
నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
______________________________________________________________________
ఇల్లినొయిస్ కి చెందిన ఓ దొంగ తుపాకి చూపించి ఒకర్ని కారుతో సహా కిడ్నాప్ చేసి, ఏటియం ముందాపించి, అతని బేంకు అకౌంట్ లోని డబ్బుని తన బేంకు అకౌంట్ కి మార్పించుకున్నాడు. తర్వాత అతను ఆ ఏటియంలో తన ఏటియం కార్డునుపయోగించి కొంత డబ్బుని డ్రా చేసుకున్నాడు. ఆ క్లూతో పోలీసులు ఆ ఏటియం నించి డబ్బుని డ్రా చేసిన వారి వివరాలు సేకరించి ఆ దొంగని తేలిగ్గా ట్రేస్ చేసి అరెస్ట్ చేసారు.
అమెరికాలో నార్త్ కరోలినా రాష్ట్రంలోని హికోరి అనే ఊళ్ళోని జైలులో ఖైదీగా వున్న దొంగ రిజర్డ్ జైలునించి పారిపోవడానికో చక్కటి పథకం వేసుకున్నాడు. ఆ ప్రకారం వారానికోసారి ఆ జైలుకి కూరగాయలు, కోడిగుడ్లు తీసుకువచ్చే వేన్ లోకి ఎక్కి, కూరగాయల మూటల వెనక దాక్కున్నాడు. వేన్ బయలుదేరి జైలు దాటాక దిగి పారిపోదామన్న అతని పథకం కొంతవరకు విజయవంతమై, కూరగాయల వేన్ లో దాక్కున్న రిచర్డ్ ఆ జైలు దాటాడు. ఆ వేన్ జైలునించి బయలుదేరాక, జైలు సూపరింటెండెంట్ ఇంటి ఆవరణలో కూరగాయలు దింపడానికి ఆగింది. ఆ సంగతితెలీక వేన్ లోంచి బయటకి వచ్చిన రిచర్డ్ ని జైలు సూపరింటెండెంట్ భార్య చూసి, భర్తని పిలిచి అతన్ని పట్టించింది.