అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి

Annamayya 'Pada' Seva

004. హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున

హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున

సరివేరీ నీకు సర్వేశ్వరా

1.నీవు నీళ్ళు నమిలితే నిండెను వేదములు
యీవల దలెత్తితేనే యింద్ర పదవులు మించె
మోవ మూతి గిరిపితే మూడు లోకాలు నిలిచె
మోవి బార నవ్వితేనే ముగిసిరసురలు

2.గోరై గీరితే నీరై కొండలెల్ల దెగ బారె
మారుకొంటే బయిటనే మడుగులై నిలిచె
చేరి యడుగువెట్టితే శిలకు బ్రాణము వచ్చె
కూరిమి గావలెనంటే కొండ గొడగాయను

3.కొంగు జారినంతలోనే కూలెను త్రిపురములు
కంగి గమనించితేనే కలిదోషములు మానె
రంగుగ నీ శరణంటే రక్షించితి దాసులను
ముంగిట శ్రీ వేంకటేశ మూలమవు నీవే (2-156)

ముఖ్యమైన అర్థాలు

 ఈవల=ఇటుపిమ్మట; తల=  కొన; ప్రతాపము=పరాక్రమమువలన గలిగిన ప్రతిష్ఠ. ;గిరిపితే= తిప్పితే; తెగబారు=అతిశయించు,; మారుకొను= ఎదిరించు.;బయిట=బైట, మడుగు=కొలను ; కంగి = ప్రోత్సహించు, కోపింపఁజేయు;  రంగుగ =చక్కగా, సొంపుగా. ముంగిట =ముందు.

తాత్పర్యము

అన్నమయ్య దశావతారాలను ఈ కీర్తనలో  ప్రశంసిస్తున్నాడు.

ఓ హరీ ! నీ పరాక్రమానికి  ఈ లోకంలో అడ్డులేదు. సర్వ ప్రపంచానికి ప్రభువా ! నీకు సమానమైన వారు ఈ లోకంలో ఎవరూలేరు.

1.స్వామీ ! నువ్వు మత్స్యావతారంలో నీళ్ళు నమిలావు. కాదయ్యా ! ఆ రాక్షసుడితో నీళ్ళు నమిలించావు. వేదాలు ఉన్నతిని పొందాయి. కూర్మావతారంలో మందరపర్వతం కింద ఉండి దానినికొంచెం ఎత్తావు. కాదయ్యా! మా దేవతల తలలను గౌరవంతో ఎత్తించావు. ఇంద్రాదులకు వాళ్ల పదవులు వాళ్లకు దక్కి మించిపోయారు. వరాహావతారంలో మూతిని కొంచెం తిప్పావు. కాదయ్యా ! అసూయతో రాక్షసులు మూతి తిప్పుకొనేటట్లు చేసావు. వాళ్ళకు మూడింది. మూడు లోకాలు నిలిచాయి.నరసింహావతారంలో గర్జిస్తూ పెదవుల మీద ప్రవహించేటట్లు ఒక నవ్వు నవ్వావు. కాదయ్యా! ప్రశ్నించిన హిరణ్య కశిపుడనే రాక్షసుని నవ్వుల పాలు చేసావు. ఆ రాక్షసుల కథ ముగిసింది.

2.వామనావతారంలో విజృంభిస్తూ గోటితో గీరావు. గంగమ్మ  కొండలను చీల్చుకొంటూ  ప్రవహించింది.  పరశురామావతారంలో క్షత్రియులను సంహరించి వారి రక్తాలను మడుగులుగా ప్రవహింపచేసావు.  రామావతారంలో రాయి మీద అడుగు పెట్టావు. ఆ శిలకు ప్రాణము వచ్చింది. కృష్ణావతారంలో గోవర్ధన  పర్వతాన్ని గొడుగుగా చేసి ప్రేమతో గో గోపాలకులను రక్షించావు.

3.బుద్ధావతారంలో  కొంగు జారింది. రాక్షస సంహారం జరిగి  త్రిపురాలు జారిపోయాయి. రాబోయే కల్క్యావతారంలో నువ్వు ఒక్కసారి గమనిస్తే చాలు కలియుగ దోషాలన్నీ పోతాయి. చక్కగా నీ శరణంటే చాలు. దాసులందరిని రక్షిస్తావు. వేంకటేశ్వరా ! ఈ ప్రపంచానికి మూలమైన వాడివి నీవే.

ఆంతర్యము

నీవు నీళ్ళు నమిలితే నిండెను వేదములు

నైమితిక ప్రళయంలో భూమి మొదలయిన లోకాలన్నీ నీళ్లతో మునిగిపోయాయి. . ఆ సమయంలో బ్రహ్మకి నిద్రవచ్చింది.. ఆయన నోటి నుంచి  వేదాలు  జారిపడ్డాయి.   హయగ్రీవుడనే  రాక్షసుడు వీటిని  దొంగిలించాడు.  అప్పుడు  శ్రీహరి మత్స్యావతారాన్ని ధరించి హయగ్రీవుని  దగ్గరనుంచి  వేదాలను  గ్రహించి బ్రహ్మదేవునికి తిరిగి ఇచ్చాడు.  నీళ్లు నమలటమంటే ఇక్కడ  చేప నీళ్ళలోనికి  చొచ్చుకొని పోవటమని అర్థం.నిండు అంటే పూర్ణత్వము. వేదాలు చేరవలసిన చోటికి చేరాయి కాబట్టి వాటికి నిండుతనము వచ్చిందని చెప్పటానికి  నిండెను వేదములు అని అన్నమయ్య అన్నాడు.

యీవల దలెత్తితేనే యింద్ర పదవులు మించె

దేవాసురులు మందరగిరిని కవ్వముగా జేసి, పాల సముద్రాన్ని  చిలికినపుడు పర్వతం కుంగి పోయింది. ,అప్పుడు కూర్మ రూపమెత్తి మందర గిరిని ఎత్తి   విష్ణువు దేవతలను రక్షించాడు. ఇక్కడ పర్వతపు కొన ఎత్తటమే   తల ఎత్తటం.

మోవ మూతి గిరిపితే మూడు లోకాలు నిలిచె

వంగి ఉన్న రూపం గలవాడే తనను  వధించాలని  హిరణ్యాక్షుడు కోరుకొన్నాడు. అందుకే వరాహావతారం వచ్చింది.  ‘ వర ‘ అంటే శ్రేష్ఠమైన  , ‘ అహం ‘ అంటే నేను లేదా ఆత్మ అని అర్థాలు. .గొప్పదయిన  ఆత్మ వరాహము. పాతాళంలో కనిపించిన భూమిని  వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్నప్పుడు హిరణ్యాక్షుడు  అడ్డుపడ్డాడు.  అతడిని వరాహమూర్తి సముద్రంలోనే చంపి , భూమిని  నీటిపైకి తెచ్చాడు .  ఈ పాదంలో అన్నమయ్య కవితాచమత్కారం ఉంది.   ఆది వరాహంగా మూతిని తిప్పాడు. అంటే చలనం. కాని మూడు లోకాలు  నిలిచాయి.  అంటే స్థిరత్వం. చలనం స్థిరత్వానికి కారణమయిందని చమక్కు.

మోవి బార నవ్వితేనే ముగిసిరసురలు

నరసింహుడు హిరణ్యకశిపుడిని  చేతులతో పట్టి పైకి ఎత్తాడు.  లోపలా బయటా కాకుండా గుమ్మం మీద కూర్చున్నాడు.  భూమి మీద ఆకాశంలో కాకుండా తొడలమీద పరుండబెట్టాడు.  గోళ్లనే ఆయుధములుగా చేసుకున్నాడు . వాడి  పొట్ట  చీల్చాడు. అందరిని ఆనందింపచేసాడు. ఇక్కడ సింహ గర్జనను నవ్వుతో పోలుస్తున్నాడు కవి. అంటే అదెలాంటి నవ్వో ఊహించుకొంటేనే గుండె లదురుతాయి. 

గోరై గీరితే నీరై కొండలెల్ల దెగ బారె

వామనావతారం ఎత్తి నప్పుడు  మహావిష్ణువు బొడ్డు తామరను చూసి నా జన్మ స్థానం ఇదే సుమా అనుకొంటూ బ్రహ్మ దేవుడు సంతోషించి  తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు . ఆ నీటి ధారలు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఇది అందరికి తెలిసిన తెలుగు భాగవతం.  కాని సంస్కృత దేవీభాగవతంలో  విష్ణుదేవుని ఎడమకాలి బొటనవేలికొన గోట చీల్చబడిన  అండ రంధ్ర పైభాగమునుండి  గంగ పుట్టిందని ఉంది.(07-12శ్లో. ) ఇది అన్నమయ్యకు ప్రేరణ యై ఉండవచ్చు. అందుకే  వామనావతారంలో విజృంభిస్తూ గోటితో గీరావు. గంగమ్మ  కొండలను చీల్చుకొంటూ  ప్రవహించింది అన్నాడు.

మారుకొంటే బయిటనే మడుగులై నిలిచె

ఇరవై ఒక్కసార్లు  దండ యాత్రలు  చేసి రాజపుత్రులను వెదకి వెదకి పరశురాముడు చంపాడు. .  ఆ విధంగా చంపిన పిమ్మట  శమంతపంచకమనే చోట ఆ రాజుల రక్తంతో  తొమ్మిది మడుగులు ఏర్పరచాడు.   సర్వదేవమయుడు తానే కనుక తనను గురించి  యాగము చేసాడు.

ముసుగులో గుద్దులాట లేదు. అంతా ప్రత్యక్షమే.   అందరికి బయటికి కనబడేటట్లు ఎదుర్కొన్నవారి రక్తపు మడుగులను ప్రవహింపచేసాడనేఉక్తి వైచిత్రి రావటం కోసం బయటనే అను  పదం కవి ప్రయోగించాడు.

చేరి యడుగువెట్టితే శిలకు బ్రాణము వచ్చె

వాల్మీకి రామాయణంలో  (బాలకాండ ) అహల్య శిలగా ఉన్నట్లు స్పష్టంగా లేదుకాని   అభూత్ సరూపా వనితా , సమాక్రాంతా మహాశిలాం (శిలగా ఉన్న అహల్య రాముని పాద పద్మములు తాకి రూపాన్ని పొందింది)  అని  పద్మ పురాణములో ఉంది. దీనినే   ‘రామావతారంలో రాయి మీద అడుగు పెట్టావు. ఆ శిలకు ప్రాణము వచ్చింది ‘అని అన్నమయ్య ఈ కీర్తనలో అన్నాడు.

కూరిమి గావలెనంటే కొండ గొడగాయను

అన్నమయ్య పదబంధాన్ని   పోతన్న అనుసరించాడని చెప్పటానికి ప్రబల సాక్ష్యం ఈ పాదం.‘కృష్ణావతారంలో గోవర్ధన  పర్వతాన్ని గొడుగుగా చేసి ప్రేమతో గో గోపాలకులను రక్షించావు’ అని అన్నమయ్య అంటే పోతన్న కూడా కొండ గొడుగు అనే పదబంధాన్ని హాయిగా వడిగొని......కొండ గొడుగు చాటున నధిపా ( 10-924) పద్యంలో వాడుకొన్నాడు. అయితే బాధాకరమైన అంశం ఏమిటంటే పోతన్న పూర్వ కవి ప్రశంసలో ఆన్నమయ్య పేరు ప్రస్తావించలేదు.

కొంగు జారటమనే పదాలలో బుద్ధుని దిగంబరత్వం  అన్నమయ్య సూచించాడు. బుద్ధావతారం  గౌతమ బుద్ధుడు కాదు.  అతి కొద్దికాలం మాత్రమే ఉండి అతి శీఘ్రంగా చాలించిన అవతారం బుద్ధావతారమని ఒక వాదం.

''మత్స్య కూర్మ వరాహశ్చ, నారసింహశ్చ వామనః/
రామో రామేతి రామశ్చబుద్ధః : కల్కి రేవచ'' అను శ్లోకానికి పాఠాంతరంగా
''మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః/
రామో రామేతి కృష్ణశ్చ బుద్ధ: కల్కి రేవచ'' అని ఉంది.

ఒక పాఠంలో కృష్ణుడు,ఇంకొక పాఠంలో లేడు. అతడి స్థానాన్ని బలరాముడు ఆక్రమించాడు. అందుకే అన్నమయ్య దశావతార కీర్తనల్లో కూడా, కొన్ని చోట్ల కృష్ణుడు, మరికొన్ని చోట్ల బలరాముడు కనబడుతుంటాడు. ఈ కీర్తనలో బలరాముడు దశావతారాలలో  లేడు. కృష్ణుడు  కనిపిస్తున్నాడు.

హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమునఅని కవి అన్నాడు. అన్నమయ్య ! నీ రచనా శైలికి సమానమైనది ఏదీ ! అని చెప్పాలనిపిస్తుంది - ఈ కీర్తనని భావ మర్మ సహితంగా  అర్థం చేసుకొన్న తర్వాత. స్వస్తి.

మరిన్ని వ్యాసాలు