శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి - టీవీయస్. శాస్త్రి

shri balijepalli lakshmeekaantha kavi

'మాయామేయ జగంబె నిత్యమని సంభావించి, మోహంబునన్' - వేదాంతపరమైన ఈ పద్యం గ్రామీణుల గొంతులో కూడా ఇప్పటికీ, ఎప్పటికీ పలుకూతూనే ఉంటుంది. ఈ పద్యం 'సత్య హరిశ్చంద్రీయం' నాటకం కోసం  శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు వ్రాసారు. కేవలం నాటకం కోసం ఇంత భావగర్భితమైన పద్యాన్నికవి వ్రాసాడంటే అతనిలోనున్న వేదాంత జిజ్ఞాస ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు. ఈ ఒక్క పద్యమే కాదు, హరిశ్చంద్రలోని పద్యాలన్నీ ఆణిముత్యాలే! శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, పద్య నాటక రచయితయే కాదు, చక్కని నటుడు. అంతే కాదు. స్వాతంత్ర్య సమరయోధుడు. వారిలో ఒక మంచి నటుడుండటం వల్లే, హరిశ్చంద్ర నాటకం అంత రసవత్తరంగా తయారయ్యింది. వారు కూడా ఆ నాటకంలో నక్షత్రకుని పాత్రను అత్యద్భుతంగా పోషించేవారట! వీరి 'హరిశ్చంద్ర' నాటకం ద్వారా ఆ రోజుల్లో ఎంతోమంది నటులుగా ప్రఖ్యాతి గాంచారు. వారిలో ముఖ్యులు స్వర్గీయ డి.వి. సుబ్బారావు, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, పీసపాటి నరసింహమూర్తి గార్లు. నాకు ఊహ తెలిసిన తరువాత, నేను చూసిన మొదటి పద్య నాటకం హరిశ్చంద్ర. ఆ నాటకం అలానే, నా మస్తిష్కంలో నిక్షిప్తమైంది. తరువాతి రోజుల్లో కూడా ఎన్నోసార్లు ఆ నాటకాన్ని చూడటం తటస్తించింది. కేవలం, ఆ నాటకంలోని భావయుక్తమైన పద్యాల కోసమే ఆ నాటకాన్ని చూసాను. ఆయన సమకాలీన జీవితంలో ఎందరో మహా కవులున్నారు. అయితే వీరిని ఒక్కరిని మాత్రమే పేరు చివరన కవి అని తగిలించి, వారిని 'లక్ష్మీకాంత కవి' అని పిలిచేవారు. అదే వారి ప్రతిభకు నిదర్శనం.

శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు 23-12-1881న, గుంటూరు జిల్లాలోని బాపట్ల వద్ద ఒక కుగ్రామమైన ఇటికంపాడులో నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. కర్నూల్ లో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులయిన పిదప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసారు. ఆయన ప్రవృత్తికి ఆ ఉద్యోగం నచ్చలేదు. అందుచేత తర్వాతి రోజుల్లో గుంటూరులోని హిందూ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా ఉపాధ్యాయులుగా చేరారు. ఆ సమయంలోనే వారు అవధానాలు కూడా చేసారు. చాలామంది సంస్థానాధీశులు, రాజులు వీరిని ఆదరించి, అభిమానించారు. వారిలో ముఖ్యులు సాహితీబంధువైన చల్లపల్లిరాజా గారు. రాజా గారి ప్రోత్సాహంతో, వీరు 1922 లో గుంటూరులోనే చంద్రికా ప్రింటింగ్ ప్రెస్ ను ప్రాంభించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్ళారు. జైలులో ఉన్నప్పుడే,1924 లో వీరు 'సత్య హరిశ్చంద్రీయం' నాటకాన్ని రచించారు. ఆయనే ఒక నాటక సమాజాన్ని ప్రత్యేకంగా ప్రారంభించి, 'సత్య హరిశ్చంద్రీయం', 'ఉత్తర రాఘవం' నాటకాలను పెక్కుసార్లు ప్రదర్శించారు. వీరు మా నాన్నగారికి గుంటూరులో తెలుగు ఉపాధ్యాయులుగా ఉండేవారని మా నాన్నగారు చెబుతుండేవారు. వీరి రచనా నైపుణ్యం గురించి, నటనా ప్రాభవం గురించి మా నాన్నగారు ఎంతో విశదీకరించి చెప్పేవారు. హరిశ్చంద్రలోని పద్యాలన్నీ వారికి కరతలామలకాలు. వారి ద్వారా, నాకూ చాలా పద్యాలు నోటికి వచ్చు. హరిశ్చంద్ర నాటకం ఎప్పుడు ప్రదర్శించినా, వారు నన్ను కూడా తీసుకొని వెళ్ళేవారు. అలా హరిశ్చంద్ర నాటకం నా జీవితంలో ఒక భాగమైంది. ప్రత్యక్షంగా చూడకపోయినా శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి మీద నాకు ఎనలేని గౌరవం ఏర్పడింది.

తర్వాత నాటి సినీ దర్శకులైన శ్రీ చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహంతో వీరు సినీరంగ ప్రవేశంచేసి, అనేక  సినిమాలకు రచయితగా మాటలను, పాటలను వ్రాసారు.1939 లో విడుదలైన 'వరవిక్రయం' అనే సినిమాలో వీరు మొదటిసారి నటించారు. ఆ సినిమాలో లింగరాజు పాత్రను వీరు పోషించిన తీరు పండితుల, పామరుల ప్రశంసలు పొందింది. వీరు వ్రాసిన పద్యాల వల్లనే, SVR నటించిన హరిశ్చంద్ర సినిమా ఘన విజయం సాధించింది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తర్వాతి రోజుల్లో శ్రీ కే.వి.రెడ్డి గారు ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో సత్యహరిశ్చంద్ర సినిమాను తీసారు. నాటకంలోని పద్యాలన్నిటినీ తీసివేసి, పింగళి గారి చేతనో, సముద్రాల గారి చేతనో సరికొత్త పద్యాలను వ్రాయించారు. ఆ సినిమా అనుకున్నంత ఘన విజయం సాధించకపోవటానికి ముఖ్యకారణం, నాటకంలోని పద్యాలను మార్చటమే అని నా ప్రగాఢ అభిప్రాయం.

శ్రీ లక్ష్మీకాంతకవి గారు రచించిన కొన్ని గ్రంధాలు - శివానందలహరి శతకం(ఆది శంకరుని శివానందలహరికి పద్య రూపం), స్వరాజ్య సమస్య (కవితాసంపుటి), బ్రహ్మరథం (నవల), మణిమంజూష(నవల), బుద్ధిమతి విలాసం(నాటకం), సత్య హరిశ్చంద్రీయం(నాటకం), ఉత్తర రాఘవం(నాటకం-భవభూతి సంస్కృత రచనకు ఆంధ్రీకరణ). వీరు రచన చేసిన సినిమాలు - అనసూయ,జరాసంధ,మళ్ళీ పెళ్లి, వరవిక్రయం, భూకైలాస్(1940), విశ్వమోహిని, జీవన్ముక్తి, బాలనాగమ్మ, తహసిల్ దార్, బ్రహ్మరథం, రక్షరేఖ మొదలైనవి. వీటిలో మళ్ళీ పెళ్లి, వరవిక్రయం, బాలనాగమ్మ, తహసిల్ దార్, రక్షరేఖలో నటించారు కూడా.

30-06-1953న శ్రీ లక్ష్మీకాంతకవి గారు దక్షిణ వారణాసి అయిన శ్రీ కాళహస్తిలో అకస్మాత్తుగా మరణించి శివైక్యం చెందారు.భౌతికంగా వారు మరణించినప్పటికీ, వారు రచించిన 'సత్య హరిశ్చంద్రీయం' నాటకం ఉన్నంత కాలం వారు చిరంజీవులే! 'భక్తయోగ పదన్యాసి వారణాసి' అనే పద్యం నా చెవుల్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. 'పాడుతా తీయగా' కార్యక్రమంలో చిరంజీవి ప్రవీణ్ కుమార్ అత్యద్భుతంగా గానంచేసిన హరిశ్చంద్రలోని చక్కని వేదాంత పరమైన ఒక పద్యాన్ని, ఈ లింకులో వినగలరు.

http://www.youtube.com/watch?feature=player_detailpage&v=VpexsnJzmyA#t=20

వెంటరాని సిరిసంపదలను ఇక్కడే వదలి, యశస్సును వెంట తీసుకొనివెళ్ళిన శ్రీ బలిజేపల్లి వారు చిరంజీవులు! సజీవులు!!


బహుముఖ ప్రజ్ఞావంతుడైన శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారికి నా కళాంజలులు!

 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి