ప్రముఖ నాస్తికుడు, హేతువాది, సంస్కర్త శ్రీ గోరా గారు - టీవీయస్. శాస్త్రి

pramukha naastikudu, hethuvadi, samskartha shree goraa garu

చాలా కాలం నుండి నన్నొక ప్రశ్నవేధిస్తుంది. అది ఏమిటంటే, ఆస్తికులు మంచివారా? నాస్తికులు మంచివారా? అని. ఆస్తికత్వం, నాస్తికత్వం అనేవి కేవలం మన నమ్మకాలకు సంబంధించిన విషయాలు.కానీ, మంచితనం నమ్మకానికి సంబంధించిన విషయం కాదు, మనసుకు సంబంధించిన విషయం. ప్రపంచంలో మహాభక్తులుగా చెలామణి అవుతున్న వారిలో దొంగ సన్యాసులు, దుర్మార్గులు చాలామంది ఉన్నారు. అలాగే, మంచివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే నాస్తికులలో కూడా మంచివారున్నారు, చెడ్డవారున్నారు. ఈ రెండు భిన్న ధ్రువాలు. ఒక దానితో మరొకటి పోల్చటానికి వీలులేదు. తోటి మనిషికి కష్ట సమయంలో సాయం చేయటం  మంచితనం. దీనికి కావలసింది మంచి మనసొక్కటే! మనిషి నాస్తికుడైతే నేమి? ఆస్తికుడైతే నేమి? మానవత్వం లేని మృగం అయితే ఉపయోగ మేముంది? మానవసేవ చేసేవాడు నాస్తికుడైనా దైవస్వరూపుడవుతాడు. దుర్మార్గుడైన ఆస్తికుడు ఎన్ని పూజలు చేసినా అతనికి దైవకటాక్షం లభించదు. కావున అన్నిటి కన్నా ముఖ్యమైంది - మనిషి మంచివాడా, కాదా అన్నదే ముఖ్యం. నేడు మనిషి మితిమీరిన స్వార్ధంతో తాను ఏమి చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి వారు ఆస్తికులైనా, నాస్తికులైనా ఒకటే! మన రాజకీయనాయకులు అందరూ దైవభక్తులే. కానీ, ఉపయోగం ఏముంది? నిజంగా వారికి దైవభక్తి, పాపభీతి ఉంటే, దేశంలో ఇంత అవినీతి వేళ్ళు పాతుకొని పోతుందా? భగవంతుడు కోరేది ఇటువంటి భక్తులను, భక్తిని కాదు. మానవత్వం, మంచితనం ఎవరివద్ద ఉంటే వారిని వెతుక్కుంటూ భగవంతుడే స్వయంగా వారివద్దకు వస్తాడు. సేవాదృక్పథం, మంచితనం లేని ఆస్తికత్వం శుద్ధ దండుగ. అసలు భక్తి అంటే ఏమిటో తెలుసు కోవాలంటే, 'నారద భక్తి సూత్రాలను' చదివితే తెలుస్తుంది. 'గోరా'గా ప్రసిద్ధులైన శ్రీ గోపరాజు రామచంద్రరావుగారు నాస్తికుడిగా, హేతువాదిగా, గాంధేయవాదిగా తెలుగు వారందరికీ సుపరిచితులు. వారి దృష్టిలో ఆస్తికత, హేతువాదం రెండు భిన్న ధ్రువాలు. నేటి సమాజంలో అగ్ర, నిమ్నజాతులనే వర్ణ బేధాలు, అంధ విశ్వాసాలు పెరగటానికి ఆస్తికతే కారణం అని వారి గట్టి నమ్మకం. మానవులందరూ ఒకటే అన్న భావం పెరగాలంటే ,అది ఒక్క నాస్తికవాదం వల్లనే సాధ్యమని  విశ్వసించి, నాస్తికభావాల ప్రచారం కోసం తన జీవితమంతా వెచ్చించిన మహనీయుడు శ్రీ గోరా! శ్రీ గోరా గారు ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ఛత్రపూర్ అనే కుగ్రామంలో,15 -11 -1902 నజన్మించారు. ఉన్నత కుల హిందూ కుటుంబంలో జన్మించిన శ్రీ రామచంద్రరావుగారు వృక్ష శాస్త్రంలోడిగ్రీ చదివి, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అదే శాస్త్రంలో మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణుడయ్యాడు. శ్రీ గోరా గారు కొంతకాలం అధ్యాపకులుగా వివిధ కళాశాలలో పనిచేశారు. కొంతకాలం శ్రీ లంకలో కూడా పనిచేసారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి ఉద్యమాలలో పాల్గొని  బ్రిటిష్ ప్రభుత్వపు జైళ్లలో కఠిన శిక్షలు అనుభవించారు. పెళ్ళికి ముందే సెక్స్ పైన అవగాహనలు, కుటుంబ నియంత్రణ, వీటితో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే. గోరా అనేక రచనలను చేశారు. 1922 లో సరస్వతిని ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నారు. సంఘం, ఆర్ధిక సమత అనే పత్రికలను నడిపారు. వర్ణవ్యవస్థ, అంటరానితనం మీద తన యుద్ధాన్ని ప్రకటించిన గోరా 1940 లోఆయన భార్యతో కలసి నాస్తిక కేద్రాన్ని, కృష్ణా జిల్లాలోని ఒక గ్రామంలో ప్రారంభించటం జరిగింది. దేశస్వాతంత్ర్యంసందర్భంగా, 1947 లో, కేంద్రాన్ని విజయవాడకు తరలించడం జరిగింది.

కుమారులకు ఆయన పెట్టిన పేర్లు - ఉప్పుసత్యాగ్రహం కాలంలో పుట్టినందున లవణం, భారతీయులు చట్టసభలలో నిలిచి గెలిచిన కాలంలో పుట్టినందున విజయం, రెండవ ప్రపంచ యుద్ధకాలంలోపుట్టినందున ఒక కుమారునికి సమరం, మరొక కుమారునికి నియంత. తొమ్మిదవ సంతానానికి నౌవ్ గా పేర్లు పెట్టారు. హిందీ భాషలో నౌవ్ అంటే తొమ్మిది అని అర్ధం. కుమార్తెలు మనోరమ, మైత్రి, విద్య. గోరా గారు 25 ఏళ్ళ వయసు వరకు అస్తికుడే. తరువాత నాస్తిక సిద్ధాంతాలతో జీవితాంతం కృషి సల్పిన గోరా జీవితమే ఒక ఆదర్శం. గోరా గారు తన భార్యకి గర్భం వచ్చిన ప్రతిసారీ గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్నఆమెను బయటకి తీసుకొని వెళ్లి తిప్పేవారు. గ్రహణం సమయంలో గర్భిణులు బయట తిరిగినంత మాత్రాన పుట్టబోయే  పిల్లలకు గ్రహణం మొర్రి రాదు, అని నిరూపించటానికి. గోరా గారి పిల్లల్లో ఎవరికీ  గ్రహణం మొర్రి రాలేదు.

గోరా నమ్మిన నిజాలు -
దేవుడు అబద్ధం. నీతి పెరగాలంటే దైవభావం పోవాలి. జాతి మతం కులం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. నాస్తికత్వంలో ఈ వివక్షలకు తావులేదు. దేవుడు, కర్మ అనే భావాలు పోతే మనిషి మతస్తుడిగా కాకుండా మానవుడిగా మిగులుతాడు. సోదరభావం పెరుగుతుంది.

ధర్మపత్ని సరస్వతీ గోరా -
గోరాగారి భార్య శ్రీమతి సరస్వతీగోరా సంఘసేవిక, మతాతీత మానవతావాది. మానవులంతా సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే, కులాలు, మతవిశ్వాసాలు ఉంటే సాధ్యం కాదు. నాస్తిక వాదం ఒక్కటే శరణ్యం. కుల, మత రహిత సమసమాజమే ధ్యేయం అనేవారు. విజయనగరంలో 1912లో జన్మించింది. గోరాతో పాటు సరస్వతీ గోరా 1928 ప్రాంతాలలో శ్రీలంకలో వున్నారు. మతాచారాల్ని దిక్కరించారు. పైగా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు గ్రహణాలను కావాలని చూసారు. రాహువు, కేతువులు మానవ సమాజంలోనే ఉన్నారన్నారు. నిప్పుల మీద నడవటమనేది దేవతల మహాత్మ్యం కాదని ఎవరెైనా నడవవచ్చని ఆమె స్వయంగా నిప్పులమీద నడిచారు. దేవదాసీలకు స్వయంగా వివాహాలను జరిపించారు. కులనిర్మూలన, నాస్తిక వాదాలను విస్తృతంగా ప్రచారం చేసారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొన్నాళ్ళు జైలుశిక్ష అనుభవించారు. అస్పృస్యతా నివారణ ఉద్యమం చేపట్టారు. మహాత్మా గాంధీజీ ఆమె సేవలను గుర్తించి సేవాగ్రామ్ కు ఆహ్వానించారు. ఆహార కొరత ఉన్న రోజుల్లో కూరగాయలను పండించాలని ఉద్యమించారు. ఈనాం భూములను పొలాలు లేని రైతులకు పంచాలని సత్యాగ్రహం చేపట్టారు. ఆచార్య వినోభాభావే చేపట్టిన సర్వోదయ ఉద్యమంతో ప్రభావితులై  దేశమంతా ప్రయాణించి వినోభాభావే ఆశయాలకు మంచి ప్రచారం కల్పించారు. మతాన్ని సూచించే ఏ ఆభరణాలను, చిహ్నాలను ఆమె ధరించేవారు కాదు. పుణ్యవతిగా బొట్టూ, కాటుక, గాజులు, మంగళ సూత్రాలవంటివి ధరించలేదు. 1975 జూలై 26న గోరా మరణించినప్పుడు ఆమె అభిమతానికి అనుగుణంగా గోరా గారికి ఏ మత సాంప్రదాయాన్ని పాటించకుండా సంస్కారాలు జరిపించారు.

శ్రీ గోరా గారు రచించిన గ్రంధాలు -
నాస్తికత్వం(దేవుడులేడు), దేవుని పుట్టుపూర్వోత్తరాలు, జీవితం నేర్పిన పాఠాలు, నేను నాస్తికుడిని, సృష్టి రహస్యం, సంఘ దృష్టి, ఆర్ధిక సమానత్వం, నాస్తికత్వం - ప్రశ్నోత్తరాలు, నాస్తికత్వం - ఆవశ్యకత, An Atheist with Gandhi, Positive Atheism, We become Atheists, I learn, people and progress, A note on Atheism, The need of Atheism...

గోరాగారు తన సంతానమందరికీ, వారివారి అభీష్టం మేరకు, అందరికీ వర్ణాంతర వివాహాలు 'నాస్తిక పద్ధతిలో' జరిపించారు. ప్రముఖ కవి, దళిత కులానికి చెందిన శ్రీ జాషువా గారి కూతురైన హేమలత గారిని, తన కుమారుడైన శ్రీ లవణం గారికిచ్చి వివాహం జరిపించిన ఆదర్శవాది శ్రీ గోరాగారు. చెప్పింది చేసి చూపించిన మహనీయుడు శ్రీ గోరాగారు. 1970 లో బోస్టన్ లోనూ,1974లో హాలండ్ లోని అంష్టర్దాంలో జరిగిన అంతర్జాతీయ హ్యూమనిష్టు మహాసభలలో శ్రీ  గోరాగారు పాల్గొన్నారు. తెలుగులో ఒక వార పత్రిక 'సంఘం' ను స్థాపించి, దాని ద్వారా తన ఆశయాలను, లక్ష్యాలను ప్రజలలో విశేషంగా ప్రచారం చేశారు. గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది, నాస్తిక ఉద్యమ నాయకుడు, హేతువాది అయిన శ్రీ గోరాగారు, 26 -07 -1975 న విజయవాడలోని నాస్తిక కేంద్రంలో ప్రసంగిస్తూ మరణించారు. గోరా గారి శతజయంతి సందర్భంగా 2002 లో భారతప్రభుత్వం, తపాలా బిళ్ళను విడుదల చేసింది. వారి కోడలైన శ్రీమతి హేమలతాలవణం గారు తన తండ్రి శ్రీ జాషువా గారి రచనలను వెలుగులోకి తెస్తూ, మామగారైన శ్రీ గోరా గారు స్థాపించిన 'నాస్తిక కేంద్రాన్ని' కూడా సమర్ధవంతంగా నడిపారు. ఈమె కూడా 19 -03 -2008 న నాస్తికకేంద్రం, విజయవాడలోనే మరణించారు.

 

తన లక్ష్యాలకోసం జీవితాన్ని మొత్తం ధారపోసిన శ్రీ గోరా గారు చిరస్మరణీయులు.
వారికి నా ఘనమైన నివాళి!

 

కలడందురు దీనులయెడ
గలదండురు పరమయోగి గణముల పాలన్
గలడందురన్ని దిశలను    
కలడు కలండనెడి వాడు కలడో లేడో !!

"A man’s ethical behavior should be based effectually on sympathy, education, and social ties; no religious basis is necessary. Man would indeed be in a poor way if he had to be restrained by fear of punishment and hope of reward after death."- Albert Einstein

Sacrificing the earth for paradise is giving up substance for the shadow.-Victor Hugo (1802-1885)

Emotional excitement reaches men through tea, tobacco, opium, whiskey and religion--George Bernard Shaw (1856-1950)

"Religion is based, I think, primarily and mainly upon fear. It is partly the terror of the unknown and partly, as I have said, the wish to feel that you have a kind of elder brother who will stand by you in all your troubles and disputes. Fear is the basis of the whole thing — fear of the mysterious, fear of defeat, fear of death. Fear is the parent of cruelty, and therefore it is no wonder if cruelty and religion have gone hand in hand." - Why I Am Not A Christian – Bertrand Russell.

మంచి తనం లేని వాడు ఆస్తికుడైనా,నాస్తికుడైనా ఒకటే అని అంటాను. మరి మీరేమంటారు?

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి