అల్లసాని పెద్దన విరచిత 'స్వారోచిష మనుసంభవము'
(గత సంచిక తరువాయి)
ఆ విధంగా సర్వసన్నద్ధుడై వేటకు బయల్దేరిన స్వరోచి దట్టమైన అడవిలో ప్రవేశించి అక్కడ స్వేఛ్ఛగా విహరిస్తూ, ఆహారాన్ని వెదుక్కుంటున్న నానావిధ మృగములను, క్రూరమృగములను, పక్షులను చూశాడు. ఇక్కడ ఒక అద్భుతమైన గద్యంలో ఆ అరణ్య జంతుజాలజీవన చిత్రాన్ని అందంగా ఆవిష్కరించాడు పెద్దన. పేరుకు వచనము. అయినా క్లిష్టమైన పదగుంఫన కలిగిఉన్నా, పెద్దన పరిశీలనా శక్తికి, వర్ణనా వైదుష్యానికి జోహారులు చేయకుండా ఉండలేము ఆ వచనాన్ని చదివి అర్ధం చేసుకొనగలిగితే!
అక్కడి పచ్చికబయళ్ళలో మందతో తప్పిపోయి, ఉలికులికిపడి, మెరుపులవంటి చూపులను నలుదిక్కులకు ప్రసరిస్తూ సంచరిస్తున్న జింకలను చూశాడు. పొట్టకూటికోసం చెట్టూ పుట్టా గాలిస్తున్న ఎలుగుబంట్లను చూశాడు. వాడి గోళ్ళతో కోరలతో పుట్టలను తవ్వి బయటకొచ్చిన మహాసర్పాలను మట్టగించి చప్పరిస్తున్న ముంగిసలను చూశాడు. కోనలు ప్రతిధ్వనించేట్లు 'కఠిల్లు' 'పెఠిల్లు'మనే ధ్వనులను చేస్తూ, పాషాణ సదృశమైన విషాణాలతో(కొమ్ములతో)కఠినంగా కుమ్ములాడుతున్న అడవిదున్నలను చూశాడు. పసికూనలను మాటేసి, వెంటాడుతూ, వెనకనే తిరుగుతున్న తోడేళ్ళ గుంపులను చూశాడు, ఆ గుంపులను మాటిమాటికీ వెనుదిరిగి తరుముతూ, తమ పిల్లలను రక్షించుకుంటున్న అడవిపందుల ఘుర్ఘుర ధ్వానాలతో మారుమ్రోగుతున్న పరిగె, పక్కె, పలుమేరు, రేగు, వేప, పులుగుడు, గురివెంద, ఈదు, గేదంగి, మోదుగు, కోరింద, కనుము, కానుగు మొదలైన వృక్షాలతో నిండిన మహావిపినాన్ని చూశాడు.
నరమాంసాన్ని మరిగిన బెబ్బులులకు ఎరలువేయగా, ఆ ఎరలో అమర్చిన ఇనుప ముళ్ళు గొంతులో దిగి, సెలయేళ్లకు నీటికి వెళ్లి, నీరు త్రాగలేక త్రాగి, గాండ్రుగాండ్రుమంటూ విల్లెత్తున ఎగిరిపడి నెత్తురు కక్కుతూ కూలిన పులుల భీకర రావాలకు కలవరపడి ధ్వనులు చేస్తున్న కారండవపక్షుల(నీటిబాతులు) గుంపులకు నెలవైన సెలయేళ్ల ప్రాంతాలను చూశాడు. కాళ్ళు ఉచ్చులో ఇరుక్కుని ఆ ఉచ్చును ఈడ్చుకుని వెళ్లగలిగినంతవరకు ఈడ్చుకెళ్ళి, ఇక వెళ్ళలేక ఆక్రందనలు చేస్తున్న మనుబోతులకు నిలయమైన అడవిని చూశాడు. కర్మగాలి చిరుతగండ్లు మాటేసి దాడిచేసి కుత్తుక కొరికి నెత్తురు త్రాగి వెళ్ళిపోతే మెడలు వంకర్లు తిరిగి ప్రాణాలు విడిచిన, ఈగలు ముసురుకుంటున్న జీవుల కుళ్ళిన కళేబరాలకోసం వెదుకుతూ విందుల సందడి చేస్తున్న గ్రద్దలు, రాబందులకు నెలవైన అడవీ ప్రాంతాలను చూశాడు.
పచ్చిక మేస్తున్నప్పుడు రేచుకుక్క వీపుమీదికెక్కి, మూపును కరిచి పడెయ్యగా, ఇంకొక రెండు మూడు రేచుకుక్కలు వెనుకా ముందులుగా దాడిచేసి, రాలిపడిన మాంసఖండాలను పీక్కు తింటుంటే, వగస్తున్న, వగరుస్తున్న దున్నలున్న అడవిని చూశాడు. పదులు పదులు, వందలు వందలు, వేలు వేలు జంటలుగా గుంపులు గుంపులుగా సంచరిస్తూ, జంటఏనుగుకు వెదుళ్ళను వంచి వెదురు బియ్యపు ధాన్యాన్ని అందిస్తూ ఆనందిస్తూ, క్రీడిస్తూ చరిస్తున్న ఆడ, మగ ఏనుగులను, అవి చేస్తున్న విధ్వంసాన్నీ చూశాడు.
ఆ వంకలను, డొంకలను, దట్టమైన ఆ అడవిని, జంతు సంపదను చూసిన స్వరోచి హర్షించాడు. మన్ను తూర్పారబట్టి గాలి వాలును గమనించాడు. (గాలివాలును బట్టి క్రూరమృగాలు, వివిధ జంతువులు ఇతర ప్రాణుల వాసనను గమనించి దాడిచేయడమో, పారిపోవడమో చేస్తాయి కనుక)వలలు పన్నించాడు. వలలు చింపుకుని వెళ్ళే భారీ, క్రూరమృగాల కోసం మొండిగా ధైర్యంగా ఎదురొడ్డి పోరాడగలిగే పుళిందవీరులను నియమించాడు. వారికి రక్షణగా జాగిలాలతో వేటాడే వారిని కొందరిని నియమించాడు. గుట్టలమీదికి గట్టి విలుకాళ్ళను, ఆకాశాన ఎగిరే పక్షులను కూడా గురితప్పకుండా పడెయ్యగలిగే పోటుగాళ్ళను కొందరిని ఎక్కించాడు. ఎదురుపడి పోరాడితే నిలపగలిగిన వాళ్ళను కొందరిని నియమించాడు. చప్పుడుకాకుండా పొదల మధ్యనుండి పారిపోయే తెలివైన జంతువులకోసం అక్కడక్కడ పదునైన ముళ్ళను, మోటు కత్తులను, వేటకత్తులను పాతించాడు, వేళ్లాడదీయించాడు. తాను ఒకోసారి పాదచారియై, ఒకోసారి గుర్రమునెక్కి, పనులు పురమాయిస్తూ, ఏర్పాట్లను పరిశీలిస్తూ కలయదిరిగాడు. ఆకాశము, భూమి చిల్లులుపడేలా తప్పెట్లు, భేరులు, కొమ్ముబూరాలు ఊదించాడు. ఇంకేముంది, అడవంతా కలకలమైపోయింది!
నెల వెడలియు నెఱి సడలియుఁ
జలముడిగియు నిదుర సెడియు జంట లెడసియున్
గలహము లడఁగియుఁ బఱచెం
బులి కిరి కరి మన్ను దున్న మొదలగు మెకముల్
ఆ భయంకర ధ్వనులకు గుహల్లోంచి పులులు, తెగువ తప్పి అడవి పందులు, సెలయేళ్ల నీళ్ళు తాగుతున్న ఏనుగులు, నిద్రబోతున్న మనుబోతులు, కుమ్ములాడుతున్న దున్నపోతులు అన్నీ విడిచి, అన్నీ మరిచి అదేపనిగా పరిచాయి, పరుగులెత్తాయి!
అత్తఱి వేఁపికాండ్రు యమునాంబుతరంగ పరంపరాక్రుతిన్
ముత్తర మైనసూకర సముత్కరముం గని మోటుకాండ్రు వి
ల్లెత్తకమున్న రాజుమది కెక్కెడునట్లుగ దీని మిత్తికిం
బుత్త మటంచుఁ బట్టెడలు బోరన దుయ్య భయంకరార్భటిన్
ఆ సమయంలో కుక్కలతో వేటాడే వాళ్ళు యమునాతరంగాలలాగా తల్లులు, పిల్లలు, పిల్లల పిల్లలతో మూడు తరాల గుంపులుగా కనిపించిన అడవిపందులను చూసి, విల్లంబుల బృందం తమ తమ విల్లులను ఎత్తకముందే, వీటిని అంతుచూద్దామంటూ, రాజుమనసుకు నచ్చేట్లు, మెడలకున్న పట్టెడలు బోరున మ్రోగుతుండగా ముందుకు దూకారు. యమునానది నల్లగా ఉంటుంది అని కవిలోక సంప్రదాయం. కనుక నల్లని యమునా తరంగాలలాగా ఒకదాని వెంట ఒకటిగా(పరుగెత్తుతున్న)పందులు అన్నాడు పెద్దన.
జాగిలములు మొఱసడములు
సాగెఁ గలసి చాపముక్త శరగతి, నం దా
జాగిలము లెదిరెఁ బందుల
కై, గోధాదికము గాలి కడరె నితరముల్
పెద్ద పెద్ద జాగిలాలు, చిన్నకుక్కలు(మొఱసడములు) కలిసి వింటినుండి వెలువడ్డ బాణములలాగా ముందుకు దూకాయి. జాగిలాలు అడవిపందులను ఎదుర్కొన్నాయి, గాట్లు పడకుండా చేతులకు ఉడుముల చర్మాలతో కట్టుకున్న రక్షణవస్త్రాలు (గ్లవుజులు) గాలిలో మెరిశాయి! (గోధ అంటే ఉడుము తోలుతో చేసిన రక్షణాతొడుగులు అని నిఘంటువు చెప్తుంది)
(ఇంకా ఉంది)