కోపం వస్తే....ఎవడికి ఉద్దరింపట ? - భమిడిపాటి ఫణిబాబు

kopam vaste... evadiki uddarimputa?

ముక్కుమీద కోపం.. నీ ముఖానికే అందం..”. అని ఒక కవి అన్నారు. అలాగే .. "చెఱువుమీద కోపం వస్తే చెడేదెవరూ..” అనే ఒక సామెత కూడా విన్నాం. ప్రస్తుతం ముఖాలూ, ముక్కులూ, అందాల గురించీ చర్చించే వయసు కాదు కాబట్టి ఆ సామెత గురించి మాట్టాడుకుందాం...

ఉద్యోగం లో ఉన్నంతకాలం మనకి ఒక privilege ఉండేది. ఎప్పుడు పడితే  అప్పుడు, ఎవరి మీద పడితే వాళ్ళమీద కోపం తెచ్చేసికోడం. ఆ కోపానికి ఓ అర్ధం పర్ధం ఉండేది కాదు. అప్పుడు తెలిసేది కాదు, కారణం, అధికారం. మా జిఎం ఒకరుండేవారు, ఆయన దగ్గరకు మా ఫ్రెండు ఒకతను వెళ్ళి సలహా అడిగాడు, ప్రెవేట్ కంపెనీలో ఉద్యోగం మంచిదా, ప్రభుత్వం లో మంచిదా అని. అప్పటికి అంటే పదిహేనేళ్ళు ముందరి మాట, ఈ పేకమిషన్లలో ప్రభుత్వోద్యోగులకి, మరీ అంతంత జీతాలుండని రోజులు. ఆ జిఎం గారిచ్చిన సలహా ఏమిటంటే, Govt job is always good, as it carries lot of power.. అని! నిజమే కదూ, చప్రాసీ దగ్గరనుండి, Chief Excecutive దాకా ప్రతీ వాడికీ పవరే. వామ్మోయ్ గేటు దగ్గర నుంచీ, ప్రతీ వాడూ పోజెట్టేవాడే. ఏదో అందరినీ దాటుకుని, మొత్తానికి "గర్భగుడి"  దాకా చేరినా, శ్రీవారి పిఏ గారి చలవుండాలి. దీనితో ఏమయ్యిందంటే, ప్రభుత్వం లో పని చేసి రిటైరయిన ప్రతీవాడికీ ఈ కోపం అనేది అలవాటైపోయింది. ఉద్యోగంలో అయితే పరవా లేదు కానీ, రిటైరయిన తరువాత వీళ్ళ మాటెవడు వింటాడండి బాబూ?

ఏదో రిటైరయిన కొత్తలో మహ అయితే కట్టుకున్న భార్య వినొచ్చు. ఏదో పోనిద్దూ, అలవాటైన ప్రాణం అని. పాపం ఆయన్ని ఈ వయస్సులో క్షోభ  పెట్టడం ఎందుకులే అని. ఈ సంగతి గుర్తించలేక, మన "హీరో" గారు, ఇంకా పేట్రేగిపోతూంటాడు. అయిన దానికీ, కానిదానికీ కోపం తెచ్చేసికోడమే, పేద్ద కారణమేమీ ఉండఖ్ఖర్లేదు. ఏదో ఇంట్లో వాళ్ళమీదైతే ( అదీ  limited to wife only..) కోపం తెచ్చుకోవచ్చుగానీ, బయట వాళ్ళ మీద  కోపాలూ తాపాలూ తెచ్చికుంటే, కాళ్ళిరక్కొడతారు.

పసిపిల్లల్లో చూస్తూంటాము, వాళ్ళక్కావలిసినది ఇవ్వకపోతే, కోపం తెచ్చేసికుని, చేతిలో ఏముంటే అది విసిరి కొడుతూంటారు. వాళ్ళకైతే చెల్లుతుంది, ఏదో పెద్దయినతరువాత తమర్ని ఉధ్ధరించేస్తారూ, ఈమాత్రం కోపం ఉంటే పరవాలేదూ, వృధ్ధిలోకి  వస్తాడూ అని, ఏదో "నజరందాజ్" చేసేస్తూంటారు, కొంతమంది తల్లితండ్రులు. కానీ ఆ ఇంటిపెద్ద కోపిష్టి అయినవాడైతే, నాలుగు దెబ్బలేస్తాడు. అదికూడా ఓ లిమిటెడ్ పిరీయడ్ దాకానే, ఎప్పుడో వాడు తిరగబడేదాకా! తెలివైన తండ్రులు, బలే పట్టేస్తారులెండి, ఆ  threshold ని! కొంతమంది తల్లితండ్రులైతే, వాడి దారిన వాణ్ణేడవనీయండి, వెధవ కోపం వీడూనూ, ప్రతీదానికీ పేచీ పెడితే కుదురుతుందా, అంటూంటారు. కొంత సేపు ఏడిచేసి, ఎవరూ పట్టించుకోడంలేదని తెలిసి, చివరకి ఊరుకుంటాడు. వాళ్ళ కోపాలు తాటాకు మంటల్లాటివి, ఓసారి పేద్ద మంటొచ్చేసి ఆరిపోతాయి. పెద్ద నష్టమేమీ ఉండదు.

ఈ short tempered ప్రబ్రుధ్ధుల్ని  చూస్తూంటాము బయట. ఓ బస్సు టైముకి రాకపోతే కోపం. ఓ ట్రైను  టైముకి రాకపోతే కోపం. బస్సులో కూర్చోడానికి సీటు దొరక్కపోతే కోపం. మాల్స్ లో బిల్లు కట్టడానికి పెద్ద క్యూ ఉంటే కోపం. పనీ పాటా ఎలాగూ లేదుకదా, ఆమాత్రం ఆగితే ఆయన సొమ్మేం పోయిందిట, చెప్పానుగా ఉద్యోగంలో ఉన్న అలవాటు - ఈయనగారిని చూడగానే అందరు పక్కకు తప్పుకుని నీరాంజనాలు ఇవ్వాలి... అస్తమానూ అలాగే జరగాలంటే ఎక్కడ కుదురుతుందీ? సొసైటీలో లిఫ్ట్ పనిచేయక, అన్ని మెట్లూ ఎక్కాల్సొచ్చేసరికి కోపం. నీళ్ళు రాకపోతే  కోపం. ఒకటేమిటి, ప్రపంచంలో అందరూ కలిసి తనమీద కసి తీర్చుకుంటున్నారేమో అన్నంత కోపం. వీటిల్లో కోపం తెచ్చుకుని చేసేదేమీ  లేదు. రైళ్ళెక్కడం మానేస్తామా, బస్సులో వెళ్ళడం మానేస్తామా, మెట్లెక్కి కొంప చేరడం మానేస్తామా, అవసరం వస్తే కిందకెళ్ళి నీళ్ళు తెచ్చుకోడం మానేస్తామా, ఏమీ లేదు ఉత్తి జరుగుబాటు రోగం. వాళ్ళనేమీ చేయలేక లోకువగా ఉన్న ఇంటావిడ మీద ఎగరడం.

ఒక్కొక్కప్పుడు నాకే అనిపిస్తూంటుంది, ఉత్తిపుణ్యాన్న మా ఇంటావిడ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటానూ అని! పోనీ తనేమైనా తప్పుమాట అన్నదా అంటే అదీ లేదు. ఇంటినిండా అన్నేసి, బ్రాండెడ్ బట్టలు కొంటున్నారే, మరి అస్తమానూ ఆ దిక్కుమాలిన దీక్షా వస్త్రాలు వదలరే, హాయిగా ఆ కొత్త బట్టలేసికోవచ్చు కదండీ, ఎవరికోసం దాచిపెట్టడమూ.." అని.. అంతే కోపం వచ్చేసింది. మరీ చిన్న పిల్లాడిలా చేతిలో ఉన్నది విసిరేయడం కాదనుకోండి, హై పిచ్ లో మాట్టాడడం అన్న మాట. అంత అవసరమంటారా ఇలాటి వెర్రి వేషాలు నాకూ? అసలు గొడవేమిటంటే,  మేముండేది నాలుగో అంతస్థులో, ఆ దిక్కుమాలిన లిఫ్ట్, కొన్ని ట్రైన్లు ముంబై CST దాకా కాకుండా, కుర్లా లోనో, దాదర్ లోనో ఆగిపోయినట్టు, రెండో ఫ్లోర్  దాకానే  వస్తోంది. ఆ లిఫ్ట్ బాగు పడదూ, చెప్పానుగా మా సొసైటీ లో సీనియర్ సిటిజెన్లు మేమే. మిగిలినవాళ్ళందరికీ మెట్లెక్కడం అంటే ఎంత సంబరమో! నన్ను డబ్బులెక్కలడిగితే కోపం, షూస్ పాలిష్  చేయించుకోమంటే కోపం. బట్టలు రోజువిడిచి రోజు  మార్చుకోమంటే కోపం, ఒకటేమిటి ఓ కారణం అక్కర్లేదు. అయినా భరిస్తోంది పాపం! ఎప్పుడో చెప్పేస్తుంది enough is enough అని, వదిలిపోతుంది రోగం! నెట్ లో ట్రైను టిక్కెట్లు రిజర్వ్ చేయడానికి, రైల్వే వారి లింకు తెరుచుకోపోతే కోపం. ఎవడికిటా ఉధ్ధరింపూ.. దానికి ఇష్టమైనప్పుడు తెరుచుకుంటుంది, లేకపోతే స్టేషను కి వెళ్ళి క్యూ లో నుంచో.. వదిలిపోతుంది రోగం...

ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, ఏ కారణం లేకుండా, కోపాలు తెచ్చుకునేవాడు, గ్యారెంటీగా ప్రభుత్వోద్యోగే ! ప్రెవేట్ లో వాళ్ళకి పాపం ఇన్నిన్ని అవకాశాలు లేవు. ఏదో అన్నా హజారే గారి లాటివారు ఏ ధర్నాయో, ఉద్యమమో ప్రారంభించినప్పుడు, ఆయన్ని సపోర్టు చేయడం తప్ప.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి