సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావ్

sahitee vanam
అల్లసానిపెద్దనవిరచిత స్వారోచిష మనుసంభవము
(గత సంచిక తరువాయి)
 
ట్టిన నీలిదిండ్లు సెలకట్టియవిండ్లును విండ్ల గౌసెనల్
చుట్టి నొసళ్ళపై నిడిన జుంజురుఁబల్లసిగల్ కటీతటిం
వెట్టిన మోటకత్తులును మేనులఁ గార్కొనుకప్పు లేర్చి చే 
బట్టిన వేఁటయమ్ములును బాగగు వాగురికుల్ మహాధ్వనిన్ 
 
ఎదురు రొమ్ములకు దట్టీలు కట్టి, కాసెపోసి బిగించి అంగవస్త్రాలను కట్టి, తలకు పాగాలు బిగించి కట్టి,
విండ్లు చేపట్టి, నడుములకు మోటకత్తులను పెట్టి, వేటకోసం ప్రత్యేకంగా చేసిన బాణాలను చేపట్టి,
వేటాడి జీవించేవాళ్ళు (వాగురికులు) పెద్ద సందడిగా బయల్దేరారు.
 
సటలెత్తుకొని యొత్తు కిటినైన మోటాస / పడి యేయఁ బొడుతు నీ పాద మాన 
కలగుండు వడఁ జెండు కరినైనఁ జెవిపట్టి / బలిమిమైఁ దెత్తు నీ పాద మాన
సెల నెప్పుకొని రొప్పు పులినైన బీడించి / పడవైతుఁ జొచ్చి నీ పాద మాన 
తెరఁదూఱి వెఱఁబాఱు గురుపోఁతుపై నైనఁ / బడియెక్కి పొడుతు నీ పాద మాన 
 
యితర దుర్బల మృగపంక్తు లేమి లెక్క?
కండగరువంపు మాటలు గావు సుమ్ము 
చూడు మ మ్మని పంతంబు లాడుకొనుచు 
నవ్వరూథిని సుతుఁ గొల్చి యరిగి రపుడు
 
నేను జూలు నిక్కబొడిచి మీదికి దూకే అడవిపందినైనా మీదపడి పొడిచి తీసుకొస్తా, నీ పాదాల సాక్షి!
అని ఒకడు, నేను బెదిరి చెల్లాచెదురై పారియేట్లు వెంటబడే మదపుటేనుగునైనా చెవి పట్టుకుని ఈడ్చుకొస్తా, 
నీ పాదాల సాక్షి! అని ఒకడు, నేను గుహలో రొప్పుతున్న పులినైనా పీడించి తెచ్చి పడేస్తా, నీ పాదాల సాక్షి! 
అని ఒకడు, నేను బెదిరి పారిపోయే మహిషాన్నైనా మీదపడి పొడిచేస్తా, నీ పాదాల సాక్షి! ఇక మిగిలిన చిన్నా 
చితకా జంతువులు నాకేం లెక్క? అని ఒకడు, కండకావరంతోనో, డాంబికంగానో చెప్పే మాటలు కావు, మా 
బలమెంతో చూపిస్తాము, చూద్దువుగాని దొరా, అని ఒకరినిమించి ఒకరు పంతాలు పలుకుతూ ఆ వరూథినీసుతుడిని,
స్వరోచిని సేవిస్తూ వెంట నడిచారు కొందరు.
 
మువ్వ గదల నత్తెములనుండి యెగురుచుఁ 
బదను మీఱ నెరల వెదకు డేగ 
పదువు వట్టి  దండపాణులై నడచిరి 
విభునిగెడల డేగ వేఁటకాండ్రు
 
వేట డేగలను పట్టుకుని వెంట వచ్చారు కొందరు. డేగల గోళ్ళు, ముక్కులు తగిలి గాయాలు కాకుండా 
చేతులకు తొడుక్కున్న వస్త్రాల(గ్లవుజులు)నుండి తప్పించుకోవడానికి ఆ డేగలు ఎగురుతుంటే వాటిమువ్వలు 
కదులుతున్నాయి, సవ్వడులు చేస్తున్నాయి. కర్రలను పట్టుకుని, డేగలను పట్టుకుని అలా డేగలతో పిట్టలను 
వేటాడేవారు కొందరు వెంట వచ్చారు.
 
గూనివీఁపు లదుర గొణఁగి తిట్టుచు నేకుఁ 
గఱచినట్టి కుక్క గండ్లనంగ
మూతి నరపమీసముల బోయ ముదుసళ్ళు
పంది వలలు మోచి పఱచి రపుడు    
 
నరపమీసాలు అంటే నరిసిన మీసాలున్న ముసలి బోయలు గొణుక్కుంటూ తిట్టుకుంటూ( వేటాడబోయే పందులను)
మూతులతో బొమికలను కరిచిపట్టిన గండుకుక్కల్లాగా పెదాలు కరిచిపట్టి, గూని వీపులు అదిరేటట్లు, పందులను 
పట్టుకునే వలలను మోసుకుంటూ పరుగులుపెట్టారు. ఇలా రకరకాల సాధనాలతో, ఆయుధాలతో, వేటగాళ్ళతో,
మిత్రులతో బ్రహ్మాండమైన బృందాన్ని వెంటేసుకుని వేటకు బయల్దేరాడు స్వరోచి.
 
(ఇంకా ఉంది)   
 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి