పర్యాటకం పట్టని ప్రభుత్వాలు .? - వి. మూర్తి

paryaatakam pattani prabhutvaalu
తెల్లవారి పేపర్ చూస్తే కేజ్రీవాల్ కాశీలో చేస్తున్న ప్రకటనలు కనిపిస్తున్నాయి. అక్కడ సమస్యలను ఆయన ప్రస్తావిస్తున్నారు. మిగిలిన విషయాల సంగతి ఏమో కానీ, సమస్యలు ఇన్నీ అన్నీ కావు.

బెనారస్ విశ్వవిద్యాలయం చూద్దామని వెళ్లాను. దారి పొడవునా, రోడ్డు అన్నది కనిపించలేదు. భయంకరమైన గోతులు. కాబ్ డ్రయివర్ ఎలా నడుపుతున్నాడా? అనిపించింది. అంత భయంకరమైన గోతులు. ఒక అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రం, ఒక అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన విశ్వ విద్యాలయం వున్న ప్రాంతాల రహదారులు ఇంత అధ్వాన్నంగా నిర్వహించడం అంటే ఏమనుకోవాలి. ఈ రహదారులే కాదు కాశీలో కొంత పాష్ ఏరియా వుంది. ఆ ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతాల రహదారులన్నీ ఇంతే. రహదారుల వెంట పాతకాలం పెద్ద సైడు కాలవలన్నీ ఇప్పుడు తినుబండారాల స్టాళ్లకు అడ్డాగా మారిపోయాయి. జనం ఆ కాలవల పక్కన వున్న అంగళ్లనే ఆశ్రయిస్తున్నారు.

కాశీలో వున్న మరో సమస్య ఏమిటంటే, పాదచారులు ఎక్కువగా వుండడం. రోడ్లపై ఇటు పాదచారులు, అటు వాహనాలు. ఆ రహదారులకు ఫుట్ పాత్ లు అన్నవి వుండవు. వైశాల్యం సరిపోదు. ఇటు వాహనాలు, అటు జనాలతో కిటకిటలాడుతుంటుంది. మరి తిరుపతి కూడా ఇలాంటి పుణ్యక్షేత్రమే, ఒక్కసారి కాశీ వెళ్లి వచ్చిన వాళ్లు, తిరుపతితో పోల్చుకోండి. ఎలా వుంటుందో?

మళ్లీ దేవస్థానం వ్యవహారాల దగ్గరకు వచ్చేద్దాం. 
కిందటి వారం వ్యాసం దిగువన గంగాహారతి గురించి మాట్లాడుకుందాం అని తెలిపాను. గంగాహారతికి చాలా మంది కూర్చోవడానికి  ఏర్పాట్లు వున్నాయి. గంగపై నుంచి హారతి చూడాలని అందరికీ ముచ్చటే. సాయంత్రం నుంచే పడవలు హారతి స్థలంలో మూగిపోవడం ప్రారంభమవుతుంది. ముందుగా వుంటే కనిపిస్తుంది లేదంటే లేదు. హారతి ముందు వున్న ఘాట్ లపై బల్లలు ఏర్పాటు చేసుకుని కూర్చునే స్థలాల అమ్మకం ప్రారంభమవుతుంది. మామూలుగా అయతే పది రూపాయిలు. కీలకమైన స్థలాలను వారు మామూలు వారికి ఇవ్వరు. విదేశీయులకు వంద నుంచి మూడు వందలు వసూలు చేసి ఇస్తారు. ఎన్నాళ్లిలా? ప్రభుత్వానికి దేవాలయ యాజమాన్యానికి పట్టదా? పద్దతిగా సిటింగ్ ఏర్పాటు చేయడం, ఈ అనాథరైజ్ఢ్ వ్వవహారాలు అరికట్టి, అందరూ హారతి వీక్షించేలా చేయడం చేయలేరా?

ఇక పడవల వ్యవహారం మరీ దారుణం. ఎవడి దోపిడీ, వాడిది. ఎవరి బేరం చేసే శక్తి వాడిది. అంతే కానీ, ప్రభుత్వం నిర్ణీత రుసుం ఫిక్స్ చేసే ఏమవుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు మోసపోకుండా వుంటారు కదా. కానీ అలా ఎందుకు చేయడం లేదో అర్థం కాదు.

ఈ ఉత్తరాది క్షేత్రాల్లో గైడ్ లది ఓ చిత్రమైన వ్యవహారం. వీరు ముందుగా మీరేం డబ్బులివ్వక్కరలేదంటారు. మీకు చూపించడం ప్రారంభిస్తూనే, మెల్లగా మార్కెటింగ్ వ్వవహారాలు ప్రారంభిస్తారు. కాశీ అయితే చీరలు, రుషీకేష్ అయితే రుద్రాక్షలు, రాళ్లు, ఆగ్రా అయితే హస్తకళా సామగ్రి, ఇలా వాటి గురించి ఊదరగొట్టడం. కాశీలో ఈ గైడ్ల వ్యవహారం లాకర్ల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. దేవుడికి సెట్ అని చెప్పి, అవీ, ఇవీ అన్నీ కలిపేయడం లేదంటే, నో లాకర్. వీటిని కూడా క్రమబద్దీకరించవచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే. కానీ అసలు గుడిలో దర్శనం దగ్గర నుంచే నియంత్రణ లేనపుడు, ఇక ఇలాంటి దూరపు విషయాలను ఎవరు పట్టించుకుంటారు. నా బాధ అల్లా ఒకటే. అసలే హిందూ మతం చులకనైపోతోంది..అయినా కూడా పాపం, విదేశీయులు ఇక్కడకు వచ్చి, నెలల తరబడి వుంటున్నారు. అలాంటపుడు ఈ క్షేత్రాలను కాస్త పటిష్టంగా నిర్వహించి పేరు నిలబెట్టాలి కదా? అన్నదే.

అల్లహాబాద్ వ్యవహారం కాశీకి ఏమీ తీసిపోదు. కానీ అక్కడ దోపిడీ రెండింతలు. పడవల వారందరికీ కట్టు. భయంకరమైన రేట్లు. అక్కడ గంగలో పడే వారిని రక్షించడానికి పోలీసులుంటారు కానీ, వీరి బారిన పడేవారిని ఎవరూ రక్షించలేరు. పైగా వద్దన్నా పండిట్ లు పూజలంటూ వెంటపడతారు. మనం గంగకు దక్షిణ ఎంతివ్వాలో వారే ముందుగా డిసైడ్ చేసి, మంత్రంతో కలిపి చదివేసి, ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తారు. సంగమంలో ఏర్పాటు చేసిన బల్ల మీదకు ఎక్కి, నీళ్లలో దిగినందుకు మనిషికి యాభై. అంటే అల్లహాబాద్ కు వేలాదిగా తరలి వచ్చి, అక్కడ వ్యాపారాలు విలసిల్లడానికి దోహదం చేస్తున్న యాత్రీకుల కోసం ఓ బల్ల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయదన్న మాట. నిజానికి ప్రభుత్వం తలుచుకుంటే, అక్కడ కొన్ని సిమెంట్ కట్టడాలు కట్టగలదు. మహిళలు పాపం, పడవల్లోనే అందరి ముందు దుస్తులు మార్చుకోవాల్సిన దుస్థితి తప్పుతుంది. కానీ ఆ ఆలోచనే ప్రభుత్వానికి వుండదు. ఒకరికి యాభై అంటే ఓ చెక్కబల్లను అక్కడ వుంచుకున్ బృందానికి రోజుకు ఎంత ఆదాయం. వారు ఆదాయం పొందుతున్నారు అని కాదు నా ఆవేదన, ఇలాంటి సదుపాయాలు ప్రభుత్వం ఎందుకు చేయదు అని?

వచ్చేవారం మరికొన్ని ముచ్చట్లు

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి