఁచి చాఁచి
బింబాధరంబు గంపింప నొయ్యన విపం / చీ స్వరంబున జట సెప్పి చెప్పి
దిశల మార్గాన్వేషి దీర్ఘలోచన దీప్తి / గణముచే దోరణకట్టి కట్టి
కమనీయ తనుకాంతి కనకద్రవంబున / నారామరంగంబు నలికి యలికి
యా నితంబ విలంబి కాలాహికల్ప
ఘనకచగ్రంథి నచటి భృంగముల కసిత
దీధితులు వడ్డికొసఁగుచు దేవపూజ
విరులు చిదిమెడి కపట భూసురుని గనియె
బంగారపు తోరపు దారము కట్టిన బాహువును మాటిమాటికీ పొదలపై చాపుతూ, మధ్య మధ్య దొండపండువంటి క్రిందిపెదవి కంపించేట్లు 'జట'చెప్తూ, నలుదిక్కులకూ దీర్ఘమైన చూపుల తోరణములు కడుతూ, నలుదిక్కులనూ పరికించి చూస్తూ, తన కమనీయమైన బంగారుశరీరకాంతితో ఆ ఉద్యానవనభూమిని అలుకుతూ, దీర్ఘమైన కాలసర్పమువంటి నల్లని శిరోజకాంతులను తుమ్మెదలకు వడ్డీకిస్తున్నట్లు, దేవపూజకోసం కాబోలు, పూలుకోస్తున్న కపట బ్రాహ్మణుడిని, మాయాప్రవరుడిని చూసింది!