సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

sahitee vanam
అల్లసాని పెద్దన స్వారోచిష మనుసంభవము
 

(గత సంచిక తరువాయి)
 

అల్లసాని పెద్దనవారి మనుచరిత్రమును గతములో పెద్దలు ఎందఱో సమీక్షించారు. వారు పండితప్రకాండులు, బహుశాస్త్ర పారంగతులు, నేను వారి ప్రజ్ఞలో ఆవగింజలో అరవయ్యోవంతుకూడా లేని సామాన్యుడిని. కానీ నాకుమాత్రం మాయాప్రవరుడిగా వరూధినితో సుఖించిన గంధర్వుడు (వాడి పేరు 'కలి' అని మార్కండేయ పురాణం చెప్తుంది, పెద్దన వాడి పేరు పెద్ద అవసరంగా భావించలేదు బహుశా, పేరు చెప్పలేదు) వరూధిని చెలికత్తెలైన ఇతర అప్సరల సహాయంతో గానీ, లేదా వారికీ తెలిసేగానీ తన నాటకం ఆడాడు అనిపిస్తుంది, మనుచరిత్రమును చదివినప్పుడల్లా! ఇందుకు కారణం వరూధినితో అలా వనంలోకి వెళ్లి వద్దాం, వాడు అక్కడనే ఉండకపోడు, వాడికి మాత్రం నిన్ను చూడకుండా కాలు నిలుస్తుందా, అని చెప్పి తీసుకెళ్లడం, సహజంగానే అప్సరలకు, కామినుల చెలికత్తెలకు ఇలా ప్రేయసీ ప్రియుల సమాగమాన్ని ఏర్పాటు చేయడం అలవాటు అనేది ఒకటి, ఆ గంధర్వుడు 'జార విద్యలో' ఆరితేరినవాడు కనుక, తగిన ఉపాయంతో స్త్రీలను
వశపరుచుకోవాలి, ఒకోసారి బెట్టు చేస్తారు, ఒకోసారి కరిగిపోతారు, విసిగిపోయి నిరాశపడకూడదు అని అనుకోవడం రెండవ కారణం, మూడవది వరూధినీ మాయాప్రవరుల కలయిక జరిగినప్పుడు వారు నర్మగర్భంగా మాట్లాడడం, ఉత్తుత్తి కోపాన్ని మాయాప్రవరుడిమీద చూపించడం, చివరిది, ముఖ్యమైనది, వారూ దేవతా జాతికి చెందినవారే ఆ గంధర్వునిలా, వారికీ జరిగినది, జరుగుతున్నది, జరుగబోయేదీ తెలుసుకోవడం అసాధ్యం కాదు అనేది! పూర్వం ఈ గ్రంథాన్ని పరిశీలించినవారు ఇలా భావించినట్టు నాకు తెలియదు మరి.

సరే, జలక్రీడలాడుతూ తననుకూడా రమ్మని పిలుస్తున్న చెలికత్తెలకు 'మీకొక నమస్కారం, మీరు హాయిగా జలక్రీడలాడుకొండి, నా వల్లకాదు' అని ఒకర్తే ముందుకు వెళ్లి, పూలు కోసుకుంటున్న మాయాప్రవరుడిని చూసింది.

కాంచి కలక్వణత్కనక కాంచికయై  యెదు రేఁగి యప్పు డ
క్కాంచన కేతకీకుసుమగాత్రి వయస్యల డించి తన్నికుం
జాంచలవీథిఁ దారుచు ఘనాంత చలచ్చపలాకృతిం గలం
గాంచిన వస్తువుం దెలిసి కాంచినయ ట్లనురక్తిఁ గాంచుచున్

చూసి, గలగలలాడుతున్న వడ్డాణపు గజ్జెల సవ్వడితో, పచ్చ మొగలిపూవంటి(గొజ్జంగిపూలు అంటారు) బంగారువన్నెలో మెరుస్తున్న శరీర కాంతి కలిగిన ఆ పూబోడి తన స్నేహితురాళ్ళను వదిలి, ఆ పూపొదల మధ్య నుండి వేగముగా పరిగెత్తుతున్నట్లు వెళ్లి, కలలో, కటికచీకటిలో కదలాడే వస్తువును, కావలసిన వస్తువును చూసినట్లు అబ్బురంగా, అనురక్తిగా, ఆర్తిగా చూసింది.

మొగలిపూవుల పొదల్లో విషనాగులుంటాయి, వీడు విషనాగులాంటి ఖలుడు అని సూచిస్తున్నాడు పెద్దన. తన ప్రియుడిని చూసిన ఆడనాగులా పరుగెత్తింది, కలయికకోసం వెర్రెత్తి అని ధ్వనిస్తున్నాడు. కలలోకదలాడే వస్తువు అనడం వాడి కలయిక ఒక కల, నిజంలాగే అనిపించే కల్పన, శాశ్వతం కాదు, యథార్థంలోకి వచ్చినప్పుడు ఆ స్వాప్నిక భ్రాంతి కరిగిపోతుంది, మనసు విరిగిపోతుంది, కాలంమాత్రం కఠోర సత్యాలను ఆవిష్కరిస్తూ జరిగిపోతుంది అని చెప్పడం! ధ్వని, సూచనలతో మనసుకు ఆనందాన్నికలిగించడం అంటే యిదే!

ఆ కమలాక్షి యింపున దృగంచల మించుక మూసి హర్షబా
ష్పాకుల కోణ శోణ రుచులగ్రమునం జనఁ జూచు చూపు తీ
రై కనుపట్టెఁ దమ్మరస మంటుకొనన్ వెడనింటివాఁడు క్రో
ధైక ధురీణతం  గఱచి యేసిన సింగిణి కోలయో యనన్

కలలో చూసిన ప్రియవస్తువును చూసినట్టు (మాయా)ప్రవరుడిని చూసి, తన కనులలో దాచుకోడానికేమో అన్నట్లు కనులు అరమూసుకుని, ఆనందబాష్పాలునిండిన ఎర్రబడ్డ కనులతోచూసిన చూపు, పూవు మకరందం అంటుకున్న, మన్మథుడు క్రోధమూర్తియై బిగించి లాగిపట్టుకుని వేసిన బాణమేమో అన్నట్లు ఉంది. అరమూసిన కనులు ముకుళించుకున్న పూలలాగా ఉన్నాయి, ఆ కంటి చెమ్మ ఆ పూల మకరందం లాగా ఉన్నది, ఈసారైనా జారిపోకుండా, పారిపోకుండా కొట్టాలి అని అనుకుని మన్మథుడు లాగిపెట్టి కొట్టిన పూలబాణం లాగా ఉన్నది చూపుతూపు

తొలుదొల్త వానిఁ గన్నులఁ గాంచినప్పుడ / పల్లవాధరగుండె జల్లు మనియె
నట రెండు మూఁడంజ లరుగునప్పుడ కాళ్ళ / బంకజాక్షికిఁ దొట్రుపాటు గదిరె
డాయంగఁ జనునప్పుడ  ముఖాంబుజంబునఁ / గంబుకంధరకు దైన్యంబు దోఁచెఁ
గదిసి నిల్చిన యప్డ కనుదోయి ఱెప్పల / లలనకు మిగులఁ జంచలత బెరసెఁ

గటకటా! యనునపుడ గద్గదిక వొడమెఁ
జెఱగు వట్టినయపుడ లేఁజెమట గ్రమ్మె
సొలసి మాటాడ నుంకింపఁ దలఁచి మోము
తేరకొనఁ జూచునపుడ కన్నీరు వొడమె

వాడిని చూడగానే మొదలు ఆ చిగురాకు పెదవుల చెలువకు గుండె జల్లుమన్నది, చిగురాకు వంటి అధరములు కనుక పెదవులు కూడా కంపిస్తున్నాయి అని సూచన! వాడివైపు రెండు మూడు అడుగులు వేస్తున్నపుడు ఆ పంకజాక్షికి కాళ్ళు తడబడ్డాయి. సమీపిస్తున్నపుడు ఆమె ముఖంలో దైన్యం గోచరించింది. దగ్గరికివెళ్లి నిలిచినప్పుడు కనులు చలించిపోయాయి, పోయింది అనుకున్న పెన్నిధిని అపురూపముగా కలయచూడడం వలన. 'అయ్యో! (నన్నెంత బాధకు గురిచేశావు!) అంటున్నప్పుడు కంఠము గద్గదికమైంది. నోట మాటలుపెకలక, ఎన్నెన్నో మాటలు ఒకేసారి చెప్పెయ్యాలని ఆత్రుతతో చీరచెరగు వేళ్ళతో మెలిక పెడుతున్నపుడు లేత చెమటలు కమ్మాయి, ఆ చెరగుతో చెమటలు అద్దుకుంటూ నీరసంగా, బలహీనంగా, మాట్లాడాలనుకుని అతని ముఖాన్నే చూస్తున్నప్పుడు కన్నీరు పెల్లుబికింది!

ఏనుగు దంతాలలాగా తళతళలాడుతున్న చెక్కిళ్ళపై కాటుకకళ్ళనుండి కన్నీరు ఒలుకుతుండగా ఆ అప్సర మాటలు పెగలక, గొంతు సవరించుకుంటూ ఇలా పలికింది.

ఏలర యీ చలంబుడిగి యేలర బాల రసాల మాలతీ
జాలములో శశాంక కరజాలములో వలవంత నశ్రువుల్
జాలుగ నాల్గుజాలు నిఁకఁజాలు భవం బనునంత కాఁకకున్
బా లయి రాత్రి పంచశరు బారికిఁ జిక్కితి నీకు దక్కితిన్

ఎందుకురా ఈ అలుక? ఈ అలుకమాని చిరుమామిళ్ళపొదలలో, మాలతీపొదలలో, చంద్రుని అమృతపుటేరులలో నన్నేలరా! నిలువెల్లా అశ్రుధారలుగా ఈ జన్మకు ఇక చాలు అన్నంతగా రాత్రి నాలుగు జాములు కాగిపోయి, మన్మథుని బారికి చిక్కి కూడా, నీకోసమేనేమో బతికిపోయాను! ఈ పద్యం శబ్దసౌందర్యపు జాలు!

రా, వైరాగ్యము పూని నీవు కడు నిర్దాక్షిణ్య చిత్తంబునన్
రావైతేఁ జవి గాని యిందులకు హోరాహోరిగాఁ బోరి యే
లా వాలాయము సేయఁగా? బ్రదుకు నీవాచారవంతుండవై
చావో యెక్కుడొ నీ యెడం బొడము వాంఛన్ భూసుర గ్రామణీ

రారా! నువ్వు ఇలా వైరాగ్యం పూని నిర్దయగా రాకుండా నన్ను తోసిపుచ్చినా ఇలా హోరాహోరీగా పోరాడడంలో యేమిరుచి ఉంటుందని? మాలతీ, మామిడి పొదల్లో మన్మథ యుద్ధంలో హోరాహోరీగా పోరాడడంలో రుచి ఉంటుంది గాని! ఇలా ఆచారవంతుడివైన నీకు దూరమై బ్రదకడమో, నీ మీది వాంఛతో చావడమో మేలు? బ్రాహ్మణోత్తమా! నాకు ఏది మంచిదో చెప్పరా! నన్నేంచెయ్యమంటావో నువ్వే చెప్పు!

నీ మొండిపట్టును విడవకుండా మనసును రాయి చేసుకుని కరగకుండా నువ్వుంటే, ఎన్నని ఏం లాభం? నా అదృష్టం ఇలా వుంటే! ఇలా పలవరింతగా, వలపుల సలపరింతగా, వల్లమాలిన వంతగా వరూధిని పలుకుతుంటే, ఆ కపట బ్రాహ్మణుడు

కొనసాఁగి కామినీ గోష్ఠిఁ బ్రౌఢములైన / యుదుటుఁజూపుల ఱెప్ప తుదల నాఁచి  
సంతసంబున ముఖాబ్జమునందుఁ జిఱునవ్వు / కందళింపక యుండ డిందుపఱచి
పొంగారు మైఁ దోఁచు శృంగార చేష్టల / తమిఁ దెచ్చికోలు మౌగ్ధ్యమున డాఁచి
పొడము రసావేశమున వచ్చు నర్మోక్తు / లొదవి నాలుకకు రాకుండఁ గ్రుక్కి

మస్తకము వాంచి యుసు రని మౌనముద్ర
నేల బొటవ్రేల వ్రాయుచు నిలిచి కొంత
సేపు వెడవెడ చింతించి శిర సొకింత
యెత్తి సన్నంపు టెలుఁగుతో నిట్టు లనియె

నిరంతరము కామినులతో కబుర్లలో కాకలుతీరిన 'ముదురు' మోహపు చూపులను కనురెప్పలవెనుక నొక్కిపట్టి, తన పాచిక పారింది, తనను గుర్తించలేదు, ప్రవరుడు అనే అనుకుంటున్నది పిచ్చిది, నా పంట పండినట్టే ఇక అని లోపల్లోపల కలుగుతున్న సంతోషంతో వస్తున్న చిరునవ్వు ముఖం మీద కనిపించకుండా దాచిపెట్టి, అలల్లాగా లోలోపల పొంగుతున్న శృంగారభావాలను తెచ్చిపెట్టుకున్న మౌనముచాటున దాచిపెట్టి, సరస రసావేశంతో పెల్లుబికివచ్చే నర్మగర్భితమైన పలుకులను నాలుక మీదికి రాకుండా అణచుకుని, తలవంచుకుని, మధ్య మధ్య ఉస్సురని నిట్టూరుస్తూ, మౌనంగా కొంతసేపు నేలను బొటనవ్రేలితో రాస్తూ పరిపరివిధాల ఆలోచిస్తున్నట్టు నటించి, చివరికి తలెత్తి సన్నని ధ్వనితో పలికాడు, ఎంత నటన, ఎలాంటి పాత్ర చిత్రణ!

అక్కడ నన్ను చూడకుండా నా తల్లిదండ్రులు దిగులుపడుతుంటే, ఇల్లాలు బెంగతో క్రుశించిపోతుంటే, అగ్నులు చల్లారుతుంటే, ఇల్లంతా శూన్యమై వెలవెల పోతుంటే , ఇక్కడ చిక్కిపోయి నేనెలా సుఖించగలను చెప్పు? నీ కౌగిలిలో సుఖించే అదృష్టం ఆ దేవేంద్రుడికైనా ఉండదని నాకు తెలియదా? వద్దొద్దు అనడానికి నేనేమన్నా సన్యాసినా, కాదుకానీ, ఇంటి ధ్యాసతో మనసు తహతహలాడుతుంటే రతికేళిపై మనసెలా నిలుస్తుంది చెప్పు, మనసు బాగోలేనప్పుడు ప్రతిదీ రోతగానే ఉంటుందని నీకు తెలియదూ? అయినా సరే, కానియ్, నీ దీనతను చూసి అయినా నా వ్రతం విడిచిపెడతాను, మన శరీరం ఏమైతేనేం, ఇతరుల మేలును కోరుకోవాలి గానీ!

అది సరే, ఒక్క నియమము మాత్రం ఉంది. మనమిద్దరమూ రతికేళిలో సుఖిస్తున్నప్పుడు నువ్వు కనులు మూసుకోవాలి, నన్ను చూడకూడదు, అది మా దేశమర్యాద!( రతిలో, జననంలో, మరణంలో అసలురూపం కలుగుతుంది గంధర్వులకు, కనుక ఈ నియమము. విచిత్రం, మనుషులకు కూడా వాడి అసలురంగు బయట పడుతుంది ఈ సమయసందర్భాలలో, చాలావరకూ!)

ఈ షరతుకు నువ్వు అంగీకరిస్తే నా అదృష్టం, లేదూ అంటావా, ఈ గంగాతీరంలో, ఈమునివాటికలలో, ఈ చెట్లకింద ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటూ బతికేస్తాను, ఏం చేయను చెప్పు? ఈ దేహంతో ఇక ఇంటికి చేరుకోలేను కదా, వేరే దారి ఏముంది నాకు? ఆ! మరొక్క మాట! నీ కోరిక తీరగానే నన్ను గెంటేయకూడదు మరి, నేనైనా నిన్ను ఒప్పించి, నువ్వు సరే అంటేనేగానీ నిన్నొదిలి వెళ్ళను, వ్రతం చెడ్డా సుఖమన్నా దక్కాలికదా! ముగ్గులోకి దిగినతర్వాత మూన్నాళ్ళముచ్చట కాకూడదు!

నీ వక్షోజాలకు పూసుకున్న కస్తూరి పరిమళం నా ఒంటినిండా అంటుకునేట్లు నీ కౌగిలిలో చిరకాలం సుఖించడం, లేదూ అంటే తపస్సు చేసుకోవడం, ఈ రెండే, ఏదో ఒకటి చెయ్యాలి గానీ, రెంటికీ చెడిన రేవడిని కావడానికి సిద్ధంగాలేను! ఈ నాలుగుమాటలు పలికి మౌనం వహించాడు మాయాప్రవరుడు.

వరూధిని సంతోషానికి అవధుల్లేవు. నువ్వెలా అంటే నేనలానే అన్నది, నీ ఇష్టం, నేను నీ దాన్ని అన్నది. ఇంతలో జలక్రీడలాడుతున్న సుందరాంగులంతా వచ్చి, చుట్టూచేరి, ఆ మాయాప్రవరుడితో పరాచికాలాడుతూ, దెప్పి పొడుస్తూ, నర్మగర్భంగా ప్రోత్సహిస్తూ కేరింతలు కొడుతూ ఇద్దరినీ తొలి సమాగమానికి పంపారు.

మృగనాభినికరంపు బుగబుగల్ గలచోటఁ /  జదలేటి తుంపురుల్ చెదరుచోట
వకుళవాటీ గంధ వహుఁడు పైకొనుచోటఁ / గర్పూరతరు ధూళి గప్పు చోటఁ
బసమీఱ సెలయేఱు లిసుక వెట్టినచోటఁ / జిగురుమావుల సంజ నిగుడుచోట
సవమాలికల తేనె నట్లొట్లు పడుచోట / మాణిక్యదీపముల్ మలయుచోట

బ్రమదమునఁ దేఁటు లెలుఁగెత్తి పాడుచోట
శారిక లనంగశాస్త్రముల్ చదువుచోటఁ
గీర కలకంఠములు క్రొవ్వి కేరుచోటఁ
బావురము లారజంబులు పలుకుచోట

కస్తూరిపరిమళపు ఘుఘుమలున్నచోట, సెలయేటి తుంపురులు చిప్పిల్లే చోట, పూపొదల సుగంధాన్ని వాయువు మోసుకొస్తున్నచోట, కర్పూరపుచెట్లనుండి రాలుతున్న కర్పూరపుపొడి దూళిగా చెలరేగేచోట, సెలయేళ్ళు పసందుగా ఇసుకమేటలు పెట్టినచోట, చిరుమామిళ్ళలో సంధ్య సందడిచేసే చోట, పూలతీగల నుండి తేనె బొట్లుబొట్లుగా పడేచోట, మాణిక్యముల కాంతులు దీపాలుగా వెలిగేచోట్ల, సంతోషంగా తుమ్మెదలు ఎలుగెత్తి పాడేచోట,  గోరువంకలు మన్మథ శాస్త్రములు అప్పజెప్పేచోట, చివురాకులు మెక్కి, బలుపెక్కి కోయిలలు కేరింతలుకొట్టేచోట, పావురాలు సొగసుగా ధ్వనులుచేసేచోట వరూథినీ మాయాప్రవరుల తొలిసంగమం రసమయంగా, సరసమయంగా, పెద్దన కవితారసమయంగా, తెలుగుసాహితీస్వర్ణయుగ సమయంగా జరిగింది.

సహసా నఖంపచ స్తన దత్త పరిరంభ / మామూల పరిచుమ్బితాధరోష్ఠ
మతిశయ ప్రేమ కల్పిత దంత సంబాధ / మగణిత గ్లాని శయ్యా నిపాత
మతివేల మణిత యాచ్ఞార్థ గల్లచపేట / మతిదీన వా క్సూచి తాత్మవిరహ
మంకుర త్పులక జాలావిద్ధ సర్వాంగ / మానంద కృత హా ర వాననాబ్జ

మాక్రమక్షీణ నుతివర్ణ మానిమీలి
తాక్ష మాస్విన్న గండ మాయత్త చేష్ట
మాస్తిమిత భూషణారవ మావధూటి
ప్రథమసురతంబు గంధర్వ పతిఁ గరంచె

వేల కొనగోటి నొక్కుళ్ళతో వెలసిన మెరిసిన మురిసిన వనిత వక్షోజముల వన్నెల కౌగిలింత ఈప్రక్క, కొసరి కొసరిన ముద్దుల ముద్దరాలి ముద్దుమోవి ఆప్రక్క, మిక్కిలి ప్రేమతో పంటి నొక్కుల ఇక్కట్లు ఈ ప్రక్క, లెక్కచేయని పక్కపై బాధలాప్రక్క, పదే పదే సన్నని సన్నాయి సన్నెల సడుల అభ్యర్ధనలు, అతి దీనలాపాల సూచితమైన విరహము, పులకరింతలు నిలువెల్లా పూసిన దేహము, ఆనంద సూచనగా 'ఆహా'కారాలు, క్రమముగా, ఆక్రమక్రమముగా సన్నగిల్లుతున్న మెచ్చుకోళ్ళు, అరమోడ్పు కనులు, అరచెమటల చెక్కిళ్ళు, సక్రమమైన సన్నద్ధత, సుడిపడి, సడి విడి సద్దుమణిగిన సర్వాభరణ సరస నిక్వణ సహితయై, ఇతర ప్రాపంచిక ఆలోచనా రహితయై, వరూథిని తన ప్రథమ సురతంలో ఆ గంధర్వుడిని కరుచుకుంది! వాడికి ప్రథమ సురతం కాదని ఒక శ్లేష వేశాడు పెద్దన, వాడు 'అనుభవజ్ఞుడ'ని ముందేచెప్పినవిషయం తెలిసిందే!

అన్నునఁ గనుమూయుట రొద
సన్నగిలుటఁ గౌఁగిలింత సడలుట నేర్పుల్
సు న్నగుట వరూథిని రతి
కన్నెఱికపు రతియుఁ బోలెఁ గడు నింపొసగెన్

అదటుకు కను మూయడం, రొద సన్నగిల్లడం, నేర్పరితనం, జాణతనం సున్నయై పోవడంతో వరూథిని సమాగమం ప్రథమ సమాగమం కావడంవలన ఇంపుగా తోచింది(గంధర్వుడికి) యిలా ఎంతోకాలం ఇద్దరూ మన్మ్తథవిద్యను ఉపాసించారు. వరూథిని గర్భం ధరించింది. ఆమె నడక మందగించింది, మునుపటి వేగము, దూకుడు లేదు. నారు ఏర్పడింది. చనుమొనలు నల్లవారాయి. ఒళ్ళు అలసటగా కనిపిస్తున్నది. బడలిక పెరిగింది. నిద్ర ఎక్కువయ్యింది, రుచి, తిండి తగ్గిపోయాయి.

నాక జలజాక్షి నిరుపేద నడుము బలిసి
యల్లనల్లన వళిసీమ నాక్రమించె
బేర్చి దివసక్రమంబున బీద బలిసి
బందికాఁ డైనఁ బొరువులు బ్రదుకు గనునె?

ఆ అప్సర నిరుపేద నడుము బలిసి నెమ్మదిగా నడుముకున్న ముద్దైన ముడుతలను ఆక్రమించింది, నెమ్మదిగా కూడబెట్టి బీదవాడు ధనికుడైతే, బందిపోటు అయితే ఇరుగూ పొరుగూ బ్రతకలేనట్టు! క్రమక్రమంగా ఆమెకు రతికేళి మీద కూడా కోరిక తగ్గింది, ఊరికే కక్కుర్తికి వాడిని అక్కున చేర్చుకోవడం, ముచ్చట్లు చెప్పడం, అంతకన్నా వాడు ఎక్కువ ప్రయత్నిస్తే వారించడం చేస్తున్నది. వాడికి ఇక మనసు తీరింది. ఇంకా ఇక్కడే ఉన్నకొద్దీ ఏదో ఒకనాడు నా రహస్యం తెల్సిపోయి, నన్ను శపించినా శపిస్తుంది, అయినా ఇంకా జుర్రుకోడానికి ఏం మిగిలింది ఈమెలో, కనుక జారుకోవడమే తక్షణ కర్తవ్యం అనుకున్నాడు. ఒకనాడు నెమ్మదిగా ఆమెచెంతకు చేరి, 'ఏ సిద్ధుడి చలువ వలన ఇదంతా జరిగిందో, ఆ సిద్ధుడు యాత్రలు చేస్తూ హిమాలయాలకు వచ్చాడు, నాకు కనిపించాడు. మా ఇంటిదగ్గర అమ్మ, నాన్న, ఆలి, గొడ్డు, గోద, పొలము,పుట్ర, చెట్టు, చేమ, శిష్యుల పరిస్థితి ఏమీ బాగోలేదుట, రోజులు గడవడమే కష్టమైపోతున్నాయట, అప్పులాళ్ళు ఇంటిచుట్టూ తిరుగుతున్నారట, బాకీలు వసూళ్లు కావడం లేదట, కనుక వెళ్ళవలసినసమయం వచ్చింది అన్నాడు. నీకు తెలియని ధర్మం ఉందా, నా బాధ్యత కదా వాళ్ళు? అనగానే గుండె జల్లుమని, కన్నీరు మున్నీరైంది వరూథిని.

నువ్వు ఎంత ధైర్యము కలదానివి! ఇలా అయితే ఎలా చెప్పు! వెళ్తే మళ్ళీ రాకూడదని ఏమన్నా షరతు ఉందా? రావడం, వెళ్ళడం, కలవడం, విడిపోవడం అన్నీ మామూలే కదా! పోయినవాడు అంతే పోతాడా మళ్ళీ రాకుండా, కాళ్ళు తెగిపోయాయా ఏమన్నా, ఆ సిద్ధుడు ఇప్పుడు ఆ యోగవిద్యను సంపూర్ణంగా నేర్పాడు. వస్తూ పోతూ ఉంటాను, దిగులుపడకు..

అని వరూథిని నూరార్చి యచటు వాసి
పోయెఁ దనయిచ్చ గంధర్వపుంగవుండు
తప్పరాదు రుణానుబంధంబు తెగినఁ
బ్రాణపదమైన వలపును బాసి చనదె?

అని వరూథినిని ఊరడించి, ఆ ప్రాంతాన్ని వీడి తన ఇచ్చవచ్చినచోటుకి వెళ్ళిపోయాడు ఆ గంధర్వుడు, రుణానుబంధము తెగిపోయినతర్వాత, ప్రాణప్రదమైన వలపును, అన్నిటినీ అందరినీ వదిలి వెళ్ళిపోవడం తప్పదుకదా' అని స్వారోచిష మనుసంభవములో మూడవ ఆశ్వాసాన్ని ముద్దుగా ముగించాడు పెద్దన.

(యింకా ఉంది)

                                                               
 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి