ఎక్సెస్ బ్యాగేజ్ - భమిడిపాటి ఫణిబాబు

excess baggage

రీ ఈ రోజుల్లో కాదనుకోండి, ఏదో పక్కింట్లో ఉన్నవాళ్ళో, ఎదురింట్లో ఉన్నవాళ్ళో, చివరాఖరికి అదే కాలనీ లోనో, సొసైటీలోనో ఉండేవారితో, సంబంధ బాంధవ్యాలూ, ఇచ్చి పుచ్చుకోడాలూ లాటివి ఉన్నప్పటి రోజుల్లో అన్నమాట- ఒకళ్ళింట్లో ఏదైనా పిండివంటో, ఓ కూరో, పులుసో,పచ్చడో వాళ్ళు తమతో సంబంధబాంధవ్యాలున్న వాళ్ళింటికి తీసికెళ్ళి ఇవ్వడం ఓ పధ్ధతి ఉండేది. పెళ్ళై ఇంకో ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఇదే కంటిన్యూ అయేది.  ఏదో ప్రతీ రోజూ అమ్మ చేసేదే తినఖ్ఖర్లేదు కదా అని, ఇంట్లో పిల్లలకి కూడా నచ్చేది.ఇంటి మగాడిక్కూడా నచ్చినా నోరెత్తి చెప్పేధైర్యం ఉండేది కాదు. ఆవిడెవరో చేసింది రుచిగా ఉందీ అంటే మళ్ళీ ఏం గొడవొస్తుందో అని నోరెత్తేవాడు కాదు! కానీ ఆ పక్కావిడ మర్నాడు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా, మరీ తనకి కూడా నచ్చేసిందీ అని చెప్పుకోడానికి కొద్దిగా మొహమ్మాటంగా ఉండి, పిల్లలకీ, మీ భాయ్ సాబ్ కీ బాగా నచ్చిందీ అని చెప్పేవారు. ఇది ఉభయతారకం ! కానీ దీనివల్ల ఆ తరువాతొచ్చే పరిణామాలే కొంచం కష్టాలు తెచ్చేవి.

ఎప్పుడు వాళ్ళింట్లో, ఈ పక్క భాయ్ సాబ్బులూ, పిల్లలూ నచ్చిందన్న పాపానికి,  వాళ్ళచే నచ్చబడిన కూరో పిండివంటో చేసినప్పుడల్లా ఓ గిన్నె నిండా తెచ్చి ఇచ్చేవారు. ఏదో for a change నచ్చిందన్నారే కానీ, ఇలా నెలలో రెండేస్సార్లు తెచ్చి ఇస్తే, దాన్ని చెల్లించడం ఎలా? పైగా ఆ కాలనీకో, సొసైటీకో పనిమనుషులు కామన్ గా ఉండేవారు. మన అదృష్టం బాగోపోతే, ఈ కేసు లో కూడా అలాగే అయితే మన పని గోవిందాయే!  ఏదో తెచ్చిచ్చింది కదా అని కడుపునిండా మెక్కుతామా ఏమిటీ? ఏదో కొంతవరకూ లాగించేసి, మిగిలినదంతా ఏ డస్టు బిన్నులోకో ( ఇంట్లో ఉండేది) పడేయడం. మన ఖర్మ కాలి ఈ విషయం పనిమనిషి చూసిందంటే అక్కడకి చేరేస్తుందీ విషయం.ఒకళ్ళ కాలికీ, ఇంకోళ్ళ మెడకీ ముడేసే విషయంలో వీళ్ళు ( పనిమనుషులు) మహా ఘనులు!

మామూలుగా మనం ఏ తీర్థయాత్రలకో వెళ్ళినప్పుడు, వాళ్ళెవరికో ఇవ్వాలీ, వీళ్ళెవరికో ఇవ్వాలీ అనుకుంటూ, ఊరికే ప్రసాదాలూ, కాశీ తాళ్ళూ కొనేయడం. పోనీ తీర్థయాత్రలనుంచి తిన్నగా ఇంటికొస్తారా అంటే అదీ లేదూ, ఆ ఊరూ ఈ ఊరూ తిరిగి మెల్లిగా ఓ పదిరోజులకి కొంప చేరతారు. మరి తెలిసిన జనాభా కోసం కొన్న ప్రసాదాల మాటేమిటీ,  భార్యా భర్తా ఓ న్యూసు పేపరుని, చిన్న చిన్న ముక్కలుగా చింపి, ఓ దాంట్లో ఆ తెచ్చిన ప్రసాదం ముక్కా, ఇంకో దానిలో పసుపూ, కుంకం, వీటన్నిటినీ మళ్ళీ ఇంకో కాగితంలో పొట్లం కట్టి, దానికో కాశీ తాడు చుట్టి, పిల్లలచేత, ఆ కాలనీ లో తెలిసిన వారందరికీ పంపడం. తీరా, అలా ఇవ్వబడినవాళ్ళు, పొట్లం తెరిస్తే ముక్కు వాసనొస్తున్న ఓ లడ్డూ ముక్కో, వడముక్కో ఉంటుంది.  పోనీ తిరుపతి ప్రసాదం కదా అని కళ్ళకద్దుకుని నోట్లో వేసికుందామనుకుంటే, అదేమో వాసనా. పోనీ పడేద్దామనుకుంటే, ఆ దేవదేవుడికి ఎక్కడ కోపం వస్తుందో అని భయం. అన్నేసి ప్రసాదాలు కొనడం ఎందుకూ, ఊళ్ళన్నీ తిరిగొచ్చేదాకా దాన్ని అంత పదిలంగా ఉంచడమెందుకూ, పోనీ ఉంచారే, అదెలా ఉందో ఓ సారి చూసిస్తే, వాళ్ళ సొమ్మేం పోయిందీ? ప్రసాదం ఇవ్వలేదే అని ఎవరైనా గొడవెట్టారా? ఏమిటో ఈ అలవాట్లెప్పుడు మానుతారో ఏమిటో? ఇదివరకటి రోజుల్లో అయితే, తిరుపతి లడ్డూ, పదిరోజులైనా పాడైపోకుండా ఉండేది. మరి ఇప్పుడో? క్వాలిటీ మారిపోయింది.

అలాగే కోడలు పుట్టింటినుంచి వచ్చేటప్పుడు తెచ్చే సారె ఒకటి. ఇదివరకటి రోజుల్లో అటుకులూ, పంచదార చిలకలూ, మినపసున్నీ, మిఠాయుండలూ, సున్నిపిండీ, తాటాకు బుట్టల్లోనో, బిందెల్లోనో తెచ్చేవారు. వాటన్నిటినీ  ఆ చుట్టుపక్కలవాళ్ళందరికీ పంచిపెట్టేవారు. అదో ముచ్చట. ఆరోజుల్లా ఇప్పటికీ కొందరు చేస్తున్నారు.కానీ వాటి క్వాలిటీ అప్పటిలా లేదు కదా, వచ్చిన గొడవల్లా ఏమిటంటే, వాళ్ళింట్లో తినగా మిగిలినవో, తినలేకపోయినవో ఎవరింటికో వెళ్ళినప్పుడు వాళ్ళకి తీసికెళ్ళడం! ఎందుకు చెప్పండి అవతలివాళ్ళను అలా హింసించడం? వర్షాలూ వరదలూ వచ్చినప్పుడు  నదుల్లోని excess water పల్లం లోకి పోయినట్లు, ఇలా ఏ పెళ్ళామో పుట్టింటినుంచి తెచ్చిన ఫలహారాలు ఇంకోళ్ళకివ్వడం!

అలాగే ఇంకోటి, ఏ పెళ్ళికో, గృహప్రవేశానికో  శుభలేఖలు వేయించడం. ఊరికే ఆబగా వేయించేయడం. వాటన్నిటికీ ఎడ్రసులు వ్రాసి పోస్టు చేసే ఓపికుండదు. పోనీ పిల్లదో పిల్లాడిదో పెళ్ళి కదా, వాళ్ళిచ్చుకుంటారూ అనుకుంటే, వాళ్ళేమో ఇంకా తెలివిమీరిపోయారు, ఏదో ఒకటి స్కాన్ చేసేసి, ఫ్రెండ్సందరికీ పంపేయడం. ఏదో కొత్త పెళ్ళికొడుకూ, పెళ్ళి కూతురూ ఏ హనీమూన్నుకో వెళ్ళినప్పుడు ఈ మిగిలిపోయిన శుభలేఖలన్నీ బయట పడతాయి. పోనీ ముందరే చెప్పొచ్చుగా, అన్నఖ్ఖర్లేదూ అని. అవేమైనా ఊరికే వచ్చాయా, ఒక్కో కార్డుకీ ఎంతంత ఖర్చయిందో, ఆ ఇంటి పెద్దకి తెలుసు. మరి ఈ  మిగిలిపోయిన కార్డులన్నీ ఏం చేయడం? అటూ ఇటూ పడేయలేరూ, మరీ పాతన్యూసుపేపర్లవాడికీ ఇచ్చేయలేరూ,ప్రతీ చోటా సెంటిమెంటోటీ. వీటన్నిటినీ ఓ పేద్ద ప్యాకెట్టులో పెట్టి అటక మీద పెట్టడమే! ఇదివరకటిలా ఈ రోజుల్లో అటకలెక్కడా, అదేదో లాఫ్టో, సింగినాదమో దానిమీద పెట్టడం!

ఇదిగో ఇలాటివే excess baggage..... అంటే.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి