పుస్తక సమీక్ష: నీటిరంగుల చిత్రం - సిరాశ్రీ

Book Review - neeti rangula chitram

పుస్తకం: నీటిరంగుల చిత్రం
రచన: వాడ్రేవు చినవీరభద్రుడు
అంశం: కవిత్వం
వెల: 150/-
పంపిణి: నవోదయ బుక్ హౌజ్, కాచిగుడ, హైదరాబాద్
ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక విక్రయ కేంద్రాలు
ఇంటర్నెట్లో లభ్యమయ్యే చోటు: http://kinige.com/book/Neetirangula+Chitram

విత్వానికి పలు రూపాలు. ఉత్తేజపరిచేవి కొన్ని, జాగృత పరిచేవి ఇంకొన్ని, నవ్వించేవి మరికొన్ని...ఇలా. వీటితో పాటు ఆశ్చర్యపరిచేవి, ఆలోచింపజేసేవి, అనుభూతినిచ్చేవి కూడా ఉంటాయి. కవిలో పరిణతి, పరిశీలనలతో పాటు ఒక తాదాత్మ్య స్థితి నెలకొంటే తప్ప ఆ రకం కవిత్వం పుట్టదు. ఈ "నీటిరంగుల చిత్రం" ఉత్కృష్ట స్థాయికి చెందిన అనుభూతికవితల సమాహారం. ఇందులో చాలా కవితలు కళ్లతో చదివినంతమాత్రాన అర్థం కావు. పక్కన ఎవరైనా చదువుతున్నప్పుడు కళ్లు మూసుకుని వినాలి. అప్పుడు ఒక బ్లూరే క్వాలిటీ కన్నా మించిన హై డెఫినిషన్ వీడియో చూస్తున్నట్టు అనిపిస్తుంది... సాంద్రత నిండిన రంగులు, స్వచ్చమైన గాలి, ఎప్పుడో మరిచిపోయిన ప్రకృతిలోని సున్నితమైన సౌందర్యం, స్మృతిపధంలోకి చొచ్చుకు వచ్చి మనసుని తడిగా తట్టే బాల్యం, జీవితంలోని మార్దవం, జీవనంలోని మాధుర్యం ఇలా ఎన్నో మనోయవనికపై సాక్షాత్కరిస్తాయి.

వాడ్రేవు చినవీరభద్రుడు ఉన్నత స్థాయినందుకున్న కవి. వారి కవిత్వంలో ఆయన చేసిన తపస్సు కనిపిస్తుంది. చెప్పానుగా.. కేవలం కళ్లతో చదవడం కాదు.. మనసుని, బుధ్ధిని అనుసంధానం చేసి ఈ కవితానాదాలు వినాలి. ప్రపంచ సాహిత్యాన్ని విస్తృతంగా చదివిన నేపధ్యం; జనానికి అర్థం కాదేమో అని ఆలోచనా ప్రవహాన్ని, భావ వ్యక్తీకరణని సరళం చేయాలనుకోకపోవడం; స్వచ్ఛమైన అనుభూతికి ఏ రంగులూ అద్దకుండా సహజంగా అల్లుకుపోయే పదాలతో కవితలల్లడం ఈ "నీటిరంగుల చిత్రం" లోని కవితల శైలి.

ఇందులో కొన్ని కవితలు చదువుతుంటే ఏదైనా అధివాస్తవిక ధోరణి ఉందేమో అనిపిస్తుంది. రెండో సారి చదివితే వాస్తవికత కనిపిస్తుంది. మూడో సారి చదివితే అనుభూతి మనసుకు చిక్కుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కవి తన భావజాలంతో, తన అనుభూతులతో పాఠకుణ్ని తన లోకంలోకి లాక్కుపోయే మాంత్రికత్వం ఈ కవిత్వంలో ఉంది. కానీ పాఠకుడికి ఆ అభిరుచి, స్థాయి ఉండాలి!

ఒక కవితలో 'జీవితం తొక్కిసలాటగా మారిన కాలం/ లోకం వినాలంటే నీ మాటలవల్ల శ్రోతలకొక లాభం చేకూరాలి/ రాజకీయ ప్రయోజనం సమకూరాలి/ కొందర్ని దూరం నెట్టాలి/ కొందరు దగ్గర కావాలి/ అప్పుడనుకుంటాను చీనాకవి తావోచిన్ లాగా/ ఈ దుమ్ములోకి పొరపాటున వచ్చిపడ్డానని/ ఐనా మట్టిరేగే రోడ్ల పక్కన మల్లెలమ్మే పల్లెపడుచులా/ నేను కూడా నగరవీథిన పూలబుట్ట తెరవకుండా ఉండలేనూ. ఇందులో ఆఖరి పంక్తులు కవి సహజ తత్వం. ఎందుకంటే నగర జీవనమన్నా, నగరంలోని కృత్రిమత్వం అన్నా ఈ కవికి గిట్టదు. నగరంలో కూడా ఏ మూలన్నా పల్లెతనం ఉంటుందేమో అని వెతికే గుణం ఈయన కవితల్లో విరివిగా కనిపిస్తుంది. నగరంలోని హడావిడి చూస్తే ఈ కవికి ప్రపంచమంతా ఒక శవంలా ఉంటుందేమొ.. ఒక కవితలో నగరానికి తనదైన శైలిలో తద్దినం పెడుతూ చివర్లో ఇలా అన్నారు..'..ఏ మలుపులోంచో పనసపూల గాలి, అంతదాకా అడ్డంగా పడి ఉన్న దృశ్యకళేబరంలో కొత్త కదలిక".

'ఆమెకి తెలిసిందేదో మాకు తెలియదు..'  అనే కవిత చదివితే గీతలోని "కర్మణ్యేవాధికారస్తే.." లోని తత్వసారం ఇంత హత్తుకునేలా చెప్పొచ్చా అనిపిస్తుంది. తన పనేదో తాను చేసుకుపోతూ 'జీవితాన్ని నిశ్శేషంగా జీవించడం...' అనే భావనలోని ఉత్కృష్టత మనసును కాసేపు స్తబ్తతలోకి తీసుకెళ్తుంది.

ఈ పుస్తకాన్ని ఓపెన్ మైండ్ తో చదవడం, ఆశ్వాదించాలనుకోవడం అనేది దశాబ్దాలకాలం తపస్సు చేసిన ఒక కవిఋషితో పయనించడమే. ఇందులోని ఆఖరి 4 పేజీల్లో ఇచ్చిన 94 అంశాల వివరణలు చూసినా చాలు వీరభద్రుడుగారి విస్తృతపఠనం, పరిజ్ణానం అర్ధంకావడానికి.

ఇందులో 182 కవితలు ఒక ఎత్తైతే అదిత్య - వీరభద్రుల మధ్య జరిగిన సంభాషణ ఒక ఎత్తు. ఆదిత్యగారి ప్రశ్నలు అర్థం కావడానికి పాఠకుడు చాలా కృషిచెయ్యాలి. పక్కన నిఘంటువు తప్పనిసరి. అందరి స్థాయిని ఒక తాడుకి కట్టేయడంలేను కానీ.. నాకు మాత్రం ప్రశ్నను నాలుగైదు సార్లు చదివితే తప్ప కాస్త అర్థమైనట్టు అనిపించలేదు. వీరభద్రుడు గారు చెప్పిన సమాధానాలు మాత్రం అర్థమయ్యాయి. వీరి ఇంటర్వ్యూ చదివాక నాకు అనిపించిన భావన 'చదవడానికి, తెలుసుకోవడానికి అంతులేనంత ఎంతో ఉంది...' అని.

కవితా జిజ్ఞాసువులు తప్పక చదివి దాచుకోవాల్సిన పుస్తకం ఈ "నీటిరంగుల చిత్రం".

మరిన్ని వ్యాసాలు

పిల్లనగ్రోవి పిలుపు...
పిల్లనగ్రోవి పిలుపు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన  సినిమాల్లో నారద పాత్రధారులు .
మన సినిమాల్లో నారద పాత్రధారులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్