కాశీ యాత్ర పై చాలా మంది చాలా వ్యాసాలు, ట్రావెలాగులు రాసేసారు. అంతెందుకు మన తొలి తెలుగు ట్రావెలాగ్ కాశీయాత్రపైనే అన్నది వ్యవహారికంలో వున్నదే. ఇంక కాశీ వెళ్లి వచ్చినంత మాత్రాన ఏం రాస్తాం? కానీ నాకు తోచిన విషయాలు ఇంతకు ముందు నాకు తెలిసినంతవరకు ఎవరూ ప్రస్తావించనివి, కాస్త లౌకకమైన విషయాలు కొన్ని నా దృష్టికి వచ్చాయి. వాటిని గోతెలుగు పాఠకులతో పంచుకోవాలని అనిపించింది. అందుకే ఈ వ్యాసం.
కాశీ వెళ్లడానికి కొంతకాలం ముందు మిత్రుడు విజయ శైలేంద్ర తో ముచ్చటించాను. ఎలా వుంది కాశీ అని అడిగితే ఆయన భలే సమాధానం చెప్పారు. ఆయన మాటల్లోనే చెబితే బాగుంటుంది.
'కాశీ.. భలే చిత్రమైన క్షేత్రమండీ.. జీవితంపై అన్ని ఆశలు పోయాక, వైరాగ్యం వచ్చాక, లౌకిక సుఖాలపై మమకారం పోయాక చూడాలి. అది అన్ని పుణ్యక్షేత్రాల మాదిరిగా సందర్శించేది కాదు. పూర్తిగా వైరాగ్యంతో, ఆధ్యాత్మిక దృష్టితో చూడాల్సింది. అంతేకానీ విహారయాత్ర కోసం సాగించేది కాదు.
ఎందుకంటే బురద, బాడి, ఇరుకు రోడ్లు, నానా చెత్తతో వుంటుంది. అయినా మనమేం పట్టించుకోకూడదు..
ఇవీ ఆయన చెప్పిన విషయాలు. దీంతో నాకు కాశీ వెళ్లాలన్న కోరిక సగం చచ్చిపోయింది. ఎందుకంటే అంత సులువుగా లౌకక సుఖాలు వదులుకునే వయస్సు, జ్ఞానం నాకు ఇంకా రాలేదేమో?
కానీ వెళ్లాలని శ్రీమతి పట్టుపట్టడంతో ముందుగా నెట్ అంతా గాలించాను. మంచి లాడ్జిలు వుంటాయా? సదుపాయాలేమిటి? ఇలాంటివి. కానీ ఎవర్ని అడిగినా సత్రాలే బెటర్ అని చెప్పడం ప్రారంభించారు. దాంతో ఆ దిశగా కూడా దృష్టి సారించాను. మిత్రులు పండరీనాథ్ (సైనిక పురి కాలనీ) గారు ఆయన కు సంబంధించిన శృంగేరీ పీఠానికి ఫోన్ చేసి చెప్పారు. అక్కడి మేనేజర్ కేదార్ ఘాట్ శృంగేరి సత్రానికి రమ్మన్నారు. సరే చూద్దాం అని బయల్దేరాను. ఢిల్లీ నుంచి వారణాసికి ఫ్లయిట్ లో వెళ్లి వెళ్లగానే ప్రీపెయిడ్ టాక్సీ ఎక్కి కేదార్ ఘాట్ శృంగేరి పీఠం అనగానే అక్కడికి టాక్సీ వెళ్లదు అని గుండెల్లో రాయి వేసాడు. అదేంటీ? అంటే, అవన్నీసందులు, దగ్గర్లో ఆపుతా.. రిక్షాలో వెళ్లండి లేదా నడిచి వెళ్లండి అన్నాడు. సరే తప్పుదుగా అని సునాపుర దగ్గర టాక్సీ దిగి, లగేజి మాత్రం రిక్షాలోవేసి, సందుల్లో నడవడం ప్రారంభించాను. గట్టిగా రిక్షా తిరిగితే, పక్కన మరొకరు నడవలేనంత సందులు. చిత్రంగా వున్నాయి. నాకు పండరీ పురం వెళ్లిన వైనం గుర్తుకొచ్చింది. కాశీ ఘాట్ కు ఆనుకున్న సందులన్నీ చిత్రంగా వున్నాయి. భవంతులు చిన్నవేమీ కాదు. పురాతనమైనవే కానీ, అన్నీ మూడు నుంచి అయిదు అంతస్తులు దాటినవే. అలా అని కొత్తవి కాదు. చాలా కాలం కిందట కట్టినవే. అంటే ఆ కాలంలోనే అధ్భుతమైన భవంతులు కట్టేసారు. రాజులు కోటలు కట్టుకోవడం సరే, సామాన్యులు కూడా ఈ స్థాయి ఇళ్లు కట్టుకోవడటం నిజంగా భలే అబ్బరం అనిపించింది. అంత ఎత్తు భవనాలు కేవలం మూడు నాలుగు అడుగుల గ్యాప్ లో కట్టడం వల్ల సూర్య కాంతి లోపలకు రావడం లేదు. పైగా రాతి పలకలు అమర్చి వేసిన దారి ఆ రాళ్లు జనం నడిచి నడిచి ఎగుడు దిగుడుగా మారాయి. కాస్త ఏమరపాటుగా నడిస్తే, కాలు మడతపడే ప్రమాదం వుంది. ఇళ్లవాళ్లంతా, తమ తమ ఇంటి లోని చెత్త నిర్మొహమాటంగా ఆ సన్న సందులోనే పోసేస్తున్నారు. నానా దుర్వాసన వస్తోంది. అక్కడికక్కడే సందుల్లో టీ స్టాళ్లు, సత్రాలు, లాడ్జిలు, దుకాణాలు, ఒకటేమిటి సమస్తం వున్నాయి. లేనిది ఒక్కటే శుభ్రత. ఎంత వైరాగ్యమైనా శుభ్రత ఎందుకు వదులుకోవాలో నాకు అర్థం కాలేదు. అసలు పూర్వం రహదారులు చాలా విశాలంగా వుండేవి. ఏ ప్రాంతమైనా, కానీ కాశీ ప్రజలు మాత్రం ఎందుకిలా వ్యవహరించారో అర్థం కాలేదు. ఈకాలంలో వ్యవహారం కాదిది. చాలా చాలా ఏళ్ల కిందటి వ్యవహారం. పోనీ విశాలంగా చేసుకోవాలన్నా ఇప్పుడు కుదరదు. ఎందుకంటే ఒక అంతస్థు భవనాలైతే ఏదో విధంగా సైజు తగ్గించుకోవచ్చు. ఇవి అయిదేసి అంతస్తుల భవనాలు.
ఇక్కడ ఇంకో సంగతి కూడా వుంది. తమ తమ భవనాలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్న వారు, వీధులను మాత్రం గాలికి, ప్రభుత్వ దయాదాక్షిణ్యానికి వదిలేసారు. అసలు కొన్ని ఇళ్లలో అయితే ఎలా వుంటున్నారో అర్థం కాదు. నేను కాస్త కిందకి వంగి అనుకోకుండా ఓ ఇంట్లోకి చూసాను. కనీసం పది ఆవులు, గేదేలు వున్నాయి. ఆవరణ అంతా వాటి మల మూత్రాలతో నిండిపోయింది. ఆ లోపున గదులు.. మనుషులు కాపురం.
వైరాగ్యం కాదు, మరేదో కలిగింది.
మొత్తానికి శృంగేరి పీఠం, కేదారి మఠం సత్రానికి చేరాను. మేనేజర్ లేరు. లోపల వాతావరణం చూసి ముచ్చటేసింది. ఏదో హోమం జరుగుతోంది. అందరూ భక్తితో కూర్చుని వున్నారు. బాగానే వుంది. అడ్జస్ట్ అయిపోదాం అనుకుని, మేనేజర్ కు ఫోన్ చేద్దామని చూసాను. సిగ్నల్ లేదు. అదేంటీ అంటే, అప్పుడు చెప్పారు చావు కబురు చల్లగా.. ఈ సందుల్లో సిగ్నల్ రాదు అని. ఓడా ఫోన్ వుంటే కొంచెం వస్తుంది. మరే నెట్ వర్క్ పనిచేయదట. గుండెల్లో రాయి పడింది. సెల్ ఫోన్ లేకుండానా..? అది పోనీ నాకు ఇంటర్ నెట్ చాలా అవసరం. టాటా ఫోటాన్ పని చేస్తుందా అని చూసాను. అదీ లేదు. దాంతో ఆ సందులకు, శృంగేరి మఠానికి ఓ నమస్కారం పెట్టి, సిగ్నల్ ఎక్కడా బాగా వస్తుందో వాకబు చేసి, అక్కడ లాడ్జ్ లో దిగాను.
సరే ఓ అంకం ముగిసింది.
అయిదురోజులున్నాను. ఆ సందులన్నీ మరొసారి, మరోసారి తిరిగాను. వారణాసి ఊరంతా చక్కబెట్టాను. నాకు తోచి, చెప్పాల్సిన విషయాలు కొన్ని కనిపించాయి. అక్కడ వ్యవహారాలను ప్రభుత్వం అనేది అస్సలు పట్టించుకోవడం లేదు. ఇది తొలి సంగతి. లక్షలాది మంది భక్తులు దేశం నలు మూలల నుంచి వస్తున్నారు. ఆ ఊరి పరిస్థితి ఏమిటి అన్నది చూడడం లేదు. విదేశీ భక్తులు అలాగే, కేవలం విశ్వనాధుడిపై భక్తితో, భారతీయ ఆధ్యాత్మిక చింతనపై మక్కువతో వస్తున్నారు. సందుల్లో తిరుగుతున్నారు. నిజానికి వారి భక్తి విశ్వాసాలను మెచ్చుకోవాలి. కంచి కామకోఠి పీఠానికి వెళ్లాను. ఆలయంలోకి అడుగుపెడుతూనే దుర్వాసన. కాళ్లదగ్గర నేల అంతా తడి. ఏమిటా అని చూద్దును.. పదులు సంఖ్యలో గోన బస్తాల్లో వాడేసిన పత్రి. నీళ్లు కుళ్లిపోయిన నీళ్లు ఓడుతోంది. ఎప్పుడు చేసి వుంటారో, లక్ష పత్రి పూజ. ఆ పత్రిని అలా గోనెల్లో పడేసి వుంచారు. బయట ఎప్పుడు పారేస్తారో? దీన్ని వైరాగ్యం అనాలా, నిర్లక్ష్యం అనాలా? ఆరోగ్యమే మహా భాగ్యం, పరిశుభ్రతే దైవం అని చిన్నపుడు చదువుకున్న పాఠాలు గుర్తుకు వచ్చాయి.
జనాలకు నిర్లక్ష్యం.. పాలకులకు నిర్లక్ష్యం. ఘాట్ లు చూసాను. వీలయినంతవరకు బాగానే వున్నాయి. కానీ వాటిని అందంగా, శుభ్రంగా నిర్వహించడంలో మాత్రం శ్రద్ధ లేదు. ఊరిలో రోడ్లు పరమ నీచం. నాతో వారం రోజుల పాటు వున్న కుర్ర డ్రయివర్ ను అడిగాను. ఏమిటిది ఏమీ పట్టించుకోరా అని. వాడు చాలా చైతన్యవంతమైన సమాధానం చెప్పాడు. యాదవులు, ముస్లింలు, ములాయంకు ఓటేస్తారు. ఎస్సీలు మాయావతికి వేస్తారు. వద్దన్నా అదే తీరు. ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ అభివృద్ధి మాత్రం చేయరు. ఈసారి మోడీకి వేస్తాను నేను అని తీర్పు కూడా చెప్పేసాడు.
సరే విశ్వనాధ మందిరానికి ముందు ఘాట్ వైపు నుంచి వెళ్లాను. మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్దామని చూసాను. భారీ రోడ్డుకు పక్కగా మరో రోడ్డు, దానిపై విశ్వనాధ మందిరానికి దారి అని బోర్డు. నడక తప్పదు. ప్రారంభించాను. ఎంతకీ రాదు. సందులో నలుగురికి మించి పట్టని వెడల్పు. మెలికలు తిరుగుతున్నాయి. సందుల నిండా దుకాణాలే. ఎవరికి తోచిన మేరకు వారు ఆక్రమించేసారు. ఆఖరికి సందులు దాటి, మందిరంలోకి వెళ్లాను. అదీ సన్నపాటి సందే.. లోపలకు వెళ్లాను. ఎక్కడపడితే అక్కడ తడి, జారు. జనాలు తోసుకుని, దేవుడిదగ్గర వంగుని, నమస్కరిస్తున్నారు. ఎక్కడా క్రమ శిక్షణ, అజమాయిషీ లేదు. సెక్యూరిటీపై వున్న శ్రద్ద, పోలీసులను మోహరించడంలో వున్న ఆసక్తిలో కనీసం పదో వంతు గుడి నిర్వహణలో లేదంటే లేదు. నిజానికి ప్రభుత్వం తలచుకుంటే గుడి చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకుని, వెడల్పు చేయడం చిటికెలో పని. విశాఖ కనకమహలక్ష్మి ఆలయం అలాగే వుండేది ఒకప్పడు. అందరూ పూనుకుని, చుట్టు వున్న ఇళ్లు కొని, వెడల్పు చేయగలిగారు. కానీ అక్కడి ప్రభుత్వానికి ఆ ఆలోచన వుందో లేదో తెలియదు. పైగా గుడిలో ఎవరి రాజ్యం వారిది. ఎవరి పలుకుబడి వారిది. అక్కడ ఓ పద్దతి, అధికార వ్యవహారాలు వున్నట్లు లేదు. గుడిలోకి ఫోన్లు, పెన్నులు సైతం అనుమతించరు. కానీ గుడి తరపున ఒక్క లాకర్ కనిపించలేదు. సవాలక్ష అనాథరైజ్డ్ లాకర్లు. వాటితో లింక్ పెట్టి పూలు, పళ్ల వ్యాపారాలు. కనీసం రెండు వందల నుంచి మూడు వందలు పిండేయడాలు. ఎందుకిలా అన్నది నాకు అర్థం కాలేదు కానీ వినిపించిన మాటలను బట్టి, అక్కడి వ్యవహారాలను ప్రభుత్వం ఏమీ పట్టించుకోదని, స్థానిక వ్యాపారులు, పండిట్ లు వాళ్లదే రాజ్యమని అనిపించింది.
(మరిన్ని సంగతులు వచ్చేవారం)